దక్షిణాసియా ప్రవాస సమూహాల నుంచి వ్యతిరేకత తీవ్రం కావడంతో మోహన్ భగవత్ లండన్ కార్యక్రమాన్ని గోప్యంగా నిర్వహించాల్సి వచ్చింది. చివరకు ఆయన పాల్గొన్న ఆఖరి కార్యక్రమం వేదిక వెలుపల కూడా నిరసనలు చోటుచేసుకున్నాయి.
లండన్: ఇటీవల ముగిసిన మోహన్ భగవత్ అంతర్జాతీయ పర్యటనను ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విస్తృతంగా ప్రచారం చేశారు. భారత్, హిందూ సమాజం, ఆర్ఎస్ఎస్పై సానుకూలమైన, వాస్తవాధారిత దృక్పథాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడం, ఆ సంస్థపై నెలకొన్న అపోహలను తొలగించడం ఈ అంతర్జాతీయ ప్రచార కార్యక్రమం లక్ష్యమని ఆర్ఎస్ఎస్ పేర్కొంది.
అయితే ఈ పర్యటన చివరి మజిలీ అయిన లండన్ పర్యటన మాత్రం గోప్యత, రాజకీయ విమర్శలు, కార్యక్రమానికి అంతరాయం వంటి పరిణామాల మధ్య ముగిసింది. ఈ పరిణామం ఆర్ఎస్ఎస్కు మిత్రుల కంటే విమర్శకులు, వ్యతిరేకులను ఐక్యం చేసే పరిస్థితిని తెచ్చిపెట్టిందని హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ యూకే (HfHR UK) సభ్యుడు రాజీవ్ సిన్హా వ్యాఖ్యానించారు.
భగవత్ అమెరికా, కెనడా నుంచి బ్రిటన్ వరకు వెంటాడిన ప్రగతిశీల దక్షిణాసియా, హిందూ సంస్థల తీవ్ర ప్రతిఘటన ఆర్ఎస్ఎస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో జాగ్రత్తగా నిర్మించుకున్న ప్రతిష్ఠను గట్టి దెబ్బతీసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సిద్ధాంతపరమైన మూల సంస్థగా పరిగణించబడుతున్న ఈ అర్ధసైనిక సంస్థ, హిందూత్వ జాతీయవాదాన్ని అమలినమైనదని, సమ్మిళితమైనదని చూపించే ప్రయత్నాలకు ఒక పరిమితి ఉందనే విషయాన్ని ఈ పరిణామాలు బహిర్గతం చేశాయి.
“ప్రపంచమంతా ఒకే కుటుంబం”, ఐక్యత వంటి నినాదాలను ముందుకు తెచ్చి భారతీయ ప్రవాస సమాజాన్ని ఆకట్టుకునే ప్రయత్నాల మాటున ఉన్న తీవ్ర మితవాద రాజకీయాలను కప్పిపుచ్చుతూ హిందూత్వ జాతీయవాదానికి అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన రూపాన్ని కల్పించాలన్న ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలకు ఇప్పుడు ఎదురు దెబ్బ తగులుతున్నై ఈ ప్రతిఘటన స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 7న సింహా నాయకత్వంలో బ్రిటన్‌లోని దక్షిణాసియా ప్రవాస సమాజానికి చెందిన హిందువులు, ముస్లింలు, సిక్కులు కలిసి నిరసనకు దిగారు. భగవత్ మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో చివరి దశలో భాగంగా లండన్‌లోని సౌత్ కెన్సింగ్టన్లో ఉన్న బెంట్లీ హోటల్లో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారన్న సమాచారం సోషల్ మీడియా ద్వారా వారికి సమాచారం అందడంతో వారు హోటల్ వెలుపల ఆందోళన చేపట్టారు.
