మనిషి తనను తాను మనిషిగా భావించుకున్నప్పుడు, ఎదుటి వారిని మనుషులుగా గుర్తించినపుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆనందం లభిస్తుంది. మొత్తానికి మొత్తంగా భద్రతా భావం ఇనుమడిస్తుంది అని అంటారు తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి.
కప్పు ఖాళీగా ఉంటేనే మీరందులో కాఫీ, టీ, పళ్ళరసం వగైరా ఏదైనా పోసుకోవచ్చు. ముందే నీళ్ళతో నిండి ఉన్న కప్పులో మరేమీ పోయలేరు. పోయాలనుకుంటే ముందు ఆ కప్పును ఖాళీ చెయ్యాలి. మనిషి మెదడు కూడా అలాంటిదే.
పసితనంలో ఎవరి మెదడైనా ఖాళీ కప్పు లాంటిదే. అందులో ఏ మత విశ్వాసాలూ ఉండవు. తాతయ్యలు, నానమ్మలు, తల్లిదండ్రులు, చుట్టు పక్కల వారు మెల్లమెల్లగా ఆ పసివాడికి దైవ భావనను పరిచయం చేస్తారు. సంప్రదాయాలు, సంస్కృతి పేర తాతలు వారసత్వంగా నేర్చుకున్న వందల యేళ్ళ నాటి విషయాలు, ఈ కాలపు ఈ పసివాడికి నూరిపోస్తారు.
అంటే ఏమిటీ? కొంచెం కొంచెం వాడి మెదడు కప్పు నింపేస్తున్నారన్న మాట! ఆ రకంగా యుక్త వయసు వచ్చే సరికి వాడికో దేవుడు, వాడికో మతం, వాడికో సంప్రదాయం ఏర్పడి, వాడో చట్రంలో బిగుసుకుని ఉండిపోతున్నాడు.
తన చుట్టూ ఉన్న సమాజం గురించి, తన దేశం గురించి, ప్రపంచం గురించి, విశ్వ విజ్ఞానం గురించి ఏమీ తెలుసుకోవడం లేదా? అంటే, భేషుగ్గా తెలుసుకుంటున్నాడు. కానీ, వాటిని తన మెదడులో, మనసులో బలంగా నిలుపుకోలేకపోతున్నాడు.
కారణం వాడి మెదడు కప్పులో ఖాళీ లేకపోవడమే! కప్పు ఖాళీగా ఉంటేనే ఇతరులకు ఉపయోగపడేది.
ఇతరులకు ఉపయోగపడదామన్న తపన ఉంటేనే మీ కప్పు ఖాళీ చేసుకుని మీరు సిద్ధంగా ఉంటారు.
మానవ హృదయంతో, మానవత్వం గురించి ఆలోచిస్తూ, మనిషి మనిషి కోసం బతికినపుడే అతను మానవుడవుతాడు.
మూస ఆలోచనల నుంచి విముక్తి..
తమలో గడ్డకట్టుకుని ఉన్న దైవ భావనకి బయటి ప్రపంచంలోని భౌతిక ప్రపంచానికి- విశ్వవిజ్ఞానానికీ మధ్య జనం మెదళ్ళలో హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎటూ తేల్చుకోలేని వారు అయోమయంలో పడి కొట్టుకుంటూ ఉంటారు.
కొందరు మాత్రం నిర్మొహమాటంగా తమ మెదడు కప్పు ఖాళీ చేసుకుంటారు. అందులో తమ దృక్పథాలకు అనుగుణంగా, తాము కావాలనుకున్న వైజ్ఞానిక స్పృహను నింపుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుతుంటారు.
భయస్థులు, చంచల మనస్కులు, కళ్ళ ముందున్న వాస్తవాన్ని చూడలేని గుడ్డివాళ్ళు మాత్రం దేవుడిలో తమ ఆత్మల గురించి, పరలోకాల గురించి, పునర్జన్మల గురించి భయపడుతూ బతుకీడుస్తుంటారు.
నమ్మకాలు, దేవుళ్ళు, సంస్కృతి, సంప్రదాయాలు, అంధవిశ్వాసాలతో ఉన్న ఏ మనసైనా అయోమయంతో బరువెక్కి పోతుంది.
అది వారి తాతల మనసుకు నకలు కాపీ(ట్రూ కాపి). ఒరిజినల్ కాదు. ఎవరి మనసైనా ఒరిజినల్ కాపీలా ఉండాలంటే దానికి వివేకం, వివేచన అవసరమౌతాయి.
