హోర్ముజ్ తిరిగి తెరిచిన తర్వాత కూడా, చమురు బావుల్లో పనిచేసే కార్మికులను మళ్లీ పనిలోకి తీసుకురావడం, బావులను తిరిగి ప్రారంభించడం కొంత సమయం పడుతుంది.
ఇరాన్ యుద్ధం ప్రారంభంలో మధ్యప్రాచ్యంలో వేలాది చమురు బావులను మూసివేయడానికి కొన్ని రోజులు పట్టింది. పర్షియన్ గల్ఫ్ దీర్ఘకాలంగా మూసి ఉండటం వల్ల, ఇంధన సరఫరా మళ్లీ సాధారణ స్థితికి రావడానికి నెలలు లేదా సంవత్సరాలు కూడా పట్టవచ్చు.
పర్షియన్ గల్ఫ్‌లోకి వెళ్లే, బయటకు వచ్చే నౌకల రవాణా దాదాపు పూర్తిగా నిలిచిపోయింది. కొన్ని రోజుల క్రితం బ్రెంట్ క్రూడ్ ధరలు మళ్లీ బ్యారెల్‌కు $100 పైగా ఎగబాకాయి. ఎందుకంటే హోర్ముజ్ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురుపై ఆధారపడిన పరిశ్రమలు క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి.
విశ్లేషకులు, చమురు పరిశ్రమ అధికారులు చెబుతున్నదేమిటంటే, గల్ఫ్ ప్రాంతం నుంచి క్రూడ్ సరఫరా, పునఃప్రారంభం అయ్యే అవకాశాలు దిగజారుతున్నాయి. ఆ మార్గం త్వరలోనే తెరిచినా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం దీర్ఘకాలం కొనసాగుతుంది.
సాంకేతిక, లాజిస్టిక్స్ సవాళ్లు..
ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే సంస్థలు మళ్లీ చురుకుగా చేయడానికి సాంకేతిక, లాజిస్టిక్స్ (రవాణా) సంబంధిత సవాళ్లను అధిగమించాలి. మధ్యప్రాచ్య ఉత్పత్తిదారులు తమ సరుకును సరఫరా చేయడానికి పంపిన ట్యాంకర్లు తిరిగి రావాల్సి ఉంటుంది, దీనికి నెలలు పట్టవచ్చు. ట్యాంకుల్లో ఉన్న ఇంధనాన్ని మార్కెట్‌కు పంపించి, కొత్త చమురుకు స్థలం కల్పించాలి.
2026 ఫిబ్రవరి చివర్లో యుద్ధం ప్రారంభమైనప్పుడు చమురు వెలికితీత పరిశ్రమల నుంచి వెళ్లిన కార్మికులు తిరిగి రావాలి.
“చాలా వరకు మౌలిక సదుపాయాలు మూసివేయబడ్డాయి” అని చమురు వ్యాపార సంస్థ విటోల్ సీఈఓ రస్సెల్ హార్డీ ఇటీవల ఒక సమావేశంలో అన్నారు.
“అన్నింటినీ మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది” గోల్డ్‌మన్ సాక్స్ బ్యాంకింగ్ సంస్థ ఎనర్జీ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే, హోర్ముజ్ జలసంధి ఎంత ఎక్కువ కాలం మూసివుంటే, పునరుద్ధరణ అంత నెమ్మదిగా జరుగుతుంది.
ఇరాక్‌పై తీవ్ర ప్రభావం.. క్షీణించిన ఉత్పత్తి..
చమురు బావులను పునఃప్రారంభించడం పెద్ద సవాళ్లతో కూడుకున్నది. ఈ సమస్యలు ముఖ్యంగా ఇరాక్‌లో తీవ్రంగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే అది సౌదీ అరేబియా తర్వాత రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు. సాధారణ పరిస్థితుల్లో ఇరాక్ ప్రపంచ చమురు ఉత్పత్తిలో సుమారు 5% ఉత్పత్తి చేస్తుంది.
యుద్ధానికి ముందు రోజుకు 4.9 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి ఉండగా, అది 1.6 మిలియన్ బ్యారెల్స్‌కు పడిపోయిందని, ఇరాక్ ఆయిల్ పరిశ్రమల పత్రిక రిపోర్ట్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ తెలిపారు.
ఇటీవల ఇరాక్ చమురు ఉత్పత్తిదారులు ఉత్పత్తిని పునఃప్రారంభించేందుకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయితే హోర్ముజ్ తిరిగి తెరుచుకోదని స్పష్టమైన తర్వాత ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.
