డేటా కేంద్రాలు చాలా ముఖ్యమైనవని, అలాంటి ప్రాజెక్టుల్లో సరైన ప్రణాళిక, పారదర్శకత చూడాల్సిన అవసరం ఉందని నిరసనకారులు వాదిస్తున్నారు.
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న డేటా కేంద్రాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలకు క్రమం తప్పకుండా వచ్చే విదేశీ నిధుల పెట్టుబడులు తగ్గుతున్నాయి.
జూన్ వరకు 2-3 ఒప్పందాలు జరగ్గా ఆ తర్వాత నెలకు ఒక్క ఒప్పందమే జరుగుతున్నట్లు ది హిందూ బిజినెస్ లైన్ కథనం తెలియజేసింది.
అదే సమయంలో 2026 మొదటి ఆరు మాసాలలో విదేశీ నిధుల పరిమాణం నెలకు దాదాపు 600 నుండి 900 మిలియన్ డాలర్ల నుంచి సుమారు 100 మిలియన్ డాలర్లకు తగ్గినట్లు ట్రాక్స్ఎన్ డేటా సూచించింది.
చివరి పెట్టుబడి జూలై 15న 130 మిలియన్ డాలర్లు వచ్చింది. ఆగస్టులో ఎలాంటి విదేశీ నిధులు నమోదు కాలేదు.
నిరసనలతో పెరుగుతున్న ఆందోళనలు..
డేటా సెంటర్ల నిర్మాణంపై నిరసనలను భారత్ ఎదుర్కొంటున్న సమయంలో పెట్టుబడుల పరిమాణం తగ్గుతోందని ది హిందూ బిజినెస్ లైన్ తెలియజేసింది.
మహారాష్ట్ర థానేలోని బాల్కమ్లో స్థానికులు నీటి, విద్యుత్ కొరత, ధ్వని కాలుష్యంపై ఇటీవల ఆందోళనను వ్యక్తపరిచారు.
విశాఖపట్నంలో కూడా స్థానికులు అలాంటి ఆవేదననే వ్యక్తపరిచారు. భూ కేటాయింపుకు ముందు కావాల్సిన అన్ని చర్యలను స్థానిక అధికారులు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు.
అవరోధంగా మారుతున్న అనుమతులు..
“పెట్టుబడిదారుల్లో డేటా సెంటర్ల పట్ల ఉత్సాహం, ఆనందం నెలకొని ఉన్నాయి. కానీ అమలులో పర్యావరణ అనుమతులు పొందడం అనేది అవరోధంగా మారుతోంది. స్థానికుల నిరసనల కారణంగా ప్రాజెక్టుల అమలులో మరింత జాప్యం ఏర్పడి, స్వల్పకాలిక సవాళ్లు సృష్టింపబడుతున్నాయి” అని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్‌లో ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బత్తిని పత్రికకు చెప్పారు.
పారదర్శకత కోసం నిరసనకారుల పట్టు..
డేటా కేంద్రాలు ముఖ్యమైనవే కానీ, ఇలాంటి ప్రాజెక్టుల్లో సరైన ప్రణాళిక, పారదర్శకత ఉన్నాయా లేదా అని చూడాలని నిరసనకారులు వాదిస్తున్నారు.
అసలైన ప్రశ్నలు లేవనెత్తుతున్న వేకప్ థానే..
“భారత డిజిటల్, ఏఐ మౌలిక సదుపాయాలలో డేటా కేంద్రాలు ముఖ్యమైనవి అన్న దాంట్లో పెద్దగా అసమ్మతి లేదు. చుట్టూ ఉన్న పౌరుల ప్రయోజనాలను పరిరక్షించకుండా, తగినంత మౌలిక సదుపాయాల ప్రణాళిక, పారదర్శకత, భూమిని సక్రమంగా వినియోగించే నిబంధనలు పాటించకుండా ఇంతటి స్థాయి ప్రాజెక్టును ఎలా అభివృద్ధి చేస్తున్నారు అనేది అసలైన ప్రశ్న” అని వేకప్ థానే నిరసనకారుల్లో ఒక సభ్యుడైన దయానంద్ నేనే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
