ట్రిబ్యునల్ సభ్యులు ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్, మేలో ఒడిశాలో క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
హింస, సామాజిక బహిష్కరణ, మతపరమైన హక్కుల నిరాకరణ ఆరోపణలను వారు నమోదు చేశారు.
క్రైస్తవ ప్రముఖులు, చర్చికి వెళ్లే వారు, సంస్థలు ఎదుర్కొంటున్న భౌతిక దాడులకు తోడుగా ఈ సామాజిక బహిష్కరణలు కూడా జరుగుతున్నాయని ట్రిబ్యునల్ ముందు సాక్ష్యాలు వెల్లడయ్యాయి.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఒడిశాలలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సామాజిక బహిష్కరణలు, ఖనన హక్కులు, ప్రార్థనా హక్కుల నిరాకరణతో పాటు అనేక రకాల వివక్షలకు సంబంధించిన ఆధారాలను జూన్ 1న జరిగిన ‘భారత్‌లో క్రైస్తవ వ్యతిరేక హింసపై ప్రజా ట్రిబ్యునల్’ వేదికగా బాధితులు, హక్కుల కార్యకర్తలు, పరిశోధకులు, కమ్యూనిటీ ప్రతినిధులు పంచుకున్నారు.
హక్కుల కార్యకర్త హర్ష్ మందర్‌కు చెందిన ‘కార్వాన్-ఎ-మొహబ్బత్’, సంబంధిత పౌరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ట్రిబ్యునల్‌లో, ఈ రాష్ట్రాల్లో క్రైస్తవ మత ఆచారాలపై కొనసాగుతున్న అణచివేతను ప్రాణాలతో బయటపడిన బాధితులు వివరించారు.
క్రైస్తవ విశ్వాసులు, చర్చిలు, సంస్థలు, మత పెద్దలపై జరుగుతున్న భౌతిక హింసకు తోడుగా ఈ అణచివేత సాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతాల్లో క్రైస్తవ విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు క్రమంగా క్షీణిస్తోందని, “హింస, వివక్ష కలవరపెట్టే స్థాయిలో పెరిగిపోవడం” పట్ల ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది.
ట్రిబ్యునల్‌ను ప్రారంభించిన ప్రముఖ జర్నలిస్టు, మానవ హక్కుల నాయకుడు జాన్ దయాల్ మాట్లాడుతూ, క్రైస్తవులకు వ్యతిరేకంగా సాగుతున్న సమకాలీన హింసను చారిత్రక నేపథ్యంలో చూడాలన్నారు.
గుజరాత్ దాడులు, ఒడిశాలో గ్రహమ్ స్టెయిన్స్, ఆయన ఇద్దరు కుమారుల హత్య, కంధమాల్ హింస సందర్భంగా జరిగిన పెద్ద ఎత్తున విధ్వంసం, వలసలను ఆయన గుర్తు చేశారు.
రాజ్యాంగం కల్పించిన అంతరాత్మ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సమాన పౌరసత్వ హక్కులకు ముప్పు పెరుగుతోందని ఆయన హెచ్చరించారు.
ఢిల్లీ మైనారిటీ కమిషన్ మాజీ సభ్యుడు, క్రైస్తవ హక్కుల కార్యకర్త ఏసీ మైఖేల్ మాట్లాడుతూ, ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనా సమావేశాలపై పెరుగుతున్న విద్వేషం సాధారణ విషయంగా మారిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
శాంతియుతంగా జరిగే ప్రార్థనలను కూడా శాంతి భద్రతలకు, జాతీయ ప్రయోజనాలకు ముప్పుగా చిత్రీకరిస్తున్నారని, చట్టబద్ధమైన మైనారిటీ సంస్థల్లో క్రైస్తవ ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి విజయేశ్ లాల్ గుజరాత్లో దాడుల గురించి ప్రస్తావిస్తూ, మత మార్పిడి ఆరోపణల ద్వారా క్రైస్తవ వ్యతిరేక సమీకరణలను, హింసను సమర్థించుకుంటున్నారని అన్నారు.
