గత శుక్రవారం పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగిన అంతర్జాతీయ అసమానతల మహాసభలో ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్కు ప్రపంచ ఆర్థిక అసమానతల పరిశోధన అవార్డు ప్రదానం చేశారు.
భారతదేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలు వంటి సామాజిక అంశాలపై డ్రెజ్ విశేషమైన పరిశోధనలు చేశారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వారిలో ఆయన ఒకరు.
అవార్డు స్వీకరించిన తర్వాత మాట్లాడుతూ డ్రెజ్, “ఈ అవార్డు నా స్వయంకృషి ఫలితం కాదు. నా కృషికి, పరిశోధనలకు సమాజ మార్పు కోసం పనిచేస్తున్న ఎంతోమంది సహచరులు సహకరించారు” అన్నారు.
దేశంలో అసమానతలపై ఆవేదన..
భారతదేశంలో అనేక రకాలైన అసమానతలు ఉన్నాయి. బయటికి కనిపించే ఆర్థిక అసమానతలు మాత్రమే కాదు.
కులపరమైన అసమానతలు, లైంగిక అసమానతలు, విద్యా వైద్య రంగాల్లో అసమానతలు పెద్ద ఎత్తున ఉన్నాయన్నారు.
ఒకే ఒక సంతోషించదగ్గ విషయం ఏమిటంటే, అసమానతలకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజలు నిరంతరం పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటాలలో భాగస్వామిని అయినందుకు నాకు ఎంతో గర్వంగా ఉందన్నారు.
అసమానతల గురించి అంతర్జాతీయంగా విశేష గుర్తింపు కలిగిన పరిశోధనలు సాగించిన ప్రతిభావంతులకు రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ సమావేశంలో అవార్డులు బహుకరిస్తారు. ఈ అవార్డును 2024లో ప్రారంభించారు. జీన్ డ్రెజ్ ఈ అవార్డు రెండో గ్రహీత.
2024లో సామాజిక పర్యావరణ అసమానతలపై విశేష కృషి సాగించిన పరిశోధకులు బీనా అగర్వాల్, జేమ్స్ కే బాయ్స్లకు ఉమ్మడిగా బహుకరించారు.
ప్రభుత్వ విధానాలపై విమర్శలు..
ఉపాధి హామీ చట్ట సవరణను వ్యతిరేకించిన వారిలో జీన్ డ్రెజ్ ఒకరు. ఆహార సబ్సిడీలను అమలు చేయటానికి ఆధార్ నంబర్‌తో ముడిపెట్టడాన్ని కూడా ఈయన చాలెంజ్ చేశారు.
ఆధార్ కార్డు ద్వారా అథెంటికేషన్ జరగటం లేదని పౌరులకు రేషన్ సరుకులు నిరాకరించడాన్ని ఆయన ప్రశ్నించారు.
నూతన ఉపాధి హామీ చట్టం ప్రకారం పనికి హామీ ఉంటుంది గానీ, ఆ హామీ అమలు జరుగుతుందన్న హామీ ఏమీ ఉండదు అని జీన్ డ్రెజ్ విమర్శించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
