రాజ్యాంగ ధర్మాసనాలు ఉపయోగించే పదజాలం కూడా ప్రజాతంత్ర పరిరక్షణలో భాగమే. ప్రభుత్వం తన వాదన పటిమ తో న్యాయస్థానాలను మెప్పించాలి కానీ ముద్రలు వేయడం ద్వారా కాదు. కేంద్ర ప్రభుత్వం తరఫున పనిచేసే న్యాయాధికారి బాధ్యత న్యాయస్థానం ముందు ప్రభుత్వాన్ని సమర్ధించడం. రాజ్యాంగపు పర్యవేక్షణ నుండి ప్రభుత్వాన్ని రక్షించడం కాదు.
వందేమాతరం ఆలాపనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో టి ఎం కృష్ణ వేసిన కేసు సందర్భంగా తన వాదనలు వినిపిస్తూ సీనియర్ న్యాయవాది ఎస్ మురళీధర్ ఒక చట్టం జాతీయగీతం అంటే ఏమిటో వివరించ కుండానే కేవలం కార్య నిర్వహణాధికార వర్గం ఇచ్చే వ్యాఖ్యానాలపై ఆధారపడి శిక్షలు విధించవచ్చా అని ప్రశ్నించారు. రాజ్యాంగపరమైన నిర్ణయాలను చరిత్ర ఒక్కటే తేల్చ లేదని, జాతీయ చిహ్నాలకు సంబంధించిన ప్రశ్నలన్నింటిని ప్రజాతంత్రయుతమైన ఏకాభిప్రాయం ద్వారానే పరిష్కరించుకోవాలని మురళీధర్ ప్రతిపాదించారు.
మురళీధర్ వాదనలకు స్పందిస్తూ సోలిసిటర్ జనరల్ పార్లమెంటు రాజ్యాంగబద్ధంగానే నిర్ణయాలు చేస్తుంది కానీ నక్సలైట్లు కోరుకున్నట్లు కాదని అన్నారు. భారత ప్రభుత్వం తరఫున న్యాయాధికారిగా ఉన్న వ్యక్తి నుండి అటువంటి పదజాలం ప్రయోగించడం సరికాదని మురళీధర్ అభ్యంతరం తెలిపారు. మరోసారి సొలి సీటర్ జనరల్ అదే మాటలను పునరుక్తి చేస్తూ తానేమి చింతించడం లేదని వక్కాణించారు. తరువాత వివరణ ఇస్తూ తాను ఒక సిద్ధాంతం గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నానని ఎవరిని ఉద్దేశించి వాడిన పదాలు కాదని సొలిసిటర్ జనరల్ అన్నారు. అయితే సొలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చినంత మాత్రాన వ్యవస్థాగత సమస్య పరిష్కారం కాలేదు.
న్యాయస్థానం ముందు ఎవరైనా హింసను గాని, రాజ్యాంగేతర పద్ధతుల్లో శాసనాలు రూపొందించడానికి గాని సమర్ధించరు. మురళీధర్ కేవలం చట్టం రూపొందించడంలో ఉన్న లోపాలు, ప్రజాతంత్రయుతమైన ఏకాభిప్రాయం, చట్టపరమైన శిక్షలు గురించి సాంప్రదాయక అవగాహనను మాత్రమే ప్రస్తావించారు. మురళీధర్ ముందుకు తెచ్చిన చట్టపరమైన అంశాలను ప్రభుత్వ తరపున న్యాయవాది నక్లిజం గురించి ప్రస్తావించటం ద్వారా తిప్పి కొట్టలేరు. ఈ రకంగా ప్రయత్నం చేయడం అంటే రాజ్యాంగపరమైన వాటిని తీవ్ర వాద సంబంధిత పదజాలం పరిధిలో ఇమడ్చటమే.
మురళీధర్ కోర్టు హాలు నుండి బయటకు వెళ్లిన తర్వాత న్యాయస్థానం మరో కేసును విచారణకు స్వీకరించింది. ఆ సమయంలో జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ఈ విషయాన్ని మళ్లీ ప్రస్తావించారు. ఒక వ్యక్తి లేటుగా మొదలు పడినంత మాత్రాన ఆయనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు రద్దయిపోవు అన్నారు. ” రాజ్యాంగ ధర్మాసనాలకు గౌరవం విశ్వసనీయత ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే ఉగ్రవాదులుగా ఆరోపణ ఎదుర్కొంటున్న వారు కూడా సమాన హక్కులను భరించాలి అని న్యాయస్థానం భావిస్తుంది” అన్నారు.
