సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఈ సంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి బోర్డు పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లో తొమ్మిదో తరగతి నుంచి తప్పనిసరిగా మూడు భాషలు విద్యార్థులకు బోధించాలని ఒక సర్కులర్ జారీ చేసింది. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తోంది.
ఈ వ్యాజ్యంలో తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి, విద్యావేత్త, మాజీ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ ఫౌజియా ఖాన్ తన వాదనలు వినిపించడానికి అప్లికేషన్ పెట్టుకున్నారు.
భారతీయ భాషల పేరుతో విద్యార్థులపై భారం..
సీబీఎస్ఈ విడుదల చేసిన ఈ సర్కులర్ అహేతుకమైనదని ఆమె వాదిస్తున్నారు. “పైపైన చూస్తే ఈ సర్కులర్ భారతీయ భాషల సంరక్షణ కోసం ఉద్దేశించినట్లుగా కనిపిస్తుంది కానీ, ఆచరణలో అర్థవంతమైన విద్యాభ్యాసానికి దోహదం చేసేదిగా లేదు”అని ఆమె అన్నారు.
దీనివల్ల విద్యార్థులందరూ అనివార్యంగా మూడు భాషలు చదవాల్సిన పరిస్థితిని ఈ సర్కులర్ ద్వారా సీబీఎస్ఈ తెచ్చిపెడుతోందని, మరోవైపు భాషా పరిశోధనలు వెనుకబాటు పడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
యాషికా బండారి జైన్ తదితరులు కలిసి కేంద్ర ప్రభుత్వంపై వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)లో సుప్రీంకోర్టు సీబీఎస్ఈ బోర్డుకు, ఎన్సీఈఆర్టీ సంస్థకు నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులోనే ఫౌజియా ఖాన్ తన వాదనలు వినిపించడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
త్రిభాషా సూత్రం: సీబీఎస్ఈ తాజా నిబంధనలు ఏమిటి?
సీబీఎస్ఈ జారీ చేసిన సర్కులర్ ప్రకారం, 9వ తరగతి నుంచి విద్యార్థులందరూ మూడు భాషలను తప్పనిసరిగా చదవాలి.
అందులో కనీసం రెండు భాషలు భారతీయ భాషలై ఉండాలని షరతు విధించింది.
ఈ సర్కులర్ను 2026 జూలై 1వ తేదీ నుంచి సీబీఎస్ఈ సిలబస్ బోధించే అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయనున్నారు.
విదేశీ భాష చదవదలుచుకున్న విద్యార్థులు మొదటి రెండు భారతీయ భాషలను ఎంచుకున్న తర్వాత మూడవ సబ్జెక్టుగా విదేశీ భాషను ఎంచుకోవచ్చని లేదా నాలుగవ సబ్జెక్టుగా ఎంచుకోవచ్చని సీబీఎస్ఈ సర్కులర్ వెల్లడిస్తోంది.
ఇప్పటివరకు 9, 10వ తరగతి విద్యార్థులు కేవలం రెండు భాషలను చదువుకుంటే సరిపోయేది.
కావాలనుకున్నవాళ్లు మూడవ భాషను కూడా సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. కానీ, అదేమీ తప్పనిసరి ఏమీ కాదు.
సీబీఎస్ఈ ద్వంద్వ వైఖరిపై విమర్శలు..
9, 10వ తరగతుల్లో 2026-27 విద్యా సంవత్సరంలో అమలు జరపబోయే త్రిభాషా సూత్రానికి సంబంధించిన ప్రశ్నలపై వివరణ ఇస్తూ- సీబీఎస్ఈ ఏప్రిల్ 9వ తేదీన జారీ చేసిన ఒక నోటిఫికేషన్లో 2029-30 సంవత్సరం వరకు ఈ త్రిభాషా సూత్రాన్ని వాయిదా వేయాలని ప్రతిపాదించింది.
దీనికి భిన్నంగా మే 15న మరొక సర్కులర్ను సీబీఎస్ఈ జారీ చేసింది. దీనిపైనే యాషికా జైన్, మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ప్రజా ప్రయోజన వ్యాజ్యంలోని ప్రధాన పిటిషనర్లు తీసుకున్న వైఖరినే ఫౌజియా ఖాన్ కూడా తీసుకున్నారు.
