చిన్న పట్టణాల్లోని ఏటీఎంలలో సరిపడా నగదు నిల్వలు ఉంచకుండా ఎస్బీఐ వివక్ష చూపుతోందని కన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ(క్యాట్మీ) ఆరోపించింది.
ముఖ్యంగా గ్రామీణ, టైర్-2, టైర్-3 నగరాల్లో నగదు అందుబాటులో లేకపోవడం వల్ల తమకు సుమారు 100 కోట్ల రూపాయల నష్టం జరిగిందని, 65 వేల ఏటీఎంల నెట్వర్క్ ఉన్న ఎస్బీఐ ఆ నష్టాన్ని పూడ్చాలని డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ: ఏటీఎంలలో సరిపడా నగదు నిల్వలను ప్రభుత్వ రంగ బ్యాంక్ పెట్టకపోవడంతో నష్టాలకు దారి తీసిందని, దీన్ని పూడ్చడానికి 100 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా ఎస్బీఐ చెల్లించాలని క్యాట్మీ డిమాండ్ చేసింది.
బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించే ఆర్బీఐ, ఎస్బీఐ అధికారులతో జూన్ 5న జరిగిన సమావేశంలో క్యాట్మీ ఈ డిమాండ్ చేసినట్లు ‘ది ఎకనామిక్ టైమ్స్’ ప్రచురించింది.
ముఖ్యంగా చిన్న పట్టణాలలో ఉన్న ఏటీఎం మెషీన్లలో నగదు కొరత కారణంగా ఏటీఎం పరిశ్రమ ఒత్తిడికి లోనవుతోందని బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) విపరీతంగా టైర్-1 నగరాల ఏటీఎంలకే నగదు మళ్లిస్తోందని, దీనివల్ల టైర్-2, టైర్-3 కేంద్రాలలో నగదు కొరతకు దారి తీస్తోందని క్యాట్మీ ఆరోపించింది. దీని వల్ల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏటీఎంల మూసివేత ప్రమాదం పొంచి ఉందని ఎకనామిక్ టైమ్స్ ఉటంకించింది.
నగదు కొరత తీవ్రం..
ఏటీఎం మెషీన్లలో నగదు కొరతపై గత వారం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కు క్యాట్మీ లేఖ రాసిందని ఎన్డీటీవీ కథనం వెల్లడించింది. ఏటీఎంలలో కావాల్సిన నగదులో కేవలం 55-65 శాతం మాత్రమే అందుతోందని ఆ లేఖలో నొక్కి చెప్పింది.
కస్టమర్లకు ఉన్న ఉచిత ఏటీఎం ఉపసంహరణ పరిమితులు దాటిన తర్వాత, ప్రతి లావాదేవీకి సుమారు 20-28 రూపాయల వరకు (18 శాతం జీఎస్టీతో కలిపి) ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సంక్షోభం తలెత్తడం గమనార్హం.
పెరిగిన నగదు.. తగ్గిన ఏటీఎంల వాడకం..
బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం నగదు లభ్యత మూడు రెట్లు పెరిగినప్పటికీ ఈ పరిస్థితి ఏర్పడింది.
ఎన్డీటీవీ కథనం ప్రకారం- 2017 ఆర్థిక సంవత్సరంలో సుమారు 13 లక్షల కోట్లుగా ఉన్న నగదు, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 41 లక్షల కోట్లకు పెరిగింది.
అయితే, డిజిటల్ లావాదేవీల(యూపీఐ తదితర) పెరుగుదల ఏటీఎంల వినియోగాన్ని తగ్గించింది. ఆ నేపథ్యంలో, పెరిగిన ఇంటర్చేంజ్ ఛార్జీలు ఏటీఎం ఆపరేటర్లకు ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని తీసుకురాలేకపోయాయి.
కస్టమర్లు ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకున్నా లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా, బ్యాంకులు వసూలు చేసే రుసుము ఏటీఎం ఆపరేటర్ల నిర్వహణ ఖర్చులకు వెళుతుంది.
