అగ్రరాజ్యాలను మెప్పించడమే దౌత్య విజయమా?
మాటల్లో విశ్వగురు… చేతల్లో సర్దుబాటు!
అంతర్జాతీయ వేదికలపై భారత దౌత్య పరిమితులు
న్యూఢిల్లీలో బ్రిక్స్ సమావేశం ముగిసింది. భారత్ ప్రపంచ రాజకీయాల్లో కీలక స్వరంగా ఎదిగిందా? లేక అగ్రరాజ్యాల మధ్య తన ప్రయోజనాలను కాపాడుకునే స్థాయికే పరిమితమైందా?
బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణం, గ్లోబల్ సౌత్‌కు ప్రాతినిధ్యం, డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయం, కొత్త అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై భారత్ తన దిశను స్పష్టం చేసింది. ప్రపంచ దక్షిణానికి స్వరం కావాలన్న ఆకాంక్షను కూడా వ్యక్తం చేసింది. కానీ మాటలకూ, ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే వాస్తవ శక్తికీ మధ్య ఉన్న దూరమే ఇప్పుడు అసలు ప్రశ్న.
అమెరికా–చైనా–రష్యా వంటి మహాశక్తుల మధ్య తన ప్రయోజనాలను సమతుల్యం చేసుకోవడమే భారత విదేశాంగ విధానమా? లేక ప్రపంచ రాజకీయాల దిశను స్వయంగా ప్రభావితం చేసి, మార్పుకు నాయకత్వం వహించేంత స్వతంత్ర శక్తిగా భారత్ నిజంగా ఎదిగిందా? మహామహులైన ప్రపంచ దేశాల ఆర్థిక, వాణిజ్య వ్యూహాలకు మనం కేవలం ఒక పెద్ద ‘వినియోగదారుల సంత’గా మిగిలిపోతున్నామా?
ప్రగతిభేరి మోగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశాల నేపథ్యాన్ని పరిశీలిస్తే, భారత విదేశాంగ విధానంలోని వైరుధ్యాలు, అంతర్గత బలహీనతలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.
ప్రపంచ జనాభాలో సింహభాగం కలిగి ఉన్నప్పటికీ, విదేశీ శక్తుల కన్ను మన నైపుణ్యం పైకంటే మన కొనుగోలు శక్తిపైనే ఎక్కువగా ఉంది. మన ఆర్థిక మూలాలను తమ ఉత్పత్తులకు మార్కెట్‌గా మార్చుకోవడానికే అంతర్జాతీయ అగ్రరాజ్యాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మనం మాత్రం దానికి ‘విదేశీ పెట్టుబడులు’ అని రంగు పూసి తలొగ్గుతున్నాం.
బ్రిక్స్ వేదికగా గ్లోబల్ సౌత్ గొంతుకగా నిలుస్తున్నామని చెబుతున్నా, కూటమిలోని ఇతర పెద్ద దేశాలైన చైనా, రష్యాల వ్యూహాత్మక ఆధిపత్యం ముందు మన పాత్ర పరిమితంగానే మారుతోంది. కేవలం సమూహాల్లో ఉండటమే తప్ప, ప్రపంచ రాజకీయాన్ని తిప్పగల చక్రబంధాన్ని వేసే సామర్థ్యం మన దౌత్యానికి కరువైంది.
ప్రపంచ వేదికపై ‘సుస్థిర అభివృద్ధి’, ‘సమానత్వం’, ‘మహిళా సాధికారత’, ‘మానవకేంద్రిత సాంకేతికత’ వంటి మాటలు చెప్పడం ఎంత అవసరమో, దేశంలో వాటిని అమలు చేయడం అంతకంటే అవసరం.
ప్రపంచానికి ప్రజాస్వామ్యం, సమానత్వం, బహుళత్వం బోధిస్తూ—దేశంలోనే పేదరికం, నిరుద్యోగం, కుల వివక్ష, మత విద్వేషం పెరిగితే, ప్రపంచం భారత్ మాటను ఎలా విశ్వసిస్తుంది? భారత్ నైతికంగా ప్రపంచానికి ఎలా మార్గనిర్దేశం చేయగలదు?