హేతుబద్ధంగా పరిశీలించుకోవడం, నిజాల నిగ్గు తేల్చుకోవడం అవసరమౌతోంది. అప్పుడే ఆ మనసులో సృజనాత్మకత, నవ్యత వంటివి ప్రవేశించగలుగుతాయి. వాటితో ఆ మనసున్న వ్యక్తికి అప్రయత్నంగానే ప్రత్యేక వ్యక్తిత్వం రూపొందుతుంది.
మనిషి తనను తాను మనిషిగా భావించుకున్నప్పుడు, ఎదుటి వారిని మనుషులుగా గుర్తించినపుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆనందం లభిస్తుంది.
మొత్తానికి మొత్తంగా భద్రతా భావం ఇనుమడిస్తుంది అని అంటారు తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి.
తెరిచిన మనసు – విశాల దృక్పథం..
అలాగే మరొక విషయం కూడా ఆలోచించాలి. మనం ఎవరి ఇంటికైనా వెళ్ళాలనుకుంటే, వారి ఇంటి గేటు తెరచి ఉంటేనే వెళ్ళగలం. గేటుకు తాళం వేసి ఉంటే మనం వెళ్ళలేము.
ఈ ప్రపంచంలో చాలా మంది తమ తమ ఇళ్ళకు ఏదో ఒక మతానికి సంబంధించిన పెద్ద తాళం కప్ప బిగించుకుని ఉంటున్నారు. అంటే తమ మెదడుకు మతం అనే తాళం వేసుకుంటున్నారు. ఇక ఇతరులు రావడానికి వీలేది?
వచ్చేవారు ఇతర మతాలవారు కావొచ్చు, ఇతర ఆలోచనా ధోరణి గలవారు కావొచ్చు. ఇతర కులాల వారు, ఇతర వర్గాల వారు ఎవరైనా కావొచ్చు.
మీకు మీరు మరొకదానికి ‘ఫిక్స్’ అయి ఉన్నప్పుడు వేరే వాటిని ఎలా ఆహ్వానించగలరు? విశాల హృదయం గురించి, విశ్వ మానవుడి గురించి, విశ్వవిజ్ఞానం గురించి మీరెలా తెలుసుకోగలరు? ముందు మీరు మీ గేట్లు తెరచి ఉంచాలి. అంటే మీ మనసు-మెదడూ తెరచి ఉంచాలి.
మనసు మెదడు వేరు వేరు కావు. రెండూ ఒకటే- అందులోని చెత్తనంతా బయటికి పంపిస్తే గానీ, మీ మనసులో కొత్తగాలి వీచదు. కొత్త వెలుతురు సోకదు.
ఇంటితో పోల్చి చూస్తే తలుపులు చిన్నవి. తలుపులతో పోల్చి చూస్తే వాటికి వేసే తాళం చిన్నది.
ఇక తాళం చెవి అన్నింటి కన్నా చిన్నది. కానీ అంత చిన్నదయినా, అది మొత్తం ఇంటినే తెరవగలదు కదా?
మత మార్గమే మీ ఇల్లనుకుని, సంస్కృతినే తలుపులు బిడాయించుకుని, దానికో సంప్రదాయపు తాళం వేసుకుని లోపల కూర్చుంటే ఏమవుతుందీ? బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పోతుంది. మీలో మీరే కుంచించుకు పోతారు.
దీనికి పరిష్కారముంది. సైన్సు మీ తాళాన్ని తెరిచే తాళం చెవి కాగలదు. సైన్సు తాళం చెవితో మీ సంప్రదాయపు తాళాన్ని ఒక్కసారి తెరవండి.
సంస్కృతి పేరుతో బిగుసుకున్న తలుపులు బార్లా తెరుచుకుంటాయి. మత మౌఢ్యపు ఇల్లు తెరుచుకుని, అందులో కాస్త గాలీ, వెలుతురూ ఆడతాయి.
ప్రపంచ జ్ఞానం అందుబాటులో కొస్తుంది. అప్పుడు మీరూ మనుషుల్లో కలుస్తారు. ఆలోచన చిన్నదైతే మాత్రం ఏమిటీ? అది పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరించేది కావొచ్చు కదా?
నమ్మకాలు – వాస్తవాలు..
