స్వాతంత్ర్యం, ప్రజా చైతన్యం, విద్య, ప్రజాస్వామ్యం కోసం జీవితాలను అంకితం చేసిన ఆ ఇద్దరు మహనీయులలో సెప్టెంబర్ 14 ఒకరి జన్మ దినం, మరొకరు వర్ధంతి.
గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
“ఆంధ్ర తిలక్”గా నిలిచిన జాతీయవాది గాడిచర్ల హరి సర్వోత్తమ రావు 1883 సెప్టెంబరు 14న కర్నూలులో జన్మించారు. ఆయన ఉన్నత విద్యను అభ్యసించి 1906లో ఎం.ఏ. పట్టా పొందారు. ఆ కాలంలో ఉన్నత విద్య పూర్తి చేసిన యువకుడికి ప్రభుత్వ ఉద్యోగంలో మంచి భవిష్యత్తు ఉండేది. కానీ ఆయన తన వ్యక్తిగత భవిష్యత్తు కంటే దేశ భవిష్యత్తు ముఖ్యమని భావించారు.
ప్రజాసేవలో ఆయన జీవితం దాదాపు ఆరు దశాబ్దాలు సాగింది. భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న జాతీయవాదిగా మాత్రమే కాకుండా, విద్యావేత్త, పాత్రికేయుడి, రచయిత, గ్రంథాలయ ఉద్యమకారుడు, వయోజన విద్యా ప్రచారకుడిగా ఆయన అనేక రంగాల్లో పనిచేశారు.
గాడిచర్ల రాజమహేంద్రవరంలో విద్యార్థిగా ఉన్నప్పుడు బిపిన్ చంద్ర పాల్ రాజమహేంద్రవరంలో చేసిన ప్రసంగానికి ఆకర్షితుడయ్యాడు. ఈ ఘటన ఆయన జీవితంలో ఒక పెద్ద మలుపుకు దారి తీసింది. ఒక రోజు జాతీయ భావాలు కలిగిన విద్యార్థులు “వందేమాతరం” బ్యాడ్జీలు ధరించి కళాశాలకు వెళ్లారు. బ్యాడ్జీలు తొలగించాలని కళాశాల యాజమాన్యం బలవంతం చేసింది. కానీ విద్యార్థులు అందుకు నిరాకరించారు.విద్యార్థి నాయకుడిగా ఉన్న గాడిచర్లపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకున్నది. ఆయనను కళాశాల నుంచి బహిష్కరించడమే కాకుండా ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉద్యోగం చేయకుండా అడ్డంకులు సృష్టించారు. ఇది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఉద్యోగం కోసం తలవంచడం కంటే దేశం కోసం పోరాడడతామే ఉత్తమమని ఆయన భావించారు.
పాత్రికేయుడిగా బ్రిటిష్ పాలనపై పోరాటం:
గాడిచర్ల కలాన్ని పోరాట ఆయుధంగా ఎంచుకున్నారు. 1907-08 ప్రాంతంలో ఆయన “స్వరాజ్/స్వరాజ్య” పత్రికలకు రాసిన వ్యాసాలలో బ్రిటిష్ పాలనను తీవ్రంగా విమర్శించారు. 1908లో దేశద్రోహం ఆరోపణపై బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు జైలు శిక్ష విధించింది. మూడు సంవత్సరాలు జైలులో ఉన్నారు. విడుదల అనంతరం కూడా ప్రభుత్వం ఆయనకు ఉపాధి దొరకకుండా కఠిన ఆంక్షలు విధించింది.
బ్రిటిష్ పాలనను విమర్శిస్తే జైలు. ఉద్యోగం చేయడానికి ప్రభుత్వ ఆంక్షలు. అయినా దేశ సేవను మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే ఆయనను ఆంధ్ర ప్రాంతపు తొలి రాజకీయ ఖైదీలలో ఒక ప్రముఖుడిగా గుర్తిస్తారు.
పత్రికను ప్రజా చైతన్య వేదికగా మార్చిన వ్యక్తి:
పత్రిక అంటే కేవలం వార్తలను ప్రచురించడమే కాదు. ప్రజలలో జాతీయ చైతన్యం కలిగించాలి. అన్యాయాన్ని ప్రశ్నించాలి. ప్రజలకు తమ హక్కుల గురించి తెలియజేయాలి. సామాజిక దురాచారాలను ఎండగట్టాలి.ఈ లక్ష్యంతో ఆయన అనేక పత్రికలు, ప్రచురణా సంస్థలలో పనిచేశారు. 1914లో ఆయన ఆంధ్రపత్రిక తెలుగు దినపత్రికకు తొలి సంపాదకుడిగా పనిచేశారు. తరువాత ఆంధ్ర హోం రూల్ లీగ్‌లోనూ కీలక పాత్ర పోషించారు.
