మణిపూర్ రాష్ట్రం ఇంకా జాతుల పరంగా తీవ్రంగా విభజించబడే ఉంది. నిరంతర భద్రతా ఆందోళనలు, రాజకీయ పరిష్కారం లేకపోవడం వల్ల నిరాశ్రయులైన అనేక కుటుంబాలు తమ సొంత ఇళ్లకు తిరిగి వెళ్లలేకపోతున్నాయి.
న్యూఢిల్లీ: రాష్ట్రంలో మే 2023లో జాతుల మధ్య హింస చెలరేగిన నాటి నుంచి, మణిపూర్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో, ప్రీఫ్యాబ్రికేటెడ్(ముందుగా తయారు చేసిన) గృహాలలో నివసిస్తున్న వారిలో కనీసం 731 మంది అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన(నిరాశ్రయులైన) వ్యక్తులు మరణించినట్లు సమాచార హక్కు చట్టం కింద మణిపూర్ హోం శాఖ వెల్లడించిన వివరాలు తెలియజేస్తున్నాయి.
ఈ ఏడాది మొదట్లో ఒక అప్పీల్ కేసుకు సంబంధించి మణిపూర్ సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు, రచయిత- రాజకీయ కార్యకర్త అయిన ఆర్టిఐ దరఖాస్తుదారు హరేశ్వర్ గోస్వామికి హోం శాఖ ఈ సమాచారాన్ని అందించినట్లు ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది.
మెయితీ, కుకీ-జో వర్గాల మధ్య హింస చెలరేగిన తర్వాత సహాయక శిబిరాలు, ప్రీఫ్యాబ్రికేటెడ్ గృహాలలో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులైన ప్రజల మరణాలకు సంబంధించి వివిధ జిల్లా పరిపాలనల నుంచి సేకరించిన జిల్లాల వారీ సమాచారాన్ని రాష్ట్ర హోం శాఖ క్రోడీకరించింది.
మరణాలు, స్థానభ్రంశం: జిల్లాల వారీగా వివరాలు..
ఆర్టిఐ సమాధానం ప్రకారం, చురచాంద్‌పూర్‌లో అత్యధికంగా 248 మరణాలు నమోదు కాగా, ఆ తర్వాత బిష్ణుపూర్ (151), కాంగ్పోక్పి (128), ఇంఫాల్ వెస్ట్ (94), కక్చింగ్ (60), ఇంఫాల్ ఈస్ట్ (25), జిరిబామ్ (13), తౌబాల్ (11), తెంగ్నౌపాల్(1) ఉన్నాయి.
ఈ ఘర్షణలు ప్రారంభమై దాదాపు మూడేళ్లు కావస్తున్నా, ఇంకా 43,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులుగానే మిగిలిపోయారని ఈ వెల్లడి ద్వారా తెలిసింది.
ఏప్రిల్ 30 నాటికి కాంగ్పోక్పిలో అత్యధికంగా 15,694 మంది నిరాశ్రయులైన జనాభా ఉండగా, ఆ తర్వాత బిష్ణుపూర్‌లో 10,092 మంది, చురచాంద్‌పూర్‌లో 6,365 మంది ఉన్నారు.
సహాయక శిబిరాల్లో అసహజ మరణాలు..
సహాయక శిబిరాలు, సెటిల్మెంట్లలో 25 అసహజ మరణాలు చోటుచేసుకున్నట్లు ఆర్టిఐ సమాధానం పేర్కొంది.
చురచాంద్‌పూర్‌లో ఇలాంటి ఆరు మరణాలను అధికారులు నమోదు చేశారు.
అందులో నాలుగు నీటిలో మునిగి చనిపోగా, ఒకటి విద్యుత్ షాక్ వల్ల, మరొకటి లైంగిక దాడి కేసు(ఇందులో నిందితుడిని అరెస్టు చేశారు) అని తేలింది.
ఈ సంఘటనల తర్వాత శిబిరాల్లో కౌన్సిలింగ్, అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు జిల్లా అధికారులు ఆర్టిఐ దరఖాస్తుదారునికి తెలిపారు.
ఇంఫాల్ వెస్ట్‌లో రెండు ఆత్మహత్యలు(ఉరి వేసుకోవడం), ఒకటి డ్రగ్స్/మందులు అధిక మోతాదులో తీసుకోవడం, మరొకటి బుల్లెట్ గాయం వల్ల కలిపి మొత్తం నాలుగు అసహజ మరణాలు జరిగాయి.
కొనసాగుతున్న ఆరోగ్య సవాళ్లు..
నిరాశ్రయులైన కుటుంబాలలో ఎదురవుతున్న ఆరోగ్య సవాళ్లను కూడా ఈ పత్రాలు ప్రముఖంగా ప్రస్తావించాయి.
ఇంఫాల్ ఈస్ట్‌లోని శిబిరాల్లో నివసిస్తున్న వారిలో 217 మంది నయం చేయలేని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతుండగా; ఇంఫాల్ వెస్ట్‌లో అలాంటి వారు 41 మంది, బిష్ణుపూర్‌లో 26 మంది రోగులు ఉన్నారు.
కొండ ప్రాంత జిల్లాల్లో గిరిజన సంఘీభావ ప్రదర్శన సందర్భంగా 2023 మే 3న మేయితీ, కుకీ-జో వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
ఈ సుదీర్ఘ సంఘర్షణలో ఇప్పటివరకు 250 మందికి పైగా మృతి చెందగా, వేలాది మంది ప్రజలు తమ నివాసాల నుంచి స్థానభ్రంశం చెందారు.
రాష్ట్రం ఇప్పటికీ జాతుల ప్రాతిపదికన తీవ్రంగా విభజించబడే ఉంది. రాజకీయ పరిష్కారం లేకపోవడం, భద్రతా కారణాల వల్ల అనేక కుటుంబాలు తమ సొంత ఇళ్లకు తిరిగి వెళ్లలేకపోతున్నాయి.
హింస ప్రారంభ దశల్లోనే ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలు నేటికీ వేలాది మంది ప్రజలకు నివాసంగా కొనసాగుతున్నాయి.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
