ఇటీవల వస్తున్న వార్తా కథనాల ప్రకారం, అదానీపై క్రిమినల్ కేసులను ఉపసంహరించుకునే దిశగా అమెరికా న్యాయశాఖ కదిలింది. దీంతో పాటు పెట్టుబడుల అంశం, రాజకీయ మార్పులు, న్యాయ ప్రక్రియపై ప్రశ్నలు మళ్లీ చర్చకు వచ్చాయి. న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్, ఇతర అంతర్జాతీయ మీడియా కూడా దీనిపై రిపోర్ట్ చేశాయి.
భారతదేశ అధికారులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణపై అమెరికాలో కేసు ఎలా నమోదయిందనేది ముఖ్యమైన అంశం. అదానీకి చెందిన వేలకోట్ల రూపాయల విద్యుత్ ప్రాజెక్టులలో అమెరికా దేశానికి చెందిన పెట్టుబడిదారులు కూడా పెట్టుబడి పెట్టారు.
వారికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఇంకా ఇతర రాష్ట్రాలలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో లాభాలు రావడానికి లంచాలు ఇచ్చారని అమెరికన్ పెట్టుబడిదారులు అన్నారు.
అంతేకాదు, ప్రాజెక్టుకు సంబంధించిన ఏ దశలో కూడా ఏమి జరుగుతున్నది పెట్టుబడి పెట్టిన అమెరికన్ దేశస్థులకు అదానీ వాస్తవాలు చెప్పలేదని వారి వాదన. దీంతో పెట్టుబడి పెట్టిన తమకు అక్రమాలు జరిగినట్టుగా అనుమానం వస్తే, అమెరికా చట్టాల ప్రకారం అమెరికాలో కేసు నమోదు చేయొచ్చు. ఆ విధంగా ప్రాజెక్టు కుంభకోణం అమెరికాలో బయటపడింది.
2024లో అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అదానీపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారత అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు.
అమెరికన్ పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించే సమాచారమిచ్చారని ఆరోపణలు; వీటితో అదానీపై అమెరికాలో వైర్ ఫ్రాడ్, సెక్యూరిటీస్ ఫ్రాడ్ వంటి కేసులు నమోదు చేశారు.
అదానీపై సమన్లు కూడా జారీ అయ్యాయి. అయితే భారత ప్రభుత్వం అమెరికా ఇచ్చిన సమన్లను అదానీకి డెలివరీ చేయలేదు. ఇప్పుడు కేసు మరొక మలుపు తిరిగింది.
అమెరికా అకస్మాత్తుగా ఎందుకు వెనక్కి తగ్గింది?
వార్తా కథనాల ప్రకారం అదానీ అమెరికాలో సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి దాదాపు 15,000 ఉద్యోగాలు కల్పిస్తానని అదానీ డొనాల్డ్ ట్రంప్‌కు హామీ ఇచ్చినట్లు పత్రికా కథనాలు తెలియజేస్తున్నాయి.
కేసులు కొనసాగితే ఈ పెట్టుబడులు నిలిచిపోతాయని అమెరికా అధికారులకు అదానీ న్యాయవాదులు చెప్పారు.
కానీ ఇదే సమయంలో కొందరు ప్రాసిక్యూటర్లు “పెట్టుబడులు కేసు నిర్ణయాన్ని ప్రభావితం చేయకూడదు” అని చెప్పినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఈ కేసు మరో రాజకీయ కోణాన్ని కూడా తెలియజేస్తున్నది. నివేదికల ప్రకారం, కొత్త పరిపాలనలో గత పరిపాలనలో మొదలైన కొన్ని హై-ప్రొఫైల్ కేసులను పునఃసమీక్షించే ధోరణి కనిపించింది.
విశ్లేషకులు దీనిని “ఎన్ఫోర్స్మెంట్ ప్రాధాన్యతల మార్పు”గా చూస్తున్నారు. దీనివల్ల ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. న్యాయ వ్యవస్థ పూర్తిగా స్వతంత్రమా? లేక రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యతలు ప్రభావితం చేస్తాయా?
బహుళజాతి సంస్థలకు మరో న్యాయమా?
ఈ కేసు మరొక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. “సాధారణ కంపెనీపై వచ్చిన ఆరోపణలకు, ప్రపంచ స్థాయి బహుళజాతి వ్యాపార సామ్రాజ్యంపై వచ్చిన ఆరోపణలకు ఒకే విధమైన న్యాయ ప్రక్రియ జరుగుతుందా?”
