భారతీయ విశ్వవిద్యాలయాల్లో పెరుగుతున్న విద్యార్థి ఆందోళనలకు విద్యార్థులను కాదు విశ్వవిద్యాలయ పాలన వైఫల్యాలనే బాధ్యులను చేయాలి.
భారతీయ విద్యార్థులు ముఖ్యంగా జెన్-జెడ్ తరం తమ స్వేచ్ఛ, స్వతంత్రతను మరింత బలంగా చాటుకుంటూ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పుడు దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన న్యాయ విద్యార్థుల్లో కొందరు తప్పుడు కారణాలతో వార్తల్లోకి వచ్చారు.
అయితే నల్సార్ పట్టభద్రుల బ్యాచ్‌కు సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) జారీ చేసిన దారుణమైన ఆదేశాన్ని నిలిపివేయడం, ఆందోళన చేసిన విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను కొట్టివేయడం, విద్యార్థులపై క్రమశిక్షణా నియంత్రణ బీసీఐకి లేదని స్పష్టం చేయడం అలాగే జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి అవసరమైన మూడేళ్ల న్యాయవాద వృత్తి అనుభవ నిబంధనను కేవలం ఏడాదికి తగ్గించడం వంటి చర్యలతో సకాలంలో జోక్యం చేసుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్‌ను అభినందించాల్సిందే.
అసంతృప్తికి అసలు కారణాలేంటి?
విద్యార్థులు తమ సొంత స్నాతకోత్సవ కార్యక్రమంలో తమకూ ఒక మాట ఉండాలని కోరుకోవడం సరైందా లేక తప్పా అన్నది అసలు ప్రశ్నే కాదు.
అసలు ప్రశ్న ఏమిటంటే, విశ్వవిద్యాలయాల పాలనా విధానంపై విద్యార్థులు ఎందుకు ఇంతగా అసంతృప్తికి గురవుతున్నారు?
కొన్ని సందర్భాల్లో వారు ఆశనే కోల్పోయే స్థితికి, మరికొన్ని సందర్భాల్లో మర్యాద, వ్యంగ్యానికి సంబంధించిన హద్దులను దాటే స్థితికి ఎందుకు చేరుతున్నారు?
విశ్వవిద్యాలయాల పాలనా సంక్షోభం
ఇదంతా ప్రధాన న్యాయమూర్తి చేసిన ఒక మౌఖిక వ్యాఖ్య వల్లే జరిగిందని ఆ వ్యాఖ్యను ఆయన వెంటనే స్పష్టం చేసినప్పటికీ దానినే కారణంగా చూపించడం ఉన్నత విద్యారంగంలో నెలకొన్న లోతైన పాలనా సంక్షోభాన్ని చాలా సరళీకరించి చూడటమే అవుతుంది.
విశ్వవిద్యాలయాలను ఎలా పాలించాలి? భావ ప్రకటనా స్వేచ్ఛకు, విద్యా స్వయంప్రతిపత్తికి ఉండాల్సిన పాత్ర ఏమిటి? వైస్-ఛాన్సలర్లు విద్యార్థుల గౌరవాన్ని ఎందుకు క్రమంగా కోల్పోతున్నారు? ఇలాంటి సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించగల సామర్థ్యం వారికి ఎందుకు తగ్గిపోతోంది?
అన్నింటికంటే ముఖ్యమైనది విద్యా స్వేచ్ఛ
విద్యా స్వేచ్ఛ లేకుండా విశ్వవిద్యాలయాలు పనిచేయలేవు. భారత రాజ్యాంగంలో విద్యా స్వేచ్ఛను ప్రత్యేకంగా స్పష్టంగా ప్రస్తావించలేదు.
అయితే కొన్ని దేశాల రాజ్యాంగాలు ఈ స్వేచ్ఛకు స్పష్టమైన హామీ ఇస్తున్నాయి.
ఉదాహరణకు జర్మనీ ప్రాథమిక చట్టంలోని ఆర్టికల్ 5(3) శాస్త్రీయ స్వేచ్ఛను విద్యా బోధన, పరిశోధనలో నిమగ్నమైన ప్రతి ఒక్కరి రాజ్యాంగ హక్కుగా ప్రత్యేకంగా హామీ ఇస్తోంది.
జపాన్, దక్షిణాఫ్రికా, పోర్చుగల్, స్పెయిన్ రాజ్యాంగాల్లోనూ ఇలాంటి స్వేచ్ఛకు స్థానం ఉంది.
హాంకాంగ్ ప్రాథమిక చట్టంలోని ఆర్టికల్ 137 ప్రకారం విద్యాసంస్థలు తమ స్వయంప్రతిపత్తిని కొనసాగించవచ్చు, విద్యా స్వేచ్ఛను అనుభవించవచ్చు.
