బెంగాల్ బీజేపీ ప్రభుత్వం ఒక కీలక సంక్షేమ పథకానికి 10 పేజీల దరఖాస్తు ఫారాన్ని రూపొందించి ప్రభుత్వ పోర్టల్‌లో పెట్టింది. ఈ ప్రక్రియ ఓటు హక్కు కోల్పోతామనే భయాలకు దారితీస్తోంది.
“కేవలం రూ. 3,000 కోసం ఈ దరఖాస్తును పూర్తి చేస్తున్నాను తప్ప, జనాభాలోని ఒక భాగానికి నష్టం కలిగించే అంశాలను నేను బలపరచడం లేదు” అని ఒక మహిళ నిర్ద్వంద్వంగా తెలియజేసింది. ఆమె ఈ దరఖాస్తు ఫారం నింపడానికి సహకరిస్తోంది. “దీని ద్వారా లభించే ఆర్థిక సహాయం లేకపోతే నాకు ప్రత్యామ్నాయం లేదు. ఆర్థికంగా నేను చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆకలి బతుకులకు కూడా సిద్ధం కావాలి” అని ఆమె చెప్పింది.
భారతదేశవ్యాప్తంగా, మహిళల కోసం ఉద్దేశించిన నగదు బదిలీ పథకాలు ఎన్నికల రాజకీయాలకు, సామాజిక సంక్షేమానికి అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటిగా మారాయి.
రెండు, మూడు వేల రూపాయలతోనే ఆహారం, మందులు, పాఠశాల ఖర్చులు సకాలంలో సర్దుబాటు చేసుకోవడం అర్థం కాని కుటుంబాలకు ఇవి ప్రత్యక్ష, సమర్థవంతమైన, అవినీతి రహిత ఆర్థిక సహకారంగా ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి.
సంక్షేమమా? నిఘానా?
ఈ పథకాలను నిశితంగా పరిశీలించే వారు ఎవరైనా సరే వీటిలో మార్పులు జరగాలని చెబుతారు. అర్హులైన వారికి ప్రజాధనాన్ని బదిలీ చేసే ముందు వారి గుర్తింపు, వయస్సు, ఆదాయం, బ్యాంకు వివరాలను తనిఖీ చేయడంలో ప్రభుత్వానికి చట్టబద్ధమైన ప్రయోజనం ఉంది. కానీ, ఒకానొక దశలో ఈ ధృవీకరణ అనేది సంక్షేమ పరిపాలనకు బదులుగా, జనాభాపై నిఘాగా మారిపోతున్నది.
గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ‘లక్ష్మీర్ భాండార్’ పథకం కింద నెలకు రూ 1,500 నుంచి రూ 1,700 వరకు ఆర్థిక సహాయం చేసింది. దీని స్థానంలో, పశ్చిమ బెంగాల్‌లోని కొత్త బీజేపీ ప్రభుత్వం తన ‘అన్నపూర్ణ యోజన’తో ఆర్థిక ప్రోత్సాహకాన్ని రెట్టింపు చేసింది. కానీ అలా చేయడం ద్వారా, అది హద్దులు దాటినట్లు కనిపిస్తోంది.
బెంగాల్ అన్నపూర్ణ యోజన విషయంలో ఉన్న ఆందోళన, ప్రజా నిధులను పంపిణీ చేసే ముందు లబ్ధిదారులను ధృవీకరించడం ప్రభుత్వ విధి అనే దాని గురించి కాదు. ఏ ప్రభుత్వమైనా ఇది చేయగలదు, చేయాలి కూడా. అసలు సమస్య ఈ పథకంలో డేటా సేకరణ పరిధిని మించిపోవడం. మహిళల నగదు బదిలీ పథకానికి సంబంధించిన ఒక సంక్షేమ దరఖాస్తు ఫారంలో, లబ్ధిదారుని గుర్తింపు, ఆదాయం, నివాసం, బ్యాంకు వివరాల కంటే మరెన్నో వివరాలు ఎందుకు తెలుసుకోవాలి?
దరఖాస్తులో ఏముంది?
అన్నపూర్ణ యోజన ఫారాన్ని రాష్ట్ర అధికారిక పోర్టల్‌లో ఉంచారు. దానిలోని కంటెంట్, డేటా, ప్రక్రియ, నిర్వహణ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయని, నిర్వహించబడుతున్నాయని అందులో పేర్కొన్నారు.
‘అన్నపూర్ణ యోజన కోసం కుటుంబ స్థాయి డేటా సేకరణ ఫారం’లోని అన్ని ఖాళీలను నింపడం తప్పనిసరి అని ఈ ఫారం శీర్షికలో పేర్కొనబడింది.
