ఇటువంటి తీవ్రమైన వేడి వాతావరణంలో, గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్లను నిర్మించడం అంటే విశాఖపట్నాన్ని ఒక కృత్రిమ మైక్రోక్లైమేటిక్ “హీట్ ఐలాండ్”గా మార్చడమే.
వేలాది సర్వర్లు నిరంతరం పనిచేయడం వల్ల వెలువడే ఉష్ణ ఉద్గారాలను డేటా సెంటర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాతావరణంలోకి నెడతాయి.
దీనివల్ల నగర ఉష్ణోగ్రతలు మరింత పెరిగి, ఏసీల వినియోగం పెరిగి సామాన్యుల విద్యుత్ బిల్లులు మరింత భారంగా మారుతాయి.
చట్టపరమైన లొసుగులు..
ఈ పారిశ్రామిక ప్రాజెక్టుల వల్ల చుట్టుపక్కల ప్రజల జీవితాలు అల్లకల్లోలం అవుతున్నా, ప్రభుత్వం ఎందుకు ప్రజా అభిప్రాయ సేకరణ చేయడం లేదనే ప్రశ్న వెనుక ఒక పెద్ద చట్టపరమైన లొసుగు, కుట్ర దాగి ఉన్నాయి.
కేంద్ర పర్యావరణ శాఖ నిఘాను, ప్రజలతో తప్పనిసరిగా నిర్వహించాల్సిన పబ్లిక్ హియరింగ్‌ను తప్పించుకోవడానికి ప్రాజెక్ట్ డెవలపర్లు అత్యంత చాణక్యంగా చట్టపరమైన లొసుగులను వాడుకున్నారు.
తమ నిర్మిత ప్రాంతాన్ని 1.5 లక్షల చదరపు మీటర్ల కంటే తక్కువగా చూపిస్తూ, ప్రాజెక్టును ముక్కలుగా విభజించి పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్ 2006లోని ‘కేటగిరీ బీ2’ పరిధి కిందకు మార్చుకుని రాష్ట్ర స్థాయిలోనే అనుమతులు పొందారు.
పర్యావరణ నిబంధనల ప్రకారం ఏదైనా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి 10 కిలోమీటర్లలోపు ప్రాజెక్ట్ ఉంటే దానిని కేటగిరీ-A కింద మాత్రమే వర్గీకరించి సమగ్ర అధ్యయనం చేయాలి.
కానీ ప్రతిపాదిత తర్లువాడ ప్రాజెక్ట్ కంబాలకొండ అభయారణ్యానికి కేవలం 1.53 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర యంత్రాంగానికి దరఖాస్తు చేసుకున్న కేవలం 9 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేశారు. దీనికి తోడు, తర్లువాడ వద్ద కేటాయించిన భూమిలో దాదాపు 90 శాతం భాగం పెద్ద చుక్కకొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధి కిందకు వస్తుందని పర్యావరణ అనుమతుల ఫైల్‌లోనే ఉన్నప్పటికీ, కేవలం ఒక పాత సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్ సాకు చూపిస్తూ అక్కడ అడవి లేదని రికార్డులను సృష్టించి అటవీ చట్టాలను తుంగలో తొక్కారు.
ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటి గ్రామసభలను, పర్యావరణ అనుమతుల నిబంధనలను కాలరాస్తూ చేస్తున్న ఈ నిర్ణయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి.
డీమ్డ్ డిస్కామ్ పాలసీ – ప్రభుత్వ విద్యుత్ రంగ పతనం, క్రాస్-సబ్సిడీ ఎగవేత..
ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ ప్రకారం 300 MW కన్నా ఎక్కువ విద్యుత్ వాడే భారీ డేటా సెంటర్లకు ప్రత్యేక ‘డీమ్డ్ డిస్కామ్’ లైసెన్స్ కల్పించారు.
దీని ద్వారా వారు ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కామ్‌లతో సంబంధం లేకుండా, నేరుగా ప్రైవేట్ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తూ ప్రభుత్వ గ్రిడ్‌ను మాత్రం ఉచితంగా వాడుకుంటున్నారు.
