తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 గణాంకాల ప్రకారం, 18-49 ఏళ్ల వయస్సు గల గ్రామీణ ప్రాంత మహిళలు పట్టణ ప్రాంతాల్లోని తమ తోటి మహిళల కంటే ఎక్కువగా భర్త నుంచి హింసను ఎదుర్కొంటున్నారు.
ఇది కేవలం భర్త నుంచి ఎదురయ్యే హింసకు మాత్రమే పరిమితం కాదు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు గర్భధారణ సమయంలో శారీరక హింసను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.
అలాగే 18-29 ఏళ్ల వయస్సు గల యువతులు 18 ఏళ్లు నిండకముందే లైంగిక హింసకు గురైన సందర్భాలు ఉన్నాయి.
సాధికారత పెరుగుతున్నా మారని పరిస్థితులు..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 ప్రకారం ఎక్కువ మంది మహిళలు ఇంటర్నెట్ పరిజ్ఞానం, బ్యాంక్ ఖాతాలు – సొంత మొబైల్ ఫోన్లు కలిగి ఉండడం ద్వారా సాధికారత సాధిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై శారీరక, లైంగిక హింస పెరుగుతోందని వివిధ రాష్ట్రాలు నివేదించాయి.
అయితే ఆంధ్రప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, మిజోరాం, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూతోపాటు పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో గ్రామీణ మహిళల కంటే పట్టణ మహిళలే భర్త నుంచి ఎక్కువ హింసను ఎదుర్కొంటున్నారు.
తగ్గిన సగటు.. కానీ పల్లెల్లో ఆందోళన..
మే 29న విడుదలైన NFHS-6 గణాంకాల ప్రకారం, భారతదేశంలో లింగ-ఆధారిత హింస 2019-21లో 29.2% నుంచి 2023-24 నాటికి 22.3%కి తగ్గి, దాదాపు 7% తగ్గుదలను నమోదు చేసింది.
వివాహిత మహిళల్లో (18-49 ఏళ్లు) భర్త నుంచి హింసను ఎదుర్కొన్న వారి శాతం కూడా 29.2% నుంచి 22.3%కి తగ్గింది; ఇందులో పట్టణ మహిళలతో (17.5%) పోలిస్తే గ్రామీణ మహిళలు (24.4%) ఎక్కువ హింసను ఎదుర్కొన్నారు.
అలాగే, గర్భధారణ సమయంలో శారీరక హింసను ఎదుర్కొన్న 18-49 ఏళ్ల వయస్సు మధ్యనున్న వివాహిత మహిళల శాతం 3.1% నుంచి 2.7%కి స్వల్పంగా తగ్గింది, అయితే ఇక్కడ కూడా పట్టణ మహిళల(2.3%) కంటే గ్రామీణ మహిళలే (2.9%) దీనిని ఎక్కువగా ఎదుర్కొన్నారు.
రాష్ట్రాల వారీగా భిన్నమైన గణాంకాలు..
గణాంకాల ప్రకారం- కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలు జాతీయ సగటు కంటే ఎక్కువ స్థాయిలో మహిళలపై భర్త నుంచి హింసను నమోదు చేశాయి.
2021 నుంచి చాలా రాష్ట్రాల్లో ఈ హింస తగ్గుముఖం పట్టినప్పటికీ, కేరళ, మిజోరాం, గోవా, లక్షద్వీప్, అండమాన్ & నికోబార్ దీవుల వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రం పెరుగుదల కనిపించింది.
అనువాదం: నాగలక్ష్మి
ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
