భారతీయ జనతా పార్టీ అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల అధికారంలో ఉన్న వారి అవినీతిని ఏ జర్నలిస్టు కూడా బహిర్గతం చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ చట్టం ప్రకారం జర్నలిస్టులు, ఆర్టీఐ చట్టం కార్యకర్తలు ఇకపై ఆర్టీఐ చట్టం ద్వారా అవినీతిని వెలికితీసే సమాచారాన్ని పొందలేరు. ఏ అవినీతి మంత్రి, అధికారి లేదా కాంట్రాక్టర్ పేరు అయినా వారి అనుమతి లేకుండా ప్రచురించడానికి నూతన చట్టం అనుమతించదు.
వారి అనుమతి లేకుండా ప్రచురించినా లేదా డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని ఉల్లంఘించినా, జర్నలిస్టుపై రూ 50 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. దాన్ని రూ 500 కోట్ల వరకు కూడా పెంచవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర జర్నలిజం సాధ్యమా? కోట్ల రూపాయల జరిమానాల భయాన్ని చూపించి మోదీ ప్రభుత్వం నిఖార్సయిన జర్నలిజానికి సమాధి కట్టనుందా? మీడియా స్వేచ్ఛపై ఇలాంటి దాడి ప్రజాస్వామ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
స్వతంత్ర జర్నలిజంపై దాడులు – ఆర్టీఐ సవరణలు..
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం దిగువ స్థానాల్లో ఉంది. దేశంలో స్వతంత్ర జర్నలిజంపై దాడులు ప్రతిరోజూ జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న వారి అవినీతి, అక్రమ కార్యకలాపాలను బహిర్గతం చేసే జర్నలిస్టులపై ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతుండగా, మరోవైపు స్వతంత్ర జర్నలిస్టులు, మీడియా సంస్థలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.
అధికారాన్ని బాధ్యతాయుతంగా నిలదీయగల నివేదికలను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో స్వతంత్ర జర్నలిజంపై మరో పెద్ద దెబ్బ తగిలింది. ప్రభుత్వం నియమాలను రూపొందించి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని అమలు చేసింది.
ఈ చట్టం కింద ఆర్టీఐ చట్టాన్ని సవరించి దాన్ని బలహీనపరిచారు. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల మంది సమాచారం పొందడానికి ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగిస్తారు. దీని ద్వారా అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలు వెలుగులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(j)లో మార్పులు చేసింది.
బయటకు రాని వ్యక్తిగత సమాచారం..
ఇప్పుడు ‘వ్యక్తిగత సమాచారం’ అంటే వ్యక్తులకు సంబంధించిన సమాచారం ఇకపై పొందడం సాధ్యం కాదు. ఉదాహరణకు, ఒక జర్నలిస్టు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని పారిపోయిన, తమ రుణాలు రద్దు చేయించుకున్న పెద్ద వ్యాపారవేత్తల పేర్లు ఆర్టీఐ ద్వారా అడిగితే, అవి వ్యక్తిగత సమాచారం కాబట్టి ఇవ్వలేమని చెబుతారు.
లేదా ఎక్కడైనా ఒక వంతెన కూలిపోతే, ఆ వంతెనను నిర్మించిన కాంట్రాక్టర్ల పేర్లు లేదా తనిఖీ తర్వాత నిధులను విడుదల చేసిన అధికారుల పేర్లు తెలుసుకోవడానికి ఆర్టీఐ దరఖాస్తు చేస్తే, ఇది వ్యక్తిగత సమాచారం అని చెప్పి ఇవ్వడానికి నిరాకరిస్తారు.
ఈ మొత్తం విషయంపై నితిన్ సేథీ, ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. గతంలో వారు ఆర్టీఐ ద్వారా పొందిన సమాచారంతో అవినీతిపై అనేక కథనాలను నిరంతరం ప్రచురించారు. నూతన చట్ట సవరణ వెలుగులో ఇకముందు అలాంటి కథనాలను చేయడం సాధ్యమవుతుందా?
వ్యవసాయ చట్టాల వెనుక దాగిన వాస్తవాలు..