సింహా ఎక్స్‌లో పంచుకున్న వీడియోలో బెంట్లీ హోటల్ ప్రవేశద్వారం వద్ద పోలీసులు భారీగా మోహరించి ఉండటం కనిపిస్తుంది. హోటల్ గేటు వద్దకు చేరుకున్న నిరసనకారులు గట్టిగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
“మోహన్ భగవత్, నేను హిందువును—నువ్వు ఫాసిస్టువి!” నిజమైన హిందువులు మూకదాడులకు పాల్పడరు! అంటూ వారు నినదించారు.
మరో వీడియోలో సింహా ఆందోళనకారులను ఉద్దేశించి మాకు న్యాయం దక్కకపోతే మీకు శాంతి ఉండదు అంటూ నినదించడం వినిపిస్తుంది. భగవత్ కార్యక్రమం జరిగిన హోటల్ వెలుపల చోటుచేసుకున్న ఈ నిరసన ఆయన పర్యటనకు ఎదురైన తీవ్ర వ్యతిరేకతను స్పష్టంగా చాటిచెప్పింది.
ఈ నిరసన కార్యాచరణ మొదట ఒక చిన్నస్థాయి పికెటింగ్ గా ప్రారంభమైందని సింహా తెలిపారు. ఇతర నిరసనకారులతో కలిసి తానే దీనికి ప్రాథమికంగా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.
సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ నిరసన భగవత్‌ను కలవరపాటుకు గురిచేసిందని, కార్యక్రమ నిర్వాహకులను తీవ్ర అవమానానికి గురిచేసిందని సింహా అన్నారు. నిరసన తీవ్రతతో కార్యక్రమాన్ని నిర్ణయించిన సమయానికి ముందే ముగించాల్సి వచ్చిందని, హాజరైన కొందరిని పోలీసులు సాయంతో బయటకు తీసుకెళ్లారని తెలిపారు. బయటకు వెళ్లే సమయంలో వారిలో కొందరు తమ ముఖాలను కప్పుకున్నారని ఆయన చెప్పారు.
భగవత్ తన ప్రసంగంలో మాత్రం మరింత సయోధ్యపూర్వకమైన మాటలు చెప్పారు. హిందువుగా ఉండటం అంటే కేవలం ఒక మతానికి చెందిన వ్యక్తిగా ఉండటం కాదని అన్ని రకాల వైవిధ్యాలను గౌరవించి, స్వీకరించే స్వభావాన్ని కలిగి ఉండటం అని ఆయన అన్నారు. ఐక్యతకు అందరూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు.
కానీ భగవత్ మాటలను ఆయన సారథ్యంలోని ఆర్ఎస్ఎస్నే సిద్ధాంత మూలంగా భావించే పరివార్ సంస్థలు, కార్యకర్తలు నిజంగా పాటిస్తున్నారా? లేక భగవత్ చెప్పే వైవిధ్యంలో ఐక్యత అనేది ప్రసంగాలకే పరిమితమైన మాటనా? భగవత్ అట్లాంటిక్ దాటి సాగించిన ఈ పర్యటన కొనసాగుతున్న సమయంలోనే న్యూ ఇండియా లో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలు చూస్తే అవి ఇంకా బయటపడాల్సిన విస్తృత వాస్తవంలో కేవలం ఆవగింజంత మాత్రమే అని స్పష్టమవుతోంది.
బయటపడిన ఆర్ఎస్ఎస్ సద్భావన పర్యటన అసలు పరిమితులు
సెప్టెంబర్ 2న అమెరికా, కెనడా పర్యటనలను ముగించుకుని భగవత్ లండన్ చేరుకున్నారు. అయితే ఆయన పర్యటనలో చివరి దశకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను మాత్రం బహిరంగంగా ప్రకటించకుండా కట్టుదిట్టమైన గోప్యతను పాటించారు అని సింహా తెలిపారు. తుది కార్యక్రమం ఎక్కడ నిర్వహించబోతున్నారన్న విషయాన్ని ఆహ్వానితుల నుంచి కూడా చివరి క్షణం వరకు దాచిపెట్టారని ఆయన చెప్పారు. కార్యక్రమం ప్రారంభానికి కేవలం ఐదు గంటల ముందు మాత్రమే దాని వేదిక వివరాలను ఆహ్వానితులకు వెల్లడించారని సింహా తెలిపారు.
