“రవి అస్తమించని సామ్రాజ్యం, 200 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన బ్రిటన్ దేశాన్ని కిందకు తొక్కి ప్రపంచంలో నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ఎదిగింది. త్వరలో జపాన్ను కూడా కిందకి నెట్టి మూడో స్థానాన్ని ఆక్రమించబోతున్నాం” అని ఊరూవాడా ఏకమై జబ్బలు చరుచుకుంటూ ప్రచార హోరు లేవనెత్తారు.
ప్రపంచ బ్యాంకు ఆ గుట్టును ఇప్పుడు రట్టు చేసింది. నాలుగు కాదు, ఆరో స్థానంలోకి భారత్ దిగిందని తాజాగా ఐఎంఎఫ్ ప్రకటించింది. 3వ స్థాన హోదాకు చాలా దూరంలో ఉన్న భారతదేశం, ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్‌లలో ఆరవ స్థానానికి పడిపోయిందని నిగ్గు తేల్చింది.
తొందరపాటు ప్రకటన – ఐఎంఎఫ్ వాస్తవాలు..
తుది గణాంకాలు వెలువడకుండానే ఐఎంఎఫ్ అంచనాల ఆధారంగా, తాము నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని భారత ప్రభుత్వం చేసిన తొందరపాటు ప్రకటన ఇప్పుడు పసలేకుండా పోయింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) డేటాను తప్పుగా అర్థం చేసుకుని, గతేడాది ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని కేంద్ర ప్రభుత్వం చేసిన తొందరపాటు వాదనలకు విరుద్ధంగా, 2026 ఏప్రిల్‌లో విడుదల చేసిన తన తాజా ర్యాంకింగ్‌లలో ఐఎంఎఫ్ భారతదేశాన్ని ఆరో స్థానంలో ఉంచింది.
2025 మేలో విడుదల చేసిన ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం, 2025-26 నాటికి భారతదేశం జపాన్ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉందని ఊహించింది.
ఆ సమయంలో, భారతదేశ జీడీపీ సుమారు $3.9 ట్రిలియన్లుగా అంచనా వేయగా, జపాన్ జీడీపీ దాదాపు $4 ట్రిలియన్లుగా ఉంది. ఐఎంఎఫ్ తాజా డేటా ప్రకారం, ర్యాంకింగ్‌లలో పైకి ఎగబాకడానికి బదులుగా, 2021లో తాను అధిగమించిన యూకే కంటే దిగువన, ఐదో స్థానం నుంచి భారతదేశం పడిపోయింది.
ఐఎంఎఫ్ ఏప్రిల్ ప్రపంచ ఆర్థిక దృక్పథం ప్రకారం, భారతదేశం 2026-27ను $4.15 ట్రిలియన్ల జీడీపీ పరిమాణంతో ముగించే అవకాశం ఉంది. ఇది యూకే $4.26 ట్రిలియన్ల కంటే తక్కువ.
గత సంవత్సరం ప్రభుత్వం ఏమి చెప్పింది?
గత సంవత్సరం నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, “నేను మాట్లాడుతున్న ఈ సమయంలో మనం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము. నేను మాట్లాడుతున్న ఈ సమయానికి మనం 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము. ఇది నా డేటా కాదు. ఇది ఐఎంఎఫ్ డేటా. ఈ రోజు భారతదేశం జపాన్ కంటే పెద్దది” అని 2025 మే 24న ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రకటించారు.
కొన్ని రోజుల తర్వాత, గాంధీనగర్‌లో జరిగిన ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ “ఈ రోజు, భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మనం ఇప్పుడు జపాన్ను అధిగమించడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు, నాల్గవ(అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ) అయిన ఆనందం కంటే, మూడవ(అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ) కావాలనే ఒత్తిడే ఎక్కువగా ఉంది. దేశం వేచి ఉండటానికి సిద్ధంగా లేదు” అని పేర్కొన్నారు.(వెనుక నుంచి ‘మోదీ ఉంటే సాధ్యమే’ అనే నినాదం వస్తుంది).
ఐఎంఎఫ్ డేటా కేవలం ఊహాజనితం మాత్రమేనని, అది తుది డేటా కాదనే ముఖ్యమైన హెచ్చరికను పాలకులు పదేపదే విస్మరించారు.
ఆ తర్వాత వెంటనే విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం, “ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించి, 2030 నాటికి 7.3 ట్రిలియన్ డాలర్ల అంచనా జీడీపీతో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచే దిశగా పయనిస్తోంది” అని పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను, “ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకాల వంటి వ్యూహాత్మక కార్యక్రమాలను” ప్రశంసిస్తూ ప్రభుత్వం ఇలా పేర్కొంది: “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆర్థిక వృద్ధి కేవలం వేగాన్ని పుంజుకోవడం మాత్రమే కాదు, ఇది దేశ ఆర్థిక భవిష్యత్తును పునర్నిర్మించడం కూడా.”
