20వ శతాబ్దపు మధ్యకాలంలో తూర్పు భారతదేశంలోని బెంగాల్లో, రంగస్థలంపై వెలిగిన అతిపెద్ద మహిళా తారలలో కొందరు వాస్తవానికి పురుషులే.
వారందరిలోనూ అగ్రగణ్యుడు చాపల్ భాదురి. ఈయన “చాపల్ రాణి”గా ప్రాచుర్యం పొందారు.
ఒకప్పుడు అశేష జనవాహినిని విశేషంగా ఆకర్షించిన “జాత్రా” అనే సంచార నాటక కళా సంప్రదాయానికి ఈయనే తిరుగులేని ‘రాణి’.
ఐరోపా నుంచి జపాన్, చైనా వరకు ప్రపంచ నాటకరంగంలో పురుషులు స్త్రీ పాత్రలు పోషించడం అనేది సుపరిచితమే.
బెంగాల్లో, ఈ కళారూపం ‘జాత్రా’ రూపంలో వర్ధిల్లింది. ఇది సంగీతం, పురాణాలు, మెలోడ్రామాతో కూడిన గ్రామీణ బహిరంగ ప్రదర్శన.
ఇది ప్రజాదరణలో సినిమాతో పోటీ పడినప్పటికీ, ఆదాయం మాత్రం అంతగా ఉండేది కాదు.
పురాణ గాథలు, భక్తి కథల ఆధారంగా సాగే ఈ ప్రదర్శనలు, అన్ని వైపులా ప్రేక్షకులు కూర్చునే వేదికలపై, గంభీరమైన గొంతు, హావభావాలు, ఆహార్యంతో(దుస్తులు) ప్రదర్శించబడేవి.
రచయిత సందీప్ రాయ్ తన కొత్త పుస్తకం ‘చపల్ రాణి: ది లాస్ట్ క్వీన్ ఆఫ్ బెంగాల్’లో భాదురి జీవిత ప్రయాణాన్ని “అద్భుతమైన కీర్తి నుంచి అజ్ఞాతం వరకు”గా వివరించారు.
ఆ క్రమంలో లింగభేదమే అభినయంగా సాగిన, అంతరించిపోతున్న ఒక ప్రపంచాన్ని ఆయన ఆవిష్కరించారు.
దశాబ్దాల పాటు, జాత్రాలో స్త్రీ పాత్రలను “పురుష రాణులు” అని పిలువబడే పురుషులే పోషించేవారు. కానీ ఆ కళారూపం అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు కూడా, దానిపై ఒక విధమైన సామాజిక చులకన భావం ఉండేది.
యూరోపియన్ అభిరుచుల ప్రభావంతో, కలకత్తాలోని వలస కాలం నాటి నగర ఉన్నత వర్గాల వారు తరచుగా జాత్రాను గ్రామీణమైనదిగా లేదా నాగరికత లేనిదిగా కొట్టిపారేసేవారు.
19వ శతాబ్దపు ఆంగ్లో-ఇండియన్ పత్రికలో మహిళల పాత్రలు పోషించే అబ్బాయిల గొంతులను “అపశ్రుతి”గా అభివర్ణిస్తూ, వాటిని “నక్కల ఊళలతో” పోల్చి తక్కువ చేసి వర్ణించారు.
వేదికపై మహిళా పరకాయ ప్రవేశం..
1950లలో భాదురి రంగస్థల ప్రవేశం చేసే సమయానికి, ఆ ప్రపంచం మార్పు దిశగా సాగుతోంది. మహిళలు నటనలో అడుగుపెట్టడం ప్రారంభించారు. దీనివల్ల స్త్రీ పాత్రలు పోషించే పురుషులకు అవకాశాలు తగ్గిపోసాగాయి. అయినప్పటికీ, భాదురి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు.
1939లో ఉత్తర కోల్కతాలో రంగస్థల నటి ప్రభా దేవికి జన్మించిన భాదురి, కళాకారుల మధ్యే పెరిగారు. ఆయన 16 ఏళ్ల వయసులో నటన ప్రారంభించారు. “నాకు అమ్మాయిల వంటి అలవాట్లు, అమ్మాయి గొంతు ఉండేవి” అని ఆయన తర్వాతి కాలంలో చెప్పుకొచ్చారు.
రంగస్థలంపైకి వచ్చిన వెంటనే ఆయన పూర్తిగా మారిపోయేవారు. రాణులు, వేశ్యలు, వేశ్యావాటికల యజమానులు, దేవతల పాత్రలను ఎంతో నేర్పుతో, హుందాగా పోషించేవారు.
తన వేషధారణలు(కాస్ట్యూమ్స్) ఎంతో జాగ్రత్తగా సిద్ధం చేయబడేవి; కొన్ని సందర్భాల్లో తానే సృజనాత్మకంగా రూపొందించేవారు. మొదట్లో, స్త్రీ వక్షోజాల ఆకృతిని చూపించడానికి పాత బట్టల ముక్కలను ఉపయోగించేవారు. తరువాత స్పాంజ్ వాడటం ప్రారంభించారు. తన రూపాంతరాన్ని నిజంగా నమ్మించేలా చేయాలనే తపనతో, క్రీములు, చిన్న చిన్న అలవాట్లతో కూడిన ప్రత్యేకమైన సౌందర్య పద్ధతిని అనుసరించేవారు.