గ్రంథాలయోద్యమం:
స్వాతంత్ర్యం వచ్చినంత మాత్రాన ప్రజలు స్వేచ్ఛను అనుభవించలేరని ఆయన భావన. ప్రజలు అజ్ఞానంలో ఉంటే రాజకీయ స్వేచ్ఛకు అర్థం ఉండదని ఆయన గ్రహించారు. అందుకే ఆయన గ్రంథాలయోద్యమాన్ని ప్రజా చైతన్య ఉద్యమంగా తీర్చిదిద్దారు. ఆంధ్రలో గ్రంథాలయ ఉద్యమానికి గాడిచర్ల హరి సర్వోత్తమ రావు, అయ్యంకి వెంకట రమణయ్య, పాతూరి నాగభూషణం తదితరులు చేసిన సేవలు అత్యంత ప్రధానమైనవి. గాడిచర్ల ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు దీర్ఘకాలం నాయకత్వం వహించారు. గ్రంథాలయాన్ని ఆయన కేవలం పుస్తకాలు పెట్టే భవనంగా చూడలేదు. గ్రంథాలయం అంటే జ్ఞాన కేంద్రం. జ్ఞానం అంటే చైతన్యం. చైతన్యం ఉంటే హక్కులపై అవగాహన కలుగుతుంది. అది ప్రజాస్వామ్యానికి పునాది అని బలంగా విశ్వాసించారు.
వయోజన విద్య — ప్రజాస్వామ్యానికి పునాది:
గాడిచర్లకు వయోజన విద్యపై ప్రత్యేకమైన శ్రధ్ధ, ఆసక్తి ఉండేవి. 1937లో మద్రాస్ ప్రభుత్వం ఆయనను వయోజన విద్యకు Honorary Director and Organiser గా నియమించింది. తరువాత ఆయన తన జీవితాన్ని వయోజన విద్య, గ్రంథాలయ ఉద్యమాలకు అంకితం చేశారు. వయోజనులలో నిరక్షరాస్యత రూపుమాపి, సాంస్కృతిక చైతన్యం కల్పించడం వయోజన విద్య యొక్క రెండు ముఖ్య లక్ష్యాలు. గ్రంథాలయం ఆ జ్ఞానాన్ని ప్రజలకు చేరవేసే ప్రధాన సాధనమని ఆయన భావించారు. ఆవిధంగా వయోజన విద్య కేవలం అక్షరాలు నేర్పడం కాదు. మనిషిని ఆలోచించే పౌరుడిగా తీర్చిదిద్దడం అని ఆయన గాఢంగా విశ్వసించారు, ఆచరించారు.
గాడిచర్ల “అబ్రహాము లింకన్ చరిత్ర”, “శ్రీరామ చరిత్ర”, “పౌర విద్య”, “వయోజన విద్య” వంటి అనేక రచనలు చేశారు. ఆయన రచనలు విద్యా రంగంలో బాగా ఉపయోగ పడ్డాయి. తెలుగులో మంచి సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు విజ్ఞాన చంద్రికా మండలి వంటి సంస్థలతో కలసి పని చేశారు.
రాజకీయ జీవితంలో ప్రజా సేవ:
గాడిచర్ల కేవలం ఉద్యమకారుడే కాదు. 1927 నుంచి 1930 వరకు మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్‌లో సభ్యుడిగా ఉన్నారు. అయితే పదవులు ఆయన లక్ష్యం కాదు. ప్రజాసేవ కోసం పదవి తప్ప పదవి కోసం ప్రజాసేవ కాదు అన్నది ఆయన జీవిత సత్యం. 1930 తర్వాత రాజకీయ కార్యక్రమాలను కొంత తగ్గించి, తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గ్రంథాలయ, వయోజన విద్యా ఉద్యమాలపై ఎక్కువ దృష్టి పని చేశారు. గాడిచర్ల హరి సర్వోత్తమ రావు జీవితం ప్రజా చైతన్యానికి మారు పేరు. స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలన అంతం కాదు అని ఆయన ప్రగాఢంగా నమ్మారు. ప్రజలు చదవాలి,
ఆలోచించాలి, తమ హక్కులు తెలుసుకోవాలి, సామాజిక అసమానతలను ప్రశ్నించాలి, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అందుకే ఆయన స్వాతంత్ర్య సమరయోధుడే కాక ప్రజా చైతన్య కారుడు కూడా. 1960 ఫిబ్రవరి 29న ఆయన మరణించారు.