ఒకడు బైక్ మీద అడవిలోకి చాలా దూరం వెళ్ళాడనుకుందాం. అతనికి రెండు దారులు కనబడ్డాయి. ఒక దారికి దేవుడున్నాడు అనే బోర్డు కనబడింది.
మరో దారికి దేవుడు లేడు అనే బోర్డు ఉంది. ఎవరూ లేని చోటికి ఒంటరిగా వెళ్ళడం దేనికీ అనే భయంతో ఈ దారిలో ఎవరో ఒకరు ఉన్నారు కదా అనే భరోసాతో ఒకరి తర్వాత ఒకరు చాలా మంది దేవుడున్నాడు అనే దారిలో వెళుతున్నారు.
కొద్ది మంది మాత్రం ‘ఇంత దాకా ఒంటరిగా ధైర్యంగా వచ్చాను కదా? ఇంకా ముందు ఎవరూ లేకపోతేనేం?’ అనే ఆత్మవిశ్వాసంతో దేవుడు లేడు అనే దారిలో వెళుతున్నారు.
అసలు విషయమేమంటే ఏ దారిలో వెళ్ళినా ఒకటే. కొంత దూరం వెళ్ళాక రెండు దారులు కలిసేవే. ‘దేవుడున్నాడు – లేడు’ అని చెప్పే ఆ సైన్ బోర్డులు మనుషుల్ని విడగొట్టడానికి తప్పితే కలపడానికి కాదు.
మత విశ్వాసాలు, లక్షల సంఖ్యలో దేవుళ్ళు పనికొచ్చేది ఎందుకంటే, మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా విడగొట్టడానికి మాత్రమే! నిజం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. వాస్తవం ఒకటే ఉంటుంది. ఊహలు, భ్రమలు, ఎన్నయినా, ఎన్ని రకాలుగానైనా ఉండొచ్చు. అందుకే కదా, దేవుళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నారు.
హేతుబద్ధత – నిజమైన మానవత్వం..
మహా మానవతావాది, జాతీయ విప్లవకారుడు, తత్త్వవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త ఎంఎన్ రాయ్(మానబెంద్ర నాథ్ రాయ్) “పిల్లి ఆత్మకథ”లో రాసుకున్న విషయం ఆధారం చేసుకుని, అందులోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది.
“ప్రతి మతమూ ప్రజలను మరింత అజ్ఞానానికి గురి చేసే సాధనంగా ఉండిపోయింది. ప్రజలు ఉన్నత వర్గాల పరిపాలనకు లొంగిపోవాలి. ప్రభువుల్ని గుడ్డిగా నోరు మూసుకుని అనుసరించాలి. సిరి సంపదల హెచ్చు తగ్గులను దైవ నిర్ణయాలుగా భావించాలి. వారు పూర్వ జన్మలో చేసిన పాప పరిహారంగా ఈ జీవితాన్ని దుర్భరంగా గడపాలి. మూఢ విశ్వాసాలతో, జ్ఞాన శూన్యులుగా, భావ స్వేచ్ఛ ఎరుగకుండా బతకాలి. మతమే ప్రజల్ని ఇలాంటి దుస్థితికి తెచ్చింది.”
నీకున్న దానితో నువ్వు గొప్పవాడివి కావు. ఇతరులకు నువ్విచ్చే దానితో అవుతావు. నీ మెదడు కప్పు ఖాళీగా ఉంటేనే కదా, దానితో నువ్వు ఎవరికైనా ఏమైనా ఇవ్వగలవు.
విశాల హృదయంతో, తెరచిన మనసుతో ఉన్నప్పుడే సమ్యక్ దృష్టితో పరిశీలించగలవు. అప్పుడే హాయిగా ‘స్వేచ్ఛాలోచన’ నాలో ఊపిరి పీల్చుకుంటుంది?
స్వేచ్ఛా- మానసిక బానిసత్వం..
గేదెను గుంజకు కట్టేసినట్టు, నీ మనసును, బుద్ధిని గుంజలాంటి ఒక మతానికి కట్టేసుకున్నావనుకో.
ఇక అంతే – మనసు ఆ గుంజచుట్టే తిరుగుతూ ఉంటుంది. అక్కడక్కడే ఆ పరిధిలో గింజుకోవాల్సిందే. అరవాల్సిందే! ఒక్కసారి గేదెను గుంజ నుంచి విప్పి చూడండి. అది స్వేచ్ఛగా ఊరి బయటికి, పొలాల్లోకి, అడవుల్లోకి పరిగెత్తుతుంది.