పాఠ్యాంశాల రూపకల్పనలో స్వేచ్ఛ
ఆదర్శ పరిస్థితుల్లో ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు ఏమి బోధించాలో, ఎలా బోధించాలో, ఏమి బోధించకూడదో నిర్దేశించకూడదు.
అలాగే విశ్వవిద్యాలయాలు కూడా ఈ స్వేచ్ఛను తమ విభాగాలు, అధ్యాపక బృందాలకు నిరాకరించకూడదు.
ఇటీవల ఢిల్లీ విశ్వవిద్యాలయం ‘ఢిల్లీ సుల్తానేట్’కు సంబంధించిన ఒక పేపర్‌తో పాటు మరికొన్ని పేపర్లను పాఠ్యాంశాల నుంచి తొలగించింది.
ఇలాంటి పాఠ్యాంశ మార్పుల వెనుక సైద్ధాంతిక కారణాలు ఉన్నాయని జెన్-జెడ్ విద్యార్థులు అర్థం చేసుకోగలిగేంత తెలివైనవారు.
విశ్వవిద్యాలయాల పాఠ్య ప్రణాళికలను ఆదర్శంగా చెప్పాలంటే విద్యార్థులతో సహా సంబంధిత భాగస్వాములందరూ కలిసి నిర్ణయించాలి.
క్యాంపస్‌లలో స్వేచ్ఛ, పరిమితులు
విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో విద్యా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ అత్యంత కీలకమైనవి.
ఎందుకంటే విశ్వవిద్యాలయాలు ఆలోచన, ప్రశ్నించడం, చర్చించడానికి ప్రత్యేకమైన వేదికలుగా ఉండాలి.
అయితే ఇతరులను కించపరిచే హక్కు లేదా దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే హక్కు ఎవరికీ ఉందని ఎవరూ చెప్పడం లేదు.
ఒక విద్యా కార్యకలాపం భావ ప్రకటనా స్వేచ్ఛకు బదులుగా ‘ప్రవర్తన’కు సంబంధించినదైతే అలాంటి ‘ప్రవర్తన’ను నియంత్రించే హక్కు ప్రభుత్వానికి తప్పకుండా ఉంటుంది.
పాశ్చాత్య దేశాల్లోనూ రాజకీయ ఒత్తిళ్లు
నేడు పాశ్చాత్య దేశాల్లోనూ విద్యా స్వేచ్ఛ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికాలో సమాఖ్య నిధులను విశ్వవిద్యాలయాల ప్రాంగణ సంస్కృతిని మార్చేందుకు ఒక ఆయుధంగా ఉపయోగించారు.
వైవిధ్య కార్యక్రమాలను తొలగించారు. వాతావరణ మార్పుల వంటి అంశాల్లో పరిశోధనకు అందే నిధులను తగ్గించారు.
గాజాపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు సహా విద్యార్థి నిరసనలకు అనుమతి ఇచ్చినందుకు కూడా విశ్వవిద్యాలయాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
వామపక్ష, మితవాద భావజాలాలకు చెందిన ప్రభుత్వాలు రెండూ కొన్ని సందర్భాల్లో విశ్వవిద్యాలయాలను తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాయి.
పరిశోధనలపై నియంత్రణ
చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
1924లో గ్రీకు సైన్యం చేసిన దారుణాలపై తన రచనల కారణంగా కింగ్స్ కాలేజ్ లండన్ నుంచి ఆర్నాల్డ్ టాయిన్బీ రాజీనామా చేయడం నుంచి, మెకార్తీ కాలంలో ప్రొఫెసర్లపై జరిగిన వేధింపుల వరకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి.
ప్రభుత్వ నిధులు తగ్గిపోతున్న కొద్దీ, పరిశోధనల దిశను నిధులు అందించే సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఔషధ కంపెనీలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.
దీంతో విద్యా స్వేచ్ఛ ఒక పరిహాసంగా మారుతోంది.
నియంత్రణ నీడ
విశ్వవిద్యాలయాలను సరిగ్గా పాలించకపోవడం వల్లే మనం విద్యార్థి ఆందోళనలను చూస్తున్నాం.
ప్రభుత్వాలు క్రమంగా విశ్వవిద్యాలయాలపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఫలితంగా విశ్వవిద్యాలయ పాలనా వ్యవస్థలు ‘నియంత్రణ నమూనా’ను స్వీకరించాయి.
చాలా విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ వైస్-ఛాన్సలర్ కేంద్రంగా నడుస్తున్నాయి. కానీ విశ్వవిద్యాలయాలు ఉండటానికి అసలు కారణమైన విద్యార్థులకు వాటి పాలనలో చాలా తక్కువ పాత్ర ఉంది.