ఏప్రిల్ 9వ తేదీన సీబీఎస్ఈ ఇచ్చిన సర్కులర్కు భిన్నంగా, మే 15వ తేదీ సర్కులర్ త్రిభాషా సూత్రాన్ని అనివార్యం చేస్తుందని వారన్నారు.
తాను దాఖలు చేసిన అప్లికేషన్లో- సీబీఎస్ఈ కేవలం 36 రోజులలో ఎటువంటి వివరణ లేకుండా తన ఆదేశాలను తానే తిరస్కరించడం, తాజా ఆదేశాల వెనుక ఉన్న విద్యా విషయక అంశాల గురించి, లాభనష్టాల గురించి విద్యార్థులకు వివరించకపోవటాన్ని ఆమె ప్రశ్నించారు.
ఉపాధ్యాయుల కొరత – ప్రత్యామ్నాయం ఏది?
మూడవ భాషను తప్పనిసరి చేస్తూ నిర్ణయించడం అనేక పర్యవసానాలకు దారితీస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఉదాహరణకు, దక్షిణాది రాష్ట్రాలలో సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో మూడవ భాషను బోధించడానికి సరిపోయినంత అనుభవం కలిగిన సిబ్బంది లేరు.
“బోధనా సిబ్బంది కొరతను గుర్తిస్తూనే త్రిభాషా సూత్రాన్ని అమలు చేయటానికి సీబీఎస్ఈ సిద్ధమవుతోంది. ఇటువంటి తప్పనిసరి నిర్ణయం ద్వారా దక్షిణాది రాష్ట్రాలలో హిందీ బోధన అనివార్యం అవుతుంది. ఉత్తరాది రాష్ట్రాలలో సంస్కృతం మూడో భాషగా వచ్చి కూర్చుంటుంది” అని ఆమె అభిప్రాయపడ్డారు.
హిందీయేతర రాష్ట్రాలలో మూడో భాషగా హిందీని గానీ, సంస్కృతాన్ని గానీ బోధించాలని తప్పనిసరి చేయటం 2020 జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమని ఆమె గుర్తు చేశారు.
మే 15న సీబీఎస్ఈ జారీ చేసిన సర్కులర్లో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయటానికి కావలసిన బోధనా అంశాలు, టెక్స్ట్ పుస్తకాలు సిద్ధం అయ్యేంతవరకు ఆరవ తరగతిలో విద్యార్థులు నేర్చుకున్న మూడవ భాషకు సంబంధించిన టెక్స్ట్ పుస్తకాలను కొనసాగించాలని స్పష్టం చేసింది.
అంటే సీబీఎస్ఈ సిలబస్ బోధించే అన్ని పాఠశాలల్లో మూడు భాషలను బోధించడానికి కావలసిన బోధనా సామాగ్రి, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత ఉన్న విషయాన్ని సీబీఎస్ఈ గుర్తించినప్పటికీ తన నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేయడానికి పూనుకోవటం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది.
ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే భాషను బోధించడం, భాషను నేర్చుకోవటం అత్యుత్తమ విద్యా విధానం అన్న మౌలిక సూత్రాన్ని కూడా సీబీఎస్ఈ విస్మరించి- 9, 10 తరగతుల్లో త్రిభాషా సూత్రంలో భాగంగా మూడవ భాషకు సంబంధించి కేవలం ప్రాథమిక స్థాయి విద్యను మాత్రమే గరపటానికి సిద్ధం కావడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఆమె అన్నారు.
సమాఖ్య స్ఫూర్తికి విఘాతం.. రాజ్యాంగ ఉల్లంఘన..
ప్రాథమిక విద్యాభ్యాసం దశలోనే త్రిభాషా సూత్రాన్ని అమలు చేయలేని ప్రభుత్వం ఉన్నత విద్య దశలో ఆ సూత్రాన్ని అమలు చేయడానికి పూనుకోవటం సరైనది కాదు.