హింసకు మతమార్పిడి ఆరోపణలను సాకుగా చూపించడం సర్వసాధారణమైపోయిందని ఆయన చెప్పారు.
ఖనన హక్కుల నిరాకరణ..
సమావేశంలో పాల్గొన్న వారు పదేపదే లేవనెత్తిన ప్రధాన అంశం ఖనన హక్కులపై ఆంక్షలు.
దేశవ్యాప్తంగా తరుచూ జరుగుతున్న ఇలాంటి సంఘటనలను బాధితులు గుర్తు చేశారు.
క్రైస్తవుల ఖననంపై వివాదాలు సృష్టించి, వారి విశ్వాసాన్ని త్యజించాలనే ఒత్తిళ్లను తీసుకువస్తున్నారని వక్తలు తెలియజేశారు.
2025లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రమేష్ బాఘేల్ తన తండ్రి పాస్టర్ సుభాష్ బాఘేల్‌ను బస్తర్‌లోని తన గ్రామంలో ఖననం చేయడానికి ప్రయత్నించగా, ఛింద్వాడ స్థానికులు అడ్డుకున్నారు.
స్థానిక కోర్టులు కూడా బాఘేల్‌కు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయి. చివరికి సుప్రీంకోర్టు వెలువరించిన భిన్నాభిప్రాయాల తీర్పుతో (విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయకుండా) 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్మశానవాటికలో ఖననం అంశం పరిష్కారమైంది – కానీ ఖనన హక్కుల విస్తృత ప్రశ్నకు మాత్రం పరిష్కారం లభించలేదు.
ఛత్తీస్‌గఢ్ రాయిపూర్లో 2025 డిసెంబర్లో ధంతారి నివాసి పునియా బాయి సాహు మరణించిన తర్వాత, ఆమె కుటుంబం మితవాద సంస్థలు, స్థానికులతో “చర్చల ద్వారా రాజీ” కుదుర్చుకోవాల్సి వచ్చింది.
సాహు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు, కానీ ఆమె చనిపోయాక ఆమె కుటుంబం ‘తిరిగి హిందూ మతంలోకి వచ్చేశామని’ రాతపూర్వకంగా ఇవ్వాలని బలవంతం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది.
మరణించిన ఆ మహిళకు క్రైస్తవ పద్ధతిలో ఖననం చేసేందుకు అనుమతించలేదు.
ఒడిశా కోరాపుట్‌లో ఒక 15 సంవత్సరాల క్రైస్తవ బాలుడిని తన సొంత కుటుంబ స్థలంలో ఖననం చేయడాన్ని స్థానికులు నిరాకరించారు.
చివరికి స్థానిక ప్రభుత్వ జోక్యంతో దానికి అనుమతి లభించింది.
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ సయీదా హమీద్ ప్రజా ట్రిబ్యునల్‌లో మాట్లాడుతూ, ఖనన హక్కులను పదేపదే నిరాకరించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది “అగౌరవపరచడం, అమానవీయం” అని వర్ణించిన ఆమె, మరణంలో హుందాతనాన్ని నిరాకరించడం రాజ్యాంగ విలువలు, మానవ విలువలపై జరుగుతున్న దాడిగా పేర్కొన్నారు.

లోతుగా పాతుకుపోయిన సామాజిక బహిష్కరణలు..
కొన్ని తీవ్రమైన హింసాత్మక సంఘటనలను మీడియా కవర్ చేసినప్పటికీ, క్రైస్తవులు రోజువారీగా ఎదుర్కొంటున్న సామాజిక బహిష్కరణలు, వెలివేతలు, ఊరి నుంచి పంపించేయడం, చివరికి ఇళ్లలో కూడా ప్రార్థనలు చేసుకోనివ్వకపోవడం వంటి సంఘటనలు ఎవరి దృష్టికీ రాకుండా పోతున్నాయి.
న్యాయవాది, క్రైస్తవ హక్కుల ప్రతినిధి సిజు థామస్ వంటి వక్తలు ట్రిబ్యునల్‌లో ఇలాంటి అనేక సంఘటనల గురించి, ముఖ్యంగా బహిష్కరణల గురించి ప్రస్తావించారు.
