హదీ పేరు ప్రస్తావించకుండా, బంగ్లాదేశ్ రాజకీయ కార్యకర్త హత్యతో సంబంధం ఉన్న వ్యక్తుల గుర్తింపును బయటపెట్టవద్దంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనపై ఒత్తిడి తెచ్చారని మమతా బెనర్జీ ఆరోపించారు.
న్యూఢిల్లీ: వేరొక దేశంలో ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిపక్ష రాజకీయవేత్త చేసిన ప్రకటనలపై ఢాకా స్పందించబోదని జూన్ 3న బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి షమా ఒబేద్ ఇస్లాం స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనపై బంగ్లాదేశ్ మంత్రి పైవిధంగా స్పందించారు.
కార్యకర్త షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ హంతకులుగా అనుమానిస్తున్న వారిని తిరిగి తమ దేశానికి తీసుకురావడానికి దౌత్య మార్గాల ద్వారా భారత ప్రభుత్వంతో బంగ్లాదేశ్ నేరుగా కృషి చేస్తోందని కూడా ఇస్లాం తెలిపారు.
“వేరొక దేశంలో ఎన్నికలు జరిగాయి, అక్కడ ఒక రాజకీయ నాయకురాలు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది చర్చించడానికి మా అంశం కాదు” అని ఒబేద్ ఇస్లాం విలేకరులకు చెప్పారు.
మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..
హదీ పేరును నేరుగా ప్రస్తావించకుండా, కోల్‌కతాలో మంగళవారం జరిగిన ఒక రాజకీయ కార్యక్రమంలో బెనర్జీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ రాజకీయ కార్యకర్త హత్యతో సంబంధం ఉన్న వ్యక్తుల గుర్తింపును బయటపెట్టవద్దంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
ఆ హత్య వెనుక ఉన్నవారి పేర్లు తనకు తెలుసని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు, కానీ వారి పేర్లు బయటపెడితే బంగ్లాదేశ్‌లో అలజడికి దారితీస్తుందన్న ఉద్దేశ్యంతో ఆ పేర్లను బహిర్గతం చేయకుండా ఆగిపోయారు.
హదీ హత్య కేసులో పురోగతి..
ఈ హత్య కేసుపై బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కలిసి చురుకుగా పనిచేస్తున్నాయని, ఇప్పటికే అర్థవంతమైన పురోగతి సాధించామని బంగ్లాదేశ్ మంత్రి తెలియజేశారు.
“హదీ హత్యకు మాకు న్యాయం కావాలి, అందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారత్‌లో అరెస్టు చేసిన వారిని బంగ్లాదేశ్‌కు తిరిగి అప్పగించినట్లయితే ఇక్కడ న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతుందని భావిస్తున్నాము” అని ఆమె అన్నారు.
షేక్ హసీనా పతనంలో హదీ కీలక పాత్ర..
బంగ్లాదేశ్ ‘ఇంక్విలాబ్ మంచా’ అధికార ప్రతినిధి అయిన హదీ- బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తొలగింపుకు దారితీసిన జూలై-ఆగస్టు 2024 తిరుగుబాటులో కీలక వ్యక్తిగా ఎదిగారు.
డిసెంబర్ 12న ఢాకాలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరపగా, గాయాలతో సింగపూర్‌లో చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత మృతి చెందారు.
తన మరణం దేశవ్యాప్తంగా అశాంతికి దారితీసింది. ఆయన హత్యకు సంబంధించి ఇద్దరు అనుమానితులు భారత్ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది, వారిని తమకు అప్పగించాలని ఢాకా కోరుతోంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