అదానీ తరఫున పనిచేసిన లీగల్ టీమ్ చాలా శక్తివంతమైనదిగా వార్తలు చెబుతున్నాయి.
దాదాపు 100 పేజీల ప్రెజెంటేషన్ ద్వారా అమెరికా అధికారులకు “ఈ కేసుకు సరైన ఆధారాలు లేవు, అమెరికాకు జూరిస్డిక్షన్ లేదు” అని వాదించారని నివేదికలు చెబుతున్నాయి.
ట్రంప్ వ్యక్తిగత కేసులను వాదించే లాయరే అదానీ కేసును కూడా చేపట్టారని వార్తలు.
ఏమైనా ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామిక దిగ్గజం అదానీ మధ్య ఉన్న సంబంధమే అమెరికాలో కేసును ఉపసంహరింప చేసేందుకు మార్గం సుగమమైందని వార్తా కథనాలు తెలియజేస్తున్నాయి.
అందుకు ఎరగా అమెరికాలో పెట్టుబడులు పెట్టేలా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంతోనే అదానీ అంగీకరించారని ఆ వార్తా కథనాల సారాంశం.
ఆవిధంగా అమెరికా కేసు ఉపసంహరణకు పావులు కదుపుతున్నట్లు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
ప్రపంచ క్యాపిటలిజం పెద్ద కార్పొరేట్ సమూహాలకు ప్రత్యేక రక్షణ ఇస్తుంది.
అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలు తరచూ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలతో పని చేస్తాయి. పెట్టుబడులు, ఉద్యోగాలు, జియోపాలిటిక్స్ న్యాయ నిర్ణయాలపై పరోక్ష ప్రభావం చూపగలవు అని కొందరు విమర్శకుల అభిప్రాయం.
అంతర్జాతీయ పెట్టుబడులు – అమెరికా ఆరోపణల గొలుసు..
అమెరికా కేసు పత్రాలలో రాష్ట్రాల పేర్లు, వ్యక్తుల గుర్తింపులు అన్నీ ఎల్లప్పుడూ పూర్తి వివరాలతో ప్రజలకు వెల్లడించబడలేదు. “ఆంధ్రప్రదేశ్‌లో ఫలానా అధికారికి లంచం ఇచ్చారు” అని నిర్ధారితంగా చెప్పడం సరైంది కాదు.
అమెరికన్ పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడులు సేకరించారు. బాండ్లు, ఫైనాన్సింగ్ పొందారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఉపయోగించారు. “లంచాల అంశాలను పెట్టుబడిదారులకు పూర్తిగా వెల్లడించలేదు”.
“ఇది కేవలం భారతీయ అవినీతి కేసు కాదు” అని అమెరికా వాదిస్తోంది.
అమెరికా ప్రాసిక్యూటర్లు చెబుతున్న “అలెజ్డ్ మెకానిజం (ఆరోపిత విధానం)” వారి ఆరోపణల ప్రకారం: టెండర్ → ప్రాజెక్టు → రాష్ట్ర ఒప్పందం → లాభాలు. ఈ గొలుసులో రాష్ట్ర ఒప్పందాలు కచ్చితంగా రావాలంటే లంచాలు ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు.
ఇది వేల కోట్ల ప్రాజెక్టుల విషయం. భారత పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించినది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఉన్నారు. అమెరికా జోక్యం ఉంది.
ఈ కేసును గురించి ఒక వాక్యంలో చెప్పాలంటే, “అమెరికా ఆరోపణ ప్రకారం — భారత సౌర విద్యుత్ ఒప్పందాలను సాధించేందుకు లంచాలు ఇచ్చారు.”
“Too Big To Fail” మాత్రమే కాదు, “Too Big To Prosecute” అని కూడా అనుకుంటున్నారు.
అమెరికాలో “అదానీపై కేసులు పూర్తిగా అబద్ధమని నిరూపించబడలేదు.” “పెట్టుబడుల కారణంగానే కేసులు మూసివేశారు అని కూడా నిరూపించబడలేదు.”
“కానీ పెట్టుబడులు, రాజకీయ మార్పులు, వ్యూహాత్మక ప్రయోజనాలు, న్యాయ ప్రక్రియ, ఇవన్నీ కలిసిన సంక్లిష్ట రాజకీయ-ఆర్థిక సంఘటనగా కనిపిస్తోంది.”
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
