బీసీఐ ఛైర్మన్ పదవికి మనన్ మిశ్రా రాజీనామా చేయాలని కొత్త డిమాండ్లు, స్వతంత్ర విచారణ కోరిన ప్రతినిధులు.
మిశ్రా హయాంపై విచారణ జరిపించాలని, బీసీఐ ఆర్థిక వ్యవహారాలు, క్రమశిక్షణా రికార్డులను బహిరంగపరచాలని, అలాగే సరైన ప్రక్రియ లేకుండా న్యాయ విద్యార్థులు, న్యాయవాదులపై ఏకపక్ష చర్యలు తీసుకోకుండా రక్షణలు కల్పించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల మొత్తం బ్యాచ్‌ను బ్యాన్ చేసేందుకు ప్రయత్నించిన కొన్ని వారాల తర్వాత, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించాలని క్యాంపెయిన్ ఫర్ జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ రీఫార్మ్స్(సీజేఏఆర్) డిమాండ్ చేసింది.
బీసీఐ కార్యాలయంలో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో మిశ్రా రాజీనామా డిమాండ్ అధికారికంగా లేవనెత్తారని ‘లైవ్ లా’ నివేదించింది.
ఆగస్టు 22న విడుదల చేసిన లేఖలో—ప్రశాంత్ భూషణ్, విపుల్ ముద్గల్, అపర్ గుప్తా, అంజలి భరద్వాజ్ సహా పలువురు ప్రముఖ న్యాయవాదులు, పౌర హక్కుల కార్యకర్తలతో కూడిన సీజేఏఆర్—మిశ్రా నడుపుతున్న ఒక ట్రస్ట్‌పై సీబీఐ తనిఖీ జరిపించాలని, బీసీఐ అధిపతిగా ఆయన “అపరిమిత” పదవీకాలాన్ని ముగించాలని కోరింది.
బహిరంగంగా విడుదల చేసిన ఈ లేఖను రాష్ట్ర బార్ కౌన్సిళ్లు, సుప్రీంకోర్టు, న్యాయ వర్గాలకు పంపారు.
నిధుల మళ్లింపు ఆరోపణలు..
అలాగే ఆగస్టు 22న, బీసీఐ కో-ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ వైఆర్ సదాశివ రెడ్డి తాము మిశ్రాకు పంపిన లేఖను విడుదల చేశారు. అందులో ఆయన వెంటనే లేదా “15 రోజుల్లోగా” రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రూ 150 కోట్ల నిధుల మళ్లింపు, కుటుంబ సభ్యుల నియామకాలు, నల్సార్ విద్యార్థులపై తీసుకున్న అక్రమ చర్యలను దృష్ట్యా ఈ డిమాండు చేస్తున్నట్లు ప్రకటించారు.
అనుమతి, పునరుద్ధరణ కోసం బీసీఐని ఆశ్రయించే లా కాలేజీలపై ‘బీసీఐ ట్రస్ట్ పెర్ల్’ అనే ట్రస్ట్‌కు “విరాళాలు” ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని రెడ్డి ఆరోపించారు.
బీసీఐ ట్రస్ట్ స్థానంలో ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. లా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు లేదా సంబంధిత ట్రస్ట్‌లు, సంస్థల నుంచి బీసీఐకి లేదా దానికి అనుబంధంగా ఉన్న ట్రస్ట్‌లకు ఇచ్చే విరాళాలు, చెల్లింపులను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు.
పలువురు బీసీఐ సభ్యుల అభ్యంతరాలు ఉన్నప్పటికీ, బీసీఐ నిధుల నుంచి సుమారు రూ 150 కోట్లు ఈ ట్రస్ట్‌కు బదిలీ అయ్యాయని రెడ్డి ఆ లేఖలో ఆరోపించినట్లు ‘లైవ్ లా’ పేర్కొంది.
ట్రస్ట్, ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆరోపణలను మిశ్రా ఖండించారు. తనకు “25 లక్షల” మంది న్యాయవాదుల మద్దతు ఉందని, రాజీనామా డిమాండ్లను తిరస్కరిస్తున్నానని ఆయన పేర్కొన్నట్లు ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలిపింది.
సీబీఐ విచారణ, బీసీఐపై నియంత్రణ, ఆశ్రిత పక్షపాత నియామకాలు..