సహజంగానే ఇందులో పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, రేషన్ కార్డు వివరాలు, ఆదాయ వివరాలు, బ్యాంకు ఖాతాలు వంటి సాధారణ సంక్షేమ సూచికలు ఈ ఫారంలో కూడా ఉన్నాయి.
అక్కడితో ఆగక, ఆ కుటుంబ సభ్యులందరి వివరాలు, కుటుంబ పెద్ద, వయోజనులందరి బ్యాంకు ఖాతాలు, అసెంబ్లీ నియోజకవర్గం, ఓటర్ల జాబితా పార్ట్ నంబర్లతో కూడిన EPIC(ఓటర్ ఐడీ) నంబర్లు, వాటితో పాటు PAN, GST రిజిస్ట్రేషన్లు, భూమి యాజమాన్య పరిమాణం, వాహన యాజమాన్య వివరాలు, ఆరోగ్య బీమా ప్రీమియంలు, మొత్తం కుటుంబం నిర్దిష్ట ఉపాధి వర్గాల సమాచారం ఇవ్వాలని ఈ దరఖాస్తులో ఉంది.
ఇది పిల్లల జీవితాలను కూడా శోధిస్తుంది. వారి టీకాల స్థితిని, వారు హాజరయ్యే పాఠశాల రకాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని ఈ ఫారంలో ఉంది. అలాగే గుర్తింపు పొందిన, పొందని మదర్సాల కోసం ప్రత్యేకమైన, అత్యంత నిర్దిష్టమైన గడులు కూడా ఈ ఫారంలో ఉన్నాయి. ఈ ఫారం ఇంగ్లీషులో 10 పేజీలు, బెంగాలీలో 12 పేజీలు ఉంటుంది.
ఆందోళన కలిగించే రెండు అంశాలు..
ఒక లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలోకి రూ 3,000 జమ చేయడానికి ఎటువంటి సంబంధం లేని రెండు అంశాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. అవి:
1. పౌరసత్వ సవరణ చట్టం కింద లబ్ధిదారుని దరఖాస్తు స్థితి.
2. 2026 ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(ఎస్ఐఆర్)లో తొలగించబడిన వ్యక్తికి ట్రిబ్యునల్‌లో కేసు పెండింగ్‌లో ఉందా లేదా అనేది.
రాష్ట్ర మంత్రి అగ్నిమిత్ర పాల్ ఇంతకు ముందు ‘ది వైర్’తో మాట్లాడుతూ, మహిళలు వారి పెండింగ్‌లో ఉన్న సీఏఏ స్థితి, ఎస్ఐఆర్ చేరికతో సంబంధం లేకుండా అన్నపూర్ణ యోజన కింద డబ్బుకు అర్హులవుతారని చెప్పారు.
కొత్త ఫారంపై వ్యాఖ్యల కోసం పాల్‌ను సంప్రదించగా ఈ ఫారం సవరించబడుతుందని ఆమె తెలియజేశారు.
ఇలాంటి ఇతర పథకాలతో లోతైన అధ్యయనం..
బీజేపీ పాలిత లేదా బీజేపీ మిత్రపక్ష ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇలాంటి మహిళా కేంద్రీకృత నగదు బదిలీ పథకాలతో పోల్చి చూసినప్పుడు, అన్నపూర్ణ యోజన అసాధారణంగా ఉందని స్పష్టంగా తెలుస్తున్నది.
మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని సామాజిక సంక్షేమ పథకాలు నిఘా ఆందోళనల నుంచి వేరుగా లేవు. కానీ అవి గుర్తించదగిన, చట్టబద్ధంగా సమర్థించదగిన ప్రయోజనాల భాషలో ఉన్నాయి.
మధ్యప్రదేశ్ “ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా యోజన” పథకంలో గుర్తింపును నిర్ధారించడానికి, నకిలీలను నివారించడానికి సమగ్ర కుటుంబ ఐడి, మొబైల్ నంబర్, ఇ-కెవైసి, దరఖాస్తుదారుడి సొంత బ్యాంకు ఖాతా, అనుసంధానంతోపాటు డీబీటీ యాక్టివేషన్ అంశాలు ఆ పథక లబ్ధిదారుల దరఖాస్తులో ఉన్నాయి. ఇది ఆదాయపు పన్ను చెల్లింపుదారులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబాలను ఫిల్టర్ చేస్తుంది.