అత్యంత తీవ్రమైన సమస్య ఇక్కడే ఉంది. భారత రాజ్యాంగం సెక్యులర్ ప్రజాస్వామ్య గణతంత్రాన్ని నిర్మించింది. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని నిరంతరం ఎన్నికల సమీకరణంగా మార్చడం దేశపు అంతర్గత ఐక్యతను మాత్రమే కాదు, అంతర్జాతీయ ప్రతిష్ఠను కూడా దెబ్బతీస్తుంది. ప్రపంచ నాయకత్వం కోరే దేశం ముందుగా తన పౌరులందరికీ సమాన హక్కులు, సమాన గౌరవం, భయరహిత జీవితం అందించగలదని నిరూపించాలి.
దేశీయంగా పెరుగుతున్న మత ప్రాతిపదికన విద్వేషాలు, సామాజిక అశాంతి అంతర్జాతీయ సమాజంలో భారత ప్రతిష్టను తీవ్రంగా మసకబారాయి. ప్రజాస్వామ్య సూచీల్లో, పత్రికా స్వేచ్ఛా సూచీల్లో భారత్ స్థానం దిగజారడం దీనికి సజీవ సాక్ష్యం. మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ, సమాజాన్ని విభజించే ధోరణి వీడనంత కాలం ప్రపంచ పటంలో భారతదేశం ‘నైతిక నాయకుడిగా’ నిలబడలేదు. మత సామరస్యమే భారత అసలైన బలం.
ఇక్కడ దేశీయ వాస్తవికతను తప్పించుకోలేం. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతోంది. ప్రపంచ బ్యాంకు 2026లో ఆర్థిక వృద్ధి 7.6 శాతంగా ఉందని పేర్కొంది. పేదరికం కూడా దీర్ఘకాలంలో గణనీయంగా తగ్గిందని దాని గణాంకాలు చెబుతున్నాయి. ‘కానీ అదే సమయంలో 2025 నాటికి దాదాపు 50కోట్ల మంది భారతీయ శ్రామికశక్తి నిరుద్యోగంగా ఉండటమో, కార్మిక మార్కెట్‌కు దూరంగా ఉండటమో జరుగుతోందని ప్రపంచ బ్యాంకు 2025 నివేదిక పేర్కొంది. వృద్ధి ఉంది. కానీ ఆ వృద్ధి ప్రతి కుటుంబం జీవితంలో సమానంగా కనిపిస్తోందా అన్నదే అసలు ప్రశ్న.
ప్రపంచ రాజకీయాల్లో ప్రతిష్ఠ కేవలం సైనిక బలం లేదా జీడీపీతో రాదు. ఒక దేశం తన మైనారిటీలను ఎలా చూస్తుంది? జర్నలిస్టుల స్వేచ్ఛ ఎంత? సంస్థలు ఎంత స్వతంత్రంగా ఉన్నాయి? న్యాయవ్యవస్థపై ప్రజలకు ఎంత నమ్మకం ఉంది? మహిళలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు ఎంత భద్రంగా ఉన్నారు? పౌర స్వేచ్ఛలు ఎంత రక్షించబడుతున్నాయి? ఈ ప్రశ్నలకు బలమైన సమాధానాలు లేని దేశం ప్రపంచానికి ప్రజాస్వామ్య నమూనా చూపించగలదా?