డిజిటల్ లావాదేవీల పెరుగుదల, ఏటీఎంల నిర్వహణ, భద్రతా ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఈ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.
ఏటీఎంలలో నగదు లేకపోతే, లావాదేవీలు జరగవు కాబట్టి ఆపరేటర్లు ఆ ఇంటర్చేంజ్ ఛార్జీల ఆదాయాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందని క్యాట్మీ ఆవేదన వ్యక్తం చేసింది.
తగ్గుతున్న ఏటీఎంల సంఖ్య..
దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఏటీఎంల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏటీఎంలకు కల్పించాల్సిన భద్రత, సేవల విషయంలో బ్యాంకులు ఇబ్బందులు పడుతున్నాయి.
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, భారతదేశంలో ఏటీఎంల సంఖ్య అంతకుముందు ఏడాది ఉన్న 2,53,000 పైచిలుకు నుంచి 2024-25 నాటికి 2,51,000కు పడిపోయింది.
నోట్ల రద్దు తర్వాత ఏటీఎంల క్షీణత వేగవంతమైంది. ఉదాహరణకు, రైల్వే స్టేషన్లలో ఏటీఎంల ఏర్పాటుకు టెండర్లు పిలిస్తే, ఏడాది గడిచినా ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.
రైల్వేలకు ఏటీఎంలు ఆదాయ వనరులు అయినప్పటికీ, బ్యాంకులు ముందుకు రాకపోవడంతో నిబంధనలను సడలించడానికి కూడా రైల్వే శాఖ ప్రయత్నించింది.
ఆర్బీఐ నిబంధనలు పాటించడానికి అయ్యే అదనపు ఖర్చుల(కంప్లయన్స్ కాస్ట్) వల్ల ఏటీఎం పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒత్తిడిని 2018 డిసెంబర్లోనే క్యాట్మీ లేవనెత్తింది.
నిర్ణయాలు, పరిశ్రమ హెచ్చరికలు..
ఆర్బీఐ 2025 మే నుంచి ఏటీఎం లావాదేవీల రుసుము(ఇంటర్చేంజ్ ఫీజు)ను 21 రూపాయల నుంచి గరిష్టంగా 23 రూపాయలకు పెంచింది.
అయినప్పటికీ, ఏటీఎం సేవలను అందించే ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ సంస్థ 2025లో తమ రుణదాతలకు చెల్లించాల్సిన 389 మిలియన్ల రుణాలను ఎగవేసింది(డిఫాల్ట్).
దీన్ని ఏటీఎం పరిశ్రమలో ముంచుకొస్తున్న సంక్షోభానికి ఒక హెచ్చరికగా భావించాలని క్యాట్మీ ఎస్బీఐకి రాసిన లేఖలో ప్రత్యేకంగా నొక్కి చెప్పింది.
కస్టమర్లు తమ సొంత బ్యాంక్ ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత(ఆర్థిక, ఆర్థికేతర) లావాదేవీలు చేసుకునే అవకాశం ఉందని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.
ఇతర బ్యాంకుల ఏటీఎంలకైతే మెట్రో నగరాల్లో మూడు, మెట్రోయేతర ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు.
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ నెట్వర్క్ ఉన్న ఎస్బీఐ, తమకు జరిగిన 100 కోట్ల నష్టానికి పరిహారం చెల్లించాలని క్యాట్మీ డిమాండ్ చేస్తోంది.
ఏటీఎంల నిర్వహణ ఖర్చులపై 2018లోనే ఆందోళన వ్యక్తం చేసిన ఏటీఎం పరిశ్రమ, దేశంలో సగం ఏటీఎంల మూసివేతకు ఇది దారి తీస్తుందని హెచ్చరించింది.
అలాగే ఏటీఎంలకు కావాల్సిన నగదులో బ్యాంకులు కేవలం 30 శాతం మేరకే సరఫరా చేస్తున్నాయని 2021 డిసెంబర్లోనే క్యాట్మీ వెల్లడించినట్లు ‘ది హిందూ’ పత్రిక అప్పట్లో ప్రచురించింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
