సహకార వ్యవస్థకు పట్టిన ‘చెదలు’పై సమరశంఖం పూరించి అక్షరం, ఆచరణతో శ్రమజీవుల రక్షణ కవచంగా నిలిచిన దార్శనికుడు.
అక్షరాన్ని ఆయుధంగా, పోరాటాన్ని శ్వాసగా మలచి- భౌతికకాయాన్ని సైతం సమాజానికి ధారపోసిన నిస్వార్థ సమరయోధుడు కామ్రేడ్ మల్లారెడ్డి.
ఆయన వెలిగించిన సహకార జ్వాలలను రగిలిస్తూ, రైతాంగ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే ఆ అమర యోధునికిచ్చే నిజమైన గౌరవం.
“సహకారాన్ని కాపాడటం అంటే రైతు మార్కెట్ శక్తిని కాపాడటమే. రైతు చేతిలో రుణం మాత్రమే కాదు- నిర్ణయాధికారం కూడా ఉండాలి” అని సారంపల్లి అన్నారు.
సమగ్ర దృక్పథం..
రైతు సమస్యను కేవలం పొలంలో, దుక్కిలోనే చూసి సరిపెట్టుకున్న నాయకుడు కాదు ఆయన. ఆ రైతు చేతిలో ఉన్న విత్తనం ఎవరిది? పంట సాగుకు రుణం ఎక్కడి నుంచి వస్తోంది? పంటకు గిట్టుబాటు ధరను ఎవరు నిర్ణయిస్తున్నారు? పొలానికి సాగునీరు ఎక్కడి నుంచి పారుతోంది? పాలను ఎవరు కొనుగోలు చేస్తున్నారు? రైతు రుణం రోజురోజుకూ ఎందుకు పెరిగిపోతోంది? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్లు ఎలా నియంత్రిస్తున్నారు?
ఈ ప్రశ్నలన్నింటినీ ఒకే గొలుసులోని పూసలుగా అనుసంధానించి చూసిన అరుదైన రైతు ఉద్యమ దార్శనికుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి.
ఆర్థిక స్వావలంబనకు ‘సహకారం’ ఆయుధం..
మల్లారెడ్డి దృష్టిలో సహకార సంఘం అనేది కేవలం ప్రభుత్వ రుణాలను పంచిపెట్టే ఒక నిష్క్రియాత్మక సంస్థ కాదు. రైతు తన ఆర్థిక అవసరాలకు తానే యజమానిగా, నిర్ణేతగా మారే ఉన్నతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ.
తక్కువ వడ్డీకి పంట రుణం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం నుంచి మొదలుకొని-పండించిన పంటను నేరుగా మార్కెట్‌కు చేర్చడం వరకు రైతు జీవితంలోని ప్రతి కీలక దశలోనూ సహకార రంగామే రక్షణ కవచంగా నిలవాలని ఆయన చివరి శ్వాస వరకు ఆకాంక్షించారు.
స్వయం అనుభవమే ప్రామాణికం..
చిన్న, సన్నకారు రైతాంగం వాణిజ్య రుణదాతల, వడ్డీ వ్యాపారుల ముందర తలవంచకుండా నిలబడాలంటే బలమైన సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలే (పీఏసీఎస్) ఏకైక శరణ్యమని ఆయన విశ్వసించారు.
తన స్వగ్రామమైన తిమ్మంపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని అత్యంత సమర్థంగా, లాభసాటిగా నడిపిన క్షేత్రస్థాయి అనుభవం ఆయన సిద్ధాంతాలకు ఆచరణాత్మక పునాది వేసింది.
వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) నిర్వహణలోనూ డైరెక్టర్‌గా ఆయన వహించిన పాత్ర అద్వితీయం.
చెదలుపై అక్షరాస్త్రం..
రైతాంగ పోరాటాల్లో నిత్యం బిజీగా ఉండే కామ్రేడ్ సారంపల్లి, విధానపరమైన రచనలతోనూ వ్యవస్థలపై పదునైన దాడులు చేసేవారు. పాలకుల సరళీకరణ విధానాలు, ఆర్బీఐ నిబంధనల పేరిట సహకార వ్యవస్థను ఎలా దెబ్బతీస్తున్నారో వివరిస్తూ- ‘సహకార రంగానికి చెదలు’ పేరుతో ఆయన రాసిన లోతైన వ్యాసం ప్రజా ఉద్యమాల్లో ఒక దార్శనిక పత్రంగా నిలిచింది.