మిశ్రా స్వయంగా ఏర్పాటు చేసుకుని, తనను తాను జీవితకాల ధర్మకర్తగా(లైఫ్‌టైమ్ ట్రస్టీ) నియమించుకున్న ఒక ట్రస్ట్(బీసీఐ ట్రస్ట్ పెర్ల్-ఫస్ట్ ట్రస్ట్) పై సీబీఐ విచారణ పెండింగ్‌లో ఉందని సీజేఏఆర్, బీసీఐ కో-ఛైర్మన్ ఇద్దరూ పేర్కొన్నారు.
“గతంలో బీసీఐ ఏర్పాటు చేసిన ట్రస్ట్(బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్) నిధులను ఈ ట్రస్ట్ స్వాధీనం చేసుకుంది. ఈ నిధుల స్వాధీనం, వాటి వినియోగంపై సీబీఐ విచారణ జరుపుతోంది” అని సీజేఏఆర్ తెలిపింది.
బీసీఐ, బీసీఐ పెర్ల్-ఫస్ట్ ట్రస్ట్‌ల నమోదు నుంచి ఇప్పటివరకు జరిగిన వ్యవహారాలపై స్వతంత్ర ఆడిట్ జరిపించాలని, ఆ నివేదికను సభ్యులకు పంపాలని రెడ్డి కూడా డిమాండ్ చేశారు.
ప్రస్తుత బీసీఐ ఛైర్మన్ రాజీనామా చేయాలని, ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలపై—ముఖ్యంగా ఆయన ఏర్పాటు చేసిన ట్రస్ట్ కార్యకలాపాలపై—విచారణ జరిపించాలని సీజేఏఆర్ డిమాండ్ చేస్తుంది.
సీజేఏఆర్ డిమాండ్లు..
♦ బీసీఐ ఛైర్మన్ పదవికి శ్రీ మనన్ కుమార్ మిశ్రా వెంటనే రాజీనామా చేయాలి.
♦ మిశ్రా హయాంలో ట్రస్ట్ ఏర్పాటు, దుర్వినియోగం, పారదర్శకత లేని నిర్ణయాలు, ఉత్తర్వులు మొదలైన వివాదాస్పద చర్యలపై విచారణ జరిపించాలి.
♦ బీసీఐ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు గరిష్టంగా రెండు దఫాల(లేదా నిర్ణీత కాలపరిమితి) నిబంధనను తీసుకురావాలి.
♦ రాష్ట్రాల వారీగా బీసీఐ నాయకత్వానికి పారదర్శకమైన, రొటేషన్ విధానాన్ని అమలు చేయాలి.
♦ మిశ్రా హయాంలో బీసీఐ ఆర్థిక లావాదేవీలు, క్రమశిక్షణా రికార్డులను పూర్తిస్థాయిలో బహిరంగపరచాలి.
♦ భవిష్యత్తులో ఏ అధికారి అయినా తగిన విచారణ లేకుండా లా విద్యార్థులు, న్యాయవాదులపై ఏకపక్షంగా చర్యలు తీసుకోకుండా నిబంధనలు రూపొందించాలి.
సుప్రీంకోర్టులో సవాలు..
దశాబ్దానికి పైగా బీసీఐ నాయకత్వంలో మిశ్రా కొనసాగడం నిబంధనలు, సాంప్రదాయాలను ఉల్లంఘించడమేనని సీజేఏఆర్ స్పష్టం చేసింది.
అడ్వకేట్స్ యాక్ట్, 1961 ప్రకారం బీసీఐ ఛైర్మన్ పదవీకాలం రెండు సంవత్సరాలు మాత్రమేనని అది తెలిపింది.
సెక్షన్ 4(3)లోని నిబంధన ప్రకారం, తదుపరి అధికారి ఎన్నికయ్యే వరకు ఉన్న సభ్యుడే కొనసాగడానికి అవకాశముంది.
అయితే, నియామకాల క్రమాన్ని వేగవంతం చేయడానికి బదులు మిశ్రా తాను అవిచ్ఛిన్నంగా ఈ పదవిలో కొనసాగడానికి ఆ నిబంధనను దుర్వినియోగం చేశారని లేఖలో పేర్కొన్నారు.
“ఇది ఒకే ఒక్క అధికారి దశాబ్దానికి పైగా అధికారం కేంద్రీకృతం చేసుకోవడానికి దారితీసింది, తద్వారా బీసీఐ తనంతట తాను సంస్కరించుకోవడంలో విఫలమైందనడానికి నిదర్శనం” అని సీజేఏఆర్ పేర్కొంది.