అమృతా జోహ్రి, ఆర్టీఐ కార్యకర్త మాటల్లో.. “ఉదాహరణకు, కొంతకాలం క్రితం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల గురించి మా మనసులో సందేహాలు ఉండేవి. ఆ చట్టాలపై ప్రభుత్వం మొదటిసారి వెనక్కి తగ్గింది. ప్రజల్లో ఇది ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాల కోసం తీసుకువచ్చారని అనుమానం ఉండేది. అయితే అది కేవలం అనుమానం మాత్రమే. అందుకే మేము ఆర్టీఐ దాఖలు చేసి, ఈ వ్యవసాయ చట్టాలను తీసుకురావాలనే చర్చలు ఎక్కడ మొదలయ్యాయో తెలుసుకోవడానికి సంబంధిత పత్రాలను పొందాము. ఎందుకంటే ప్రభుత్వంలో అంతర్గత చర్చలు తప్పకుండా జరుగుతాయి.
ఆ ఫైళ్లను పరిశీలించినప్పుడు, మూడు చట్టాలలో కనీసం రెండింటిలో ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు ప్రభుత్వంతో కూర్చొని ‘దయచేసి ఇది చేయండి’ అని చెప్పినట్లు బయటపడింది. ‘ఇలా చేస్తే మాకు లాభం కలుగుతుంది’ అని వారు స్పష్టంగా పేర్కొన్నారు. వారు ప్రజలకు లాభం కలుగుతుందని కూడా రాయలేదు. తమ వ్యాపారం మెరుగవుతుందని మాత్రమే చెప్పారు. ఆ పత్రాలను మేము బయటకు తీసినప్పుడు, అదానీ ప్రతినిధులు కూడా అందులో ఉన్నారు. ఆహార వ్యాపారంలో ఉన్న మరెన్నో కంపెనీల ప్రతినిధులు కూడా అక్కడ కూర్చొని ‘ఈ అవకాశం మాకు మంచిది, ఈ చట్టాన్ని ఇలా మార్చండి, ఇలా తీసుకురండి’ అని సూచనలు చేశారు.
బయట మాత్రం ప్రభుత్వం ఇది ప్రజల కోసం, పేదల కోసం, రైతుల కోసం చేస్తున్నామని చెప్పింది. కానీ ఈ పత్రాలు చూస్తే అది కేవలం మాటలేనని తెలుస్తుంది. లోపల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. విదేశాల్లో ఉన్న ఒక ఎన్ఆర్ఐ కూడా అక్కడి నుంచే సూచనలు చేస్తే వాటిని కూడా అమలులోకి తీసుకువచ్చినట్టు తెలిసింది. ఇలా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొదటిసారిగా పక్కా ఆధారాలతో ఈ విషయాలను చెప్పగలిగాము. కాబట్టి ఆ పేర్లు మీరు ఎలా చెప్పారని మాపై కేసు వేయడం సాధ్యం కాలేదు.”
కోవిడ్ మరణాల లెక్కల్లో దాగిన నిజాలు..
ఇంకో ఉదాహరణగా కోవిడ్ కాలాన్ని తీసుకుందాం. సమయం గడిచిపోయి ఉండవచ్చు. కానీ ఆ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఇక్కడ మరణాలు ఎక్కువగా లేవు, పరిస్థితి నియంత్రణలో ఉంది’ అని పదేపదే చెబుతూ ఉండేవి. కానీ మాకు అందులో ఏదో తేడా ఉందని సమాచారం వచ్చింది. అది ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లో కూడా కనిపించింది. మన బంధువులే మరణిస్తున్నారు. ఆగ్రహం కూడా ఉంది.
అందుకే దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిజంగా ఏమి జరిగిందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాం. దాదాపు 600 ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేసి, ‘మీ మరణాల నమోదు పుస్తకంలో నమోదవుతున్న మరణాల సంఖ్య ఎంత?’ అని అడిగాము. ఆ 600లో సుమారు 90 మాత్రమే సమాధానం ఇచ్చాయి. మిగిలినవి స్పందించలేదు.
అయినప్పటికీ, ఆ 90 నుంచే ప్రభుత్వాలు చెబుతున్న సంఖ్యల కంటే నాలుగు నుంచి ఇరవై రెట్లు ఎక్కువ మరణాలు నమోదయ్యాయని బయటపడింది.
ఈ డేటా మొత్తం ఆర్టీఐ ద్వారానే బయటకు వచ్చింది. దీనిని తెలుసుకోవడానికి మరే ఇతర మార్గం లేదు.
కోవిడ్ సమయంలో పప్పుల పంపిణీ కుంభకోణం..
