భవిష్యత్తులో జరగబోయే అనేక దర్యాప్తుల విషయంలో సీబీఐకు రాష్ట్రంలో సాధారణ అనుమతులను మంజూరు చేస్తూ బెంగాల్లో తాజాగా గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తుందంటూ- 2018 నుంచి బెంగాల్లో అనేక విషయాలకు సంబంధించి సీబీఐ దర్యాప్తుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
తిరిగి ఎనిమిదేళ్ల తర్వాత రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టడానికి బీజేపీ తలుపులు తెరిచింది.
1946 ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద జారీ చేసిన ఆదేశాల మేరకు భవిష్యత్తులో బెంగాల్ పరిధిలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు చేసే ఏ నేరాలపైనైనా వాటి తీవ్రతను అనుసరించి సీబీఐ దర్యాప్తు చేసేందుకు అవకాశం ఉన్నది.
అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన దర్యాప్తు విషయంలో ముందస్తు అనుమతి అవసరం.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ లక్ష్యాలు చేరుకోవడానికి సీబీఐని దుర్వినియోగం చేస్తోందని చెప్తూ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం 2018లో సీబీఐ రాష్ట్రంలో ప్రవేశించడానికి అనుమతిని నిరాకరించింది.
తర్వాత కాలంలో ప్రధానంగా బీజేపీయేతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఈ బాటనే ఎంచుకున్నాయి.
మిజోరం, ఛత్తీస్గడ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్, పంజాబ్, మేఘాలయ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో సీబీఐ నేరుగా జోక్యం చేసుకోవడానికి అవకాశం నిరాకరించబడింది.
అయితే రాజస్థాన్, మహారాష్ట్ర, చత్తీస్గడ్, మిజోరం రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడడంతో ఆయా రాష్ట్రాలలో జరిగే నేరాలను దర్యాప్తు చేసే విషయంలో సీబీఐపై ఉన్న ఆంక్షలు రద్దు చేశారు. బెంగాల్ కూడా తాజాగా ఈ కోవలోకి చేరింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
