(ప్రధాన స్రవంతి బీసీ రాజకీయాల పరిమితులు, పీడిత వర్గాల ఐక్యత అవసరం, కుల నిర్మూలన లక్ష్యంపై విశ్లేషణ)
మనదేశ సామాజిక చరిత్రను పరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన వైరుధ్యం కనిపిస్తుంది. ఒకవైపు రాజ్యాంగం సమానత్వాన్ని ప్రకటించింది.
ఈ క్రమంలో రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యంలో అణగారిన కులాలు, వర్గాలకు అవకాశాలు పెరిగాయి.
అనేక వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు ఉన్నత పదవులను అధిరోహించారు. అయినప్పటికీ కుల వివక్ష పూర్తిగా అంతరించిపోలేదు.
కులం పేరుతో అవమానాలు, సామాజిక వెలివేత, హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గిరిజనులు తమ భూమి, అటవీ హక్కుల కోసం పోరాడుతున్నారు.
మైనారిటీలు భద్రత, సమాన అవకాశాల కోసం ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.
ఇలాంటి నేపథ్యంతో కూడిన నేటి పరిస్థితులలో అభివృద్ధి ప్రయాణం అందరికీ ఒకేలా చేరలేదన్న వాస్తవం ఇప్పటికే మనకు అర్థమైంది.
ప్రాతినిధ్యం పెరిగితే సమాజం కూడా మారాలి. కానీ ఎందుకు మారడం లేదు? కొత్త నాయకత్వాలు వచ్చినా పాత అసమానతలు ఎందుకు కొనసాగుతున్నాయి? ఎన్నికల మార్పులు కనిపిస్తున్నా సామాజిక సంబంధాల్లో అదే పాత ఆధిపత్య ధోరణులు ఎందుకు నిలిచి ఉన్నాయి?
ఈ ప్రశ్నలకు సమాధానం వ్యక్తుల్లో వెతికితే దొరకదు. కొన్ని కులాల వద్ద మాత్రమే వెతికినా దొరకదు.
అసలు మూలం కుల వ్యవస్థ అనే సామాజిక నిర్మాణంలో ఉంది. దాని స్వభావాన్ని అర్థం చేసుకోకుండా సామాజిక న్యాయం గురించి చేసే చర్చ అసంపూర్ణంగానే మిగులుతుంది.
ఆధిపత్య ధోరణులు – బహుజన రాజకీయాల సవాలు..
నేటి రాజకీయ జీవితంలో మరో విచిత్రమైన ధోరణి కనిపిస్తోంది. ప్రతి వర్గం తన సమస్యలను ముందుకు తెస్తోంది. అది అవసరమే.
హక్కుల కోసం పోరాటం కూడా అవసరమే. కానీ సమస్యలకు కారణమైన అసలు నిర్మాణాన్ని ప్రశ్నించే చర్చ క్రమంగా వెనుకబడుతోంది.
ఎన్నికల నినాదాలు పెరుగుతున్నాయి గానీ సమాజాన్ని కొత్త దిశలో ఆలోచింపజేసే తాత్విక చర్చలు తగ్గుతున్నాయి.
ఫలితంగా ఆవేశం పెరుగుతోంది, కానీ సామాజిక చైతన్యం అదే స్థాయిలో విస్తరించడం లేదు.
ఇక్కడే ప్రధాన స్రవంతి బీసీ రాజకీయాల పరిమితి కూడా కనిపిస్తుంది. అనేక సందర్భాల్లో ప్రాతినిధ్యం, వాటా, అవకాశాల ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.
అయితే కుల వ్యవస్థను మూలంగా ప్రశ్నించే దృక్పథం అంతగా కనిపించడం లేదు.
అధికార భాగస్వామ్యం గురించి చర్చ జరుగుతోంది గానీ సమాజ పునర్నిర్మాణం గురించి చర్చ బలహీనంగా ఉంది. ఇది ఒక్క ఉద్యమానికి సంబంధించిన సమస్య కాదు. మొత్తం సమగ్ర బహుజన రాజకీయాల ముందున్న సవాలు.