బూర్గుల రామకృష్ణారావు
నిజాం వ్యతిరేక ఉద్యమం నుంచి ప్రజాస్వామ్య పరిపాలన దాకా ఆయన జీవన ప్రస్థానం సాగింది. బూర్గుల రామకృష్ణారావు 1899 మార్చి 13న హైదరాబాద్ సంస్థానంలోని పడకల్ గ్రామంలో జన్మించారు. పుణేలోని ఫెర్గూసన్ కాలేజీలో BA (Honours) చేసి, తరువాత న్యాయ బాంబే విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా పొందారు. న్యాయవాదిగా పనిచేసినప్పటికీ ఆయన జీవితం కేవలం న్యాయ వాద వృత్తికే పరిమితం కాలేదు. హైదరాబాద్ సంస్థానంలో ప్రజలకు రాజకీయ హక్కులు, బాధ్యతాయుత ప్రభుత్వం, ప్రజాస్వామ్యం కల్పించాలనే ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం:
హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనలో ప్రజలకు దాదాపు రాజకీయ హక్కులు ఉండేవి కావు. ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం, బాధ్యతాయుత ప్రభుత్వం కోసం, ప్రజల రాజకీయ హక్కుల కోసం జరిగిన ఉద్యమంలో బూర్గుల రామకృష్ణారావు ప్రముఖ నాయకుడిగా ఎదిగారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుల్లో ఆయన ఒకరు. ఆంధ్ర మహాసభలో కూడా కీలక పాత్ర పోషించారు. 1932లో దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. ఆయన ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నందుకు జైలుకు వెళ్లారు.1942 క్విట్ ఇండియా ఉద్యమం, 1947 స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాల్గొన్నారు.
ఆంధ్ర మహాసభ-తెలంగాణ చైతన్యం:
ఆంధ్ర మహాసభ తెలంగాణలో భాష, విద్య, సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెంచిన ముఖ్యమైన వేదిక. బూర్గుల రామకృష్ణారావు దాని కార్యక్రమాలలో పాల్గొని ప్రజల్లో చైతన్యం పెంచేందుకు కృషి చేశారు. ఇది కేవలం భాషా ఉద్యమం మాత్రమే కాదు. విద్య, సామాజిక సంస్కరణ, ప్రజా హక్కులు, రాజకీయ చైతన్యం వంటి అంశాలకు కూడా ఆ వేదిక ప్రాధాన్యం ఇచ్చింది. బూర్గుల దానిలో ఒక ముఖ్యమైన మేధావి, రాజకీయ నాయకుడిగా ఎదిగారు.
గ్రంధాలయ ఉద్యమం:
గాడిచర్ల హరి సర్వోత్తమ రావు, బూర్గుల రామకృష్ణారావుల మధ్య ఇందులో ఆసక్తికరమైన సామ్యం కనిపిస్తుంది. గాడిచర్ల ఆంధ్రలో గ్రంథాలయ ఉద్యమాన్ని బల పరిస్తే, బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఇది యాదృచ్ఛికం కాదు. ఆ కాలంలోని జాతీయోద్యమ నాయకులు పుస్తకం, పత్రిక, గ్రంథాలయం, విద్య లను ప్రజా విముక్తికి సాధనాలుగా భావించారు.
బూర్గుల రామకృష్ణారావు న్యాయ వాద వృత్తిలో ఉన్నప్పుడు పేదల తరఫున కూడా కేసులు వాదించేవారు. ఆయనకు న్యాయ వృత్తి కేవలం సంపాదన కోసం కాదు, అది ప్రజాసేవకు ఒక సాధనంగా భావించారు. భారత ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి. నరసింహారావు ఆయన వద్ద జూనియర్‌గా పని చేసారు.
హైదరాబాద్ రాష్ట్ర తొలి ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి: 1952లో జరిగిన ఎన్నికల్లో బూర్గుల రామకృష్ణారావు షాద్ నగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1952 మార్చి 6న ఆయన హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1956 అక్టోబరు 31 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఇది హైదరాబాద్ రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మలుపు. నిజాం పాలన ముగిసిన తరువాత ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వానికి నాయకత్వం వహించడం ఆయన రాజకీయ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం.
