అనేక సంవత్సరాలుగా, $ 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించాలన్నదానిపైనే ప్రభుత్వ ఆర్థిక విధానం, రాజకీయ భావ వ్యక్తీకరణ ప్రాథమికంగా దృష్టి పెట్టాయి.
ఇప్పుడు అధికార ప్రకటనలన్నీ దీర్ఘకాలిక అంచనాలతో ఏకంగా 2047 వైపుగా దృష్టి సారించాయి, తద్వారా విఫలమైన గడువును చాకచక్యంగా దాటవేశారు.
న్యూఢిల్లీ: భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న అధికారిక లక్ష్యం మరో గడువును తప్పింది.
2018లో, న్యూఢిల్లీలో ‘ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్’కు శంకుస్థాపన చేసిన సందర్భంగా(2018 సెప్టెంబర్ 20న) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ $5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి 2022ను గడువుగా విధిస్తూ తొలి ప్రకటన చేశారు.
ప్రాథమిక లక్ష్యం విజయవంతంగా సాధించకుండానే దాటిపోవడంతో, మోదీ ప్రభుత్వం ఆ గడువును 2024-25 ఆర్థిక సంవత్సరానికి మార్చింది.
ఈ వారంలో విడుదల చేసిన 2025-26 ఆర్థిక సంవత్సర జీడీపీ డేటా ప్రకారం ప్రభుత్వం ఈ గడువును కూడా తప్పిపోయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశ జీడీపీ రూ 346.4 లక్షల కోట్లుగా ఉంది, ఇది సుమారుగా $ 3.6 ట్రిలియన్లతో మాత్రమే సమానం.
లక్ష్యాలను సాధించడంలో ఎదురైన ఈ వైఫల్యానికి స్పందనగా, ప్రధాని మోదీ, ఆయన మంత్రులు ప్రజా వేదికలు, అధికారిక బ్రీఫింగ్స్‌లో (గోష్ఠులలో) ఐదు ట్రిలియన్ల గురించి ప్రస్తావించడాన్ని పూర్తిగా మానుకున్నారు.
ఆరో స్థానానికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ..
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ త్వరలోనే ఎదుగుతుందని ప్రధాన మంత్రి మోదీ గొప్పలు చెబుతూ వచ్చారు.
భారత్ ఇప్పటికే ఆ ఘనత సాధించిందని ఆయనకు చెందిన కొంతమంది అధికారులు వాదిస్తున్నారు.
అయితే, వాస్తవానికి ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ ఆరవ స్థానానికి జారిపోయినట్లు అధికారిక ఆర్థిక డేటా ఇప్పుడు బట్టబయలు చేసింది.
అదే మాదిరిగా, భారతీయ షేర్ మార్కెట్ కూడా గడచిన కొద్ది వారాలలో గ్లోబల్ స్థాయిలో ఆరవ స్థానానికి పడిపోయింది.
గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో ఉన్నత శ్రేణికి చేరుకోవాలన్న భారత్ ఎదుగుదల స్తంభించిపోయిందని దీని అర్థం.
యూపీఏ వర్సెస్ ఎన్డీఏ: ప్రగతిలో వెనుకబాటు..
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో చూసిన అధిక వృద్ధి రేటుతో పోలిస్తే, మోదీ ప్రభుత్వ నేతృత్వంలో భారత ఆర్థిక వృద్ధి రేటు(ట్రాజెక్టరీ) స్తంభించిపోయినట్లు ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి.
యూపీఏ ప్రభుత్వ హయాంలో(2004 నుంచి 2014 వరకు) డాలర్ల రూపంలో భారత జీడీపీ అనూహ్యంగా పెరిగి సగటున 11%కి పైగా (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లేదా CAGR) వృద్ధి సాధించింది. కాగా, మోదీ ప్రభుత్వం తన 12 సంవత్సరాల పాలనలో డాలర్ల రూపంలో కేవలం 6% వృద్ధిని మాత్రమే అందించింది.
గ్లోబల్ కరెన్సీ(డాలర్ల) పరంగా కొలిస్తే ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో ఆర్థిక ప్రగతి మందగించిందని ఇది స్పష్టం చేస్తోంది.
డాలర్ ఆధారిత వృద్ధి మందగించడానికి భారతీయ రూపాయి నిరంతరం పడిపోవడం ఒక ప్రధాన కారణం.
గత దశాబ్ద కాలంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ప్రత్యక్ష ఫలితమే ఈ రూపాయి బలహీనత.
తయారీ రంగ ఎగుమతులకు సరిపడా ఊతమివ్వడంలో, ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడంలో, దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడంలో, లేదా దేశంలోకి సరిపడా సుస్థిరమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ విధానాలు విఫలమయ్యాయి.
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి క్రమంగా బలహీనపడుతుండటంతో, భారత ఆర్థిక పరిమాణం కుదించుకుపోయింది, మోదీ ప్రభుత్వం సాధించాలనుకున్న $5 ట్రిలియన్ లక్ష్యం వైఫల్యాన్ని ఇది నొక్కిచెబుతోంది.
స్థానిక కరెన్సీ మాయాజాలం..
గ్లోబల్ కరెన్సీకి బదులుగా కేవలం స్థానిక కరెన్సీ(రూపాయల)లోనే ప్రగతిని కొలవడం వల్ల అంతర్లీనంగా ఉన్న నిర్మాణపరమైన బలహీనతలు మరుగునపడిపోతాయి.
దేశీయ ద్రవ్యోల్బణం, స్థానిక ఖర్చుల కారణంగా రూపాయలలో చూసినప్పుడు నామమాత్రపు జీడీపీ వృద్ధిని చూపిస్తుంది.
కానీ, అంతర్జాతీయ కొనుగోలు శక్తి, ఆర్థిక వ్యవస్థ గ్లోబల్ స్థాయి అనేది పూర్తిగా అమెరికా డాలర్ల రూపంలో దాని విలువ పైనే ఆధారపడి ఉంటుంది.
మాటల గారడీ: 2025 నుంచి ఏకంగా 2047కు..
ప్రధాన మంత్రి దగ్గర నుంచి, కేంద్ర మంత్రులు, ఇతర ప్రభుత్వ అధికార ప్రతినిధుల వరకు ఆకస్మికంగా నిశ్శబ్దం పాటించడం అనేది వారి వాక్చాతుర్యంలో వచ్చిన స్పష్టమైన మార్పును సూచిస్తోంది.
అనేక సంవత్సరాలుగా, $5 ట్రిలియన్ల మైలురాయి అనేది ఆర్థిక విధానంలో, రాజకీయ భావవ్యక్తీకరణలో ప్రాథమిక దృష్టిగా ఉండేది.
ఇప్పుడు అధికారిక ప్రకటనలన్నీ దీర్ఘకాలిక అంచనాలతో ఏకంగా 2047 వైపుగా లాగుతూ, సమర్థవంతంగా ఈ విఫలమైన గీటురాయిని దాటవేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