మహారాష్ట్రలో అమలు జరుగుతున్న ‘మాఝీ లడ్కీ బహీన్’ పథకం కూడా, ఇ-కేవైసీ ఆధారిత ఆదాయం, నివాసం, బ్యాంకు ధృవీకరణ అంశాల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది.
అక్కడ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇ-కేవైసీ, పత్రాల ధృవీకరణ డ్రైవ్ తర్వాత దాదాపు 69 లక్షల పేర్లను తొలగించినట్లు సమాచారం.
ఈ పద్ధతులు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేవి అయినప్పటికీ, అవి ప్రాథమికంగా ఆర్థిక అర్హతను అంచనా వేయడం వరకే పరిమితం అవుతాయి.
సంక్షేమ వ్యవస్థలోకి ఎన్నికల, పౌరసత్వ గుర్తులను నేరుగా తీసుకువచ్చిన బెంగాల్‌కు అత్యంత దగ్గరి నిర్మాణాత్మక ఉదాహరణ నగదు పథకం కాదు, కుటుంబ గుర్తింపు రిజిస్ట్రీ. హర్యానా ‘పరివార్ పెహచాన్ పత్ర’ ఒక కుటుంబ ఐడిని కేటాయిస్తుంది. సంక్షేమ పంపిణీ కోసం ఒక డేటాబేస్‌ను రూపొందించడానికి దీనిని ఉపయోగిస్తారు.
ఈ విధంగా ఒకదానికొకటి ముడిపెట్టిన వ్యవస్థలు ఎలా విఫలం కాగలవో గత ఉదంతాలు రుజువు చేశాయి. వాటిలో కొందరిని మరణించిన వారిగా గుర్తించి, వారు తమ పింఛన్లను కోల్పోయేలా చేసిన కేసులు కూడా ఉన్నాయి.
ఈ నిర్మాణాత్మక మార్పు సుదూర పరిణామాలకు దారితీస్తుంది. ప్రజా ప్రయోజనాలకు కేంద్రీకృత కుటుంబ డేటాబేస్‌ను ద్వారపాలకుడిగా పనిచేయనివ్వడం వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాలకు దారి తీస్తుంది. అటువంటి వ్యవస్థలో, ఒక స్థానిక అసాధారణమైన డేటా ఒక పొరపాటు స్థాయిని దాటి, మొత్తం సంక్షేమ వ్యవస్థను ప్రభావితం చేసే అంశంగా మారి, వ్యవస్థాగత హక్కుల హరణకు దారితీస్తుంది.
ఒకే ఫారం – అనేక అనుమానాలు..
అన్నపూర్ణ యోజన పథకం ఫారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దుర్బలత్వాన్ని తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వయంగా బహిరంగంగా అంగీకరించిన ప్రకారం, సేకరిస్తున్న సమగ్ర కుటుంబ వివరాలు కేవలం ఈ నిర్దిష్ట నగదు బదిలీకి మాత్రమే కాకుండా, అనేక ఇతర రాష్ట్ర పథకాలకు అర్హతను నిర్ధారించడానికి ఉద్దేశించబడ్డాయి.
పర్యవసానంగా, ఒకే ఒక్క పాలనా వైఫల్యం లేదా పరిష్కరించని డేటా సూచిక ఒక కుటుంబాన్ని పూర్తి సామాజిక భద్రతా వలయం నుంచి వేరుచేయగలదు.
రాజకీయాలు ఈ విషయాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, సుమారు 2.2 కోట్ల మంది మహిళలు అప్పటికే లక్ష్మీర్ భాండార్ లబ్ధిదారులుగా ఉన్నారు.
ప్రస్తుత దరఖాస్తు ఫారంలో చేసిన మార్పుల కారణంగా సుమారు 30 లక్షల మంది అనర్హులుగా మారతారని కొత్త ప్రభుత్వం సూచించింది. అందువల్ల, ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన పేర్లకు లేదా ఎస్ఐఆర్-అనుబంధ ట్రిబ్యునల్ ద్వారా చేర్చబడటానికి దరఖాస్తు చేసుకోని వారికి ముఖ్యమంత్రి అనర్హతను ముడిపెట్టారని ఈ సంఖ్య సూచిస్తోంది.
అస్సాం ఎన్ఆర్సీతో పోలిక..
అన్నపూర్ణ ఫారం, తీవ్ర వివాదాస్పదమైన అస్సాం జాతీయ పౌర పట్టికతో పోలి ఉంది. ఈ రెండూ చట్టపరంగా ఒకేలా లేనప్పటికీ, వాటి నిర్మాణాన్ని విశ్లేషిస్తే అందులోని సారూప్యతలు వెల్లడవుతాయి.