భారత్ ప్రపంచ మార్కెట్‌కు పెద్ద వినియోగదారు. ఈ జనాభా ప్రపంచ పెట్టుబడిదారులకు అపారమైన ఆకర్షణ. కానీ ఒక దేశం పెద్ద మార్కెట్ కావడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే శక్తి కావడం ఒకటే కాదు. మార్కెట్ పరిమాణాన్ని రాజకీయ శక్తిగా మార్చాలంటే అధునాతన తయారీ, పరిశోధన, సాంకేతిక స్వావలంబన, అధిక నైపుణ్య ఉపాధి, బలమైన దేశీయ డిమాండ్, సమానమైన సంపద పంపిణీ అవసరం. జనాభాను మార్కెట్‌గా చూపించడం సులభం. అదే జనాభాను ఉత్పాదక శక్తిగా మార్చడం అసలు సవాలు.
భారత్‌ను తక్కువ చేసి చూడటం ఈ విశ్లేషణ ఉద్దేశం కాదు. 1.46 బిలియన్ జనాభా, ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటి, వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, అణ్వస్త్ర సామర్థ్యం, అంతరిక్ష సాంకేతికత, ఐటీ రంగం, ఇండియన్ ఓషన్‌లో కీలక భౌగోళిక స్థానం—ఇవన్నీ భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చాయి. ప్రపంచ వ్యవస్థలో భారత్ ఒక ముఖ్యమైన మధ్య స్థాయి ప్రపంచ శక్తి (middle power) గా మారుతోందని అంతర్జాతీయ విశ్లేషణలు కూడా చెబుతున్నాయి. కానీ ‘ముఖ్యమైన ఆటగాడు” కావడం ఒకటి; ‘ఆట నియమాలను నిర్ణయించే శక్తి’కావడం మరొకటి.
నాయకత్వం అంటే సమావేశాలు నిర్వహించడం కాదు. తీర్మానాలు చేయడం కాదు. సంయుక్త ప్రకటనలు విడుదల చేయడం కాదు. ప్రపంచ దేశాలు తమ విధానాలను మార్చుకునేంత ఆర్థిక, సాంకేతిక, దౌత్య, మానవీయ ప్రభావాన్ని సృష్టించడమే నిజమైన నాయకత్వం. ఆ స్థాయికి చేరాలంటే భారత్ తన విద్య, పరిశోధన, తయారీ, ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక భద్రత రంగాల్లో భారీ మార్పు తీసుకురావాలి.
ప్రపంచ రాజకీయాలను అమెరికా, చైనా, రష్యా వంటి శక్తులు తమ ఆర్థిక, సైనిక, సాంకేతిక సామర్థ్యాలతో ప్రభావితం చేస్తున్నాయి. భారత్ మాత్రం ఈ శక్తుల మధ్య తనకు అనుకూలమైన స్థలాన్ని వెతుక్కుంటోంది. అది తప్పు కాదు. వాస్తవానికి వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి భారత ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. కానీ మధ్యలో నిలబడటం మాత్రమే ప్రపంచ నాయకత్వం కాదు. అవసరమైనప్పుడు స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయాన్ని ప్రపంచం గౌరవించే స్థాయికి ఎదగడం నిజమైన స్వయంప్రతిపత్తి.
బ్రిక్స్ విస్తరణతో భారతదేశానికి మరొక అవకాశం వచ్చింది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలతో అభివృద్ధి భాగస్వామ్యాలను నిర్మించవచ్చు. చైనా లేదా అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా మరో ఆధిపత్యాన్ని సృష్టించడం కాకుండా, చిన్న దేశాలకు నిజమైన స్వరం కల్పించే వ్యవస్థను నిర్మించవచ్చు.
అయితే ఆ పాత్రను పోషించాలంటే దేశం లోపల ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి. ఆర్థిక వృద్ధి ఫలాలు కొద్దిమందికి కాకుండా విస్తృత ప్రజానీకానికి చేరాలి. యువతకు గౌరవప్రదమైన ఉపాధి రావాలి. విద్య, ఆరోగ్యం ప్రజా హక్కులుగా బలపడాలి. మతం పేరుతో ప్రజలను విడదీయడం ఆగాలి. రాజ్యాంగ విలువలు రాజకీయ నినాదాలుగా కాకుండా పాలనా ప్రమాణాలుగా మారాలి. దేశంలోనే ప్రజాస్వామ్య విలువలు బలహీనపడుతుంటే, ప్రపంచ ప్రజాస్వామ్య సంస్కరణలకు నాయకత్వం వహిస్తామని చెప్పడం స్పష్టమైన వైరుధ్యం.
