“గాయాలు సలుపుతున్నా
గుండెలమీద నీ పాదముద్రల్నే కదా మోశాను
చావు ముసురుకొస్తున్నా
నీతో బతుకునే కదా కోరుకున్నాను
ప్రేమకోసమే బతకలేకపోయినా
కనీసం ప్రేమకోసమే చద్దామనుకున్నాను
గుండెల్లో నువు రగిలించిన నిప్పుల కుంపటి
వంటిమీద నీ వాళ్ళంటించిన కిరసనాయిలు మంటలు
ఏ బాధ ఎక్కువని అడిగితే ఇప్పుడు చెప్పలేను
ప్రియా! ఈ మంటలు నన్ను అలుముకొంటుంటే
నువ్వు నన్ను వాటేసుకున్నట్టేవుంది.”
(అంటరాని ప్రేమ)
– కలేకూరి ప్రసాద్ (యువక)
ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘దళిత ప్రేమ’ అనగానే స్ఫురించే కవితల్లో ‘అంటరాని ప్రేమ’(1996) ప్రధానమైంది. కంచికచర్లలో దళితుడైన కోటేశు(ఆరుకట్ల కోటేశ్వరరావు)ను దొంగతనం చేశాడనే ఆరోపణతో ఆధిపత్య కులస్తులు సజీవదహనం చేసిన అమానుష ఘటన(1968 ఫిబ్రవరి 24) నేపథ్యంలోంచి ఈ రచన పుట్టింది.
దళితుల పట్ల తరతరాలుగా వివక్ష, అణచివేత కొనసాగుతోంది. ఈ వర్ణ, వర్గ వ్యవస్థలోని హింసాత్మక విశ్వరూపం అసంఖ్యాక ఉదంతాల ద్వారా కళ్ళకు కడుతోంది.
దళిత సమస్య తీవ్రతను వామపక్ష పార్టీలు కూడా చారిత్రక, సామాజిక, తాత్విక దృక్కోణం నుంచి చూడలేదనే అసంతృప్తి వల్ల 1980లలో దళితోద్యమం ఆరంభమైంది. ఆ అభివ్యక్తి సాహిత్యరంగంలోనూ సమాంతరంగా వెల్లువెత్తింది.
అప్పటికే మరాఠీ సాహితీవేత్తలు, ముఖ్యంగా ‘దళిత పాంథర్స్’ ప్రాంతీయ భాషల సాహిత్యాన్ని అమితంగా ప్రభావితం చేశారు.
ఈ పూర్వరంగంలో వరుసగా మన కవిత, కథ, నవలల్లో గణనీయమైన సృజన జరిగింది. తొలిదశలో దళిత రచయితల రచనల్ని మాత్రమే దళిత సాహిత్యంగా పరిగణించారు. ఆ తర్వాత దళితుల స్థితిగతుల్ని దళితేతరులు ఆసాంతం ఆకళించుకుని రాయాలన్నారు.
అయితే స్వానుభవం, గాఢమైన సహానుభూతి మధ్య సూక్ష్మమైన వ్యత్యాసమే ఉంటుంది. ఇది కృత్రిమ విభజన అనేందుకు చాలా రచనల్ని ఉదాహరించవచ్చు. నిజానికి జన్మతః దళితులైన రచయితలు రాసిందే దళిత సాహిత్యమన్న నిబంధన మరాఠీ దళిత సాహిత్యంలోనే లేదు.
‘నీలిగులాబీలు’ – కథాంశం, విస్తృతి..
ఆ పరంపరలో ప్రస్తుతం వెలువడిన దళిత ప్రేమకథా సంకలనం ‘నీలిగులాబీలు’(2026). మానస ఎండ్లూరి, అరుణ గోగులమండ దీని సంపాదకులు. ఇద్దరూ స్వతహాగా రచయిత్రులు, అనువాదకులు. వీరి సంపాదకత్వంలో మూడేళ్ల కిందట ‘ముళ్ళ చినుకులు’(2023) పేరిట దళిత కథాసంకలనం వెలువడింది. దానిలోని 23 కథల్ని “దళిత ఆధునికానంతర కథలు”గా వారు పేర్కొన్నారు.
‘నీలిగులాబీలు’ 24 కథల సమాహారం. ఇందులో దళిత, దళితేతర, ప్రముఖ, వర్ధమాన రచయితలు రాశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కథకులూ ఉన్నారు.