అస్సాం ఎన్ఆర్సీ కచ్చితంగా చట్టబద్ధంగా నిర్దేశించబడిన పౌరసత్వ ధృవీకరణ ప్రక్రియ. దాని అధికారిక నిర్మాణానికి, 1951 ఎన్ఆర్సీలో తమ ఉనికికి రుజువు, 1971 మార్చి 24 అర్ధరాత్రి వరకు ఉన్న ఓటర్ల జాబితాలు లేదా 1971కి ముందు ఆమోదయోగ్యమైన ఇతర పత్రాలు, ఆ తర్వాత “లిస్ట్ బి” పత్రాల ద్వారా పూర్వీకులతో సంబంధానికి రుజువు అవసరం. ఇది గతానికి వర్తించేది- ఆర్కైవల్ రికార్డులు, లెగసీ డేటా కోడ్లు, భూమి పత్రాలు, జనన ధృవీకరణ పత్రాలు, ఓటర్ల జాబితాలు, సంబంధాల రుజువుల ద్వారా వెనక్కి వెళ్లి చూసుకోవాలని కుటుంబాలను కోరింది.
దీనికి విరుద్ధంగా, అన్నపూర్ణ యోజన అనేది చారిత్రకమైనది కాకుండా సమకాలీనమైనది. దీనిని పౌరసత్వ ధృవీకరణగా కాకుండా సామాజిక రక్షణగా రూపొందించారు.
అయితే, ఈ రెండు వ్యవస్థలూ కుటుంబ వ్యవస్థను ప్రభుత్వ చట్టబద్ధతకు ప్రధాన కేంద్రంగా మారుస్తాయి. రెండూ కూడా పథకంలో ప్రయోజనం పొందేందుకు ప్రాథమిక ప్రమాణంగా ఎన్నికల రికార్డులపై ఎక్కువగా ఆధారపడతాయి.
రెండూ కూడా ఒక ప్రమాదకరమైన పత్ర మార్గాన్ని సృష్టిస్తాయి. దీనిలో సాధారణ ప్రజలు ఒక పౌర హక్కును పొందే ముందు, తాము ప్రాథమికంగా ఈ వ్యవస్థకు చెందినవారమని నిరూపించుకోవలసి ఉంటుంది.
ఏ విధంగా చూసినా అన్నపూర్ణ యోజన పథకం పరిపాలనాపరంగా మరింత శక్తివంతమైనది. అస్సాం ఎన్ఆర్సీ గతాన్ని దృష్టిలో పెట్టుకోగా, అన్నపూర్ణ బహుళ లైవ్ డేటాబేస్లను అనుసంధానిస్తూ వర్తమానాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటుంది.
డిజిటల్ రేషన్ కార్డులు, EPIC నంబర్లు, పాన్, జీఎస్టీ, ఆస్తి యాజమాన్యం, సీఏఏ స్థితిని అనుసంధానించడం ద్వారా, రాష్ట్రం తప్పించుకోలేని ఒక డిజిటల్ పానోప్టికాన్ను నిర్మిస్తుంది.
ఒకే ఫారం గృహ కూర్పు, ఆర్థిక దుర్బలత్వం, పౌరసత్వ స్థితిని మ్యాప్ చేసినప్పుడు, అది భవిష్యత్తులో తొలగింపులు, లక్ష్యంగా చేసుకున్న ఆడిట్లు, రాజకీయ ప్రొఫైలింగ్ కోసం సిద్ధంగా ఉన్న రెడీమేడ్ డేటాబేస్‌ను సృష్టిస్తుంది.
ఎస్ఐఆర్ అనంతర వాస్తవికత..
ఈ పథకం 2026లో భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ జరిగిన వెంటనే వచ్చింది. ఇది రాష్ట్రంలో దాదాపు 91 లక్షల పేర్లను తొలగించడానికి దారితీసిన తీవ్రమైన ప్రక్షాళన. ఈ సవరణను నిర్వహించడానికి ఈసీఐ అధికారాన్ని సుప్రీం కోర్టు సమర్థించినప్పటికీ, ఈసీఐ అంతిమంగా సార్వభౌమ పౌరసత్వాన్ని నిర్ణయించలేదని న్యాయవ్యవస్థ స్పష్టంగా నొక్కి చెప్పింది.
అయినప్పటికీ, అన్నపూర్ణ యోజన కోసం ఎస్ఐఆర్ డేటాను ప్రాథమిక కాపలా కాచి, వడపోసి తిరిగి ఉపయోగించడం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ జీవితంలో ఈ ముఖ్యమైన న్యాయపరమైన వ్యత్యాసాన్ని సమర్థవంతంగా కూల్చివేసింది.