“మూడవ ఉదాహరణ, కోవిడ్ సమయంలో ప్రభుత్వం ‘పేదలు చాలా కష్టాల్లో ఉన్నారు, అందుకే అందరికీ తక్కువ ధరకు లేదా ఉచితంగా పప్పులు పంపిణీ చేస్తాం’ అని ప్రకటించింది. అది వినడానికి చాలా మంచిదిగా అనిపించింది. ప్రభుత్వాలు అప్పుడప్పుడూ మంచి పనులు కూడా చేస్తాయి కాబట్టి, వారు దీన్ని ఎలా ప్రణాళిక చేశారు, ఎలా అమలు చేశారు అనేది తెలుసుకోవాలని మాకు ఆసక్తి కలిగింది.
దీంతో మేము మళ్లీ ఆర్టీఐ దాఖలు చేసి ‘మీరు ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏ విధమైన ప్రక్రియ అనుసరించారు? కోవిడ్ సమయంలో ఇంత పెద్ద స్థాయిలో పంపిణీ ఎలా సాధ్యమవుతుందని భావించారు?’ అని అడిగాము. ఇది నిజంగా జరిగితే గొప్ప పని అవుతుందని కూడా మేము భావించాము, ఎందుకంటే ఆ సమయంలో అవసరం కూడా ఉంది.
కానీ ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం చూస్తే, ప్రభుత్వం ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. దాని ప్రకారం, ప్రభుత్వ గోదాముల్లో ఉన్న మంచి నాణ్యత గల పప్పులను మిల్లర్లకు ఇచ్చారు. ఆ మిల్లర్లు మార్కెట్ నుంచి తక్కువ నాణ్యత గల పప్పులను కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేశారు. అప్పటికే పేదలు ఆ పప్పులను తినలేకపోతున్నారని నివేదికలు వస్తున్నాయి.
ఎందుకంటే అవి తినడానికి అనువుగా లేవు. ఒకవైపు ప్రధాని దేశమంతా అత్యుత్తమ నాణ్యత గల పప్పులు పంపిణీ చేస్తున్నామని చెబుతుండగా, మరొకవైపు ప్రజలు వాటిని తినడానికి నిరాకరిస్తున్నారు.
కొన్ని రాష్ట్రాలు కూడా ‘ఇంత తక్కువ నాణ్యత గల పప్పులు పంపొద్దు’ అని స్పష్టంగా తెలిపాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
ఈ విషయాలు ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చినప్పుడు— మాకు బెదిరింపులు కూడా వచ్చాయి, మాట్లాడవద్దని ప్రలోభాలు కూడా చూపించారు. ప్రభుత్వం మిల్లర్లకు లాభం కలిగేలా ఒక విధానాన్ని రూపొందించినట్లు తెలిసింది. మిల్లర్లు మంచి నాణ్యత గల పప్పులను తమ దగ్గరే ఉంచుకుని, తరువాత మార్కెట్లో మంచి ధరలకు విక్రయించుకునే అవకాశం కలిగింది.
అంటే, ప్రభుత్వ గోదాముల్లో ఉన్న పప్పులు ప్రజల వనరులే. సంక్షోభ సమయంలో తక్కువ ధరకు మిల్లర్లకు ఇచ్చి, వారు వాటిని మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకునేలా అనుమతించారు.
పేదలకు మాత్రం తక్కువ నాణ్యత గల పప్పులను పంపిణీ చేశారు. ఈ మొత్తం పప్పుల పంపిణీ విలువ ఒక్క సంవత్సరంలోనే సుమారు 12–13 వేల కోట్ల రూపాయలకు చేరింది.”
ప్రజాస్వామ్యంలో పౌరుడే సార్వభౌముడు..
ఇలాంటి విషయాలను వెలుగులోకి తీసుకురావడం ఆర్టీఐ ద్వారానే సాధ్యం. దీనికి మరే ఇతర మార్గం లేదు. చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం, ప్రభుత్వం ఈ సమాచారాన్ని ముందుగానే వెల్లడించాలి. కానీ వాస్తవంగా ఏ ప్రభుత్వం స్వయంగా సమాచారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండదు.
అయితే ఆర్టీఐ ద్వారా ఫైళ్లను తెరిపించి, వారు ఏం ఆలోచిస్తున్నారనేది తెలుసుకునే హక్కు ఉండటం వల్లే ఇవి బయటపడతాయి.