భూ సంస్కరణలు-జాగీర్దారీ వ్యవస్థకు ముగింపు:
బూర్గుల ముఖ్యమంత్రిగా పఅని చేసిన కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో భూ సంబంధ సంస్కరణలు ముఖ్యమైన అంశంగా నిలిచాయి. జాగీర్దారీ, మధ్యవర్తిత్వ భూ వ్యవస్థలను తొలగించడం, కౌలు రైతుల హక్కులను బలోపేతం చేయడం వంటి చర్యలకు ఆయన ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణలో రైతాంగం ఎదుర్కొన్న భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అసమానతల చారిత్రక న నేపధ్యంలో ఈ భూ సంస్కరణలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే బూర్గుల రామకృష్ణారావును భూ సంస్కరణలకు మార్గదర్శకుడు గా పేర్కొంటారు.
విశాలాంధ్ర ఏర్పాటులో బూర్గుల పాత్ర
1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రంలో కలిశాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ముగిసిన తరువాత బూర్గుల కొత్త పరిస్థితిని అంగీకరించి జాతీయ స్థాయిలో ప్రజాసేవ కొనసాగించారు. పదవిని పట్టుకొని వేలాడకుండా రాజకీయ పరిణామాలను అంగీకరించడం ఆయన రాజకీయ జీవితంలో ముఖ్యమైన అంశం.
రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా:
1956లో బూర్గుల రామకృష్ణారావు కేరళ రాష్ట్ర గవర్నర్‌గా నియమితు లయ్యారు. 1960లో ఆయన ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒక ప్రాంత స్వాతంత్ర్యోద్యమ నాయకుడి నుంచి జాతీయ స్థాయి రాజ్యాంగ పదవులను నిర్వహించిన నాయకుడిగా ఆయన ఎదిగారు.
సాహితీవేత్తగా బూర్గుల:
బూర్గుల రామకృష్ణారావు కేవలం రాజకీయ నాయకుడే కాదు. ఆయన బహు భాషావేత్త, కవి, రచయిత, అనువాదకుడు, సాహిత్య విమర్శకుడు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్ తదితర భాషల్లో ఆయనకు మంచి పాండిత్యం ఉండేది. తెలుగు, సంస్కృతంలో కవిత్వం, అనువాదాలు, సాహిత్య వ్యాసాలు రచించారు. కృష్ణ శతకం, పుష్పాంజలి, తొలి చుక్క, నివేదన, పారశీక వాఙ్మయ చరిత్ర వంటి రచనలు ఆయన సాహిత్య వైవిధ్యాన్ని తెలియజేస్తాయి.1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవ పట్టాను, 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లాస్ గౌరవాన్ని ప్రదానం చేశాయి.
బూర్గుల జీవితాన్ని పరిశీలిస్తే ఒక అరుదైన సమ్మేళనం కనిపిస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి, గవర్నర్, సాహితీవేత్త, బహు భాషావేత్త, ప్రజాస్వామ్యవాది ఈ అన్ని పాత్రలను ఆయన తన జీవితంలో పోషించారు.
నేడు సమాచారం విపరీతంగా పెరిగింది. కానీ జ్ఞానం, విమర్శనాత్మక ఆలోచన, ప్రజా చైతన్యం అదే స్థాయిలో పెరిగాయా అనేది ప్రశ్న. గాడిచర్ల జీవితం మనకు నేర్పే పాఠం ఏమంటే అందరికీ చదువు, పుస్తకాలు గ్రామాలకు చేరాలి. పెద్దలకు కూడా విద్య అందాలి. ప్రజలు తమ హక్కులు గురించి తెలుసుకోవాలి. పత్రిక ప్రజల పక్షాన నిలబడాలి. విద్య రాజకీయ చైతన్యానికి పునాది కావాలి. సామాజిక అసమానతలను ప్రశ్నించాలి.
బూర్గుల రామకృష్ణారావు జీవితం నుండి తెలుసుకో వలసినది “చైతన్యవంతమైన ప్రజలకే ప్రజాస్వామ్యాన్ని బలపరచే శక్తి ఉంటుంది.” అందువల్ల ఈ ఇద్దరి జీవితాలను కలిపి చూస్తే ఒక సంపూర్ణ ప్రజాస్వామ్య సూత్రం కనిపిస్తుంది. గాడిచర్ల హరి సర్వోత్తమ రావు, బూర్గుల రామకృష్ణారావు లు వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు పరిస్థితుల్లో జీవించారు. ఒకరు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. మరొకరు హైదరాబాద్ సంస్థానంలోని నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడారు. కానీ వారి జీవితాల అంతర్లీన లక్ష్యం ఒక్కటే ప్రజలు గౌరవప్రదమైన జీవితం గడపాలి. ప్రజల చైతన్యం, ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యం, సామాజిక అభ్యుదయం అని అర్ధం చేసికోవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