ఇది భగవత్ అమెరికా పర్యటనలో ప్రధాన ఘట్టంగా నిలిచిన న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ కార్యక్రమానికి పూర్తి భిన్నమైన పరిణామం. ఆ కార్యక్రమాన్ని భారీ ప్రచారంతో, విస్తృత ఏర్పాట్లతో ఘనంగా నిర్వహించారు. అయితే భగవత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన నాయకత్వంపై తీవ్ర విమర్శలు, ఘర్షణాత్మక చర్చలు, తీవ్ర వ్యతిరేకత చెలరేగడంతో అది పెద్ద వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
చివరికి ఒక సద్భావన పర్యటన అనేది గోప్యతపై కాకుండా పరదర్ధకాయాపై ఆధారపడి ఉంటుంది. దాని ఉద్దేశ్యం సంభాషణే అయితే వేదికను ఎందుకు రహస్యంగా ఉంచారని వార్తలు వచ్చాయి. ఈ పెరుగుతున్న గోప్యతను సిన్హ బిక్కు బిక్కు మంటూ వేసే ముందడుగుగా అభివర్ణించారు.
యూరప్‌లోనే అత్యంత పురాతన గురుద్వారాగా పేరున్న షెపర్డ్స్ బుష్లోని ఖాల్సా జాథా బ్రిటిష్ ఐల్స్ గురుద్వారాకు భగవత్ రాకపైనా ప్రగతిశీల సిక్కు సమాజం నుంచి తీవ్రమైన ప్రతిఘటన వ్యక్తమైంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, దాని కార్యకలాపాలపై తమకు ఎప్పటినుంచో తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు ఉన్నాయని పేర్కొంటూ సిక్ ఫెడరేషన్ యూకే కూడా భగవత్ పర్యటనను వ్యతిరేకించింది.
అంటే భగవత్ చెప్పే సద్భావన, ఐక్యత సందేశానికి ఆచరణలో ఎదురవుతున్న స్పందన అంత సులభంగా లేదనే విషయం ఈ వ్యతిరేకత మరోసారి స్పష్టం చేసింది.
ఒక వ్యక్తి ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా గురుద్వారాకు వచ్చి గౌరవం సమర్పించుకోవడం వేరు. ఒక రాజకీయ సంస్థ తనకు అనుకూలమైన ప్రజా ప్రతిష్ఠను నిర్మించుకునేందుకు ముందస్తు ప్రణాళికతో చేపట్టే ప్రచార కార్యక్రమానికి గురుద్వారాను కేవలం వేదికగా, ఫొటోలకు నేపథ్యంగా మార్చడం వేరు అని సిఖ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ రెండింటి మధ్య ఉన్న కీలకమైన తేడాను విస్మరించలేమని పేర్కొంది.
ఈ తేడానే భగవత్ చేపట్టిన సద్భావన ప్రచార పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని నేరుగా ప్రశ్నించే కీలక అంశంగా మారింది.
మతాల మధ్య గోడలు అడ్డుకున్న దక్షిణాసియా ఐక్య ప్రతిఘటన
భగవత్ పర్యటన ఆయనకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ ప్రవాస భారతీయ సమూహాలను కదిలించింది. కానీ ఈ విభజనే ప్రవాస భారతీయులందరి తరఫున మాట్లాడే ఏకైక ప్రతినిధిగా ఆర్ఎస్ఎస్ తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నాన్ని బట్టబయలు చేసింది. విదేశాల్లోని భారతీయ సమాజం మొత్తం ఒకే గొంతుక కాదని ఆర్ఎస్ఎస్ చెప్పే ఏకైక భారతీయ స్వరం అన్నది వాస్తవం కాదని ఈ పరిణామం స్పష్టం చేసింది.
