మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని బాబుపారా ప్రాంతంలో, మంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ బంగ్లా వైపు నిరసనకారులు పాదయాత్ర చేయగా- భద్రతా దళాలకు, వారికి మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో కనీసం 22 మంది గాయపడి ఆసుపత్రులలో చేరారు. ఇదిలా ఉండగా, కాంగ్పోక్పి జిల్లాలో, ఉఖ్రుల్లో అనుమానిత నాగా మిలిటెంట్ల చేతిలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురైన ఘటనకు నిరసనగా, ఒక కుకీ సంస్థ 10 గంటల సంపూర్ణ బంద్‌కు పిలుపునిచ్చింది.
న్యూఢిల్లీ: జాతి హింసాకాండతో అట్టుడికిపోతున్న మణిపూర్‌లో, శనివారం(మార్చి 25) నాడు, పౌర సమాజ సంస్థ అయిన ‘కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ’ నిర్వహించిన ర్యాలీలో నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ చెలరేగింది.
న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని బాబుపారా ప్రాంతంలో ఉన్న ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ బంగ్లా వైపు నిరసనకారులు పాదయాత్ర చేయడానికి ప్రయత్నించారు.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు.
నిరసనకారులు నాలుగు వేర్వేరు దిశల నుంచి కవాతు చేశారు. అయితే, భద్రతా సిబ్బంది వారి కవాతును మధ్యలోనే నిలిపివేశారు.
ముఖ్యమంత్రి బంగ్లాకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖురాయ్ లామ్లాంగ్ ప్రాంతంలో జరిగిన ర్యాలీ సందర్భంగా ఉద్రిక్తతలు పెరిగాయి.
నిరసనకారులు భద్రతా బారికేడ్లను ఛేదించుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో, వారిని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది బాష్పవాయువు ప్రయోగించారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ ఉద్రిక్తతల్లో కనీసం 22 మంది గాయపడి ఆసుపత్రిలో చేరారు.
ప్రభుత్వానికి కోకోమి డెడ్‌లైన్..
పౌరులపై ఉగ్రవాద దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ఇంఫాల్ లోయకు చెందిన మైతేయి సంస్థ మణిపూర్ సమగ్రతా సమన్వయ కమిటీ(కోకోమి) పిలుపు మేరకు నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు.
ఇటీవల, కోకోమి అధికార బీజేపీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. బిష్ణుపూర్ జిల్లాలో ఇటీవల జరిగిన బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించగా, ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ ఏప్రిల్ 25 లోగా అరెస్టు చేయాలని ప్రభుత్వానికి గడువు విధించింది.
బిష్ణుపూర్ జిల్లాలోని ట్రోంగ్లావోబి గ్రామంలో ఇద్దరు పిల్లలు మరణించడం, వారి తల్లి తీవ్రంగా గాయపడటంతో ఏప్రిల్ 7న మణిపూర్‌లో తాజా నిరసనలు చెలరేగాయి.
కుకీ మిలిటెంట్లు ప్రయోగించినట్లు భావిస్తున్న ఒక పేలుడు పదార్థం(రాకెట్) వారి ఇంటిపై పడటంతో ఈ ఘటన జరిగింది.
శనివారం, భద్రతా ఆంక్షలు ఉన్నప్పటికీ, నిరసనకారులు కాంగ్లా సమీపంలో ర్యాలీ నిర్వహించగలిగారు. ఈ సభను కోకోమి నాయకులు ఉద్దేశించి ప్రసంగించారు.
అనంతరం, ముఖ్యమంత్రితో సమావేశమయ్యేందుకు అధికారులు కొంతమంది కోకోమి నాయకులకు అనుమతినివ్వగా, వారు అక్కడ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
కొనసాగుతున్న ‘పరోక్ష యుద్ధాన్ని’ ఆపి, ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలలో, ముఖ్యంగా ఇద్దరు పిల్లల హత్యల విషయంలో న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందా అని ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
అంతేకాకుండా, బిష్ణుపూర్‌లో ముగ్గురు నిరసనకారులను చంపిన కేంద్ర బలగాల కాల్పులపై న్యాయ విచారణ జరపాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. ఆ ఇద్దరు పిల్లల హత్యలే ఈ నిరసనలకు దారితీశాయి.
కాంగ్పోక్పిలో 10 గంటల సంపూర్ణ బంద్..
శుక్రవారం ఉఖ్రుల్ జిల్లాలోని ములాంలో అనుమానిత నాగా మిలిటెంట్లతో జరిగిన కాల్పుల మార్పిడిలో మరణించిన ఇద్దరు కుకీ వాలంటీర్లకు నివాళులర్పించేందుకు గిరిజన ఐక్యతా కమిటీ పిలుపునిచ్చిన 10 గంటల సంపూర్ణ బంద్‌తో శనివారం కాంగ్పోక్పి జిల్లాలో సాధారణ జనజీవనం స్తంభించింది.