1944 నుంచి 1991 వరకు దేశాభివృద్ధిలో, హరిత విప్లవంలో సహకార వ్యవస్థ వహించిన కీలక పాత్రను కొనియాడుతూనే- ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల పడుతున్న ‘చెదలు’ను ఆ వ్యాసంలో నిర్భయంగా ఎండగట్టారు.
సహకార రంగాన్ని పవిత్రంగా కాపాడుకోవాలనే ఆయన ఆశయానికి, రైతాంగ హక్కుల పట్ల ఆయనకున్న అపార నిబద్ధతకు ఆ రచన ఒక సజీవ ప్రతీక.
పాలకుల సరళీకరణపై నిప్పులు..
ప్రభుత్వాల నిర్లక్ష్యం, నయా ఉదారవాద విధానాలు, ప్రైవేటీకరణ పేరుతో సహకార మార్కెటింగ్ వ్యవస్థను కుంటుపరచడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. సహకార చక్కెర కర్మాగారాలు, స్పిన్నింగ్ మిల్లులు, డెయిరీలు, ఇతర ప్రజా ఆధారిత వ్యవస్థలను మూసివేయడం లేదా కార్పొరేట్ చేతుల్లోకి నెట్టివేయడం వెనుక ఉన్న కుట్రలను అక్షర రూపంలో పదేపదే ప్రశ్నించారు.
‘సహకారాన్ని కాపాడటం అంటే ఒక బ్యాంకునో, సంఘాన్నో కాపాడటం కాదు.. రైతు మార్కెట్ శక్తిని, ఆత్మగౌరవాన్ని కాపాడటం’ అనేది ఆయన ప్రతిపాదించిన అమూల్యమైన సూత్రం.
విధానపరమైన డిమాండ్లు – కార్యాచరణ..
ధాన్యం, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాలను మాత్రమే ప్రభుత్వాలు క్రియాశీలకంగా ఉపయోగించాలని డిమాండ్ చేశారు.
దళారుల దోపిడీని అరికడుతూ, మహిళా పాడి సహకార సంఘాలను ప్రోత్సహించాలని కోరారు. సహకార బ్యాంకులకు ప్రభుత్వం వెంటనే పునరుజ్జీవన నిధులు ఇచ్చి, మూలధనాన్ని పెంచాలని వాదించారు.
పంట నష్టాలు, ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులు అప్పు తీర్చలేకపోతే వారిని ‘డీఫాల్టర్లు’ అని ముద్రవేసి రుణాలకు దూరం చేయడం శోచనీయమని గణాంకాలతో సహా నిరూపించారు.
రైతు ఆత్మహత్యలు, రుణభారం, కల్తీ విత్తనాలు, గిట్టుబాటు ధరలు, పంట నష్టాలు, సాగునీటి కొరత వంటి సమస్యలపై ఆయన సాగించిన పోరాటం కూడా సహకార దృక్పథంతోనే ముడిపడి ఉంది.
పాల సహకార సంఘాలపై ప్రత్యేక శ్రద్ద..
పాడి రంగంపైనా ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉండేది. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు పాడి సహకార సంఘాలు ఎంతో ముఖ్యమని ఆయన గుర్తించారు. పాలు ఉత్పత్తి చేసే రైతుకు నేరుగా మార్కెట్, సమయానికి చెల్లింపు, పశుపోషణకు అవసరమైన సహాయం అందేలా సహకార డెయిరీలు బలపడాలని కోరేవారు. పాడి ఉత్పత్తులపై అనవసర భారాలు పడకుండా చూడాలని, మహిళా సహకార సంఘాలను ప్రోత్సహించాలని ఆయన వాదించారు.
ఒక గ్రామంలో పాడి సహకార సంఘం బలపడితే ఒక కుటుంబం మాత్రమే కాదు— మొత్తం గ్రామీణ మహిళా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అనే దృక్పథం ఆయనది.
సిద్ధాంతకర్త మాత్రమే కాదు.. పోరాటంలో ముందంజ..
సహకార వ్యవస్థకు పట్టిన ‘చెదలు’ను సమూలంగా తుడిచిపెట్టడానికి ఆయన కేవలం వ్యాసాలు రాసే సిద్ధాంతకర్తగానే మిగిలిపోలేదు.