తమ సమస్యలను సకాలంలో పరిష్కరించకపోతే విద్యార్థులు తమను పట్టించుకోవడం లేదని, తమను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారని భావిస్తారు. కొందరు చివరకు తీవ్ర చర్యలకు కూడా పాల్పడతారు.
వైస్-ఛాన్సలర్ల తీరు మారాలి
తరచూ ప్రభుత్వాన్నే నిందిస్తుంటారు.
కానీ విశ్వవిద్యాలయ పరిపాలనా వ్యవస్థలు విద్యార్థులతో అర్థవంతమైన సంభాషణ జరిపి వారి సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపితే ఈ వ్యతిరేకతలో చాలా భాగాన్ని నివారించవచ్చు.
వైస్-ఛాన్సలర్లు అరుదుగా విద్యార్థులతో బహిరంగ సమావేశాలు నిర్వహిస్తారు. సాధారణ విద్యార్థులకు వారు అందుబాటులో ఉండరు.
విశ్వవిద్యాలయాలు అత్యున్నత విద్యావంతులైన అధ్యాపకులు, తెలివైన యువతతో కూడిన సమాజాలు. వాటికి కావాల్సింది సంభాషణ, విశ్వాసం, పారదర్శకత- అంతులేని నియంత్రణ, నిఘా కాదు.
జ్ఞాన సృష్టికి స్వేచ్ఛ అవసరం
విశ్వవిద్యాలయాల లక్ష్యం కొత్త ఆలోచనలను ఆవిష్కరించడం, జ్ఞానాన్ని సృష్టించడం.
అయితే నియంత్రిత వాతావరణంలో జ్ఞాన సృష్టి సాధ్యం కాదు. ప్రతిదానినీ ప్రశ్నించే, ఇప్పటికే ఉన్న ఆలోచనలను సవాలు చేసే స్వేచ్ఛ దానికి అవసరం.
ప్రాచీన భారతదేశాన్ని పదేపదే గొప్పగా కీర్తిస్తున్నప్పటికీ నేడు భారత విద్యా వ్యవస్థ అతిగా నియంత్రించబడుతూ, తీవ్రంగా నిధుల కొరతతో ఉంది.
ప్రాచీన గురుకుల వ్యవస్థ పూర్తిగా స్వయంప్రతిపత్తితో ఉండేది. కానీ నేడు విద్యపై జాతీయ విద్యా విధానం 2020 ఇచ్చిన హామీ —జీడీపీలో 6 శాతం ప్రభుత్వ పెట్టుబడికి భారత్ చాలా దూరంలోనే ఉంది.
విద్యపై ప్రభుత్వ పెట్టుబడి క్రమంగా తగ్గుతూ 4-4.1 శాతం చుట్టూ ఉంది. అందులోనూ ఉన్నత విద్యకు అత్యల్ప వాటా మాత్రమే దక్కుతోంది.
నిధుల కొరత, మౌలిక వసతుల లేమి
ఇదిలా ఉండగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల మౌలిక వసతులు క్షీణించాయి. హాస్టళ్ల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల న్యూఢిల్లీలో జరిగిన విషాద సంఘటనల వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గెస్ట్ ఫ్యాకల్టీకి తగిన వేతనాలు లభించడం లేదు.
నియామకాల్లో లోపాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు
అధ్యాపకుల నియామక ప్రక్రియల్లోనూ లోపాలున్నాయి. ప్రతిభ కంటే సైద్ధాంతిక అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నాణ్యతలేని బోధన విద్యార్థుల్లో నిరాశను పెంచుతోంది.
పదేపదే ప్రశ్నపత్రాలు లీక్ కావడం వారి ఒత్తిడిని మరింత పెంచుతోంది. చివరకు ఈ అసంతృప్తి విశ్వవిద్యాలయ పరిపాలనపై కాకుండా ప్రభుత్వంపైనే విరుచుకుపడుతుంది.
నిబంధనల ఉల్లంఘన
వైస్-ఛాన్సలర్ల నియామకంలో సహజ న్యాయ సూత్రాలు తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నా మనం వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నాం.
ఒక సందర్భంలో ఒక వైస్-ఛాన్సలర్ ఎంపిక కమిటీ కూర్పునే మార్చడమే కాకుండా ఆ కమిటీకి అధ్యక్షత వహించి, తన భార్య ఎంపికలో తానే ఓటు కూడా వేశారు.
ఆమె వైస్-ఛాన్సలర్‌గా నియమితులయ్యారు.
ఇలాంటి నియామకాలను రద్దు చేసిన తన స్వంత గత తీర్పులను అనుసరించేందుకు న్యాయవ్యవస్థ నిరాకరించింది.