ఈ చర్చ ఈ మధ్యకాలంలో రాజ్యాంగ ధర్మాసనాలు ఉపయోగిస్తున్న పదజాలం గురించిన ప్రశ్నను ముందుకు తెస్తుంది. సొలిసిటర్ జనరల్ న్యాయస్థానానికి సహాయపడే ఎమికస్ క్యూరీ కాదు. న్యాయస్థానం ముందుకు వచ్చే కేసులలో ప్రభుత్వాన్ని వెనకేసుకురావడం సొల్లు సీటర్ జనరల్ కార్యాలయం పని విధానంలో అంతర్భాగం. సొలిసిటర్ జనరల్ భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తారు తప్ప అధికారంలో ఉన్న పాలక పార్టీకి కాదు. రాజ్యాంగబద్ధమైన పాలన పట్ల, సమన్యాయ పాలన పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి, బాధ్యత ఉంటాయి. అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఈ బాధ్యతలను బలి చేయకూడదు.
ఇదేదో పొరపాటున జరిగింది కాదు. వందేమాతరం కేసు గతంలో విచారణకు వచ్చినప్పుడు కూడా సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే బలవంతంగా దేశభక్తిని అలవాటు చేయలేరు అన్నారు. దీనిపై జోకింగ్ చేసుకుంటూ సోలిసిటర్ జనరల్ “ఈ అభిప్రాయాలు కలిగిన వ్యక్తికి ఈ న్యాయస్థానంలో భాగస్వామ్య అధికారం లేదు” అని ఎదురుదాడికి దిగారు. దేశభక్తికి ప్రభుత్వం ఇచ్చే నిర్వచనాన్ని తూచా తప్పకుండా పాటించడమే న్యాయస్థానం ముందు రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందటానికి ప్రాతిపదిక కాకూడదు.
సంజయ్ హెగ్డే “బిజొయ్ ఇమాన్యుయెల్ కు కేరళ ప్రభుత్వానికి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆధారపడి తన వాదనలను వినిపించారు. ఈ కేసులో జాతీయ గీతాలాపన జరుగుతున్నప్పుడు విద్యార్థి గౌరవ సూచకంగా నిలబడి కూడా గీతాలాపనను నిరాకరించే హక్కును సుప్రీంకోర్టు సంరక్షించింది. తనకున్న మత విశ్వాసాలను అనుసరించి ఆ గీతం ఆలపించలేను అన్నది విద్యార్థి అభ్యంతరం. కానీ ప్రస్తుత సందర్భంలో రాజ్యాంగపరమైన వాదనలు వినిపించడమే సాక్ష్యంగా మలుచుకుని అటువంటి వ్యక్తికి న్యాయస్థానం రక్షణ కల్పించకూడదు అన్న వాదన ముందుకు వచ్చింది.
2020లో దేశాన్ని కలవరపరచిన వలస కార్మికులు సమస్యకు సంబంధించిన కేసు విషయంలో కూడా ఇదే రకమైన ధోరణి వ్యక్తం అయ్యింది. ఒకవైపున వలస కార్మికులు ఆకలి దప్పులతో కాలినడకన కరోనా సమయంలో ఇంటి బాట పడితే ప్రభుత్వ ఒక స్పందనను విమర్శించిన వారిని ఉద్దేశించి ” కొంతమంది నిరంతరం ప్రతికూల మనస్తత్వంతో ఉంటున్నారు. ఏదో జరిగిపోతోంది అని వాదిస్తున్నారు. వాపోతున్నారు” అన్నమాటలు వినిపించాయి. కరోనా సమయంలో ప్రభుత్వ స్పందన విమర్శించిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి పడకుర్చి మేధావులు వలస కార్మికులకు నిజంగా సహాయం చేయడం కోసం చిల్లిగా ఆయన ఖర్చు పెట్టారా అన్న ఎదురు ప్రశ్నలు వచ్చాయి. ఆహారం నివాసం రవాణా సదుపాయాలు సమకూర్చడం వంటి బాధ్యతలను ప్రభుత్వం నెరవేర్చిందా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న తప్ప విమర్శకులు తమ సొంత ఆదాయాల నుండి దానధర్మాలు చేయడం ద్వారా ఈ పనులలో సహాయపడ్డారా లేదా అన్నది కాదు.
