అవసరమో లేదా అనివార్యమో తెలియదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాంతీయవాదాన్ని బలంగా వినిపించారు.
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన గురించి తొలి నుంచి నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు.
బీజేపీ నాయకుల నుంచి ఆరోపణలు ఎదురైనా సీట్ల పెంపు విషయంలో ఒక స్టాండ్ తీసుకున్నారు. పరోక్షంగా తెలంగాణ అస్తిత్వాన్ని, దాని ఉనికిని వినిపించే ప్రయత్నం చేశారు.
కులగణన నివేదిక – సంచలన నిర్ణయాలు..
మరొక ముఖ్యాంశం ఇక్కడ ప్రస్తావించాలి. కులగణన పూర్తి నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచారు. గత ప్రభుత్వం జనాభా లెక్కలు చేసినా ఆ నివేదిక బయటికి రాలేదు.
ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది. ఈ లెక్కల పైన కొన్ని నిరసనలు, కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.
వీటి సంగతి ఎలా ఉన్నా, ఒక ముఖ్యమంత్రిగా, జాతీయ పార్టీ నాయకుడిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాలే.
జాతీయ పార్టీలో ఉంటూ దక్షిణాది వాదం..
ఇంత వరకు ఎవరూ చేయలేదని కాదు. జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయవాదాన్ని వినిపించడమే ఇక్కడ గమనించాల్సిన విషయం.
తమిళనాడు నుంచి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి – డీఎంకే ద్రవిడవాద పార్టీ, సీపీఎం కూడా దక్షిణాదికి జరుగుతున్న నష్టం గురించి మాట్లాడింది.
కాంగ్రెస్ పార్టీ ద్రవిడ అస్తిత్వాన్ని బహిరంగంగా, పరోక్షంగా సమర్థించలేదు. ఆ వాదాన్ని ఎత్తుకోలేదు.
రేవంత్ రెడ్డి దక్షిణాది వాదాన్ని ఎత్తుకోవడం గమనించాల్సిన విషయం. గడిచిన కొన్ని నెలలుగా రేవంత్ రెడ్డి దక్షిణ భారతదేశానికి జరిగే నష్టం గురించి చెబుతున్నారు.
ఉత్తర-దక్షిణ భారతదేశాల అభివృద్ధి వ్యత్యాసాలను ఎత్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మన పక్క రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు, టీడీపీ, వైసీపీ, జనసేన వీటి గురించి ఎక్కువగా పట్టించుకోలేదని చాలా మంది భావన.
మరి పట్టించుకున్న రేవంత్ రెడ్డికి అనుకూలత, సానుకూలత ఎందుకు లేదు?
గతం ప్రభావం – ప్రస్తుత నిర్ణయాలపై విమర్శలు..
రేవంత్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలుగుదేశంలో ఉన్నారు. ఆ పార్టీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది.
రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని చూసింది. ఆ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలకు సానుకూల అభిప్రాయం లేదు.
పైగా అప్పట్లో రేవంత్ రెడ్డి వ్యవహార శైలి తెలంగాణ ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. తెలంగాణ ఉద్యమకారుల వైపు ఆయన లేడని అప్పట్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు గందరగోళాన్ని కలిగిస్తున్నాయి.
అంతేకాదు, హైడ్రా చర్యల వలన ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతున్న తీరు కూడా బాగా లేదని చాలా మంది అనుకుంటున్నారు.
గత ప్రభుత్వాన్ని, దాని విధానాన్ని పదేపదే తప్పుబట్టిన ఈయన అదే దారిలో వెళ్తున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.
వ్యక్తిగా తాను తెలంగాణ పౌరుడు కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ, ఆయన విధానాలు ఎన్నికల చుట్టూ, పెట్టుబడుల చుట్టూ తిరుగుతున్నాయి తప్ప తెలంగాణ ఆత్మ లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వెరసి రేవంత్ రెడ్డి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడినా, పరోక్షంగా ద్రవిడవాదాన్ని సమర్థించినా ప్రజల నుంచి సానుకూలత రావడం లేదు.