ఇతర వ్యాపారాల వలె ఈ ప్రైవేట్ సంస్థలు చెల్లించాల్సిన రూ 2 నుంచి రూ 4ల క్రాస్-సబ్సిడీ ప్రీమియంను ప్రభుత్వం పూర్తిగా మినహాయించింది.
ప్రభుత్వ డిస్కామ్‌లకు ఈ మినహాయింపు వల్ల వేలాది కోట్ల రూపాయల ఆదాయ నష్టం వాటిల్లుతుంది.
ఈ లోటును పూడ్చడానికి భవిష్యత్తులో గృహ వినియోగదారులు, వ్యవసాయ వినియోగదారుల కరెంటు ఛార్జీలను ప్రభుత్వం పెంచడం ఖాయం.
ప్రజా ఆరోగ్య సమస్యలు, గాలి కాలుష్యం..
ఈ డేటా సెంటర్ల విస్తరణ వల్ల తీరప్రాంతంలో తీవ్రమైన ప్రజా ఆరోగ్య సమస్యలు తలెత్తనున్నాయి. డేటా సెంటర్లు నిరంతరం పనిచేయడానికి 100% విద్యుత్ సరఫరా అవసరం.
ఒకవేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, బ్యాకప్ కోసం ఈ క్యాంపస్‌లలో దాదాపు 350కి పైగా భారీ పారిశ్రామిక డీజిల్ జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ జనరేటర్లు రన్ అయినప్పుడు వెలువడే పొగ వల్ల సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, అతి సూక్ష్మ ధూళి కణాలు(PM2.5) వాతావరణంలోకి విపరీతంగా విడుదలవుతాయి.
దీనివల్ల తర్లువాడ, ఆనందపురం, రాంబిల్లి పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, బ్రాంకైటిస్, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది.
ఇవి నిరంతరం చేసే కర్ణకఠోరమైన శబ్ద కాలుష్యం వల్ల స్థానిక ప్రజలలో మానసిక ఒత్తిడి, నిద్రలేమి, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి.
అమెరికాలోని జార్జియా రాష్ట్రం మోర్గాన్ కౌంటీలో మెటా డేటా సెంటర్ కారణంగా సమీప ప్రజల బావుల నీరు పూర్తిగా బురదగా, గోధుమ రంగులోకి మారిపోయి ప్రజలు చర్మ వ్యాధుల బారిన పడ్డారు.
ఈ కాలుష్యంపై అమెరికా ప్రతినిధుల సభ విచారణలో ప్రతినిధి అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ ఆ కలుషిత నీటి సీసాలను ప్రదర్శించి నిలదీయగా, యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ విచారణ జరిపింది.
పటిష్టమైన చట్టాలు లేని మన రాష్ట్రంలో ఇటువంటి జలకాలుష్యం జరిగితే పేద ప్రజల ఆరోగ్యం మరింత ఘోరంగా క్షీణిస్తుంది.
గిరిజన ప్రాంతాల జలవనరుల లూటీ, పెసా చట్టాల ఉల్లంఘన..
ఈ భారీ ఇంధన అవసరాల కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా లాంటి ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న పంప్డ్ స్టోరేజ్ హైడ్రో-ఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్ సైట్లను ప్రభుత్వం అదానీ గ్రూప్‌నకు నాన్-ట్రాన్స్పరెంట్ విధానాల ద్వారా కట్టబెట్టింది. ఈ పంప్డ్ హైడ్రో ప్లాంట్ల కోసం గిరిజన వాగులు, కొండల నీటి వనరులను మళ్లించడం ద్వారా స్థానిక గిరిజన ఆవాసాలు నీరు లేక ఎండిపోతున్నాయి. ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులు కట్టబెట్టేటప్పుడు షెడ్యూల్డ్ తెగల హక్కులను కాపాడే పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం ప్రకారం స్థానిక గిరిజన గ్రామసభల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ఆ చట్టాలన్నింటినీ ప్రభుత్వం తొక్కివేసింది.
అంతేకాకుండా, గిరిజన ప్రాంతాల్లో ప్రైవేటు శక్తులకు భూములను, సహజ వనరులను బదిలీ చేయకూడదన్న సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక సమత తీర్పును ఈ అదానీ అలయెన్స్ యథేచ్ఛగా ధిక్కరిస్తోంది.