నల్ల చట్టాలు వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమించిన సందర్భంలో కూడా స్వార్థపరులే సొంత ప్రయోజనాల కోసం ఉద్యమిస్తున్నారు అన్న విమర్శలు వచ్చాయి. ఢిల్లీ ప్రభుత్వం నుండి సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న అప్పటి అడ్వకేట్ రాహుల్ మెహరా రైతాంగపు మొరను ఆలకించాలని అభ్యర్ధించినప్పుడు సొలిసిటర్ జనరల్ చేసుకుంటూ మెహరా కూడా అవి అభిప్రాయాలను కలిగి ఉన్నారని ఆరోపించారు. మరొక సందర్భంలో వివాహపు విషయంలో సమానత్వం గురించిన కేసు లో వాదనలు వినిపిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున వానలో వినిపించిన న్యాయాధికారి ‘పిటిషనర్ల వాదనలు పట్టణ ప్రాంతంలోని కులీనుల అభిప్రాయాలు’ అని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. పట్టణ ప్రాంత కులీనులు అన్నది రాజ్యాంగపు పదజాలం కాదు. అటువంటి కేటగిరి ని నిర్ధారించడానికి తగినంత సమాచారం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ యావత్ చర్చలో ఒక ధోరణి వ్యక్తం అవుతోంది. రాజ్యాంగ బద్ధమైన విమర్శ ప్రతికూల మనస్తత్వం గానూ, సమానత్వం గురించిన ఆకాంక్షలు పట్టణ కూలీనుల అభిప్రాయాలు గాను, నిరసకారులు స్వంత ఎజెండా కలిగిన వారుగానూ, చైతన్యం దేశభక్తి రాహిత్యంగాను, చట్టం లోని లోపాలను ఎత్తి చూపే అర్థవంతమైన వాదనలు నక్సలైట్ అభిప్రయాలుగాను పరిగణించబడుతున్నాయి. గౌరవమైన పారదర్శకమైన పద్ధతుల్లో న్యాయవాదులు తమ కాక్షిదారుల ప్రయోజనాలు కాపాడాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఘోషిస్తున్నాయి.
అటువంటిది భారత ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే న్యాయాధికారి ముందు ఈ బాధ్యతలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఆ కార్యాలయానికి ఉన్న సంస్థాగతమైన గుర్తింపు కూడా విలక్షణమైనది. సదరు అధికారి కోర్టు ముందు నిలబడితే సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే నిలబడ్డట్టు. ప్రభుత్వం తన రాజ్యాంగ పరమైన బాధ్యతలను ఎలా అర్థం చేసుకుంటుంది ఎలా ఆచరిస్తుంది వంటివి సదరు న్యాయాధికారి స్పందనల్లో వ్యక్తం అవుతుంది. అటువంటి వారు న్యాయస్థానం లో వాదనలు వినిపించేటపుడు గౌరవప్రదంగాను, నిష్పాక్షికంగా, సంయమనంతోనూ వ్యవహరించాల్సి ఉంటుంది. వారి నోట వచ్చే ప్రతిమాట కేంద్రప్రభుత్వం అభిప్రాయం అన్న ఎరుక కలిగి వ్యవహరించాలి.
ఇక్కడ మా ఆందోళన అంతా సదరు సొలిసిటర్ జనరల్ ఎంత తీవ్రంగా కేంద్ర ప్రభుత్వాన్ని వెనకేసుకువస్తారు అన్నది కాదు. రాజ్యాంగ బద్ధమైన వాదన స్థానంలో రాజకీయ వాగాడంబరం చోటు చేసుకోవడం గురించే మా ఆందోళన. కేంద్ర ప్రభుత్వం ఒక కేసు మిలబడదని కానీ, గతంలోనే సదరు విషయంపై న్యాయస్థానం తీర్పు ఇచ్చింది అని కానీ సదరు చట్టం ద్వారా విధించే నియంత్రణలు నిబంధనలు రాజ్యాంగ బద్ధమైన వే అని కానీ వాదించవచ్చు.
అంతేకానీ కోర్టును ఆశ్రయించిన వ్యక్తికి దేశభక్తి లేదనో, ఒక వాదన పట్టణ కులీనుల అభిప్రాయం అనో, ఒక ఆందోళన స్వప్రయోజనాల కోసం అనో రాజ్యాంగబద్ధమైన వాదన తీవ్రవాద ప్రేరణ గానో ప్రతిపాదించనవసరం లేదు. రాజ్యాంగ ధర్మాసనం ఉపయోగించే బాధ కూడా ప్రజాతంత్ర హక్కుల సంరక్షణ లో భాగమే. ప్రభుత్వం తన వాదన పటిమ తో న్యాయస్థానాలను మెప్పించాలి కానీ ముద్రలు వేయడం ద్వారా కాదు. కేంద్ర ప్రభుత్వం తరఫున పనిచేసే న్యాయాధికారి బాధ్యత న్యాయస్థానం ముందు ప్రభుత్వాన్ని సమర్ధించడం. రాజ్యాంగపు పర్యవేక్షణ నుండి ప్రభుత్వాన్ని రక్షించడం కాదు.
జెహోష్ పాల్
రచయిత బెంగుళూరు లో లాయర్ గా పని చేస్తున్నారు. స్వతంత్ర పరిశోధకులు కూడా.
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
