ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న అట్లాంటిక్ దేశాల(అమెరికా-ఐరోపా) మధ్య విభేదాల నేపథ్యంలో, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు లండన్‌లో రెండు రోజుల సైనిక ప్రణాళికా సమావేశాన్ని యూకే నిర్వహించింది.
ఇందులో 30కి పైగా దేశాలు, ప్రాంతాలకు చెందిన సైనిక ప్రణాళికా నిపుణులు పాల్గొంటున్నారు.
అమెరికా, ఇరాన్ మధ్య “సుస్థిరమైన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత, పరిస్థితులు అనుకూలించిన వెంటనే” ఈ వ్యూహాత్మక జలసంధిని తిరిగి తెరవడానికి యూకే, ఫ్రాన్స్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన కూటమిలో భాగంగా ఈ సమావేశం జరుగుతోందని పత్రికా ప్రకటనలో యూకే ప్రభుత్వం పేర్కొంది.
“సైనిక సామర్థ్యాలు, కమాండ్ అండ్ కంట్రోల్, ఆ ప్రాంతంలో సైనిక బలగాలను ఎలా మోహరించాలి” అనే అంశాలపై పాల్గొనేవారు సుదీర్ఘంగా చర్చిస్తారని ఆ ప్రకటనలో వివరించారు.
మునుపటి చర్చలు – యూరప్ వైఖరి..
ఏప్రిల్ 17న పారిస్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటీష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ నిర్వహించిన అంతర్జాతీయ సమావేశం తర్వాత ఈ లండన్ చర్చలు జరుగుతున్నాయి.
ఈ సమావేశానికి జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని హాజరయ్యారు.
ఆ శిఖరాగ్ర సమావేశంలో, యూరోపియన్ నాయకులు హోర్ముజ్ జలసంధిని “షరతులు లేకుండా, ఆంక్షలు లేకుండా వెంటనే తెరవాలని” కోరారు.
అలాగే వర్తక నౌకలను రక్షించడానికి, వాణిజ్య నౌకాయాన నిర్వాహకులకు భరోసా కల్పించడానికి, మైన్ క్లియరెన్స్(బాంబుల తొలగింపు) కార్యకలాపాలను నిర్వహించడానికి “స్వతంత్ర, రక్షణపరమైన” వివిధ దేశాల ప్రాతినిధ్యంతో ఒక స్వతంత్ర మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వారు ధృవీకరించారు.
సంక్షోభం – తీవ్ర పరిణామాలు..
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి, ప్రపంచ చమురులో ఐదవ వంతు రవాణా అయ్యే హోర్ముజ్ జలసంధి వాస్తవంగా మూసివేయబడింది.
దీనివల్ల ప్రపంచ ఇంధన ధరలు పెరగడం, సరఫరా గొలుసులు దెబ్బతినడం, ఐరోపా అంతటా, ఐరోపా వెలుపల గృహాలు, వ్యాపారాలకు ఖర్చులు పెరగడంలాంటి సమస్యలు తలెత్తాయి.
బీజింగ్ ఫారిన్ స్టడీస్ యూనివర్సిటీలోని ‘సెంటర్ ఫర్ యూరోపియన్ యూనియన్ అండ్ రీజినల్ డెవలప్మెంట్ స్టడీస్’ డైరెక్టర్ కుయ్ హాంగ్జియాన్ మాట్లాడుతూ, ఐరోపా దేశాలు ఇప్పుడు తమ సొంత ప్రయోజనాలను రక్షించుకోవడానికి దౌత్యపరమైన సూచనల నుంచి క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక సైనిక చర్యల వైపు మళ్లుతున్నాయని చెప్పారు.
సంఘర్షణ మరింత తీవ్రతరం కావడమే కాకుండా, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత వ్యాపిస్తే, అది యూకే, ఫ్రాన్స్, ఇతర ఐరోపా దేశాల కీలక ప్రయోజనాలకు నేరుగా ముప్పు కలిగిస్తుందని కుయ్ చైనా మీడియా గ్రూప్‌తో అన్నారు.
ఇంధన సరఫరాలు, కీలకమైన నౌకాయాన మార్గాల భద్రతతో పాటు, శరణార్థుల ప్రవాహం పెరగడం, ఉగ్రవాద దాడుల ముప్పు పెరగడం లాంటి తీవ్రమైన సమస్యలను ఐరోపా ఎదుర్కోవాల్సి ఉందని, ఇవి ఐరోపా ప్రభుత్వాలకు దీర్ఘకాలిక తలనొప్పిగా మారాయని ఆయన తెలిపారు.
స్వతంత్ర వ్యూహం దిశగా ఐరోపా అడుగులు..
యూకే, ఫ్రాన్స్‌తో సహా ఐరోపా దేశాలు, మొదట్లో ఈ సంఘర్షణలో పక్కన పెట్టబడ్డాయని, ఇప్పుడు వాషింగ్టన్ వ్యూహాత్మక లక్ష్యాలకు పూర్తిగా తలొగ్గడానికి ఇష్టపడటం లేదని కుయ్ గమనించారు.
“ఒకవైపు, వారు తమ సొంత ప్రధాన ప్రయోజనాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు, అమెరికా నుంచి రాజకీయ, సైనిక దూరాన్ని పాటించాలని, స్వతంత్ర రక్షణ సైనిక సామర్థ్యాలను ప్రదర్శించాలని, సంక్షోభంలో జోక్యం చేసుకోవడానికి చొరవ చూపాలని చూస్తున్నారు” అని ఆయన అన్నారు.
యూకే, ఈయూ తీసుకుంటున్న తాజా చర్యలకు ఇదే కీలకమైన ఉద్దేశమని కుయ్ పేర్కొన్నారు.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడి ప్రారంభమైనప్పటి నుంచి, వాషింగ్టన్ తన నాటో మిత్రదేశాలను హోర్ముజ్ జలసంధిలో ఎస్కార్ట్ కార్యకలాపాలలో పాల్గొనాలని పదేపదే కోరింది.
అయితే, ఆ పిలుపులను ఐరోపా సభ్య దేశాలు దాదాపుగా తిరస్కరించాయి.
కొనసాగుతున్న ఈ సంఘర్షణ, అట్లాంటిక్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉన్న తీవ్రమైన విభేదాలను బయటపెట్టిందని కుయ్ అన్నారు.
“వ్యూహాత్మక లక్ష్యాలు, వాస్తవ ముప్పుల పట్ల అవగాహన, వాటిని పరిష్కరించే పద్ధతులపై ఈ విభేదాలు చాలా లోతైనవిగా మారాయి. అమెరికా-ఐరోపా సంబంధాలు గతంలో ఉన్నట్లుగా ఇక ఎప్పటికీ ఉండలేవని నేను భావిస్తున్నాను” అని ఆయన ముగించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