ప్రత్యక్ష పోరాటంలో ముందంజ వేశారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు నాటి ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ రంగాన్ని విడగొట్టే విధానాలను, వ్యవసాయానికి నీటి మీటర్లు బిగించే కుట్రలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో నిరసన తెలుపుతూ స్వయంగా నీటి మీటర్‌ను పగులగొట్టి, జైలు శిక్ష అనుభవించి, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేసిన ధీశాలి ఆయన.
బహుముఖ ఉద్యమ చారిత్రక సాక్షి..
ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ), డంకెల్ ముసాయిదా ముప్పులను ముందే గుర్తించి కొల్లి నాగేశ్వరరావు వంటి ఉమ్మడి ఉద్యమ సహచరులతో కలిసి దేశవ్యాప్త పోరు నడిపారు.
రైతుల ఆత్మహత్యల నివారణకు జస్టిస్ పీఏ చౌదరి కమిషన్ (2001), ప్రొఫెసర్ జయతి ఘోష్ కమిషన్ (2004) ఏర్పాటు చేయించడంలోనూ, రాష్ట్రమంతటా పర్యటించి నివేదికల రూపకల్పనకు శాస్త్రీయ సమాచారం అందించడంలోనూ ఆయన వహించిన పాత్ర చరిత్ర పుటల్లో చెరిపివేసి లేనిది.
ఎఫ్‌సీఐ లోపాలపై పార్లమెంటునే ఒప్పించిన మేధావి..
2005లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) సలహా కమిటీలో సభ్యుడిగా ఉంటూ, తేలపల్లి రాఘవయ్య కమిటీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోదాములను పర్యటించారు.
ఏడాదికి రూ. 2,342 కోట్ల నష్టం జరుగుతోందని, మధ్యదళారులను తొలగించి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని 2007 సెప్టెంబరు 22న నివేదిక ఇచ్చి, కేంద్ర పార్లమెంటు చేతనే దానికి ఆమోదం పొందేలా చేశారు.
నీటిపారుదల రంగానికి విజ్ఞాన కోశం..
నదుల పుట్టుక నుంచి నీటి ప్రవాహం, రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం, ఆయకట్టు విస్తీర్ణం, ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం బడ్జెట్ గణాంకాల వరకు అన్నీ ఆయన వేళ్ల కొనలపై ఉండేవి.
ప్రజాశక్తి జర్నలిజం స్కూలులో జర్నలిస్టులకు పాఠాలు బోధించేటప్పుడు నల్లబల్లపై ఆయన చకచకా లెక్కలు కడుతుంటే ఒక మహామహోపాధ్యాయుడు కళ్లముందు సాక్షాత్కరించేవారు.
ఇది కేవలం శిష్యుల, అభిమానుల సొంత భావన మాత్రమే కాదు- ఎంఎస్ స్వామినాథన్, పి సాయినాథ్ వంటి జాతీయస్థాయి నిపుణులు, వ్యవసాయ రంగాన్ని నిశితంగా పరిశీలించే జర్నలిస్టు ప్రముఖులు సైతం ఆయన క్షేత్రస్థాయి విజ్ఞానాన్ని చూసి ముక్తకంఠంతో ఏకీభవించిన అక్షర సత్యం.
శాశ్వత అక్షర సంపద – 20 గ్రంథాలు..
రాజకీయాల్లోకి రాకముందు వంశపారంపర్యంగా వచ్చిన తిమ్మంపేట పోలీస్ పటేల్ బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన అనుభవం ఆయనది. రెవెన్యూ, పంచాయతీరాజ్, సహకార చట్టాలపై ఆయనకున్న అవగాహన అసాధారణం.
‘సహకార రుణాలు’, ‘తెలంగాణలో సాగునీటి వనరులు’, ‘భారత రైతాంగ పోరాటాలు’, ‘కార్పొరేట్ దిశన వ్యవసాయం’ తదితర 20కి పైగా గ్రంథాలను రచించి రాబోయే తరాలకు రైతు విజ్ఞాన సంపదను వారసత్వంగా మిగిల్చారు.
కమ్యూనిస్టు నిరాడంబరతకు నిలువెత్తు రూపం..