అనేక రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు తరచుగా సంభవిస్తున్నాయని ఆయన చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ పశ్చిమ సింగ్భూమ్లో నాలుగు కుటుంబాలు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత, వారిని గ్రామ చెరువు, బావి, చేతి పంపు, దుకాణాలను వినియోగించకుండా సామాజిక బహిష్కరణ చేశారని, చివరికి పోలీసులు జోక్యం చేసుకుని ఆ బహిష్కరణను ఆపాల్సి వచ్చిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించిందని థామస్ గుర్తుచేశారు.
ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్ నుంచి బెదిరింపులు రావడంతో ఒక క్రైస్తవ కుటుంబం బలవంతంగా గ్రామాన్ని వదిలేసిందని మే 30న మక్తూబ్ మీడియా నివేదించింది.
2017లో గోవింద్ మండావి, ఆయన కుటుంబంతో పాటు మరో 15-20 కుటుంబాలు ఎలాంటి ఒత్తిడి లేకుండానే క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లు ఆ కథనం తెలిపింది.
“అంతకు ముందు పరిస్థితులు బాగానే ఉండేవి, కానీ గత రెండేళ్లుగా ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్ మా జీవితాలను నరకం చేశాయి” అని మండావి ఫోన్ ద్వారా మక్తూబ్కు చెప్పారు.
2022లో బెంగళూరు ఆర్చ్‌బిషప్ డాక్టర్ పీటర్ మచాడో, నేషనల్ సాలిడారిటీ ఫోరం, ఎవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
2021లో క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగిన 505 దాడులను, 2022 మే వరకు జరిగిన మరో 250 దాడులను అందులో ప్రస్తావించారు.
ఈ పిల్ వార్తా నివేదికలు, బాధితుల ధృవీకరణపై ఆధారపడిందని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది.
దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 2023లో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేస్తూ, పిటిషనర్లు చూపించిన లెక్కలను తోసిపుచ్చింది.
అనేక సంఘటనలను మతపరమైనవిగా “తప్పుగా చిత్రీకరించారని” వాదించింది.
పిటిషనర్లు పేర్కొన్న 495 సంఘటనల్లో, ఎనిమిది రాష్ట్రాల్లో 232 సంఘటనలకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు(FIRల నమోదు కోసం) అందాయని, ఇందులో చాలా కేసులు చిన్నపాటి వివాదాలని హోం మంత్రిత్వ శాఖ సూచించింది.
“పరస్పర అంగీకారంతో 73 సంఘటనలు సామరస్యంగా పరిష్కరించబడ్డాయి” అని కూడా తెలిపింది.
“క్రైస్తవులపై వేధింపులు అని ఆరోపిస్తున్న అనేక సంఘటనలు అబద్ధం లేదా తప్పుగా చిత్రీకరించబడినవి” అని ప్రభుత్వ అఫిడవిట్ పేర్కొంది.
పిల్లోని “అనేక” ఉదంతాలు రెండు వర్గాల మధ్య జరిగిన “చిన్నపాటి వివాదాలని”, వాటికి ఉద్దేశపూర్వకంగా మతం రంగు పులిమారని పేర్కొంది.
పిల్లో పేర్కొన్న దాడుల జాబితాలో- చర్చిల కూల్చివేతలు, హత్యలు, బలవంతపు మతమార్పిడులు(ఘర్ వాపసీ), భౌతిక దాడులు, పాస్టర్ల అరెస్టులు, చర్చి ఆస్తుల ధ్వంసం, బైబిల్ దహనం, విద్వేష ప్రచారాలు, సామాజిక బహిష్కరణలు, ప్రార్థనా సేవలను అడ్డుకోవడం, లింగపరమైన హింస ఘటనలు ఉన్నాయని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది.
వ్యవస్థల బలహీన స్పందన..