చెప్పొచ్చేదేమంటే మనిషి గేదె కాదు. మనిషి మనిషే. మనిషి గేదెను కట్టేస్తున్నాడు. సరే, మరి మనిషి? తనను తానే ఎందుకు కట్టేసుకుంటున్నాడూ? మనిషి గేదెలా బతకకూడదు. మనిషిలాగా బతకాలి. స్వంత ఆలోచనలతో, స్వంత నిర్ణయాలతో, సంయమనంతో, విచక్షణతో ఎదగాలి!
మనిషి మెదడుని నియంత్రించే మత మౌఢ్యం, చాదస్తాలు, సంప్రదాయాల బంధనాలోంచి మనిషి స్వేచ్ఛగా బయటికి రావాల్సిన అవసరం ఉంది.
ఇది ఎవరికి వారు, అందరూ సీరియస్గా ఆలోచించుకోవాల్సిన విషయం. మూఢ విశ్వాసాల నుంచి, మత పరమైన నమ్మకాల నుంచి స్వేచ్ఛ పొందినపుడే మానవ జీవితంలో ఒక కొత్తదనం ప్రారంభమవుతుంది.
ప్రతి క్షణాన్ని, ప్రతి కదలికని, ప్రతి సందర్భాన్ని, ప్రతి సంఘటనను గతితార్కికంగా విశ్లేషించుకుంటూ ఉన్నపుడే, కార్యకారణ సంబంధాల్ని అర్థం చేసుకుంటున్నపుడే మనిషిలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది.
ప్రపంచంలోని ఏదో ఒక మతాన్ని అంగీకరించి, ఏదో దేవుణ్ణి ఆరాధిస్తూ, పరలోక సౌఖ్యాల కోసం అంగలారుస్తున్నంత కాలం మనిషి కృశించి మగ్గిపోతూనే ఉంటాడు.
వాడికి ఆత్మవిశ్వాసం పెరగదు. నాణ్యమైన విత్తనాలు నాటితేనే ప్రాణమున్న మొక్కలు మొలుస్తాయి.
నాణ్యమైన పంట పండుతుంది. ఏదో ఒక మతానికి సంబంధించిన పిచ్చి గింజలు చల్లితే పంటలు ఆ విధంగానే ఉంటాయి మరి.
ఇక్కడొక విషయం ఆలోచించాల్సి ఉంది- అన్ని మతాలు శాంతి ప్రబోధిస్తూ శాంతి స్థాపనకే పనిచేస్తుంటే మరి వేల వేల యేళ్ళుగా ప్రపంచంలో శాంతి ఎందుకు స్థాపించబడడం లేదూ? అంటే మతాలన్నీ విఫలమైనట్టే కదా?
అభూతకల్పనలు ఎలా పలాయనం చిత్తగిస్తాయంటే?
మనిషి మానవ శక్తిని గుర్తించి, శ్లాఘించి, కీర్తించగలిగినపుడు అతను ఇక ఏ శక్తి గురించి ఆలోచించనవసరం లేదు.
జవాబులకు బలం ఉన్నప్పుడు ప్రశ్నలు తోకముడుస్తాయి. వాస్తవాలు దృఢమవుతున్న కొద్దీ భ్రమలు, ఊహలు, కల్పనలు, పరలోకాలు పలాయనం చిత్తగిస్తాయి.
మనిషిలోని మంచితనమనేది మతంతోనూ, స్థాయితోనూ, జాతితోనూ, రంగుతోనూ, లింగ భేదంతోనూ లేదా రాజకీయ పరమైన, సాంస్కృతిక పరమైన దృక్పథాలతోనూ ముడిపడి లేదు.
కేవలం ఎదుటి వారితో అతను ఎట్లా వ్యవహరిస్తున్నాడన్న దానిమీదే అతని మంచితనం గుర్తింపులోకి వస్తుంది.
అలాగే మనిషిలోని చెడుతనం ఎలా ఉంటుంది? మూర్ఖుడంటే ఎవరు? అనేది ఆలోచిస్తే దానికి సమాధానం ఇలా ఉంటుంది: “అతను నిజం తెలుసుకుంటాడు. నిజాన్ని చూస్తాడు కూడా! అయినా అబద్ధాల్ని నమ్ముతుంటాడు.” అందువల్ల ఎవరికివారు తమను తాము బేరీజు వేసుకుంటూ ఉండాలి.
వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