తర్లువాడ దళిత భూముల బలవంతపు లాగోలు, అణచివేత..
సాంకేతికత పేరుతో అట్టడుగు దళిత వర్గాల పొట్టకొట్టడం మన ప్రభుత్వాల డబుల్ గేమ్‌లో మరొక దుర్మార్గమైన అంశం.
తర్లువాడ గ్రామంలో రైడెన్ ఇన్ఫోటెక్(గూగుల్)కు కేటాయించిన భూములలో దాదాపు 200 ఎకరాల భూమి దళితులదే.
1970వ దశకంలో భూమిలేని పేద దళితులకు పంపిణీ చేసిన ఈ అసైన్డ్ భూములను నేడు ప్రభుత్వం కార్పొరేట్ల కోసం బలవంతంగా లాక్కుంటోంది.
స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటన ప్రకారం బంజరు భూముల అభివృద్ధి పథకం కింద సాగుచేసుకుంటున్న 520 రైతు కుటుంబాలను ప్రభుత్వం నిర్వాసితులను చేస్తోంది.
కేవలం దళితుల భూములను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆక్రమిస్తున్నారని, ఆధిపత్య కులాల భూములను ఏమాత్రం తాకడం లేదని గ్రామ మాజీ సర్పంచ్ పైలా కొండమ్మ వాపోతున్నారు.
ఈ భూదోపిడీపై జర్నలిస్టులు చేసిన సంచలన పరిశోధనాత్మక వీడియోను 2026 మే 19న ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచురించగా 2.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
కానీ పాలకుల పాపం బయటపడుతుందనే భయంతో, కేవలం నాలుగు రోజుల్లోనే (మే 22న) సమాచార సాంకేతిక చట్టం సెక్షన్ 79(3)(b)ను ఉపయోగించి, కేంద్ర హోంశాఖ సహయోగ్ పోర్టల్ ద్వారా ఆ వీడియోను భారతదేశంలో పూర్తిగా బ్లాక్ చేయించి ప్రజాస్వామ్య గొంతుకను నలిపేసింది.
ఇటువంటి కార్పొరేట్-ప్రభుత్వ కుమ్మక్కు అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టుగా మారింది.
ఉపాధి మాయాజాలం, అంతర్జాతీయ పాఠాలు..
లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నది కేవలం ఒక పెద్ద మైండ్ గేమ్.
దాదాపు 18,000 మందికి శాశ్వత, సంప్రదాయ, రిజర్వేషన్లతో కూడిన ఉద్యోగాలను కల్పిస్తున్న ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కావాలనే నిర్వీర్యం చేస్తున్నాయి.
మరోవైపు, ఒక్క శాతం కూడా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వని, రిజర్వేషన్లు వర్తించని ఈ డేటా సెంటర్ల ప్రైవేట్ గుత్తేదారులకు అపారమైన రాయితీలు ఇస్తూ నెత్తిన పెట్టుకోవడం రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహం.
నిజానికి డేటా సెంటర్లు అత్యంత ఆటోమేటెడ్ వ్యవస్థలు.
భారతదేశంలో డేటా సెంటర్ రంగంలో కేవలం ఒకే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగాన్ని సృష్టించడానికి సగటున ₹6.4 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.
మరోవైపు, అభివృద్ధి చెందిన అమెరికా, యూరోపియన్ దేశాలు మాత్రం డేటా సెంటర్ల వల్ల కలిగే నష్టాలను గుర్తించి చట్టపరంగా మూసివేస్తున్నాయి లేదా నిషేధిస్తున్నాయి.
2026 మార్చిలో నిర్వహించిన గాలప్ పోల్ సర్వేలో 71 శాతం మంది అమెరికా పౌరులు తమ నగరాల్లో ఏఐ డేటా సెంటర్ల నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
పర్యావరణ విధ్వంసం, గ్రిడ్ లోడ్స్, నీటి కాలుష్యమే ఇందుకు ప్రధాన కారణాలని వారు తేల్చి చెప్పారు.
న్యూజెర్సీ రాష్ట్ర గవర్నర్ మిక్కీ షెరిల్ డేటా సెంటర్ల విస్తరణను అరికట్టడానికి సమగ్రమైన కఠిన నియంత్రణ ప్రణాళికను ప్రవేశపెట్టారు.
