ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కుదిపేస్తున్నది. ఇంధనం, ఎరువులు, ఆహార పదార్థాల ధరలు అన్ని దేశాల ప్రజలనూ బాధిస్తున్నాయి. అమెరికాలో ఒక గ్యాలన్ గ్యాస్ ధర నాలుగు డాలర్లకు చేరుకుంది.
అభివృద్ధి చెందిన యూరప్ దేశాల నుంచి.. వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రెజిల్, చైనా లాంటి దేశాలపై కూడా యుద్ధ ప్రభావం ఉంది. ఏ దేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు.
అయితే, మరొక సమూహానికి చెందిన పేద దేశాలు చాలా ఎక్కువగా నష్టపోతున్నాయి. అయినా వారి స్పందన చాలా తక్కువగా ఉంది. ఆ దేశాల ప్రజల ఆదాయంలో సగభాగం ఆహారం, ఇంధనం ఖర్చులకే పోతున్నది. కారణం ఆ దేశాల ప్రజలలో అధికభాగం పేదరికంలో ఉన్నారు. వారు చేసుకున్న కొద్దిపాటి పొదుపు కూడా ధరల పెరుగుదలకు ఆవిరైపోతున్నది.
టారిఫ్‌లు, ఏఐ: పేద దేశాలకు కొత్త సవాళ్లు..
దిగువ మధ్యతరగతి, తక్కువ ఆదాయాలు కలిగిన దేశాల ప్రజలు ఇరాన్ యుద్ధం కారణంగా ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రెండో ప్రపంచ యుద్ధానంతరం మొదటిసారిగా అమెరికా విధించిన పన్నులు గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టలేకపోతున్నాయి. దానికి అదనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ) ఆ దేశాల భవిష్యత్తును చీకట్లోకి నెడుతున్నాయి.
ఈ దేశాలలో దాదాపు 3.8 బిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. మొత్తం ప్రపంచ జనాభాలో వీరు 50% గా ఉన్నారు.
ఇది ఒక కొత్త పరిణామం. ప్రపంచంలో జరిగే యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల కారణంగా ఈ దేశాలు చితికిపోతున్నాయి. నేడు దాదాపు 75 దేశాలలోని ప్రజల సగటు వార్షిక ఆదాయం 4,500 డాలర్ల లోపుగా ఉన్నదని ప్రపంచ బ్యాంకు నివేదికలు తెలియజేస్తున్నాయి.
అదే సందర్భంలో అమెరికా ప్రజల సగటు వార్షిక ఆదాయం 85,000 డాలర్లుగా ఉంది. ఈ దేశాలలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులలో కొన్ని ఆ దేశాలు స్వయంగా సృష్టించుకున్నవి. మితిమీరిన అవినీతి, అసమర్థ పాలన కారణంగా ఈ దేశాలు విపరీతమైన అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. వీటిలో భారతదేశం మినహా మిగిలిన దేశాలకు ప్రపంచ పరిణామాలపై తమ ఇబ్బందులు చర్చించుకునే వేదిక కూడా లేదు.
ద్రవ్యోల్బణం – వనరులున్నా ఆటంకాలు..
ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ఈ పేద దేశాలను మరింత మూలకు నెడుతున్నది. వీటిలో చాలా దేశాలు, సబ్ సహారన్ దేశాలతో సహా, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాయి. విదేశీ వ్యాపారానికి తలుపులు తెరిచాయి. పబ్లిక్ ఫైనాన్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ దేశాలన్నీ విరివిగా ఉన్న సహజ వనరులను, ఆ దేశ ప్రజలలో ఎక్కువగా ఉన్న యువశక్తిని వినియోగించుకొని ఆర్థిక అభివృద్ధికి తమ సొంత మార్గాన్ని ఎంపిక చేసుకున్నాయి.
అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా పెరుగుదల లేదు. కొన్ని దేశాలలో జనాభా క్షీణిస్తున్నది. అయినప్పటికీ సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలతో సహా ఈ దేశాల ప్రజలలో ఎక్కువ భాగం 30 సంవత్సరాల లోపు వారే.