“దళిత ప్రేమ సమస్యను చర్చించాలని, జంటలో కనీసం ఒకరు దళితులై ఉండాలని” కథకులకు సంపాదకులు ముందుగా కథాంశం ఇచ్చారు. అందువల్ల రచయితకు అనివార్యంగా ఒక పరిధి ఏర్పడుతుంది. అదే సమయంలో విస్తృతి కూడా ఉంటుంది.
ఒక అంతస్సూత్రంతో పలువురు కథలు రాసిన ఇటువంటి సందర్భంలో కథాంశం పట్ల వారి అవగాహన మేరకు, రచనలో వారి అనుభవాన్ని బట్టి కథ రూపుదిద్దుకుంటుంది. రచయిత కొత్తవారైనా, పాతతరమైనా కళాశక్తిపై రచన ఆధారపడుతుంది. కాబట్టి వాస్తవ సంఘటనను లేదా విశిష్ట అనుభవాన్ని, కొంత ఆలోచనను, ఇంకొంత కల్పనను ఎంచుకుని కథలుగా మలిచారు.
దళిత, బహుజన కులాలు, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ మతాల యువతీయువకుల్ని పాత్రలుగా నిలిపారు. “భారతీయ గ్రామం అస్పృశ్యతకు కేంద్రంగా ఉంది” అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దశాబ్దాల క్రితం చెప్పిన మాట త్రికాలాల్లోనూ ప్రత్యక్ష సత్యమని రుజువులుగా చూపారు.
ఈ కథల్లోని భాష, శైలి, శిల్పం, రచయిత దృష్టికోణం వంటి కథా మౌలిక లక్షణాల్ని నేను ప్రస్తావించడం లేదు. ఎందుచేతనంటే, దీనిలో సగం కథలు అన్నివిధాలా బాగున్నాయి. కొన్ని విలక్షణంగా సాగాయి. మరికొన్ని సాధారణంగానే అనిపించాయి.
నూతన రచయితల్ని ప్రోత్సాహించే క్రమంలో కొన్ని సడలింపులు తప్పవు. అలాగే రీతివైవిధ్యం పట్ల తమ ఆసక్తిని సంకలనకర్తలు ఒకచోట ప్రకటించారు. అందుకని దళిత సాహిత్యం, ‘నీలిగులాబీలు’ ప్రతిబింబించిన సమాజం, విషయ సాదృశ్య రచనల మీద రేఖామాత్రంగా వ్యాఖ్యానిస్తున్నాను.
విలక్షణమైన పాత్రలు.. వాస్తవిక ప్రతిరూపాలు..
జీ వెంకటకృష్ణ ‘కుముద్వతి’ కథలో ‘నా గురించి కథ రాయవూ’ అని అడిగిన ఎరుకల అమ్మాయి కుముద్వతి, డాక్టర్ పసునూరి రవీందర్ ‘డిస్క్లైమర్’లో రెండక్షరాల కులం, మూడక్షరాల కులం కలిసి అయిదయ్యేందుకు ఎదురుచూసే నిషాంత్-నిరీక్షణలు, డాక్టర్ తమలపాకుల సౌజన్య ‘పొలిమేరమ్మ’లో భూస్వామి రెడ్డిమ్మకు లెప్రసీ వ్యాధిని నయం చేసిన మాదిగ బసవయ్య పెంపుడు కూతురు పొలిమేరమ్మ, బండారు విజయ ‘వివర్ణ’లో కులం అనేది అట్టడుగు కులాల వారిలో కూడా ఉందని మథనపడే మానుషి, కంచర్ల శ్రీనివాస్ ‘నూట ఎనిమిదో బాతు’లో ఆమెనొక బాతుగా తండ్రి జమకడతాడని బెంగటిల్లే బాతుల కాపరి మిధున, సురేంద్ర శీలం ‘బావుల్లా-నాగలచ్చిమి’లో ఏరు తనలో కలిపేసుకున్న నాగలచ్చిమి కోసం ఏటిగట్టున పడి అరిచే బావుల్లా.
మేరెడ్డి రేఖ ‘నిరీక్షణ’లో స్నేహాన్ని తమ జీవితపర్యంతం కాపాడుకోవాలనే రమేష్-రాగిణి, గిడ్డకింద మాణిక్యం ‘అగ్గి’లో ఎగుడుదిగుళ్ళ అలలపై తేలియాడి ఆత్మాహుతికి పాల్పడిన మీనా, అరుణ గోగులమండ ‘ప్రేమ పావురాయి’లో ఇష్టమైన మనిషిని కాదని ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకోలేకపోయిన క్రిస్టియన్ అమ్మాయి షైనీ, మానస ఎండ్లూరి ‘పందెం కోళ్ళు’లో ప్రహాదేడి, ప్రహాదెక్కడ అని రోదించే సుభద్ర.