భద్రతా సమస్యలు, చమురు పరిశ్రమలలో పనిచేసే విదేశీ కార్మికులు పెద్ద సంఖ్యలో వెళ్లిపోవడం, పరిమిత వనరులు కలసి కొన్ని చమురు క్షేత్రాల పరిస్థితిని అంచనా వేయడాన్ని కష్టతరం చేశాయని అధికారులు చెప్పారు.

క్షేత్రాలను పునఃప్రారంభించడంలో ఆటంకాలు..
కొన్ని క్షేత్రాలను మెల్లగా మళ్లీ ప్రారంభించాల్సి ఉంటుంది. గాఢమైన చమురును ఉత్పత్తి చేసే బావుల్లో “పారాఫిన్”, “ఆస్ఫాల్ట్”లాంటి పదార్థాలు గడ్డకట్టిపోయి చమురు సరఫరాకు అడ్డంకులు సృష్టించి ఉండవచ్చు.
పాత క్షేత్రాల్లో మూసివేత సమయంలో ఒత్తిడి తగ్గిపోయి ఉండే అవకాశం ఉంది. మళ్లీ ప్రారంభించినప్పుడు తక్కువ చమురు, ఎక్కువ సహజ వాయువు బయటకు రావచ్చు.
దక్షిణ ఇరాక్ చమురు క్షేత్రాల్లో యుద్ధానికి ముందు ఉన్న ఉత్పత్తి స్థాయిలో 85% వరకు చేరుకోవడానికి సుమారు తొమ్మిది నెలలు పట్టవచ్చని పరిశోధనా సంస్థ Wood Mackenzie అంచనా వేసింది.
అయితే ఆ ప్రాంతంలో మూడింట రెండవ వంతు ఉత్పత్తిని త్వరలో సాధించే అవకాశముంది.
యుద్ధం ప్రారంభ రోజుల్లో అనేక క్షేత్రాలను హడావుడిగా మూసివేయడం వల్ల, బావులు దెబ్బతినటం మాత్రమే కాకుండా, సహజ ఒత్తిడి సరిపోని క్షేత్రాల్లో చమురును పైకి తీసుకురావడానికి ఉపయోగించే సబ్మర్సిబుల్ పంపుల వంటి పరికరాలకు కూడా నష్టం కలగవచ్చు.
చమురు క్షేత్రాలను మళ్లీ ప్రారంభించడం ఖర్చుతో కూడుకున్న పని. దీనికి తోడు చమురు ఆదాయం తీవ్రంగా పడిపోవచ్చు. పరిశ్రమ పునఃప్రారంభ ప్రక్రియ క్లిష్టం కావచ్చని ఇరాక్ అధికారులు చెబుతున్నారు.
ఇరాక్‌కు మరో సమస్య ఏమిటంటే, సౌదీ అరేబియాలా ఇరాక్‌కు ప్రభుత్వ ట్యాంకర్లు, నౌకాదళం లేదు. అందుకే అది అంతర్జాతీయ వ్యాపారులు, షిప్పింగ్ కంపెనీలపై ఆధారపడుతోంది.
“ఎంత ఎక్కువ కాలం పనులు నిలిచిపోతే, వాటిని పునఃప్రారంభించడం అంత క్లిష్టంగా మారుతుంది” అని ఆయిల్‌ఫీల్డ్ సేవల సంస్థ Halliburton సీఈఓ జెఫ్ మిల్లర్ తెలిపారు.
ఉత్పత్తి ఎంత వరకు దెబ్బతింటుందో, ఇంజినీర్లు మళ్లీ ప్రారంభించే వరకు ఖచ్చితంగా చెప్పలేమని Wood Mackenzie (అంతర్జాతీయ పరిశోధన, విశ్లేషణ సంస్థ) అప్‌స్ట్రీమ్ విశ్లేషణ విభాగాధిపతి ఫ్రేజర్ మెకే అన్నారు. దీన్ని ఒక “నిజమైన అనిశ్చితి”గా ఆయన పేర్కొన్నారు.
మెరుగ్గా యూఏఈ, సౌదీ.. ఇరాక్, కువైట్ పరిస్థితి ఏంటి?..
విశ్లేషకుల అంచనా ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలు ఈ పరిస్థితిని కొంత మెరుగ్గా ఎదుర్కొనే అవకాశముంది. ఎందుకంటే వారు దశాబ్దాలుగా ఇటువంటి ఒత్తిడులను జాగ్రత్తగా నిర్వహించారు. అయినా కూడా ఉత్పత్తి ఒక్కసారిగా పూర్తిగా కోలుకోదు.