రాష్ట్రంలోని విస్తృత రాజకీయ వాతావరణంలో చూసినప్పుడు, ఈ పరిణామాలు మరింత కలవరపెట్టేవిగా మారతాయి.
అదే ప్రభుత్వం ఏకకాలంలో అక్రమ వలసదారులుగా ఆరోపించబడిన వారి కోసం ‘గుర్తించండి, తొలగించండి మరియు బహిష్కరించండి’ అనే విధానాన్ని ప్రకటించడమే కాకుండా, స్వదేశానికి తిరిగి పంపడం కోసం ఎదురుచూస్తున్న అనుమానిత విదేశీయుల కోసం నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అన్నిటినీ కలిపి చూడటం కాకుండా ఫారం ఒకదానినే విడిగా చూస్తే, ఒక సమగ్ర సంక్షేమ పత్రాన్ని కేవలం పరిపాలనాపరమైన అతిక్రమణగా కొట్టిపారేయవచ్చు.
అయితే ఎస్ఐఆర్ తొలగింపులు, సీఏఏ-సంబంధిత మినహాయింపులు, ట్రిబ్యునల్ ఆదేశాలు, ఒక అధికారిక బహిష్కరణ చట్రంతో కలిపినప్పుడు, ఇది హక్కులను హరించే ఒక నిర్మాణాత్మక మార్గంగా పనిచేస్తుంది.
అన్నపూర్ణ పత్రం మతం గురించి స్పష్టంగా అడగకుండానే, కుల వర్గాలు, సీఏఏ స్థితి, ఎస్ఐఆర్ తొలగింపులు, మదర్సాలకు హాజరయ్యే పిల్లల గురించిన నిర్దిష్ట ప్రశ్నలను కలపడం ద్వారా, ఇది సామాజిక గుర్తింపు గురించి శక్తివంతమైన పరోక్ష అంచనాలను సృష్టిస్తుంది.
ఆకలి భయంతో బలవంతపు అంగీకారం..
అంతిమంగా, రూ 3,000 జీవనాధారం కోసం ఈ విస్తృతమైన దరఖాస్తు ఫారాన్ని పూరిస్తున్న ఒక పేద మహిళ, ఒక పెద్ద జనాభా నిఘా కార్యకలాపానికి అర్థవంతమైన అంగీకారం ఇవ్వడం లేదు. ఆమె దీనికి సహకరిస్తోంది, ఎందుకంటే దీనికి ప్రత్యామ్నాయం తన ఆర్థిక స్వేచ్ఛను కోల్పోవడం, అనేక సందర్భాల్లో ఆకలిని ఎదుర్కోవడం.
అన్నపూర్ణ యోజనకు సంబంధించి అత్యంత ఆందోళనకరమైన వాస్తవం ఏమిటంటే, వ్యవస్థాగత ఓటు హక్కు హరణకు దారితీసే పరిణామం. విస్తృతంగా చర్చించబడే లేదా అధికారిక ఎన్ఆర్సీ రూపంలో రావలసిన అవసరం లేదు. అది ఒక ఆకర్షణీయమైన నగదు పథకంగా, సమగ్రమైన తప్పనిసరి ఫారమ్‌గా, అంటే ఒక నిశ్శబ్ద పరిపాలనా నియమంగా నిశ్శబ్దంగా రావచ్చు.
ఈ నియమం ప్రకారం, స్వయంచాలక ఎన్నికల యంత్రాంగం ద్వారా గుర్తించబడిన వారు, ప్రభుత్వం తమకు మద్దతు ఇవ్వాలంటే, తాము ఈ వ్యవస్థలో భాగమని చట్టబద్ధంగా నిరూపించుకోవాలి.
బీజేపీ తొలిసారి హర్యానాలో అధికారానికి వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కువ మంది ఉన్న కుటుంబాలకు సామాజిక సంక్షేమ ప్రయోజనాలు తొలగిస్తూ నిర్ణయం చేసింది. ఎటు చూసినా సబ్సిడీ కోతలో కూడా మతోన్మాద కోణాన్ని కచ్చితంగా అమలు అయ్యేలా ప్రభుత్వ విధానాలు రూపొందించడమే బీజేపీ పరిపాలన ప్రత్యేక లక్షణంగా కనిపిస్తున్నది. బెంగాల్‌లోని బీజేపీ ప్రభుత్వం కూడా ఈ దారుణ కాండలోనే ముందుకు సాగుతోంది.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