ఇంకా అనేకులు, అశాంతులు ఈ కథల ద్వారా నాకు పరిచయం అయ్యారు. నన్ను అత్యంత కలవరపరిచారు. ఇవి కేవలం ఊహాజనిత ఇతివృత్తాలు, కల్పిత పాత్రలు కావు. దురంతమైన జీవిత వాస్తవికతతో ఆనాటి కంచికచర్ల కోటేశు నుంచి నిన్నామొన్నటి రోహిత్ వేముల, ప్రణయ్ పెరుమాళ్ళ వంటి పరాజితులకు ప్రతిరూపాలు.
ప్రేమకే కాదు, మృత్యువుకూ కులమే..
ఈ పుస్తకం ముందుమాటలో, “ఈ కథలు మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళతాయి. సరిహద్దుల్లేకుండా ప్రేమించడం గురించి, అన్నింటినీ అధిగమించి ప్రేమించబడటం గురించి చెబుతాయి. ప్రేమ ఎంత బహుముఖమైందో తెలియజేస్తాయి” అని దళిత మానవహక్కుల ఉద్యమకారిణి బీనా పల్లికర్ అన్నారు.
నిజమే, ఈ కథల్లో దిటవు గుండెగల యవ్వనస్తులు కల్లాకపటంలేని ప్రేమనే ఆకాంక్షించారు. ఆద్యంతం కుల, మత, లింగ అసమానతలు సమసిపోవాలని, ప్రతి మనిషికి ఒకే విలువ సమకూరాలని పరితపించారు. అందుకోసం చేతనైన రీతిలో కడవరకు జీవితేచ్ఛతో పోరాడారు. మార్గాంతరం లేనప్పుడు ప్రాణాల్ని గడ్డిపోచలుగా విడిచారు.
“ప్రేమకు కులాన్ని అంటగడుతున్నారా?” అనే ప్రశ్నతోనే ఈ ప్రయాణం మొదలైందని మానస, అరుణలు పీఠికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ దేశంలో ప్రేమకే కాదు, ఆఖరికి మృత్యువుకీ కులం వర్తిస్తుంది. దళితుడి భౌతికకాయానికి, అంతిమయాత్రకి అంటరానితనం అమలవుతుంది. నేనొక మానవహక్కుల కార్యకర్తగా అందుకు నిదర్శనం చూపగలను- ఒక ఉదాహరణకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామంలో ఈ ఏడాది మార్చి 16న జరిగిన సంఘటన.
అంతేకాక బాధితుల పట్ల రాజ్యాంగ వ్యవస్థల సహాయ నిరాకరణ గురించి చెప్పగలను. కాబట్టి నేడు ఈ కథల ప్రాసంగికతకి ఎలాంటి లోటూ లేదు.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 1984లో మరాఠీ దళిత రచయితల అనువాద కథలతో ప్రచురించిన ‘దళిత కథలు’ నేను చదివిన తొలి దళిత కథాసంపుటి. గత అర్ధశతాబ్దంగా దళితుల కాలరేఖలు ఏదోమేరకు రాతలోకి వస్తున్నాయి. దళిత సృజనాత్మక కృషిలో ఎందరో ఉదాత్త సాహితీవేత్తలు, ఎన్నెన్నో మేలిమి పుస్తకాలు ఉన్నాయి.
బహుశా ‘నీలిగులాబీలు’కి నిఖిల్ పాండి సంపాదకత్వంలో సరికొత్తగా వచ్చిన ఆంగ్ల కథాసంపుటి ‘Love in the Time of Caste : A Dalit-feminist anthology of love stories’ అనేది సామ్య రచన కావచ్చు.
మా పోస్ట్ ఉమెన్ నుంచి ‘నీలిగులాబీలు’ అందుకున్న రోజు నేను నాగా కవయిత్రి ఈస్టరిన్ కిరే ‘Freerain’ కవితాసంపుటి చదువుతున్నాను. ‘Story’ అనే కవితలో ఆమె అంటారు:
“కథ నా దర్వాజ దగ్గరకు వస్తుంది
నా భుజమ్మీదకు ఎగబాకుతుంది
‘నన్ను రాయి, నన్ను రాయి, నన్ను రాయి’
అని అడుగుతుంది.”