మొత్తంగా చూసినప్పుడు గల్ఫ్ ప్రాంతంలో సగం చమురు క్షేత్రాల్లో ఒత్తిడి తగినంతగా ఉండటంతో, యుద్ధానికి ముందు ఉన్న ఉత్పత్తి స్థాయికి రెండు వారాల్లోనే చేరుకునే అవకాశం ఉంది.
మొత్తం 80% క్షేత్రాలలో ఆరు వారాల్లో యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి చేరగలవని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.
సమస్యాత్మకంగా ఉన్న మిగిలిన 20% క్షేత్రాలు ప్రధానంగా ఇరాక్, కువైట్‌లో ఉన్నాయి. ప్రపంచ చమురులో కువైట్ సుమారు 3% ఉత్పత్తి చేస్తుంది. “ఉత్పత్తి తిరిగి ప్రారంభమైనప్పటికీ యుద్ధానికి ముందు ఉన్న ఉత్పత్తికి చేరకపోవచ్చు” అని IEA పేర్కొంది.
ఇరాక్ అధికారులు, మూడో భారీ స్థాయి క్షేత్రాలను మళ్లీ ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశంలోని అతిపెద్ద క్షేత్రం రుమైలాను, ఇరాక్ ప్రభుత్వ కంపెనీలతో ఒప్పందం కింద బీపీ, PetroChina సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
సాధారణ పరిస్థితులలో ఇది వందలాది బావుల నుంచి ఇరాక్ మొత్తం చమురులో మూడో వంతు ఉత్పత్తి చేస్తుంది.
రుమైలా, ఇతర తక్కువ ఒత్తిడి ఉన్న ఇరాక్ క్షేత్రాల్లో, చమురును పైకి తీయడానికి ఆపరేటర్లు నీటిని పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో ఒక బ్యారెల్ చమురు తీసేందుకు మూడు బ్యారెల్స్ నీరు అవసరమవుతుందని Renaissance Energy Advisor అహ్మద్ మెహ్దీ తెలిపారు.
బావులు పనిచేయని సమయంలో నీరు చమురుతో కలిసిపోతుంది. క్షేత్రాలను మళ్లీ ప్రారంభించినప్పుడు ఉత్పత్తిలో నీటిని చాలా జాగ్రత్తగా నియంత్రించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
వాల్ స్ట్రీట్ పత్రిక సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము..
అనువాదం: జె నాగేశ్వరరావు..
భారతదేశంలో చమురు సంక్షోభ ముప్పు!
భారతదేశంలో ఆయిల్ సంక్షోభం మొదలైనట్లు కనిపిస్తుంది. గత వారం రోజులుగా ఆయిల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కనిపిస్తున్నది.
దేశం మొత్తం చమురు వినియోగంలో 15% నుంచి 20% మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతున్నది. మిగిలిన 80% పైన చమురు దిగుమతి పై ఆధారపడవలసి వస్తున్నది. ప్రపంచ చమురు వినియోగంలో మన దేశం మూడవ స్థానంలో ఉన్నాము. ప్రధానంగా రష్యా, అమెరికా, ఇరాక్, ఇరాన్ దేశాలపై ఆధారపడుచున్నాము.
దీనికి తోడు అమెరికా ఒత్తిడి ఫలితంగా, అమెరికా ఎవరి దగ్గర కొనమంటే వారి దగ్గర చమురు కొనటానికి మన ప్రధాని మోడీ అంగీకరించారు. భారత ప్రజలపై పెద్ద ఎత్తున చమురు ధరలు పెరగనున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి రోజురోజుకి పడిపోతున్నది. కార్మికుల నిజ వేతనాలు పడిపోవుచున్నవి. ఇప్పటికే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, అప్పులు పెరిగి, బతుకు భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
నిరుద్యోగ సైన్యం పెరుగుతున్నది. ప్రజల అసంతృప్తిని పక్కదారి పట్టించడానికి దేవుడు, మతాన్ని వాడుకొని, మైనారిటీ ప్రజలపై ద్వేషం, ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తున్నారు. అదానీ, అంబానీలు విపత్కర పరిస్థితులలో భారీ ఎత్తున లాభాలను గడించేందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలు దోహదం చేస్తున్నాయి.
గమనిక: భారతదేశ పరిస్థితులపై అభిప్రాయాలు అనువాద రచయిత వ్యక్తిగతం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