“స్త్రీత్వం ఎప్పుడూ నాలో అంతర్భాగంగానే ఉండేది” అని చాపల్ భాదురి అన్నారు.
ఆయన ప్రదర్శనలు కేవలం హాస్యానికి లేదా వ్యంగ్యానికి పరిమితం కాలేదు. అవి ప్రేక్షకులను ఆ లోకంలోకి ముంచెత్తేలా, లోతైన భావోద్వేగాలతో నిండివుండేవి. ‘క్వీర్’ పాత్రలను తరచుగా ఎగతాళి కోసం ఉపయోగించే నాటకరంగ సంస్కృతిలో, భాదురి కళ ఒక ప్రత్యేకమైన గంభీరతను, గౌరవాన్ని సంతరించుకుంది.
“గే లేదా క్వీర్ పాత్రలను కేవలం ఎగతాళి కోసం మాత్రమే చూపే భారతీయ నాటక కళా రంగంలో, చపల్ ఒక మహిళగా పరకాయ ప్రవేశం చేసి, తన పాత్రలను ఎంతో నిజాయితీతో, ధైర్యంతో పోషించారు” అని రచయిత రాయ్ రాశారు.
రంగస్థలం వెలుపల: వ్యక్తిగత జీవితం – సవాళ్లు..
రంగస్థలం బయట, భాదురి జీవితం మరింత క్లిష్టంగా ఉండేది. ఆ కాలంలో మధ్యతరగతి బెంగాల్ సామాజిక పరిస్థితుల దృష్ట్యా, ఆయన తనను తాను ‘గే’ గా బహిరంగంగా చెప్పుకోలేదు.
అయితే, ఆయనకు అభిమానుల ఆదరణ ఏమాత్రం తక్కువ కాలేదు. అభిమానులు, ప్రేమికుల నుంచి లేఖలు, సాన్నిహిత్యం కోసం ప్రతిపాదనలు, బంధాల కోసం ఆహ్వానాలు వెల్లువెత్తేవి.
భాదురి తన ఎంపికల్లో చాలా కచ్చితంగా, గర్వంగా ఉండేవారు. అయినా “నేను ఇంకొకరి ప్రేమ కొరకు లొంగి ఉండను” అని స్పష్టంగా చెప్పారు.
తన ఒక సుదీర్ఘ బంధం మూడు దశాబ్దాలకు పైగా కొనసాగింది, ఆ సమయంలో ఆయన భాగస్వామి వివాహం చేసుకుని పిల్లలు కలిగినప్పటికీ ఆ బంధం అలాగే ఉంది.
భాదురి ఆ బంధంలో ఒక అంచునే ఉండిపోయారు; అక్కడ ఉన్నప్పటికీ, తనకు ఎప్పుడూ పూర్తి గుర్తింపు లభించలేదు, చివరికి ఆ ఇంటి పనివాడిలా పరిమితమయ్యారు.
మారుతున్న కాలం – తెరమరుగైన వైభవం..
తన కెరీర్ పతనం ఒక్కసారిగా సంభవించలేదు; అది అనేక మార్పుల సమాహారంగా వచ్చింది.
రంగస్థలంపై మహిళలకు ప్రాధాన్యం పెరగడంతో, ప్రేక్షకులు స్త్రీ పాత్రల్లో పురుష నటులను తిరస్కరించడం ప్రారంభించారు.
ఒకప్పుడు ‘జాత్రా’ కళను నిలబెట్టిన ఆ సంప్రదాయమే క్రమంగా కనుమరుగవ్వడం మొదలైంది.
1960ల చివరలో, 1970ల ప్రారంభంలో “జాత్రాలోని మీసాల రాణులు” రంగస్థలం నుంచి బయటకు నెట్టబడ్డారని రచయిత సందీప్ రాయ్ పేర్కొంటారు.
చపల్ భాదురి ఆ తిరస్కారాన్ని స్వయంగా అనుభవించారు. ఒక ప్రదర్శనలో, వృద్ధురాలి పాత్రను పోషిస్తున్నప్పుడు, ప్రేక్షకులు ఆయనపై మట్టి కప్పు విసిరి, వేదికపై నుంచి వెళ్లిపోవాలంటూ హేళన చేశారు. అప్పటికే మహిళా నటీమణులకు అలవాటు పడిన ప్రేక్షకులకు ఆయన ప్రదర్శన అసౌకర్యంగా అనిపించింది.
భాదురి సమకాలికుల్లో చాలామంది పేదరికంలోకి జారిపోయారు. ఒకప్పటి జాత్రా తారలలో ఒకరు దర్జీగా మారారు. మరొకరు టీ కొట్టు నడుపుతూ పల్లీలు అమ్మేవారు. కొందరు కూలి పనులకు వెళ్లేవారు. ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కథలు ఎక్కువగా ఎక్కడా నమోదు కాలేదు.