మతమార్పిడి నిరోధక చట్టాల కింద ఏకపక్షంగా జరుగుతున్న అరెస్టులు, బెదిరింపులు, బలవంతపు వలసలు, ప్రార్థనా స్థలాల మూసివేత, వ్యవస్థీకృత గ్రూపుల బెదిరింపుల వంటి అనేక సంఘటనలను ప్రాణాలతో బయటపడిన బాధితులు పీపుల్స్ ట్రిబ్యునల్‌లో ప్రస్తావించారని నివేదికలు తెలిపాయి.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హక్కుల కార్యకర్త డిగ్రీ చౌహాన్ మాట్లాడుతూ- జరుగుతున్న హింస స్థాయికి, అధికారుల స్పందనకు పొంతన లేదన్నారు.
ఏటా వందలాది సంఘటనలు జరుగుతున్నా ఎఫ్ఐఆర్లు సరిగ్గా నమోదు కావడం లేదని, దర్యాప్తులో జాప్యం, పోలీసుల ఉదాసీనత, బాధితులకు న్యాయం చేయడంలో వ్యవస్థల వైఫల్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
మతమార్పిడి నిరోధక చట్టాల దుర్వినియోగం, న్యాయ పరిష్కారాన్ని కోరుతున్న బాధితులు ఎదుర్కొంటున్న కష్టాలను కూడా వక్తలు లేవనెత్తారని ట్రిబ్యునల్ తన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.
సీనియర్ జర్నలిస్ట్ పమేలా ఫిలిపోస్ ఈ వాంగ్మూలాలను ‘తీవ్ర కలవరపెట్టే పరిస్థితులకు సూచికలు’గా అభివర్ణించారు.
పెరుగుతున్న విద్వేషాన్ని, సామాజిక బహిష్కరణను ఎదుర్కోవడానికి నిరంతర ప్రజా భాగస్వామ్యం, సంఘీభావం, కొత్త రూపాల్లో సమిష్టి కార్యాచరణ అవసరమని ఆమె నొక్కి చెప్పారు.
సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజం డైరెక్టర్ ఇర్ఫాన్ అలీ ఇంజనీర్ మాట్లాడుతూ, విస్తృతమైన అభద్రతాభావం ఉన్నప్పటికీ జూన్ 1న సాక్ష్యం చెప్పడానికి వచ్చిన బాధితుల “అసాధారణ ధైర్యం, ప్రతికూల పరిస్థితుల నుంచి కోలుకునే సామర్థ్యాన్ని” సభ దృష్టికి తెచ్చారు.
‘ఘర్ వాపసీ’, మత మార్పిడి చుట్టూ అల్లుతున్న కథనాలను తరచుగా వివక్షను, బలవంతాన్ని చట్టబద్ధం చేయడానికి వాడుకుంటున్నారని ఆయన హెచ్చరించారు.
భారత రాజ్యాంగ చట్రంలో నిజమైన అంతరాత్మ స్వేచ్ఛ కేంద్రంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు.
కార్వాన్-ఎ-మొహబ్బత్ వ్యవస్థాపకుడు, హక్కుల కార్యకర్త హర్ష్ మందర్ ప్రజా ట్రిబ్యునల్ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ- ఆ రోజు నమోదైన సంఘటనలు కేవలం యాదృచ్ఛికంగా జరిగినవో, లేదా అప్పటికప్పుడు వ్యక్తమైన శత్రుత్వమో కాదన్నారు.
అవి సమాన పౌరసత్వాన్ని ప్రమాదంలో పడేసే, ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ‘సామాజిక బహిష్కరణల ప్రచారాన్ని’ బట్టబయలు చేస్తున్నాయన్నారు.
ఖనన హక్కుల నిరాకరణ, సామాజిక బహిష్కరణ, బలవంతపు వలసలు, ప్రార్థనలపైన దాడులకు సంబంధించిన సాక్ష్యాలను ప్రస్తావిస్తూ, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక స్వేచ్ఛలు క్రమంగా హరించుకుపోతున్నాయని ఆయన హెచ్చరించారు.
వాటిని పరిరక్షించడానికి పౌరులు, సంస్థలు, ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
