కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవాలకు వాణిజ్య ప్రకటనల రూపంలో భారత ప్రభుత్వం రూ 76 లక్షలు విడుదల చేసిందని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
ఇదంతా సాధారణంగా జరగాల్సిన పద్ధతి ప్రకారమే జరిగిందని, ఈ నిధుల విడుదలకు సంబంధించిన నిర్ణయం కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్ షా అధ్యక్షులుగా ఉన్న సంబంధిత కమిటీ తీసుకున్నదని సాంస్కృతిక శాఖ ఆ ప్రకటనలో తెలియజేసింది.
సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన వాస్తవాలు..
దేశంలోని వివిధ మీడియా సంస్థలకు ఆర్ఎస్ఎస్ శత వార్షికోత్సవాల సందర్భంగా వాణిజ్య ప్రకటనల రూపంలో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ 76,13,129లు ఖర్చు చేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారం వెల్లడైంది.
మహారాష్ట్రకు చెందిన అజయ్ బాసుదేవ బోస్ అనే సమాచార హక్కు కార్యకర్త కేంద్ర ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్న వేశారు. సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి పపుంజయ్ కుమార్ 2026 ఏప్రిల్ 13న అజయ్ బాసుదేవ్ బోస్ ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారం ఇచ్చారు.
ఈ మొత్తం ఖర్చు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ భరించినట్లుగా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 1న ఆర్ఎస్ఎస్ శత జయంతి సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమానికి ఇచ్చిన వాణిజ్య ప్రకటనల ఖర్చు ఇది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు.
పైన తెలియజేసిన మొత్తం కేవలం కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ప్రకటనల రూపంలో చేసిన ఖర్చు మాత్రమే తప్ప, మొత్తం ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలకైన ఖర్చు కాదు.
1925 సెప్టెంబర్ 27న నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. ఆర్ఎస్ఎస్ తనకు తాను కల్చరల్ నేషనలిజంగా(సాంస్కృతిక జాతీయవాదం) ప్రకటించుకున్నది. వాస్తవంగా ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఐడియాలజీ, ఇండియాను హిందూ నేషన్‌గా ప్రమోట్ చేసింది.
ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలు భారతదేశమంతటా వివిధ రూపాలలో ప్రజా కార్యక్రమాలుగా నిర్వహించబడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వమే ఈ కార్యక్రమాలకు ఆర్థిక మద్దతు ఇవ్వడం అత్యంత ప్రమాదకరం.
‘ది వైర్’ సంధించిన కీలక ప్రశ్నలు..
ఈ అంశంపై ప్రభుత్వ స్పందన కోసం ప్రభుత్వ మీడియా సమాచార హక్కు సంస్థ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎం అన్నాదురైకి “ది వైర్” కింది ప్రశ్నలు సంధించింది:
1. ప్రభుత్వ సంస్థలు కాని ఒక సిద్ధాంతపరమైన సంస్థకు కేంద్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు చేసేందుకు ఒక స్పష్టమైన విధానం కానీ నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ కానీ ఉన్నాయా?
2. ఏ స్థాయిలో ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవాలకు వాణిజ్య ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు?
3. ఇలాంటి వాణిజ్య ప్రకటనలు ఇవ్వడానికి ఏ కొలమానం ప్రకారం నిర్ణయం తీసుకున్నారు?
4. గతంలో ప్రభుత్వం ఎప్పుడైనా ఇలాంటి సామాజిక, సాంస్కృతిక, మతపరమైన సంస్థలకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చిందా? ఇస్తే వాటి వివరాలు ఏమిటి?
5. ప్రభుత్వం ఏ మతానికి చెందినది కాదు, స్వతంత్రంగా వ్యవహరించేది అనే అంశాన్ని ఆర్ఎస్ఎస్ కు వాణిజ్య ప్రకటనలు ఇచ్చే ముందు ప్రభుత్వం పరిశీలించిందా?
6. ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకోవడానికి, ఆమోదించడానికి ఇతర మంత్రిత్వ శాఖల నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయా?
అయితే ఈ ప్రశ్నలకు మెయిల్ ద్వారా లేదా మరొక రూపంలో రాతపూర్వక జవాబులు రాలేదు. సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ ది వైర్ సంస్థతో ఫోన్లో మాట్లాడారు.
సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరణ..
కేంద్ర హోంమంత్రి అధ్యక్షులుగా ఉన్న సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగానే ఈ నిర్ణయాలు తీసుకుంది. ఒక నిర్దిష్ట పద్ధతి ప్రకారం మంత్రిత్వ శాఖ కొన్ని ముఖ్యమైన చారిత్రాత్మకమైన, సంస్థాగతమైన వాటికి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని కూడా ఆయన చెప్పారు. ఆయన ఇంకా ఇలా చెప్పారు.
హోం శాఖ మంత్రి అధ్యక్షులుగా ఉన్న నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఇలాంటి శత జయంతులు, వ్యక్తుల, సంస్థలకు సంబంధించినవి నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంటుంది. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కూడా ఇందులో భాగంగానే నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ తీసుకున్నది. ఇలాంటి ఉత్సవాలు నిర్వహించేప్పుడు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం సర్వసాధారణం.
