“మనం ప్రమాణాలను మెరుగుపరిచి పరీక్షా వ్యవస్థను మరింత కఠినతరం చేయకపోతే మనం వెనకబడిపోతాం” అని 1961లోనే నెహ్రూ హెచ్చరించారు. ఆ హెచ్చరిక నేటికీ వర్తిస్తుంది.
భారత ప్రగతికి ఉన్నత ప్రమాణాలతో కూడిన పరీక్షలు నిర్వహించాల్సిన అవసరాన్ని 1961 జూలై 11న మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ నొక్కిచెప్పారు.
“మనం ప్రమాణాలను మెరుగుపరిచి పరీక్షా వ్యవస్థను మరింత కఠినతరం చేయకపోతే, మనం వెనుకబడిపోతాం- సామర్థ్యం, జ్ఞానమే ఇక్కడ ముఖ్యం”అని ఆయన స్పష్టంగా చెప్పారు.
పేపర్ లీకులు: ఒక సంస్థాగత వైఫల్యం..
గత 12 ఏళ్లుగా ఏ అవకాశాన్నీ వదలకుండా నెహ్రూ పాలనను నిందించే మోదీ సర్కార్, ఈ ఏడాది రద్దయిన నీట్-యూజీ పరీక్షతో సహా ఇటీవల జరిగిన వివిధ పేపర్ లీక్‌ల వ్యవహారంలో తన పేరును లాగకుండా చాలా ఆశ్చర్యకరంగా తప్పించుకుంది.
పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
వారిలో కొందరు ఆత్మహత్య చేసుకోగా, లక్షలాది కుటుంబాలు అయోమయం, నిస్సహాయతలో చిక్కుకుపోయాయి.
కేవలం 2024లోనే నీట్-యూజీ పేపర్ లీక్ అయినప్పటికీ, ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలోని విద్యా మంత్రిత్వ శాఖలో ఉన్నత స్థాయిలో ఎవరూ బాధ్యత వహించలేదు.
2024, 2025, 2026 పరీక్షలతో సంబంధం ఉన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంతర్గత వర్గాలు, నిపుణులతో సహా సుమారు డజను మందిని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఇంటర్వ్యూ చేసింది.
అనంతరం- “ఒక సంస్థాగత వైఫల్యమే ఈ లీక్‌లకు దారితీసే పరిస్థితులను సృష్టించిందనే విశాలమైన అంతర్గత ఏకాభిప్రాయం” ఉన్నట్లు బట్టబయలు చేసింది.
‘వికసిత్ భారత్’ గురించి తరచుగా మాట్లాడుతూ, పాఠశాల పరీక్షలు మొదలుకాక ముందే విపరీతంగా ప్రచారం చేసుకునే తన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం ద్వారా యువ విద్యార్థులతో మాట్లాడే ప్రధాని మోదీ- పేపర్ లీకుల గురించి నిశ్శబ్దం పాటించడం దిగ్భ్రాంతికి గురిచేసింది.
భారీ ధరలకు లీకైన పేపర్ల అమ్మకాల వెనుక ఒక “పేపర్ లీక్ ఆర్థిక వ్యవస్థ” ఆవిర్భవించిందని చెప్పవచ్చు.
బాధ్యతాయుతమైన చర్యలపై కోర్టు స్పందన..
పేపర్ లీక్- విద్యార్థులను, వారి కుటుంబాలను “మానసిక క్షోభకు” గురిచేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం సంక్షోభాన్ని గుర్తించడంతో సరిపెట్టుకోకుండా, వాస్తవికంగా వ్యక్తిగత, సంస్థాగత జవాబుదారీతనం ఉండాలని నొక్కిచెప్పింది.
ఈ సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు.
అయితే, మోడీ తన ‘మన్ కీ బాత్’ రేడియో షోలో పేపర్ లీక్ అంశాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేదు. దానికి విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బాధితులను కలుసుకొని వారి మానసిక క్షోభను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.
సీబీఎస్ఈ మూల్యాంకనంలోనూ లోపాలు – కుప్పకూలిన పాలన..
నీట్ పేపర్ లీక్, ఆ పరీక్ష రద్దు వ్యవహారంతో పాటుగా- సీబీఎస్ఈ 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో(దిద్దడంలో) కుంభకోణం కూడా వెలుగుచూసింది.
వేదాంత్ అనే విద్యార్థి ఈ కుంభకోణానికి బాధితుడు. సీబీఎస్ఈ తనకు తక్కువ మార్కులు వేసిన జవాబు పత్రం వేరొకరిది అని అతడు నిస్సందేహంగా రుజువు చేశాడు.
అయితే, దూరదర్శన్ యాంకర్ అశోక్ శ్రీవాస్తవ్ ఆ విద్యార్థిని “పాకిస్తానీ”గా వర్ణించగా, బీజేపీ ఐటీ విభాగం అతడిని లక్ష్యంగా చేసుకుని దారుణంగా వేధించింది.
ఇది నిజంగా వినాశకరమైన పరిణామం. చిన్నాభిన్నమైన లక్షలాది మంది విద్యార్థులను రాజ్య వ్యవస్థలను నడిపే వ్యక్తులేదో నేరస్థుల్లా చూస్తున్నారు.
మోదీ హయాంలో పాలన ఎంతలా పతనమైందో ఇది నిస్సందేహంగా రుజువు చేస్తోంది.
ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 88% నుంచి 85%కి పడిపోవడం– యువత విద్యా పరిస్థితి ఎంత దిగ్భ్రాంతికరమైన దుస్థితిలో ఉందో బట్టబయలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే- “మనం ప్రమాణాలను మెరుగుపరిచి పరీక్షా వ్యవస్థను మరింత కఠినంగా చేయలేకపోయినట్లయితే మనం వెనకబడిపోతాం” అని 1961లో నెహ్రూ చేసిన హెచ్చరిక నేటికీ అత్యంత సందర్భోచితం.
గత 12 ఏళ్లుగా మోదీ పాలనలో తరచుగా పేపర్ లీక్ ఘటనలు సంభవిస్తుండటం యువత భవిష్యత్తును, అంతకంటే ముఖ్యంగా దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది.
పరీక్షల నిర్వహణలో న్యాయబద్ధతపై నెహ్రూ..
1955 అక్టోబర్ 6లో బెంగళూరులో(నాటి బెంగుళూర్) జరిగిన బహిరంగ సభలో నెహ్రూ మాట్లాడుతూ- ఢిల్లీలోని కేంద్ర సచివాలయం దక్షిణ భారతీయులతో ఎలా నిండిపోయి ఉందో ప్రజలకు వివరించారు.
“వారంతా అక్కడ ఎందుకు ఉన్నారు?” అని ఆయనే ప్రశ్నించుకుని- “అయితే ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. వారు సమర్థులు, సామర్థ్యం గలవారు కాబట్టే అక్కడ ఉన్నారు. పక్షపాతం అనే ప్రశ్నే తలెత్తదు” అని సమాధానం ఇచ్చారు.
అఖిల భారత పరీక్షలు న్యాయబద్ధంగా జరుగుతున్నాయని, ప్రాంతంతో సంబంధం లేకుండా కేవలం అర్హత, సామర్థ్యం ఆధారంగానే దక్షిణ భారత అభ్యర్థులు ఎంపికై నియమితులవుతున్నారని నెహ్రూ ఆనాడు సంకేతమిచ్చారు.
మోదీ హయాంలో మన యువత కోసం నిర్వహిస్తున్న పరీక్షల్లో కనీస న్యాయ ప్రమాణాలు లోపించాయి. నిరంతరంగా పేపర్ లీక్‌లు జరుగుతున్నాయి.
విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇలాంటి గడ్డు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పడం లేదంటే, పాలనా సంస్థలు కుప్పకూలిపోయాయన్నది కచ్చితంగా రుజువవుతోంది. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోంది.
ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలోని విద్యా మంత్రిత్వ శాఖ తన వైఫల్యాల వల్ల ఏర్పడుతున్న పరిణామాలకు బాధ్యత వహించాలి.
వాస్తవానికి, సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మూల్యాంకన ప్రక్రియలో జవాబు పత్రాలను దిద్దడంలో కనీస ప్రమాణాలను తీవ్రంగా ఉల్లంఘించడం వల్లే కొన్ని లోపాలు జరిగాయని ఆయనే అంగీకరించారు.
వీటిని సరిదిద్దకపోతే భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది.
టీఎన్ శేషన్ వ్యాఖ్యలు – నేటి దుస్థితి..
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన టీఎన్ శేషన్, 1995లో తను రాసిన “ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ బర్డెన్” పుస్తకంలో ‘మనం ఏమైనా బొద్దింకలమా?’ అని ఒక అధ్యాయానికి పేరు పెట్టారు.
పేపర్ లీక్‌లతో సహా భారతీయ సమాజాన్ని పీడిస్తున్న తీవ్రమైన రుగ్మతలు, అడుగడుగునా వ్యాపించిన అవినీతి, కాపీ కొట్టి డిగ్రీలు పొందడం, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, జడ్జీలు, ఐఏఎస్‌లు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు కావడానికి అడ్డదారులు తొక్కడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కోర్టు గదిలో ఇతర అంశాలను పరిశీలిస్తూ “నిరుద్యోగ యువత బొద్దింకల్లాంటి వారు” అని మౌఖికంగా అన్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆయన తర్వాత వివరణ ఇచ్చారు. కానీ, సీజేఐ వ్యాఖ్యలు నీట్ పేపర్ లీక్ సమయంలోనే రావడం యాదృచ్ఛికం.
ఆ తర్వాత అభిజిత్ దిప్కే ఆన్లైన్లో వ్యంగ్యంగా స్థాపించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’లో కోట్ల మంది భారతీయులు డిజిటల్‌గా తమ పేరును నమోదు చేసుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో దీని ఫాలోయింగ్ బీజేపీని సైతం దాటేసింది. మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ ఇప్పుడు నిరంతరంగా డిమాండ్ చేస్తోంది.
భవిష్యత్తులో డాక్టర్లు కావాలని ఆశిస్తున్న మన యువతకు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తామనే భరోసా ఇవ్వడంలో విద్యాశాఖ మంత్రి అసమర్థత- పాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని రుజువు చేస్తోంది.
ఇది బీజేపీ ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపడమే కాకుండా, విద్యార్థులను బొద్దింకల్లా చూస్తూ “పేపర్ లీక్ ఆర్థిక వ్యవస్థ” ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు కూడబెట్టడానికి కుట్ర పన్నే వారెంత సులభంగా తమ పనులు చేసుకుపోతున్నారో స్పష్టం చేస్తోంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు ఓఎస్డీ పనిచేసిన వ్యాస రచయిత ఎస్ఎన్ సాహు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