కుల వ్యవస్థ సంక్లిష్టత – కులాంతర వివాహాలపై దాడులు..
సామాజిక న్యాయ చర్చల్లో తరచూ జరిగే ఒక పొరపాటు ఏమిటంటే కుల వ్యవస్థను కేవలం అగ్రకులాల ఆధిపత్యానికి మాత్రమే పరిమితం చేయడం. వాస్తవానికి అది మరింత సంక్లిష్టమైన నిర్మాణం.
ఏదైనా సమూహం ఆర్థిక, సామాజిక లేదా రాజకీయ బలం సంపాదించినప్పుడు తనకంటే బలహీనమైన వర్గాలపై ప్రభావం చూపే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అందుకే కుల వ్యవస్థ పైనుంచి మాత్రమే కాదు, విభిన్న స్థాయిలలో తన ప్రభావాన్ని కొనసాగించగలుగుతోంది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా కుల నిర్మూలన లక్ష్యం గురించి మాట్లాడటం సాధ్యం కాదు.
కులాంతర వివాహాలపై జరుగుతున్న ప్రతిఘటనను పరిశీలిస్తే కుల వ్యవస్థ అసలు స్వభావం స్పష్టమవుతుంది. కేవలం దళితులు మాత్రమే కాదు, వివిధ కులాల మధ్య జరిగే వివాహాలపైనా వ్యతిరేకత కనిపిస్తోంది. దీనివల్ల సమస్య వ్యక్తుల ప్రేమలో లేదు; కుల గోడలు చెదిరిపోతాయనే భయంలో ఉందని అర్థమవుతుంది. కానీ కుల వ్యవస్థ తన కొనసాగింపుకు అవసరమైన గీతలను కాపాడుకోవాలనుకుంటుంది.
అందుకే సామాజిక కలయికను అనుమానంతో చూస్తుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలను వ్యక్తిగత ఘర్షణలుగా మాత్రమే కాకుండా, ఒక సామాజిక నిర్మాణం తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నంగా కూడా చూడాలి.
ఐక్యత లోపించడం – చారిత్రక కారణాలు..
ఇక్కడ మరో ప్రశ్న ఎదురవుతుంది. చారిత్రకంగా అణచివేతకు గురైన కులాలు, వర్గాలు పరస్పరం ఎందుకు ఐక్యంగా నిలబడలేకపోతున్నాయి? దళితులు, బీసీలు, గిరిజనులు, మైనారిటీలు, ఇతర వెనుకబడిన కులాలు, వర్గాల మధ్య ఎందుకు దూరాలు కొనసాగుతున్నాయి? దీనికి సమాధానం పూర్తిగా బయటి శక్తుల వద్ద లేదు. చారిత్రక అనుభవాలు, పరస్పర అపోహలు, సామాజిక దూరాలు, పరిమిత రాజకీయ అవగాహన వంటి అంశాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి.
అదే సమయంలో ఈ వైరుధ్యాలను ఇతర శక్తులు తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునే అవకాశమూ ఉంటుంది. కాబట్టి సమస్యను నిరాకరించడం కాదు, దానిని నిజాయితీగా అర్థం చేసుకోవడం అవసరం.
నేడు బహుజన రాజకీయాలు ఒక కీలక మలుపు వద్ద ఆగిపోయాయి. అవి కేవలం ప్రాతినిధ్యం కోసం జరిగే రాజకీయాలుగా మిగిలిపోతాయా? లేక సమాజ నిర్మాణాన్ని ప్రభావితం చేసే శక్తిగా ఎదుగుతాయా? అన్న ప్రశ్న మన ముందుంది.