చివరికి వైస్-ఛాన్సలర్ చర్యలకు ప్రభుత్వమే విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
స్వేచ్ఛా నమూనా వైపు
వైస్-ఛాన్సలర్‌గా 16 ఏళ్లకు పైగా పనిచేసిన కాలంలో మూడు విశ్వవిద్యాలయాల్లో ‘స్వేచ్ఛా నమూనా పాలన’గా చెప్పగల విధానాన్ని ఈ రచయిత అమలు చేశారు.
విద్యార్థులపై విశ్వాసం ఉంచినప్పుడు వారు కూడా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు.
అలాంటి నమూనా అప్పుడే పనిచేస్తుంది. విద్యార్థులు ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోకుండానే వైస్-ఛాన్సలర్‌ను కలుసుకునేంత సౌకర్యంగా భావించారు.
కొన్నిసార్లు తమ వ్యక్తిగత సమస్యలు, ఇబ్బందులను కూడా పంచుకున్నారు.
ఈ విశ్వాసం వల్ల కఠినమైన లేదా విద్యార్థులకు నచ్చని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా వారితో నేరుగా, నిజాయితీగా మాట్లాడటం సులభమైంది.
‘నియంత్రణ’ లేదా పై నుంచి కిందకు ఆదేశించే నమూనాకు భిన్నంగా ‘స్వేచ్ఛా నమూనా’ విశ్వవిద్యాలయాలను అత్యంత అసహ్యకరంగా అనిపించే ఆలోచనలతో సహా అన్ని రకాల భావాలను స్వేచ్ఛగా చర్చించగల వేదికలుగా చూస్తుంది.
నిర్ణయాల్లో విద్యార్థుల భాగస్వామ్యం
అధ్యాపకుల నియామకాలు, కొనుగోళ్లు, పాఠ్య ప్రణాళిక రూపకల్పన, విశ్వవిద్యాలయ నిబంధనల తయారీ వంటి అంశాలతో పాటు విద్యా, పరిపాలనా, ఆర్థిక నిర్ణయాల్లో విద్యార్థులకు అర్థవంతమైన పాత్ర ఉండాలి. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వంటి పాత విద్యాసంస్థల్లో వైస్-ఛాన్సలర్‌ను ఎంపిక చేసే ప్రక్రియలో విద్యార్థులకు చట్టబద్ధమైన పాత్ర కూడా ఉంది.
విద్యార్థి ఆందోళనలు పెరుగుతున్న సమస్యను పరిష్కరించాలంటే మన క్యాంపస్‌లను ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరం ఉంది.
నియామకాల్లో ప్రతిభకే ప్రాధాన్యం
సైద్ధాంతిక ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో తమకు అనుకూలమైన భావజాలం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. కానీ అందుకోసం ప్రతిభను పూర్తిగా పక్కన పెట్టకూడదు.
అనుమానాస్పద నేపథ్యం ఉన్న వ్యక్తులు, కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) నుంచి ప్రతికూల నివేదికలు ఎదుర్కొన్న వ్యక్తులు కూడా నియమితులైన సందర్భాలున్నాయి.
కొన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో లంచాల ఆరోపణలు కూడా ఉన్నాయి.
ప్రశ్నపత్రాల లీకేజీలు కూడా ఇదే వ్యవస్థాగత వైఫల్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రశ్నపత్రాలు రూపొందించే వారు, వాటిని పరిశీలించే వారు, పరీక్షల నిర్వహణలో పాల్గొనే అధికారులను సంపూర్ణ ప్రతిభ, నిజాయితీ కాకుండా ఇతర కారణాలతో నియమిస్తే ఏ పరీక్షా వ్యవస్థా పూర్తిగా లోపరహితంగా ఉండదు.
స్వేచ్ఛా నమూనాతోనే పరిష్కారం
ప్రభుత్వం నిజంగా విద్యార్థుల విశ్వాసాన్ని తిరిగి పొందాలనుకుంటే విశ్వవిద్యాలయాలు వైస్-ఛాన్సలర్ కేంద్రంగా కాకుండా విద్యార్థి కేంద్రంగా మారాలి.
పాతబడిపోయిన, తిరోగమన దిశలో ఉన్న ‘నియంత్రణ నమూనా’ను తిరస్కరించి, ‘స్వేచ్ఛా నమూనా’ను స్వీకరిద్దాం. భారతదేశ విద్యార్థులు దీనికంటే తక్కువదాన్ని ఆశించాల్సిన అవసరం లేదు.
(ఫైజాన్ ముస్తఫా ప్రస్తుతం పాట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీకి వైస్-ఛాన్సలర్‌గా ఉన్నారు. గతంలో ఆయన హైదరాబాద్‌లోని నల్సార్, కటక్‌లోని నేషనల్ లా యూనివర్సిటీ ఒడిశాలకు వైస్-ఛాన్సలర్‌గా పనిచేశారు. వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు.)
అనువాదం : మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