ఇదే సమయంలో, బీసీఐ ఛైర్మన్‌గా మిశ్రా కొనసాగడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
అడ్వకేట్ దీపక్ ప్రకాష్ ద్వారా అడ్వకేట్ యోగమాయ ఎంజీ దాఖలు చేసిన ఈ పిటిషన్లో, దశాబ్దానికి పైగా ఆయన పదవిలో కొనసాగడం బీసీఐ నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు.
స్వయంప్రతిపత్తి కాపాడాలి..
2024 నుంచి బీహార్ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మిశ్రా, బీసీఐని ఒక “శాశ్వత రాజకీయ వేదికగా” మార్చకుండా, లా విద్య, న్యాయవాద వృత్తి స్వయంప్రతిపత్తిని కాపాడాలని సీజేఏఆర్ డిమాండు చేస్తుంది.
మిశ్రా పదవీకాలాన్ని 2030 వరకు పొడిగించినట్లు చెబుతున్న 2025 ఏప్రిల్ 21 నాటి గెజెట్ నోటిఫికేషన్‌ను కూడా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ సవాలు చేసింది. మిశ్రా తన హయాంలో చేపట్టిన చర్యలు, ట్రస్ట్ దుర్వినియోగం, పారదర్శకత లేని నిర్ణయాలపై విచారణ జరిపించాలని సీజేఏఆర్ డిమాండ్ చేసింది. బీసీఐ ఆర్థిక వ్యవహారాలు, క్రమశిక్షణా రికార్డులను వెల్లడించాలని కోరింది.
అదే సమయంలో, బీసీఐ సిబ్బందిలో అధికులు మిశ్రాకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా సంబంధం ఉన్నవారేనని బీసీఐ కో-ఛైర్మన్ రెడ్డి తన లేఖలో ఆరోపించారు.
ఈ నియామకాలను సమర్థించే ఒక్క ప్రకటన గానీ, ఎంపిక కమిటీ వివరాలు గానీ, మెరిట్ జాబితా గానీ అందుబాటులో లేవని ఆయన వివరించారు.
“బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ వ్యక్తి సొంత ఆస్తి కాదు” అని రెడ్డి అంటున్నారు.
దశాబ్ద కాలంగా ఈ వ్యవస్థను లోపలి నుంచి చూస్తున్న తాను, మిశ్రా ఆ పదవిలో ఉన్నంత కాలం ఇది కోలుకోలేదని ప్రగాఢంగా విశ్వసిస్తున్నానని తెలిపారు.
నిరసనకారులను దేశద్రోహులుగా చిత్రించడంపై విమర్శలు..
మరోవైపు, కేరళకు చెందిన బీసీఐ సభ్యుడు మనోజ్ కుమార్ నరేంద్రన్, మిశ్రా రాజీనామా ప్రతిపాదనను జనరల్ కౌన్సిల్ ముందు ఉంచారు.
ఉత్తరప్రదేశ్ సభ్యుడు, అడ్వకేట్ శ్రీనాథ్ త్రిపాఠి కూడా దీనికి మద్దతు తెలిపారు. “అధికారంలో ఉన్నవారితో విభేదించినంత మాత్రాన నిరసన తెలిపే విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరించడం రాజ్యాంగ విలువలను కాపాడవలసిన న్యాయవాద వృత్తి ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధం” అని మిశ్రాకు నరేంద్రన్ పంపిన లేఖలో పేర్కొన్నారు.
ఏకమవుతున్న మిశ్రా మద్దతుదారులు..
దేశవ్యాప్తంగా కోర్టుల్లో రాజీనామా డిమాండ్లు ఊపందుకుంటున్న తరుణంలో, మనన్ మిశ్రా తనకు మద్దతుగా న్యాయవాదులు నినాదాలు చేస్తున్న వీడియోను పంచుకున్నారు.
“మీ నిరంతర నమ్మకానికి, మద్దతుకు ధన్యవాదాలు” అని ఆయన ‘ఎక్స్’లో ఒక పోస్టు పెట్టారు.
బీసీఐలో మూడింట రెండు వంతుల మందికి పైగా సభ్యుల మద్దతు తనకు ఉందని, ఆ మద్దతు ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతానని ఆయన ఏఎన్ఐ కి తెలిపారు.