2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తున్నామని ఆగస్టులో ప్రభుత్వం పేర్కొంది. “ప్రస్తుతం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం, అంచనా వేయబడిన $7.3 ట్రిలియన్ల జీడీపీతో 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోంది. నిర్ణయాత్మక పాలన, దూరదృష్టితో కూడిన సంస్కరణలు, చురుకైన ప్రపంచ భాగస్వామ్యం ఈ పురోగతికి దోహదపడుతున్నాయి” అని ఆ ప్రకటన తెలిపింది.
2025 డిసెంబర్లో విడుదల చేసిన మరో ప్రకటనలో “2025లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పుడు దాని పటిష్టత స్పష్టమైంది” అంటూ ప్రభుత్వం పేర్కొంది.
అధికారిక వైఖరికి కట్టుబడిన మంత్రులు, ప్రభుత్వ అధికారుల బృందంలో మాజీ కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు.
“గత 11 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేసిన అపూర్వమైన సంస్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక విధానాల వల్ల భారతదేశం నిలకడగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. ఈ సంస్కరణలు భారతదేశాన్ని ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాయి” అని ఆయన అన్నట్లు అవుట్‌లుక్ బిజినెస్ పేర్కొంది.
అసలు ఏం జరిగింది?
నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండటానికి లేదా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే మార్గంలో ఉండటానికి బదులుగా, 2028లో భారతదేశం కేవలం నాలుగో స్థానంలో నిలుస్తుందని ఐఎంఎఫ్ తాజా గణాంకాలు అంచనా(ఊహ) వేస్తున్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం భారతదేశ జీడీపీ క్షీణతకు గల కారణాలలో ఒకటి.
అంతేకాకుండా, ఐఎంఎఫ్ అంచనాలు ప్రభుత్వ డేటాపై ఆధారపడి ఉంటాయి. ఇందులో తరచుగా తప్పులు ఉంటాయి. ఐఎంఎఫ్ ఒక డేటా సేకరణ సంస్థ కానందున, దాని డేటాలో కూడా ఈ తప్పులు ఉండే అవకాశం ఉంది.
ఫిబ్రవరిలో విడుదలైన తాజా ప్రభుత్వ జీడీపీ అంచనాల ప్రకారం, దేశ నామమాత్ర జీడీపీ పాత సిరీస్‌లోని రూ 357 లక్షల కోట్ల నుంచి కొత్త సిరీస్‌లో రూ. 345.5 లక్షల కోట్లకు తగ్గింది.
ఇదిలా ఉండగా, జపాన్ $4.38 ట్రిలియన్లతో తన స్థానాన్ని నిలుపుకుంది. దీని కంటే ముందు జర్మనీ ($5.45 ట్రిలియన్లు), చైనా ($20.85 ట్రిలియన్లు), అమెరికా ($32.3 ట్రిలియన్లు) ఉన్నాయి. ఇండియా వీటి వెనుక ఉంది.
ఆదాయ అసమానతలు – వాస్తవ పరిస్థితి..
భవిష్యత్తులో భారతదేశం జపాన్ను అధిగమించి నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించవచ్చు. అయినప్పటికీ, ఈ రెండు దేశాల మధ్య తలసరి ఆదాయంలో పూడ్చాల్సిన భారీ అంతరం ఇంకా ఉందని గమనించాలి.
జపాన్ తలసరి ఆదాయం $33,900 కాగా, 146 కోట్ల జనాభాతో చాలా పెద్దదైన భారతదేశ తలసరి ఆదాయం కేవలం $2,880 మాత్రమే. అదానీ, అంబానీ, టాటా, ఎయిర్టెల్ లాంటి దిగ్గజ సంస్థల/వ్యక్తుల ఆదాయాలు/సంపద భారీగా పెరిగింది. వీరిని లెక్కలోకి తీసుకొని జీడీపీ పెరుగుదల లెక్కించబడుతున్నది. కానీ సగటు భారతీయుడి ఆదాయాలు, సంపద దిగజారుతున్నాయి.
భారతదేశానికి సంబంధించి, ఆర్థిక వ్యవస్థ పరిమాణం కంటే భారీ ఆదాయ అసమానతల తగ్గింపు, సమాన అభివృద్ధి అనేవి చాలా ముఖ్యమైన కొలమానాలు. వీటిని కప్పిపెట్టి ప్రగల్భాలు పలికితే నిజమనే నిప్పును తాత్కాలికంగా మభ్యపెట్టవచ్చు తప్ప, శాశ్వతంగా పాతిపెట్టడం అసాధ్యం.
స్వేచ్ఛానువాదం: సుబ్రమణ్యం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