హిందూ, ముస్లిం, సిక్కు, అణగారిన కులాల గొంతుకలను కలుపుకుంటూ భారతీయ ప్రవాస సమాజంలో రూపుదిద్దుకుంటున్న విస్తృత కూటమి భగవత్ ఉనికినే ప్రశ్నిస్తూ ప్రతిఘటనకు దిగింది. ఈ ఐక్యత హిందూత్వ జాతీయవాదం విదేశాల్లో పదేపదే ఉపయోగించుకునే ఒక కీలక రాజకీయ కవచానికే చీలిక తెచ్చింది. ఆర్ఎస్ఎస్ను విమర్శించడం అంటే హిందువులను వ్యతిరేకించడం అన్న ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా నిలిచిన ఈ స్వరాలు హిందువులకు వ్యతిరేకమైనవి కావు. హిందువుల పేరుతో ఆర్ఎస్ఎస్ తన రాజకీయ సిద్ధాంతాన్ని సమర్థించుకునే హక్కును ప్రశ్నిస్తున్న స్వరాలు. ఇదే తేడా భగవత్ సద్భావన పర్యటనకు ఎదురైన ప్రతిఘటనలోని అసలు రాజకీయ సందేశం.
సెప్టెంబర్ 6న బ్రిటన్ పార్లమెంట్ వెలుపల భగవత్ పర్యటనకు వ్యతిరేకంగా తొలుత ఒక పెద్ద నిరసన ప్రదర్శన జరిగింది. సౌత్ ఏషియా సాలిడారిటీ గ్రూప్, ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్ (గ్రేట్ బ్రిటన్), హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ యూకే, యూకే ఇండియన్ ముస్లిం కౌన్సిల్, ఇండియా లేబర్ సాలిడారిటీ తదితర ఉద్యమ సంస్థలు ఈ ప్రదర్శనను సంయుక్తంగా నిర్వహించాయి.
ఆ తరవాత సెప్టెంబర్ 7న భగవత్ కార్యక్రమం జరుగుతున్న బెంట్లీ హోటల్ వెలుపల కూడా నిరసన వ్యక్తమైంది. అంటే పార్లమెంట్ ఎదుట ప్రారంభమైన విస్తృత నిరసన మరుసటి రోజు భగవత్ కార్యక్రమం జరిగిన ప్రదేశం వరకూ కొనసాగింది. వివిధ మతాలు, సామాజిక వర్గాలు, రాజకీయ-ఉద్యమ సంస్థలు కలిసి సాగించిన ఈ నిరసనల పరంపర భగవత్ పర్యటనకు ఎదురైన ప్రతిఘటన ఎంత విస్తృతంగా ఉందో వెల్లడించింది.
ప్లకార్డులపై ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రవాసులంతా ఒక్కటే”, “2002 గుజరాత్ మారణహోమాన్ని ఎన్నటికీ మర్చిపోవద్దు వంటి నినాదాలు దర్శనమిచ్చాయి.
నిరసనకారులు లండన్ మేయర్ సర్ సాదిక్ ఖాన్ సహా బ్రిటిష్ అధికారుల మౌనాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థకు వేదిక కల్పించే విషయంలో బ్రిటిష్ అధికారులు మౌనం వహించడం, వారి ప్రకటిత ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల పట్ల నిబద్ధతపై కూడా ప్రశ్నలు లేవనెత్తిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించనున్న కార్యక్రమానికి గ్రేటర్ లండన్ అథారిటీ ఎలాంటి వేదికను కేటాయించకూడదని కోరుతూ 20 సంస్థలు మేయర్ ఖాన్‌కు లేఖ రాశాయి.