ఈ త్రిభాషా సూత్రం ద్వారా మాధ్యమిక దశలో ఉన్న విద్యార్థులు ఒకవైపు తమ బోర్డు పరీక్షలకు సన్నద్ధులు అవుతూనే, మరొకవైపు మూడో భాషకు సంబంధించిన అక్షరమాల నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇటువంటి విధానం విద్యార్థులపై అనవసరమైన భారాన్ని మోపుతుంది.
ఈ త్రిభాషా సూత్రం ద్వారా సాధించదల్చుకున్న విద్యా విషయక లక్ష్యాలు కూడా ఏమీ లేవు అని ఫౌజియా తన దరఖాస్తులో వివరించారు.
విద్య రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలోని అంశమని, అంతమాత్రాన కేంద్ర ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు విధివిధానాలు రూపొందించడం సాధ్యం కాదని ఆమె గుర్తు చేశారు.
రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విద్యారంగంలో దీర్ఘకాలం ప్రభావం చూపే సంస్కరణలను చేపట్టరాదని స్పష్టం చేశారు.
ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు నిర్ధారించిన సమాఖ్య ప్రమాణాలను ఈ తాజా సీబీఎస్ఈ నిర్ణయం ఉల్లంఘిస్తోందని కూడా ఆమె గుర్తు చేశారు.
సీబీఎస్ఈ విడుదల చేసిన తాజా సర్కులర్ భారతదేశపు విలక్షణ గుర్తింపు అయిన ‘భిన్నత్వంలో ఏకత్వం’ సూత్రాన్ని దారుణంగా ఉల్లంఘిస్తోంది.
దేశమంతా ఒకే భాష ఉండాలని రాజ్యాంగం ఆశించలేదు.
ప్రాంతీయ భాషలు, అల్పసంఖ్యాకులకు సంబంధించిన భాషలతో భారతదేశం బహుభాషా గుచ్ఛంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు.
ఈ భాషా భిన్నత్వాన్ని సంరక్షించాలని కూడా రాజ్యాంగం ఆకాంక్షిస్తోంది.
తమిళనాడు, కర్ణాటకలోని విద్యార్థులు అనివార్యంగా హిందీ చదవడం, హిందీ భాషా విద్యార్థులు సంస్కృతం చదవాల్సి రావడం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ విద్యార్థులకు తమకు నచ్చిన భాషను నేర్చుకోవడానికి ఉన్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నిరాకరిస్తోంది.
ఈ త్రిభాషా సూత్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ఆశించిన జాతీయ సమైక్యత, సమగ్రతలను సాధించలేదని ఆమె తన దరఖాస్తులో వివరించారు.
మైనారిటీ సంస్థలపై ప్రతికూల ప్రభావం..
సీబీఎస్ఈ సర్కులర్ ధార్మికపరమైన, భాషా పరమైన అల్పసంఖ్యాకులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని డాక్టర్ ఫౌజియా ఖాన్ హెచ్చరించారు.
భారతదేశంలోని మైనారిటీ విద్యాసంస్థలు ఇప్పటివరకు ఉర్దూను మొదటి భాషగాను, ఇంగ్లీషును రెండో భాషగాను, మరో విదేశీ భాషను మూడో భాషగాను బోధిస్తూ వచ్చాయి.
ప్రస్తుతం ఇంగ్లీషును విదేశీ భాషగా సీబీఎస్ఈ పరిగణిస్తోంది. దాంతో విద్యార్థులు మరో విదేశీ భాషను నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు.
మే 15న సీబీఎస్ఈ జారీ చేసిన సర్కులర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(ఏ)ను ఉల్లంఘించేదిగా ఉందని, 2009లో ఆమోదించిన నిర్బంధ ఉచిత విద్య చట్టాన్ని కూడా ఉల్లంఘించేదిగా ఉందని, అందువలన ఈ సర్కులర్ను రద్దు చేయాలని ఫౌజియా ఖాన్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
దేవేశ్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఆమె ఉటంకించారు.
(లైవ్ లా.ఇన్ ఆధారంగా)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