అంతేకాదు ఇలాంటి సందర్భాలలో ప్రత్యేక నాణేలు, పోస్టల్ స్టాంపులు కూడా విడుదల చేస్తుంటాము. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక నాణేన్ని, పోస్టల్ స్టాంప్‌ను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా వార్తాపత్రికలలో వాణిజ్య ప్రకటనలు కూడా విడుదల చేశాము.
వివిధ శత జయంతి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలలో భాగంగానే ఇది జరిగింది అని ఆయన వివరణ ఇచ్చారు.
ఇంకా మాట్లాడుతూ, “ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించింది కనుక సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు మేము సమాచారం ఇచ్చాము” అని ఆయన చెప్పారు.
గతంలో జరిగిన ఇతర ఉత్సవాల ఉదాహరణలు..
జైన్ మునిస్వామి విజయానంద్ స్థాపించిన సంస్థ శతజయంతి ఉత్సవాలను కూడా మేము నిర్వహించాము. అలాగే వందేమాతరం 150వ జయంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు కూడా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే మేము నిర్వహించాం.
అంతేకాదు కొద్దిమంది వ్యక్తుల, సంస్థల సిల్వర్ జూబ్లీ(25), గోల్డెన్ జూబ్లీ(50), ప్లాటినం జూబ్లీ(75)లాంటి ఉత్సవాలకు కూడా నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అనుమతి ఇస్తుంది.
సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధికారిక వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన వివరాలు చూడవచ్చు. సోమనాథ్ పై జరిగిన దాడి వెయ్యి సంవత్సరాల సందర్భంగా, గురుతేజ్ బహదూర్ హత్య 350 సంవత్సరాల సందర్భంగానూ, అహల్యాబాయ్ హోల్కర్ లాంటి ఉత్సవ సందర్భాలలో కూడా కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాలకు నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఆమోదం ఉంది.
సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేపథ్యం..
ఈ సందర్భంలో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గతాన్ని గురించి తెలుసుకోవటం అవసరం.
వారు 1992లో జై నారాయణ వ్యాస్ యూనివర్సిటీ, జోధ్‌పూర్‌లో ఏబీవీపీ అధ్యక్షులుగా ఎన్నిక కావడం దగ్గర వారి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి నుంచి వారు సంఘ్ పరివార్ కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్నారు. స్వదేశీ జాగరణ్ మంచ్‌లో సభ్యులుగా ఉన్నారు. సీమా జనకల్యాణ్ సమితిలో కూడా వారు చురుకైన కార్యకర్త.
ఈ సంస్థల ఉద్దేశం దేశ సరిహద్దు దళాల మాదిరిగా దేశంలో ప్రజల మధ్య ఒక రక్షణ వలయం ఏర్పాటు చేయడం. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తను మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ అనేది జాతీయ భావనను నిర్మించే ఒక పాఠశాల అని, అందుకు ఆ పాఠశాల కొత్త శక్తిని, మార్గదర్శకత్వాన్ని చూపించిందని ఆర్ఎస్ఎస్ను షెకావత్ పొగిడారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా?
రాజ్యాంగపరమైన ప్రశ్నలు, నిపుణుల అభిప్రాయాలు..
రాజ్యాంగంలో భారతదేశం సెక్యులర్ దేశం అని స్పష్టంగా రాయబడి ఉంది. అలాగే ప్రభుత్వం ఒక ప్రత్యేక ఐడియాలజీని కానీ, సంస్థని కానీ ప్రోత్సహించదని కూడా ఉంది.
కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ వ్యవహారాల శాఖ ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలకు వాణిజ్య ప్రకటనలను విడుదల చేసేముందు రాజ్యాంగంలో నిర్దేశించబడిన ఈ అంశాలని పరిగణించాల్సిన అవసరం లేదా?
సుప్రీంకోర్టు న్యాయవాది సంజయ్ హెగ్డే ‘ది వైర్ హిందీ’తో మాట్లాడుతూ ఇలాంటి ప్రశ్నలు తప్పనిసరిగా వేయాల్సిన అవసరం ఉన్నది అన్నారు.
కుంభమేళా పండుగలకు కూడా కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా నిధులను విడుదల చేస్తుంది, ఇవన్నీ ప్రభుత్వం సెక్యులర్ కాదు అని నిర్ధారిస్తున్నాయి.
అదే సందర్భంలో “ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే నిధులను ఇలాంటి సందర్భాలలో ఖర్చు చేయడాన్ని నిషేధిస్తూ రాజ్యాంగంలో నిర్దిష్టమైన అంశం లేదు” అని ఆయన అన్నారు.
అదే సందర్భంలో ఆయన మరొక విషయాన్ని కూడా చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తన శత జయంతి ఉత్సవాలను జరుపుకున్నది కానీ ప్రభుత్వ నిధులను వాణిజ్య ప్రకటనలకు వినియోగించుకోలేదని గుర్తు చేశారు.
ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం చట్ట ఉల్లంఘన కాకపోయినప్పటికీ, స్వతంత్రంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకునేందుకు ఏమాత్రం అవకాశం లేదు.
అందుచేత భవిష్యత్తులోనైనా ఇలాంటి వాటికి సంబంధించి నిర్దిష్టమైన చట్టాలు తీసుకురావడం అవసరం.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