దీనికి సమాధానం పీడిత వర్గాలు తమ మధ్య ఉన్న దూరాలను గుర్తించి, తమలోని ఆధిపత్య ధోరణులను విమర్శించి, కుల వ్యవస్థను కేంద్ర సమస్యగా తీసుకొని కొత్త దిశలో ఆలోచించినప్పుడే బహుజన రాజకీయాలు చారిత్రక పాత్రను పోషించగలవు.
బహుజన రాజకీయాల అంతర్గత విశ్లేషణ మన ముందు అత్యంత సున్నితమైన, కీలకమైన వాస్తవాన్ని ఉంచుతోంది. అదే పీడిత వర్గాల మధ్య ఏర్పడుతున్న అంతర్గత దూరాలు, అపోహలు, వాటిని ఉపయోగించుకుంటున్న రాజకీయ నిర్మాణాలు.
సమాజంలో అణచివేత ఒకే రూపంలో ఉండదు; అది అనేక పొరలుగా, అనేక అనుభవాలుగా, అనేక స్థాయిల్లో కొనసాగుతుంది.
దళితులపై జరిగే అణచివేత ఒక రూపం అయితే, బీసీలలోని అనేక కులాలు, వర్గాల మధ్య జరిగే ఆధిపత్య సంబంధాలు మరొక రూపం.
గిరిజనుల సమస్యలు మరొక వాస్తవం. మైనారిటీల భద్రత మరొక ప్రశ్న. ఇవన్నీ విడివిడిగా కనిపించినా, అసలు మూలంలో ఒకే నిర్మాణం పనిచేస్తుంది. అదే కులాధారిత సామాజిక శ్రేణీకరణ.
ఈ శ్రేణీకరణను అర్థం చేసుకోకుండా, కేవలం ఒక్క వర్గం అనుభవం ఆధారంగా రాజకీయాలు నిర్మిస్తే అవి తాత్కాలిక విజయాలు ఇవ్వవచ్చు కానీ దీర్ఘకాలిక మార్పును ఇవ్వలేవు.
ఎందుకంటే కుల వ్యవస్థ తనను తాను కాపాడుకునే అత్యంత సూక్ష్మమైన సామర్థ్యం కలిగిన నిర్మాణం. అది పైనుంచి కిందకు మాత్రమే కాదు, కింద నుంచి కూడా తన ప్రతిరూపాలను సృష్టించుకుంటుంది. అందుకే బీసీ సమాజంలోనే కొన్ని వర్గాలు ఆర్థికంగా బలపడినప్పుడు తమకంటే బలహీనమైన వర్గాలపై అదే ఆధిపత్య ధోరణిని ప్రదర్శించే సందర్భాలు అనేకంగా కనిపిస్తాయి.
ఇదే విషయం దళిత సమాజంలో కూడా కొన్ని ఉప కులాలు, వర్గాల మధ్య వేరే రూపంలో కనిపిస్తుంది. ఇది వ్యక్తిగత నైతికత సమస్య మాత్రమే కాదు; ఇది వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూపించే సామాజిక సత్యం.
ప్రధాన స్రవంతి బీసీ రాజకీయాల మౌనం..
ఇలాంటి పరిస్థితుల్లో బహుజన రాజకీయాలు ఒక ప్రధాన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు అవి అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడాలి. మరోవైపు తమలోపలే ఉన్న అసమానతలను కూడా ప్రశ్నించాలి. ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని విస్మరించినా ఉద్యమం అసంపూర్ణంగా మిగిలిపోతుంది.
ముఖ్యంగా బీసీ రాజకీయాల ప్రధాన స్రవంతి అనేక సందర్భాల్లో తమ సమస్యలను మాత్రమే కేంద్రంగా పెట్టుకొని, ఇతర పీడిత వర్గాల అనుభవాలను పక్కకు నెట్టినట్లుగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఉద్దేశపూర్వకంగానైనా, కాకపోయినా ఫలితంగా ఐక్యతను బలహీనపరుస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