ఈ సంస్థలు ఆర్ఎస్ఎస్ను యూరోపియన్ ఫాసిజం నుంచి స్పష్టమైన స్ఫూర్తి పొందిన నియంతృత్వ, సైనికవాద సంస్థ గా అభివర్ణించాయి. బ్రిటన్ బహుళసాంస్కృతిక స్వరూపాన్ని, వివిధ మతాలు–సమాజాలు కలిసి జీవించే ప్రజాస్వామ్య వాతావరణాన్ని కాపాడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
అంతేకాక భగవత్ బ్రిటన్‌లో ఉండటం చట్టపరంగా ఆయనను దేశంలోకి అనుమతించకుండా మినహాయించే స్థాయికి వస్తుందా లేదా అనే అంశాన్ని హోం ఆఫీస్‌తో సంప్రదించి పరిశీలించాలని కూడా ఆ సంస్థలు లండన్ మేయర్‌ను కోరాయి.
విదేశాంగ కార్యాలయానికి రాసిన లేఖలో ఈ సంస్థలు మరో కీలక ఆరోపణను కూడా చేశాయి. భగవత్ పర్యటన బ్రిటన్‌లోని ఆయన మద్దతుదారుల సహకారంతో, ప్రజల్లోకి వెళ్లి అనుకూలతను సంపాదించుకునేందుకు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగం అని పేర్కొన్నాయి.
ఆర్ఎస్ఎస్ పర్యటనపై బ్రిటన్ ఎంపీలు స్పందించక తప్పలేదు
ఈ ప్రచార ఉద్యమం బ్రిటన్‌లోని ప్రభుత్వ సంస్థలు, పార్లమెంటు సభ్యుల దృష్టికి కూడా చేరింది. భగవత్ పర్యటన బ్రిటన్ ప్రభుత్వం మానవ హక్కులు, మత స్వేచ్ఛకు సంబంధించి ప్రకటించిన కట్టుబాట్లకు విరుద్ధంగా ఉందా అనే అంశంపై నాటింగ్‌హామ్ ఈస్ట్ నియోజకవర్గ లేబర్ పార్టీ ఎంపీ నదియా విట్టోమ్ పార్లమెంటులో లిఖితపూర్వక ప్రశ్నను సంధించారు.
మాజీ లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ మాత్రం బ్రిటన్ తీవ్రమైన తీవ్ర మితవాద హింసకు సంబంధించిన చరిత్ర కలిగిన విద్వేష సంస్థ నాయకుడికి ఆతిథ్యం ఇవ్వకూడదని స్పష్టంగా తేల్చిచెప్పారు.
మత స్వేచ్ఛను అణచివేసి, మైనారిటీలపై భయానక దాడులకు స్ఫూర్తినిచ్చిన అత్యంత నియంతృత్వ, మినహాయింపువాద, వివక్షాపూరిత సంస్థ ఇది అని యువర్ పార్టీ ఎంపీ అయిన కార్బిన్ పేర్కొన్నారు. ఇలాంటి విద్వేషానికి మన నగరంలో ఎలాంటి చోటూ ఉండకూడదు. అయినప్పటికీ ఈ కార్యక్రమం ముందుకు సాగుతుండటం నిజంగా దిగ్భ్రాంతికరం అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
సరిహద్దులు దాటి విస్తరించిన ప్రతిఘటనల అంతర్జాతీయ పరంపర
లండన్‌లో ముగిసింది భగవత్ పర్యటన మాత్రమే. ఆయన పర్యటనకు వ్యతిరేకంగా సాగిన అంతర్జాతీయ ప్రతిఘటన మాత్రం లండన్‌తో మొదలైనది కాదు.