భాదురి లైబ్రరీలను శుభ్రం చేయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ జీవించారు. ఒక దశలో, వీధుల్లో శీతలా దేవత వేషంలో ప్రదర్శనలు ఇస్తూ జీవనం సాగించారు. ఆహారం లేదా కొద్దిపాటి డబ్బు కోసం ఆశీర్వాదాలు అందించే జానపద సంప్రదాయంలో భాగంగా ఆయన ఈ పనిని చేసేవారు.
పునరాగమనం – కొత్త తరం గుర్తింపు..
గత దశాబ్దంలో తను మళ్ళీ కొద్దికాలం పాటు వెలుగులోకి వచ్చారు. బెంగాలీ చలనచిత్ర దర్శకుడు కౌశిక్ గంగూలీ తన సినిమాల్లో భాదురికి అవకాశాలు ఇచ్చారు.
అంతకుముందు, 1999లో కోల్కతాకు చెందిన ‘సీగల్ బుక్స్’ ప్రచురణకర్త, నాటక రంగ నిర్వాహకుడు నవీన్ కిషోర్, భాదురి జీవితాన్ని ఒక డాక్యుమెంటరీ సినిమాగా ప్రదర్శించారు.
వీటి ద్వారా తనను పరిచయం చేసుకున్న కొత్త తరం, తనను సరికొత్త కోణంలో చూడటం ప్రారంభించింది.
కొందరికి తను ‘క్వీర్ పెద్దదిక్కు’గా మారారు; ఏ నిర్వచనాలకు అందని విధంగా తన జీవితాన్ని గడిపిన వ్యక్తిగా నిలిచారు.
“భారతదేశంలో LGBTQ+ ఉద్యమం అప్పుడప్పుడే మొదలవుతోంది. ఒక క్వీర్ చరిత్ర కోసం ఆరాటపడుతున్న ఆ ఉద్యమం, చపల్ భాదురిని తన ‘ఫెయిరీ గాడ్ మదర్’గా (రక్షక దేవతగా) స్వీకరించినట్టు అనిపించిందని రాయ్ రాస్తారు.
అయితే భాదురి స్వయంగా తనపై ఎలాంటి ముద్రలు వేయించుకోవడానికి ఇష్టపడలేదు. తన థర్డ్ జెండర్ వంటి పదాలతో తనను తాను గుర్తించుకోలేదు. రంగస్థలం బయట, తను ఏ ఇతర బెంగాలీ పురుషుడిలాగే కుర్తా, పైజామా ధరించేవారని రాయ్ పేర్కొన్నారు.
ఈ నిరాకరణ ఆధునిక కోణంలో తన జీవితాన్ని అర్థం చేసుకోవడాన్ని కొంత క్లిష్టతరం చేస్తుంది.
“తను ఒక క్వీర్ సర్వైవర్” అని రాయ్ అభిప్రాయపడ్డారు.
మిగిలిన ప్రశ్నలు..
నేడు ప్రపంచవ్యాప్తంగా జెండర్, అస్తిత్వ అంశాలపై చర్చలు జరుగుతున్న తరుణంలో, మరో విభిన్నమైన రూపంలో భాదురి కథ కనిపిస్తుంది.
ఏదో మాట వరసకు కాకుండా ఆచరణలో లింగభేదాలు పాటించని నాటక కళల చరిత్రను ఇది తెలుపుతుంది.
ప్రస్తుతం భాదురి ఒక వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. అది ఆయనకు ఆహ్వానం పలకని తన పుట్టింటికి కేవలం కొన్ని వీధుల దూరంలోనే ఉంది. వృద్ధాప్య ఆరోగ్య సమస్యలు, పాత జ్ఞాపకాల మధ్య ఆయన అక్కడ గడుపుతున్నారు.
రాబోయే కొత్త తరాలకోసం భాదురిలాంటి వారి జీవితాలను పునర్దర్శించడం అన్నది జ్ఞాపకాలుగా మిగిలిన ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది.
కొందరు కళాకారులు ఎందుకు గుర్తుండిపోతారు, మరికొందరు ఎందుకు మర్చిపోబడతారు? కొన్ని కళారూపాలు మాత్రమే ఎందుకు భద్రపరచబడతాయి, మరికొన్ని వాటిని పోషించిన వారితో పాటే ఎందుకు అంతరించిపోతాయి?
భాదురి జీవితాన్ని డాక్యుమెంట్ చేయడం ద్వారా, రాయ్ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి లేదా కనీసం వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించారు.
భాదురి ఆరు దశాబ్దాలకు పైగా నటించారు. ఏ కోణంలో చూసినా తను ఒక గొప్ప నటుడు. అయినప్పటికీ, ఏ సంస్కృతిని తీర్చిదిద్దడంలో తాను సహాయపడ్డారో, అదే సంస్కృతిలో ఆయన ఏళ్ల తరబడి ఒక మూలన సామాన్యుడిలా ఉండిపోయారు.
అనువాదం: దేవి పోలిన
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