కొన్ని సందర్భాల్లో “విజిల్బ్లోయర్లు” సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఇతర మార్గాల్లో కూడా ఈ విషయాలు బయటకు రావచ్చు. కానీ అలా చేస్తే ఎక్కువ సమయం పడుతుంది. పైగా అవి దొంగ పత్రాలుగా పరిగణించబడే ప్రమాదం ఉంటుంది. కానీ ఆర్టీఐ మాత్రం మన హక్కు. ప్రభుత్వంపై పర్యవేక్షణ చేయడం, వారు ఏమి చేస్తున్నారనేది తెలుసుకోవడం పౌరుల బాధ్యత. ఈ పారదర్శకత ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన అంశం. ప్రభుత్వం మన సేవకుడు. అది మన వనరులపై కూర్చొని ఉండేది కాదు. మన కోసమే వాటిని ఉపయోగించాలి.
అందువల్ల, నా వనరులను మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అని అడగడం నా హక్కు కావాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో పరిశోధనాత్మక జర్నలిజం పెరిగింది. సాధారణ పౌరుడికి కూడా “నా ఇంటి వెనుక ఉన్న రోడ్డుపై నేను ప్రశ్నించగలను, ప్రధానమంత్రిని కూడా మీరు అప్పట్లో ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు అని అడగగలను” అనే భావన వచ్చింది.
ఎందుకంటే మీరు ప్రధానమంత్రి అయినా సరే, మీరు నా సేవకుడివే. నేను మీకు జీతం చెల్లిస్తున్నాను. కాబట్టి మీరు ఏమి చేస్తున్నారు అని అడగడం నా హక్కు. ప్రజాస్వామ్యంలో పౌరుడే సార్వభౌముడు అన్న భావన ఆర్టీఐ చట్టం ద్వారా స్థాపించబడింది.
ఆ విధంగా ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ఎంతో సమాచారం ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చింది. పరిశోధనాత్మక జర్నలిస్టులు, సాధారణ ప్రజలు ఈ సమాచారాన్ని వెలికితీశారు. కానీ ఇప్పుడు అలాంటి సమాచారంలో చాలా భాగం పొందడం సాధ్యం కాదు.
సెక్షన్ 8(1)(j) సవరణతో పారదర్శకతకు గండి..
ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8లో ఏ సమాచారాన్ని ప్రజలకు ఇవ్వకూడదో పేర్కొనబడింది. అందులోని సెక్షన్ 8(1)(j)లో, ప్రజా ప్రయోజనానికి లేదా ప్రజా కార్యకలాపాలకు సంబంధం లేని వ్యక్తిగత సమాచారం మాత్రమే ఇవ్వకుండా నిరాకరించవచ్చని స్పష్టంగా పేర్కొనబడింది.
ఈ నిబంధన గత 20 సంవత్సరాలుగా అమల్లో ఉంది. దీనికి సంబంధించిన అనేక కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాయి.
2019లో సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠం ఈ సెక్షన్ను పరిశీలించి, ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమని పేర్కొంది. సమాచార హక్కు, గోప్యతా హక్కు అనే రెండు మౌలిక హక్కులను ప్రజా ప్రయోజనాన్ని ఆధారంగా తీసుకుని సమతుల్యం చేసిన విధానం సరైనదని పేర్కొంది.
ఆర్టీఐ చట్టం గోప్యతను కాపాడుతూనే, ప్రజా ప్రయోజన అంశాల్లో పారదర్శకత, బాధ్యతను కూడా ప్రాముఖ్యత ఇస్తుందని తెలిపింది.
అయితే, డేటా ప్రొటెక్షన్ చట్టం ద్వారా ప్రభుత్వం సెక్షన్ 8(1)(j)ను పూర్తిగా సవరించింది. ఈ సమతుల్య విధానాన్ని తొలగించి, ఇప్పుడు ఏ వ్యక్తిగత సమాచారం కూడా ఇవ్వబడదు అని పేర్కొంది. అంటే, ఈ సెక్షన్ కింద వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడంపై పూర్తిగా నిషేధం విధించినట్లైంది.
అంతేకాకుండా, ప్రజా ప్రయోజనం అనే ప్రమాణాన్ని కూడా ఈ సెక్షన్ నుంచి తొలగించారు. ఉదాహరణకు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కలుషిత పాలను తాగి 16 మంది మరణించారు. ఆ పాలను పరీక్షించిన అధికారులు ఎవరు? వారికి మార్కెట్లో విక్రయానికి అనుమతి ఇచ్చింది ఎవరు? అని ఎవరైనా ఆర్టీఐ ద్వారా అడిగితే, ఆ అధికారుల పేర్లు వ్యక్తిగత సమాచారం అని చెప్పి ఇకపై ఇవ్వకపోవచ్చు.
ఈ వ్యాసం నాలుగు భాగాలుగా ప్రచురితమవుతోంది, ఇది మొదటి భాగం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