స్థానిక కథనాల ప్రకారం, ఉదయం 6 గంటలకు ప్రారంభమైన బంద్ సాయంత్రం 4 గంటలకు శాంతియుతంగా ముగిసింది. మరణించిన ఇద్దరు బాధితుల మృతదేహాలను కాంగ్పోక్పి జిల్లాలోని ఫైజాంగ్ గ్రామంలో ఉన్న అమరవీరుల స్మశానవాటికలో ఖననం చేశారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న జాతి ఘర్షణల సమయంలో మరణించిన కుకి-జా కమ్యూనిటీ సభ్యులకు ఈ స్మశానవాటిక ఒక ముఖ్యమైన ఖనన ప్రదేశంగా మారింది.
ఉఖ్రుల్ జిల్లాలో సాయుధుల దాడి.. ముగ్గురు మృతి..
శుక్రవారం(ఏప్రిల్ 24) మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో కుకీ, నాగా వర్గాల మధ్య హింస చెలరేగడంతో ముగ్గురు మరణించగా, పలువురు గాయపడ్డారు.
మృతుల్లో ఇద్దరు కుకీ వర్గానికి చెందినవారు కాగా, మూడవ వ్యక్తి జిల్లాలోని ఆధిపత్య వర్గమైన తంగ్ఖుల్ నాగా వర్గానికి చెందినవారు.
శుక్రవారం ఉదయం సుమారు 5:30 గంటలకు, నివాసితులు నిద్రిస్తున్న సమయంలో, సాయుధ టాంగ్ఖుల్ నాగా పురుషులు ముల్లం; షోంగ్ఫాల్ అనే కుకీ గ్రామాలపై దాడి చేశారని కుకీ మానవ హక్కుల సంస్థ ఆరోపించింది.
దాడి చేసినవారు ఇద్దరు గ్రామ వాలంటీర్లను కాల్చి చంపారని, మహిళలు, పిల్లలతో సహా పలువురిని గాయపరిచారని, డజనుకు పైగా ఇళ్లకు నిప్పు పెట్టారని ఆ సంస్థ ఆరోపించింది.
2023 మేలో రాష్ట్రంలో జాతి ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి గ్రామాలకు కాపలా కాస్తున్న సాయుధ పౌరులను వర్ణించడానికి ‘గ్రామ వాలంటీర్లు’ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు.
కుకీ సామాజిక వర్గానికి చెందిన మృతులిద్దరినీ, చురాచంద్పూర్ జిల్లాలోని సింగాట్ ఉపవిభాగంలోని హైజాంగ్ గ్రామానికి చెందిన పామిన్లున్ హావోలాయ్(22), కాంగ్పోక్పి జిల్లాలోని కే ఖోనోమ్ గ్రామానికి చెందిన లెట్లాల్ సిట్లాహౌ(41)గా గుర్తించారు.
ఈ ఘటనను “హేయమైన నేరం”గా సీఓటీయూ తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వంపై దాని ప్రభావం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
కవ్వింపు చర్యలు లేకుండానే కాల్పులు.. కొనసాగుతున్న జాతి హింస..
రాష్ట్రంలో అదుపు తప్పినట్టుగా ఆరోపించబడుతున్న సాయుధ మిలీషియా గ్రూపులను నియంత్రించేందుకు, దోషులను గుర్తించి అరెస్టు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ అధికారులకు విజ్ఞప్తి చేసింది.
ఏప్రిల్ 10న, ఉఖ్రుల్ జిల్లాలోని లిటాన్ ప్రాంతంలో ఉగ్రవాదులుగా భావిస్తున్న వారు ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ మరణించారు.
ఉఖ్రుల్లోని నాగాలు అధికంగా నివసించే లిటాన్ ప్రాంతంలో ఫిబ్రవరి 7 నుంచి నాగా, కుకీ వర్గాల మధ్య హింస, దహనకాండ చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇరుపక్షాలకు చెందిన 30కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.
2023 మే నుంచి మణిపూర్‌లో కొనసాగుతున్న జాతి హింస కారణంగా కనీసం 260 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 60,000 మంది నిరాశ్రయులయ్యారని తెలిసింది.
ఈ హింస మొదట మైతేయి, కుకీ వర్గాల మధ్య ప్రారంభమై, ఇప్పుడు దాదాపు అన్ని వర్గాలకూ వ్యాపించింది.
మైతేయి వర్గం ప్రధానంగా ఇంఫాల్ లోయలోని మైదాన ప్రాంతాలలో నివసిస్తుండగా, కుకీలు కొండ ప్రాంతాలలో నివసిస్తున్నారు.
హింస చెలరేగినప్పటి నుంచి, మైతేయితోపాటు కుకీ వర్గాలు వారి వారి ప్రాంతాలకే పరిమితమయ్యాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
