ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలలో కార్ల్ మార్క్స్ అగ్రగణ్యుడు. సమాజాన్ని పలువురు వివిధ కోణాలలో అధ్యయనం చేశారు.
అయితే దోపిడీ సమాజాన్ని మార్చి దోపిడీ రహిత సమసమాజాన్ని స్థాపించడమే కర్తవ్యం అని మార్క్స్ సిద్ధాంతీకరించారు. అది ఎలా సాధ్యమో వివరించాడు.
రష్యాలోని నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా విశ్లేషించి మార్క్స్ సిద్ధాంతాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారి అమలు చేసి, శ్రామిక వర్గ రాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు లెనిన్.
ఈరోజు వారి 156వ జయంతి. ఆ మహనీయుడు 1870 ఏప్రిల్ 22న జన్మించారు. వారి జయంతి సందర్భంగా లెనిన్ రచనలలోని కార్మిక వర్గానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వీఐ లెనిన్ కలెక్టెడ్ వర్క్స్ ప్రోగ్రెస్ పబ్లిషర్స్, 1964, మాస్కో వాల్యూమ్ 4, పేజీ 310-319 నుంచి ఈ రచనను అందిస్తున్నాము.
తమను తీవ్రమైన ఈతిబాధలకు గురిచేసే పీడన నుంచి రక్షించుకునేందుకు కార్మికులు తాడో పేడో అనే రీతిలో పోరాటానికి దిగుతారు.
ఒక్కొక్కరుగా ఉంటే తాము శక్తిహీనులమని, పెట్టుబడిదారీ పీడన తమను అణగదొక్కుతుందని గుర్తించే కొద్దీ వారు తమ యజమానులపై ఐక్యంగా తిరగబడతారు. ఆ విధంగా కార్మికుల సమ్మెలు ప్రారంభమవుతాయి.
అన్ని దేశాల్లోనూ కార్మికుల ఆగ్రహం తొలుత విడివిడి తిరుగుబాట్లుగా ప్రారంభమవుతుంది.
రష్యాలో పోలీసులు, ఫ్యాక్టరీ యజమానులూ వీటిని “మ్యూటినీలు” అన్నారు. అన్ని దేశాల్లోనూ ఈ విడివిడి తిరుగుబాట్లు ఒక్కవైపు శాంతియుత సమ్మెలకు, మరోవైపు కార్మికవర్గం తన విముక్తికోసం చేసే సర్వతోముఖ పోరాటాలకు దారితీస్తాయి.
ఐక్యతతోనే బలం..
అయితే, పెట్టుబడిదారీ వ్యవస్థ సహజ లక్షణం నుంచి ఉద్భవించే సమ్మెలు, ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికవర్గం సాగించే పోరాటానికి నాంది అవుతాయి.
ధనిక పెట్టుబడిదారీలతో ఆస్తిపాస్తులు లేని కార్మికులు వ్యక్తిగతంగా తలపడితే కార్మికులు బానిసలుగా మారిపోతారు. కానీ అదే కార్మికులు ఐక్యమైతే పరిస్థితి మారిపోతుంది.
ప్రతి సమ్మె.. పెట్టుబడిదారులకు నిజమైన యజమానులు కార్మికులేగానీ తాము కాదన్న విషయాన్ని గుర్తుచేస్తుంది.
కార్మికులు రానురాను తమ హక్కుల గురించి గొంతెత్తుతారు. ప్రతి సమ్మె కార్మికులకు తమ పరిస్థితి నిరాశాజనకంగా లేదని, తాము ఒంటరి వాళ్లం కాదన్న విషయాన్ని గుర్తుచేస్తుంది.
పెట్టుబడిదారీ వర్గ నైజం – సమ్మెతో బట్టబయలు..
సమ్మె కార్మికులకు యజమానుల బలాన్ని, కార్మికుల్లో ఉన్న బలాన్ని అర్థం చేసుకోవడం ఎలాగో నేర్పుతుంది.
తమ యజమాని గురించి, మొత్తం యజమానుల గురించి, మొత్తం పెట్టుబడిదారీ వర్గం గురించి, మొత్తం కార్మికవర్గం గురించి ఆలోచించడం నేర్పుతుంది.
అనేక తరాల కార్మికుల శ్రమను దోచుకుని కోట్లు గడించిన ఫ్యాక్టరీ యజమాని కొంచెం వేతనం పెంచడానికీ నిరాకరిస్తే, వేతనాన్ని ఇంకా తగ్గించేయడానికి ప్రయత్నిస్తే, దానికి కార్మికులు అడ్డం తిరిగినప్పుడు ఆకలిగొన్న వేలాది మంది కార్మిక కుటుంబాలను రోడ్డుపాలు చేస్తే, అప్పుడు మొత్తం పెట్టుబడిదారీ వర్గం మొత్తం కార్మిక వర్గానికి శత్రువని కార్మికులకు స్పష్టమైపోతుంది.
కార్మికులు తమ కాళ్ళ మీద, తమ సంఘటిత శక్తిమీద తాము నిలబడాలన్న విషయం కూడా వారికి స్పష్టమైపోతుంది.
ఫ్యాక్టరీ యజమాని కార్మికులను తరచు మోసగిస్తుంటాడు. తాను వారిని ఉద్ధరించే వాడిలా పోజు పెడుతుంటాడు.
చిన్న చిన్న రాయితీలు, పనిరాని వాగ్దానాలతో తన దోపిడీని కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. సమ్మె ఈ మోసాన్ని ఒక్క దెబ్బతో బట్టబయలు చేస్తుంది. తమను ఉద్ధరించేవారు మేక తోలు కప్పుకున్న పులులనే విషయాన్ని కార్మికులకు స్పష్టం చేస్తుంది.
సమ్మె ఒక ‘యుద్ధ పాఠశాల’..
అంతేకాదు, సమ్మె పెట్టుబడిదారుల సహజ లక్షణం పట్లనే కాకుండా ప్రభుత్వం, దాని చట్టాల లక్ష్యాలపట్ల కూడా కార్మికుల కళ్లు తెరిపిస్తుంది.
ప్రతి సమ్మె – ప్రభుత్వం తమ శత్రువనే అవగాహనను, కార్మిక వర్గం ప్రజల హక్కులకోసం పోరాడటానికి సిద్ధపడాలన్న అవగాహనను కార్మికుల్లో అభివృద్ధిచేసి, పటిష్ట పరుస్తుంది.
అందువల్ల సమ్మెలు, కార్మికులకు ఐక్యం కావడాన్ని నేర్పుతాయి. తాము ఐక్యంగా ఉంటేనే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడగలమని వారికి తెలియజేస్తాయి.
మొత్తం యజమానుల వర్గానికి వ్యతిరేకంగా, ఏకపక్ష పోలీసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం కార్మిక వర్గం పోరాడాలన్న ఆలోచనను కార్మికులకు సమ్మెలు నేర్పుతాయి.
ఈ కారణం చేతనే సోషలిస్టులు సమ్మెలను “యుద్ధ పాఠశాల”గా పేర్కొంటున్నారు. మొత్తం ప్రజానీకాన్ని, శ్రమజీవులందరినీ ప్రభుత్వాధికారుల కబంధ హస్తాల నుంచి, పెట్టుబడి పీడన నుంచి విముక్తి చేయడానికి శత్రువుపై పోరాడటం ఎలాగో కార్మికులు నేర్చుకునే పాఠశాల సమ్మె.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