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం ఆయన నైజం. హైదరాబాద్‌లో సుదీర్ఘకాలం నివసించినా రెండు చిన్న గదుల అద్దె ఇల్లు, ప్రయాణాలకు ఆటోలు, బస్సులు- ఇదీ ఆయన నిరాడంబర జీవనశైలి.
1981లో సర్పంచిగా, సొసైటీ ఛైర్మన్‌గా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిగా, ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నత పదవులు అధిరోహించినా సాదాసీదా రైతు ఆహార్యాన్నే కడవరకు కొనసాగించారు.
కార్యకర్తల కుటుంబాలే తన కుటుంబం..
కామ్రేడ్ మల్లారెడ్డి దృష్టిలో ఉద్యమం అంటే కేవలం వేదికలపై చేసే ఉపన్యాసాలు, సభా సమావేశాలు మాత్రమే కావు.
మనుషులను, కార్యకర్తలను ఆప్యాయంగా ప్రేమించడం. ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా హోటళ్లలో కాకుండా నాయకులు, సాధారణ కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తూ- వారి పిల్లల చదువులు, కుటుంబ సంక్షేమాన్ని ఆప్యాయంగా పలకరించేవారని పార్టీ శ్రేణులు, నాటి ఉద్యమ సహచరులు ఇప్పటికీ ఎంతో భావోద్వేగంతో గుర్తుచేసుకుంటారు.
ఆయన సతీమణి భాగ్యలక్ష్మి సైతం రైతు సంఘం కార్యవర్గంలో చురుగ్గా పనిచేస్తూ ఆయన నిరంతర పోరాటాలకు, ఆరోగ్యానికి కొండంత అండగా నిలిచారని- తన కుటుంబాన్ని సైతం కమ్యూనిస్టు భావజాలంతో ఉద్యమానికే అంకితం చేసిన నిజమైన ప్రజా నాయకుడని కమ్యూనిస్టు శ్రేణులు, రైతాంగ నాయకులు బలంగా విశ్వసిస్తారు.
రాజీలేని భావజాలం – ధన్యజీవి..
వయోభారం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ 2026 ఆగస్టు 24న హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో తన 88వ ఏట కన్నుమూసే వరకు ఆయన చింతనంతా రైతాంగ భవిష్యత్తుపైనే ఉంది.
నిస్వార్థ సేవకు నిదర్శనంగా భౌతికకాయాన్ని సైతం గాంధీ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం దానం చేసి, చనిపోయి కూడా సమాజానికి ఉపయోగపడే ఆదర్శవంతమైన ధన్యజీవితాన్ని ముగించారు.
సహకార దిగ్గజానికి అశ్రునీరాజనం..
మల్లారెడ్డి నిష్క్రమణ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కమ్యూనిస్టు నాయకులు బీవీ రాఘవులు, కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ, రైతు నాయకులు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించి, ఆయన నిబద్ధతను, సేవలనూ కొనియాడారు.
పార్టీలకు అతీతంగా ప్రతి ప్రజా గుండె ఆయన నిష్క్రమణకు అశ్రునయనం సమర్పించింది.
ఆశయ సాధనే నిజమైన నివాళి..
మల్లారెడ్డి మరణంతో తెలుగు నేల ఒక గొప్ప విజ్ఞాన నిధిని, సహకార రక్షణ కవచాన్ని కోల్పోయింది.
అయితే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి సంతాప వేదికలకే పరిమితం కాకూడదు. బలహీనపడుతున్న ప్రాథమిక సొసైటీలను (పీఏసీఎస్) పునరుద్ధరించడం, సహకార బ్యాంకులను కార్పొరేట్ కబ్జా నుంచి రక్షించడం, మహిళా-చిన్న రుణగ్రహీతల హక్కులను కాపాడటమే ఆయన కలకు నిజమైన కర్మరూపం.
వెలుగులు నింపే సహకార స్ఫూర్తి..
సహకార రంగాన్ని బతికించుకోవడమే రైతు భద్రతకు, గ్రామీణ భారతదేశ పునర్నిర్మాణానికి మార్గమని కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి బలంగా చాటారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చిందించిన స్వేదం, రాసిన ప్రతి అక్షరం, రగిల్చిన ఉద్యమ జ్వాలలు సహకార రంగానికి దిక్సూచిగా నిలుస్తాయి. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుదాం.. సహకార జెండాను ఎగురవేద్దాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