అందుకే బ్రిక్స్ సమావేశం ముందు భారత్ తనను తాను అడగాల్సిన ప్రశ్న—’ప్రపంచాన్ని మార్చగలమా?’ అన్నది కాదు. ‘ప్రపంచం మన మాట ఎందుకు వినాలి?’ అన్నది. జనాభా కోసం ప్రపంచ మార్కెట్లు భారత్‌ను కోరవచ్చు. భౌగోళిక స్థానం కోసం మహాశక్తులు భారత్‌ను కోరవచ్చు. వ్యూహాత్మక ప్రయోజనాల కోసం కూటములు భారత్‌ను కోరవచ్చు. కానీ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, మానవ గౌరవం, శాంతి విషయంలో భారత్ చెప్పే మాటను ప్రపంచం గౌరవించాలంటే—ఆ మాటకు ముందుగా దేశం లోపలే ఆచరణకు బలం ఉండాలి. బ్రిక్స్ భారత్‌కు ప్రపంచాన్ని మార్చే అవకాశం ఇస్తోంది. ఆ అవకాశాన్ని కేవలం దౌత్య ఫోటోలుగా మిగలనివ్వాలా, లేక కోట్లాది ప్రజల జీవితాలను మార్చే కొత్త అంతర్జాతీయ పాత్రగా మలచాలా అన్నది పాలకుల చేతుల్లోనే కాదు—ప్రజాస్వామ్య సమాజం అప్రమత్తతలో కూడా ఉంది. ప్రపంచ నాయకత్వం కోసం మొదటి అడుగు ప్రపంచ వేదికపై కాదు. భారత రాజ్యాంగం ముందు వేయాలి.
ఇక్కడే బ్రిక్స్ వేదిక అసలు పరీక్ష. బ్రిక్స్ ప్రపంచ వ్యవస్థను కూల్చి కొత్త వ్యవస్థను నిర్మించాలన్న కూటమిగా కాకుండా, ప్రస్తుత బహుళపాక్షిక వ్యవస్థను మరింత ప్రాతినిధ్యంతో, సమానత్వంతో మార్చాలన్న వేదికగా భారత్ తన పాత్రను వివరిస్తోంది. యూఎన్, ఐఎంఎఫ్, డబ్ల్యూటీవో వంటి సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ప్రాతినిధ్యం కావాలని భారత్ కోరుతోంది. ఇది ముఖ్యమైన డిమాండ్. కానీ డిమాండ్ చేయడం ఒకటి, దాన్ని అమలు చేయించగల సామర్థ్యం సంపాదించడం మరొకటి.
బ్రిక్స్ దేశాల జనాభా, వనరులు, ఆర్థిక బలం కలిపితే అపారమైన శక్తి కనిపిస్తుంది. కానీ అది ఒకే రాజకీయ శక్తి కాదు. సభ్యదేశాల ప్రయోజనాలు, భద్రతా ఆందోళనలు, ఆర్థిక నమూనాలు, విదేశాంగ ప్రాధాన్యతలు పరస్పరం భిన్నంగా ఉన్నాయి. ఇరాన్‌పై జరిగిన దాడుల సమయంలో బ్రిక్స్ సమిష్టి స్పందన పరిమితంగా ఉండటం కూడా ఈ అంతర్గత వైరుధ్యాలను చూపించింది. కలిసి కూర్చోవడం సులభం. కలిసి ప్రపంచ నిర్ణయాన్ని ప్రభావితం చేయడం కష్టం.