కారణం గతంలోని ఆయన చర్యలు, వర్తమానంలోని ఆయన విధానాలే. అందుకే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉనికి, అస్తిత్వాలను పట్టించుకుంటారనే ఆలోచన రాకపోవడానికి బహుశా ఈ అంశాలు పునాదై ఉండొచ్చు.
జాతీయ విధానం వర్సెస్ స్థానిక పరిస్థితులు..
రాహుల్ గాంధీ పార్టీ పాలసీకి బహుజన కోణాన్ని ఆపాదించుకున్నారు. ఎవరెంతో వారికంత అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు.
కాబట్టే రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుతున్నారనే కొందరి భావన. కాంగ్రెస్ పార్టీ నాయకత్వమంతా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశాలకు సంబంధించి పార్లమెంట్ లోపలా, బయటా బీజేపీ విధానాన్ని తప్పుబడుతోంది.
ఈ కారణంగా ఈ బిల్లులు వెనక్కి వెళ్లాయి. బీజేపీ, ఎన్డీఏ పార్టీల నేతలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజల నుంచి అనుకూల స్పందన అంతంత మాత్రంగానే ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి ఒక్కరే పార్టీ విధానాన్ని బలంగా వ్యక్తీకరించారు.
తనదైన దూకుడు, ఎదురుదాడి శైలి ఆయనకు పెద్దగా మైలేజ్ తీసుకురాలేదు. కాకపోతే, బీజేపీ వ్యూహాన్ని అడ్డుకునే ప్రక్రియలో లేదా ప్రజల్లోకి తన గొంతును బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఆయన విజయవంతమయ్యారు. రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకులు మినహా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు, వాదనలకు పెద్దగా మద్దతు ఇచ్చిన వాళ్లు లేరు. దీంతోపాటు దక్షిణాదికి నష్టం జరుగుతుందనే వాదన ఒకవైపు, హైడ్రా కూల్చివేతల వాదనలు మరోవైపు. ఈ రెండింటిలో ప్రజల దృష్టి మాత్రం కూల్చివేతల వైపే వెళ్లింది.
చట్ట విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికార యంత్రాంగంపై ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉండి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేది. రేవంత్ రెడ్డిపై జనాభిప్రాయం ఇంకో విధంగా వ్యక్తమయ్యేది.
విపక్షాల వైఖరి – ప్రజల స్పందన..
బీఆర్ఎస్ కూడా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విధానాన్ని తప్పుబట్టింది. దక్షిణానికి నష్టం జరుగుతుందనే వాదనను కూడా వినిపించింది.
అయితే, బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉండి ప్రశ్నించి ఉంటే తెలంగాణ ఉనికి, అస్తిత్వ ఆకాంక్షల వ్యక్తీకరణ మరింత బలంగా ఉండేది. దక్షిణాది ముఖ్యమంత్రులు, పార్టీలు తీసుకునే ఆందోళనా కార్యక్రమాలకు తామూ మద్దతిస్తామని ఆ పార్టీ నాయకత్వం చెప్పింది.
లోక్ సభలో ఆ బిల్లులు వెనక్కి వెళ్లిన తర్వాత జరగాల్సిన చర్చ జరగడం లేదు. ప్రజలకు ఈ రెండు బిల్లుల అనుకూల, వ్యతిరేక అంశాలు విడమరిచి చెప్పాల్సిన పార్టీలు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి.
ముందు తరాలకు ఏ సందేశం ఇవ్వాలనే అంశం గురించి పట్టించుకున్నట్టు లేదు. బహుశా జాతీయ పార్టీలో ఉండి కూడా దక్షిణాది వాదాన్ని వినిపించిన రేవంత్ రెడ్డికి ప్రజల నుంచి తగిన సానుకూలత రావడం లేదనేది రాజకీయ పండితుల భావన.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