స్వల్పాదాయ దేశాలు ఎరువులు, ఆయిల్, గ్యాస్, ఆహార వస్తువులు భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. వీటి ధరలు విపరీతంగా పెరగడం, ఆ దేశాల కరెన్సీ విలువలు పడిపోవటం, విదేశీ చెల్లింపుల ఇబ్బందులు లాంటివన్నీ కలిసి సాధారణ ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ఈ పరిస్థితి వారి అభివృద్ధి అవకాశాలను బాగా దెబ్బతీస్తుంది.
అంతర్జాతీయ సంస్థలు, వాణిజ్య ప్రభావం..
ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలు మాత్రమే ఈ దేశాల్లో పురోభివృద్ధిని అడ్డుకోవటానికి కారణాలు కావు. 1930లో వచ్చిన అతి పెద్ద ఆర్థిక సంక్షోభం, ఆ తర్వాత వచ్చిన రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచ విధివిధానాలలో జరిగిన ఏర్పాట్లు ఈ దేశాలలో కనీసం ఒక మోస్తరు నిలకడ సాధించడానికి దోహదపడ్డాయి.
కానీ, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్, అంతర్జాతీయ ద్రవ్యనిధి లాంటి సంస్థల విధానాల వల్ల కూడా ఈ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
గతంలో ఇలాంటి దేశాలను ఆదుకోవటానికి అమెరికా కొంత సహాయం అందజేస్తూ ఉండేది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ దేశ రక్షణ పేరుతో అది నిలిచిపోయింది.
ఉక్రెయిన్, ఇరాన్‌లపై వరుసగా జరుగుతున్న యుద్ధాలు, సూపర్ పవర్లయిన అమెరికా, చైనా మధ్య పోటీ బాగా పెరుగుతున్నది. అస్థిరత అనేది ఏదో వచ్చిపోయే ఘటనగా కాకుండా నిరంతర ప్రక్రియగా మారుతున్నది.
ప్రపంచ దేశాలు ఒకరికొకరు సహకరించుకోటానికి బదులుగా విడిపోవడం, సర్వసాధారణంగా ఆమోదించబడిన అంతర్జాతీయ సంబంధాలు, వాణిజ్యం దెబ్బతినటం కారణంగా ఈ పేద దేశాలు బాగా దెబ్బతింటున్నాయి.
పరస్పర సహకారానికి ఆధారంగా ఉన్న ప్రపంచ వాణిజ్యం చిన్నాభిన్నం కావడం కూడా ఈ దేశాలను దెబ్బతీసింది. తక్కువ ఆదాయం గల దేశాలలో చాలా భాగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సర్దుబాటు చేసుకోవడానికి తంటాలు పడుతున్నాయి.
ఆ దేశాలు ఎగుమతి లక్ష్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌ను బలంగా నిర్మించాయి. నేటి టారిఫ్‌ల వేధింపులతో అవి బాగా దెబ్బతింటున్నాయి. టారిఫ్‌ల పెంపు వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అదే సందర్భంలో తమ దేశాలలో తయారైన సరుకులను ప్రపంచ మార్కెట్లో అమ్ముకోవడం కష్టతరం అయింది.
పెట్టుబడుల కొరత – వాతావరణ మార్పులు..
ఈ దేశాల ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండటంతో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు పెట్టడం కష్టంగా ఉంది. అందుచేత విదేశీ ఆర్థిక సహాయం ఈ దేశాలకు చాలా అవసరం. కానీ విపరీతమైన ఆర్థిక లోటుతో సతమతమవుతున్న అభివృద్ధి చెందిన దేశాలు ఈ పేద దేశాలకు ఆర్థిక సహాయం చేయడానికి నిరాకరిస్తున్నాయి.
పెట్టుబడులు పెట్టగలిగిన వారు ఈ దేశాలలో వచ్చే లాభాలు తక్కువగా ఉండటం, రిస్క్ ఎక్కువగా ఉండటంతో లాభసాటిగా ఉండే అమెరికా, జపాన్ దేశాలలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారు.