రెడ్డి లేఖలోని ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని, ఆయన వ్యాఖ్యలు “రాజకీయ కక్ష సాధింపు చర్యలు” అని మిశ్రా పేర్కొన్నట్లు ‘బార్ అండ్ బెంచ్’ తెలిపింది.
తనపై వచ్చిన ఆరోపణలు “పాక్షికమైనవని”, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వంటి వారి నుంచి వస్తున్నాయని అన్నారు. మిశ్రా రాజీనామాను మొదటగా డిమాండ్ చేసిన సంస్థలలో సీజేపీ ఒకటి.
“న్యాయవాదులకు మెరుగైన నాయకత్వం లభించాలంటూ బీసీఐ కో-ఛైర్మన్ ఇప్పుడు ఆయనను రాజీనామా చేయమని కోరారు. మిశ్రా తీసుకున్న ఆర్థిక నిర్ణయాలపై ఇది పెద్ద ప్రశ్నార్థకం” అని సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ‘ఎక్స్’లో స్పందించారు.
“ఆయన వేరే రాజకీయ పార్టీకి చెందినవారు, సాధారణంగా కాంగ్రెస్ వారికి మద్దతు ఇస్తారు. కాబట్టి ఇదంతా రాజకీయ కక్షసాధింపు, రాజకీయ స్టంట్. ఆయన గత ఎనిమిదిన్నరేళ్లుగా బీసీఐ సభ్యుడిగా ఉన్నారు, కానీ ఎప్పుడూ నోరు విప్పలేదు” అని మిశ్రా వ్యాఖ్యానించారు.
ఆర్థిక అక్రమాల ఆరోపణలను తిరస్కరించిన మిశ్రా, ట్రస్ట్ వ్యవహారాలు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయని, అందులో బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్లు ట్రస్టీలుగా ఉన్నారని చెప్పారు.
“ఎవరైనా వచ్చి ఖాతాలను తనిఖీ చేయవచ్చు. ట్రస్ట్‌కు ప్రతి ఏటా ఆడిట్ జరుగుతుంది. ఆ నివేదికను బడ్జెట్లో చేర్చి, పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచుతాము”అని మిశ్రా తెలిపారు.
మిశ్రా క్షమాపణలు..
విద్యార్థుల నమోదును నిలిపివేయాలనే ఆదేశాన్ని మిశ్రా తర్వాత వెనక్కి తీసుకున్నప్పటికీ, నల్సార్ వైస్ ఛాన్సలర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని, బార్ కౌన్సిళ్లు వారి రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్ చేయాలని కోరడానికి దారితీసిన ప్రవర్తనను ఇది సమర్థించదని సీజేఏఆర్ పేర్కొంది.
నల్సార్‌కి మిశ్రా రాసిన లేఖను “ఛైర్మన్ హోదాను దుర్వినియోగం చేయడమే” అని అభివర్ణిస్తూ బాంబే బార్ అసోసియేషన్ చేసిన తీర్మానానికి సీజేఏఆర్ మద్దతు తెలిపింది.
నల్సార్, ఎన్ఎల్ఎస్ఐయూ బెంగళూరు సహా పలు లా యూనివర్సిటీల విద్యార్థులు తమ గురించి చేసిన వ్యాఖ్యలకు, 2026 బ్యాచ్‌పై తీసుకోవాలని చూసిన చర్యలకు గానూ మిశ్రా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్‌ను తమ కాన్వొకేషన్‌కు ఆహ్వానించడాన్ని విద్యార్థులలో ఒక వర్గం వ్యతిరేకించిన తర్వాత ఈ వివాదం మొదలైంది.
విద్యార్థులకు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదని, మిశ్రా తర్వాత చెప్పిన క్షమాపణ ఆయన రాజీనామాకు ప్రత్యామ్నాయం కాదని అసోసియేషన్ పేర్కొంది.
నిరసన తెలిపే హక్కును, భావప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకున్నందుకు న్యాయ పట్టభద్రుల కెరీర్లను బెదిరించే నియంత్రణ అధికారులు ఆ పదవిలో కొనసాగడానికి “అనర్హులు”అని, మిశ్రా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే ధోరణికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అని సీజేఏఆర్ పేర్కొంది.
అనువాదం : కె సత్యరంజన్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