న్యూయార్క్‌లోనూ భగవత్ పర్యటనకు గట్టి రాజకీయ ప్రతిఘటన ఎదురైంది. మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో నిర్వహించిన భగవత్ యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని అంతర్మత, పౌరహక్కుల, కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే 60కి పైగా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆర్ఎస్ఎస్ ప్రచారం చేసే ఐక్యత వెనుక ఉన్న రాజకీయ మినహాయింపువాదాన్ని ప్రశ్నిస్తూ ఈ సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ కూడా ఆర్ఎస్ఎస్ దృష్టికోణాన్ని మినహాయింపువాద(వెలివేత) స్వభావం కలిగినదిగా స్పష్టంగా అభివర్ణించారు.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం భగవత్ లేదా ఆర్ఎస్ఎస్ పేర్లను ఆహ్వానాల్లో ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ఇద్దరు మత పెద్దలు తాము మోసపోయి కార్యక్రమానికి హాజరయ్యామని భావించారు. ఆ పత్రిక పరిశీలించిన ఈ-మెయిల్ సంభాషణలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఇంతటితో ఆగకుండా అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ మరింత తీవ్రంగా స్పందించింది. భగవత్‌తో పాటు ఇతర ఆర్ఎస్ఎస్ సభ్యులపై లక్ష్యిత ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చింది. అంతేకాక మత స్వేచ్ఛ ఉల్లంఘనలకు భగవత్ ఇతర ఆర్ఎస్ఎస్ సభ్యులు బాధ్యులుగా భాగస్వాములయ్యారు అని తీవ్రంగా ఆరోపించింది.
భగవత్ కెనడాలో అడుగుపెట్టడానికి చాలా ముందే ఆయన పర్యటనకు వ్యతిరేకంగా తీవ్ర ప్రతిఘటన మొదలైంది. ఆయన పర్యటనను ఇద్దరు కెనడా పార్లమెంటు సభ్యులు బహిరంగంగా వ్యతిరేకించగా, 40కి పైగా కెనడా సంస్థలు కూడా భగవత్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ తమ స్వరాన్ని వినిపించాయి. భగవత్ కెనడా చేరకముందే పార్లమెంటు సభ్యుల నుంచి పౌరహక్కుల సంస్థల వరకు విస్తరించిన ఈ ప్రతిఘటన ఆయన అంతర్జాతీయ సద్భావన పర్యటనకు ఎదురవుతున్న రాజకీయ వ్యతిరేకత ఎంత విస్తృతంగా ఉందో స్పష్టం చేసింది.
సంక్షిప్తంగా చెప్పాలంటే భగవత్ శతాబ్ది పర్యటన ముగిసే నాటికి ఆర్ఎస్ఎస్ ముందొక పదునైన సూటి రాజకీయ ప్రశ్న మిగిలింది. మూడు దేశాల్లో హిందువులే ముస్లింలు, సిక్కులు, కుల అణచివేతకు గురైన వర్గాలతో కలిసి ఆర్ఎస్ఎస్ రాజకీయాలను తిరస్కరిస్తున్నప్పుడు ప్రపంచ హిందూ సమాజానికి తామే ప్రతినిధులమని ఆర్ఎస్ఎస్ ఎలా చెప్పుకోగలదు?
ఆర్ఎస్ఎస్ తన అపారమైన వనరులు, ప్రభావాన్ని ఉపయోగించి ఎంతటి ప్రతిష్ఠాత్మక వేదికలనైనా సంపాదించుకోగలిగింది. కానీ ఆ వేదికలపై కనిపించడం ద్వారా తనకు దక్కుతుందని ఆశించిన రాజకీయ చెల్లుబాటును, ప్రజా ఆమోదాన్ని దక్షిణాసియా ఐక్యతా సంస్థలు పూర్తిగా నిరాకరించాయి. వేదికలను అయితే కొనుగోలు చేయగలిగింది కానీ వాటితో ఆర్ఎస్ఎస్ కోరుకున్న నైతిక చెల్లుబాటును మాత్రం కొనలేకపోయింది. భగవత్‌కు అంతర్జాతీయ వేదికలు దొరికాయి. కానీ ఆ వేదికలు ఆయన రాజకీయాలకు ప్రజల ఆమోద ముద్ర వేయలేకపోయాయి.
కలరవ్ జోషి
లండన్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