వాతావరణ మార్పులను తట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వ్యవసాయంపై ఆధారపడిన ఈ దేశాలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు తరచూ వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు ఈ దేశాలను మరింత దెబ్బతీస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఉత్పాదకతకు ఊతం.. ఉపాధికి ముప్పు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ దేశాలను మరింత వెనుకకు నెడుతున్నది. ఇందులో కొన్ని దేశాలు కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ సామాజిక స్థిరత్వం సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇటీవల స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్‌లో జరిగిన ఎకనమిక్ ఫోరం సభలో ఆఫ్రికా దేశానికి చెందిన కొందరు పారిశ్రామికవేత్తలను కలిశాను.
ఆ పారిశ్రామికవేత్తలు ఉత్పత్తి రంగంలోనూ, సర్వీస్ రంగంలోనూ ఉత్పాదకతను పెంచి, విదేశీ పోటీని తట్టుకునేందుకు కష్టమైనప్పటికీ కృత్రిమ మేధస్సును వినియోగించుకుంటున్నారు.
వారు ఉపాధి కల్పన పట్ల చాలా స్పష్టమైన అంచనాలతో ఉన్నారు. వారు ఆశించిన విధంగా కృత్రిమ మేధ వారికి అనుకూలంగా మారినప్పటికీ, అది దేశంలో ఉత్పత్తిని పెంచవచ్చు, వారి లాభాలను పెంచవచ్చు కానీ దేశంలో ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి.
పేద దేశాల మనుగడకు మార్గాలేమిటి?..
ప్రపంచంలో ఇన్ని ప్రతికూల అంశాల నేపథ్యంలో పేద దేశాలు మనుగడ సాగించగలుగుతాయా? ఆ దేశాలు రెట్టింపు చర్యలు చేపట్టి తమ దేశాలను యథాతథంగా నిలుపుకోగలవు. క్రమశిక్షణాయుతమైన బడ్జెట్ నిర్వహణ ద్వారా ఆటుపోట్లను తట్టుకునేలా ఆ దేశాలలో సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చు. వారి దేశ రిజర్వ్ బ్యాంకుకు ఆర్థిక విషయాలలో మరింత స్వేచ్ఛను ఇచ్చి ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచవచ్చు.
పెట్టుబడి తరలిపోవడాన్ని నివారించవచ్చు. మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులలో విదేశీ అప్పుల మీద ఆధారపడడాన్ని తగ్గించుకొని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడానికి అనువైన పరిస్థితులను కల్పించవచ్చు.
ఆ దేశాలు అవినీతిని అరికట్టి వ్యవస్థలను దృఢపరచాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ కూడా దేశ నియమాలను కచ్చితంగా అమలు జరిగేలా తీర్చిదిద్దాలి.
ధనిక దేశాల బాధ్యత..
ఏమైనప్పటికీ ప్రపంచ సంక్షోభ సమయంలో ఈ దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడతాయి అనేది కఠోర సత్యం. ఈ దేశాల ఇబ్బందుల వల్ల అభివృద్ధి చెందిన పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలకు సమస్యలు ఉండవని ఆశించడం హాస్యాస్పదం.
పేద దేశాల ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రజలు వలస పోవడం ద్వారా ఎదురయ్యే సామాజిక సమస్యలను ఎదుర్కొనడం అంత తేలికైన విషయం కాదు.
ఇది అభివృద్ధి చెందిన దేశాల రాజకీయ పరిస్థితులలో మార్పులు తీసుకొస్తుంది, యూరప్‌లోనూ అమెరికాలోనూ నేడు అదే చూస్తున్నాం.
ధనిక దేశాలు పేద దేశాలకు ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో అప్పులను మాఫీ చేయడం సరైనది కాదు. అంతర్జాతీయ సంస్థలను స్థిరపరచడం, విదేశీ వాణిజ్య విధానాలను అదుపులో ఉంచడం అన్ని దేశాలకు ప్రత్యేకంగా పేద దేశాలకు శ్రేయస్కరం.
బడ్జెట్ లోటు తగ్గించుకోవటం, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులను అరికట్టవచ్చు. ఆ విధంగా సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ధనిక దేశాలు తమకు తాము సహాయం చేసుకోవటంతో పాటు పేద దేశాలకు కూడా సహాయపడగలుగుతాయి.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య..
న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఏప్రిల్ 25 సౌజన్యంతో..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