విదేశాంగ విధానం అనేది కేవలం విదేశీ పర్యటనలు, అంగరంగ వైభవంగా నిర్వహించే శిఖరాగ్ర సమావేశాలకే పరిమితం కాకూడదు. అది దేశ పౌరుల ఆత్మగౌరవాన్ని, ఆర్థిక స్వతంత్రతను కాపాడేదిగా ఉండాలి.
ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించకుండా, కేవలం జనాభా అనివార్యతను చూపి మార్కెట్‌గా మారడం ద్వారా అగ్రరాజ్యాలను శాసించే శక్తి ఏ దేశానికీ రాదు. మన అంతర్గత బలహీనతలే విదేశీ శక్తులకు మనపై ఒత్తిడి తెచ్చే అవకాశాన్ని ఇస్తున్నాయి.
చరిత్ర చెప్పిన పాఠాలను విస్మరించి, పొరుగుదేశాలతో సరిహద్దు సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతూ, అగ్రరాజ్యాల మధ్య సమతుల్యం పాటించడాన్నే దౌత్య విజయంగా చెప్పుకోవడం నిజమైన విదేశాంగ విజయాన్ని కప్పిపుచ్చడమే.
న్యూఢిల్లీలో 20 ఏళ్ల మైలురాయిని చేరుకున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు ముగింపు సందేశం గమనిస్తే… ఆధిపత్య శక్తులకు ఎదురొడ్డి సొంత అజెండాను నిర్దేశించే నైతిక తెగువ కంటే, కూటమిలోని అంతర్గత వైరుధ్యాలను కప్పిపుచ్చుకునే ‘రాజీ దౌత్యమే’ స్పష్టంగా కనిపిస్తుంది. గాజాలో ఇజ్రాయెల్ హింసను నిరసిస్తూ, పాలస్తీనియన్ల నిర్బంధ నిర్వాసితుల యత్నాలను ఖండిస్తూ, ఇరాన్ అణు కేంద్రాలపై దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఐక్యరాజ్యసమితి ఆమోదం లేని ఏకపక్ష ఆంక్షలు, సుంకాలను తప్పుపడుతూ ముగింపు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అయితే, పశ్చిమాసియా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఇంధన రంగాన్ని, సరఫరా వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న ఈ కీలక ఘడియలో—కూటమికి అధ్యక్షత వహిస్తున్న భారత్ ‘బ్రిక్స్ ఎవరికీ వ్యతిరేకం కాదు’ అంటూ అగ్రరాజ్యాలను సంతృప్తి పరిచే సంకేతాలివ్వడానికే ప్రాధాన్యమిచ్చింది. చైనా, రష్యాలు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ ప్రత్యామ్నాయ ద్రవ్య వ్యవస్థ వైపు వేగంగా అడుగులు వేస్తుంటే, భారత్ మాత్రం పాశ్చాత్య దేశాల వ్యాపార సంబంధాల మధ్య, గ్లోబల్ సౌత్ నాయకత్వ ఆకాంక్షల మధ్య నలిగిపోతూ కేవలం ఒక ‘సర్దుబాటుదారుడి’ పాత్రకే పరిమితమైంది.
ప్రపంచం మన వైపు గౌరవంతో చూడాలంటే… ముందుగా మనం మన ఇంట్లోని అసమానతలను, అశాంతిని తుడుచిపెట్టాలి. మన సెక్యులర్ ప్రజాస్వామ్య పునాదులను, రాజ్యాంగ విలువలను రక్షించుకున్నప్పుడే మన విదేశాంగ విధానానికి నిజమైన నైతిక బలం చేకూరుతుంది. కేవలం అగ్రరాజ్యాల వస్తువులను కొనుగోలు చేసే ‘వినియోగదారుల సంత’గా మిగిలిపోదామా? లేక తన నైతిక విశ్వసనీయతతో ప్రపంచానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శిగా ఎదుగుదామా? అనేది మన అంతర్గత ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తిపైనే ఆధారపడి ఉంది. మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది!
కృష్ణ కానూరి,
7981305 779
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