టెక్ కంపెనీల వల్ల పెరిగే విద్యుత్ గ్రిడ్ల అప్‌గ్రేడ్ ఖర్చుల భారాన్ని సామాన్య వినియోగదారుల పై నెట్టడాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా నిరసించారు.
దీని ఫలితంగా న్యూజెర్సీ నగరాలైన చెర్రీహిల్, మన్రో టౌన్షిప్, మరియు మిల్లీవిల్లే లలో డేటా సెంటర్ల పూర్తి నిషేధం విధించారు.
ముఖ్యంగా మిల్లీవిల్లేలో ఏకంగా 1.4 గిగావాట్ విద్యుత్ తాగే భారీ ఏఐ ప్రాజెక్టును రద్దు చేశారు.
ఆఫ్-షోర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ సెక్టార్ తులనాత్మక విశిష్టత..
విశాఖపట్నం సహజ వనరుల సంపదను పణంగా పెడుతున్న ఈ మెగా డేటా సెంటర్ ప్రాజెక్టుల వల్ల సామాన్య ప్రజలకు దక్కే ప్రయోజనాలు శూన్యమని నిరూపించడానికి ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్ ప్లాంట్‌తో ఉన్న సామాజిక-ఆర్థిక వ్యత్యాసాల ఈ విశ్లేషణే ఉదాహరణ.
సుమారు 18,000 ఎకరాల భూమిలో విస్తరించిన విశాఖ స్టీల్ ప్లాంట్ 18,000 మందికి పైగా శాశ్వత, సంప్రదాయ- రిజర్వేషన్లతో కూడిన ఉపాధిని అందిస్తోంది.
దానికి భిన్నంగా గూగుల్-అదానీ, రిలయన్స్ వంటి సంస్థలకు కేటాయించిన 601.40 ఎకరాల భూమిలో కేవలం 150 నుండి 300 మందికి మాత్రమే శాశ్వత ఐటీ ఉద్యోగాలు లభిస్తాయి, పైగా ప్రైవేట్ రంగం కావడం వల్ల వీటికి ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు.
ఇనుము తయారీ వంటి భారీ పబ్లిక్ అవసరాలకు గ్రిడ్ విద్యుత్ సరిపోతుండగా, కేవలం సర్వర్ల ఆకలి కోసం రోజువారీ 68.5 మిలియన్ లీటర్ల నీటిని, 1 గిగావాట్ కరెంట్‌ను ఈ సెంటర్లు మింగేస్తాయి.
స్టీల్ ప్లాంట్‌ను విక్రయించడానికి సిద్ధపడుతూ, ఈ భారీ డేటా సెంటర్లకు రాయితీలు ఇవ్వడం పాలకుల ద్వంద్వ నీతికి స్పష్టమైన ఆధారము.
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే ఏకైక పరిష్కారం..
విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో రాబోతున్న ఈ డేటా సెంటర్ల హబ్‌లు ఆంధ్రప్రదేశ్ పాలిట వనరులను కొల్లగొట్టే నయా వలసవాదానికి ప్రతీకలు.
అమూల్యమైన దళిత కుటుంబాల జీవనాధారాలను లాక్కొని, జలవనరులను ఆవిరి చేస్తూ, పెరిగే ఉష్ణోగ్రతలతో పర్యావరణాన్ని సమాధి చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఈ వినాశకరమైన పద్ధతులను పూర్తిగా తోసిపుచ్చాల్సిందే. ఈ కార్పొరేట్ అనుకూల రాజకీయ పార్టీల ద్వంద్వ నీతిని జనం గ్రహించారు.
ఈ కార్పొరేట్ దాహాన్ని తీర్చడానికి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డేటా సెంటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి, అక్రమ అనుమతులను తక్షణమే రద్దు చేయాలి.
ఈ ప్రజాద్రోహానికి వ్యతిరేకంగా, విశాఖను- ఆంధ్రదేశాన్ని రక్షించుకోవడానికి ప్రజలందరూ, విద్యార్థులు, రైతులు ఏకమై మన భూములను, మన అమూల్యమైన నీటిని, మన భవిష్యత్తును కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లకుండా రక్షించుకుందాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
