న్యూయార్క్ నగరం 10 లక్షల ఫ్లాట్ల అద్దెలు పెరగకుండా నగర కౌన్సిల్ లో నిరయం”. మమ్దానీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలు చేశారు.
న్యూయార్క్ నగర హౌసింగ్ బోర్డు సుమారు 10 లక్షల అద్దె-నియంత్రిత అపార్ట్ మెంట్ల అద్దెలను రెండు సంవత్సరాల పాటు పెంచకుండా ఉంచాలని నిర్ణయించింది. ఇది మేయర్ జొహ్రాన్ మమ్దానీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే ఈ హామీ నెరవేరింది.
నగరంలోని రెంట్ గైడ్ లైన్స్ బోర్డు 7–1 ఓట్లతో అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల లీజులపై ప్రస్తుత అద్దె పెంచరాదని నిర్ణయించింది. సమావేశానికి హాజరైన వందలాది మంది అద్దె దారులు మాన్ హాటన్లోని మ్యూజియం ఆడిటోరియంలో చప్పట్లు కొడుతూ, విజిల్లు ఊదుతూ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.
“ఇది న్యూయార్క్ అద్దె దారుల చారిత్రాత్మక విజయం,” అని మమ్దానీ జూన్ 25 న అన్నారు. “ఈ ఉపశమనం కోసం మన నగరంలోని శ్రమజీవులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.”
ఈ ఓటింగ్ ప్రతి సంవత్సరం జరిగే, ఎంతో చర్చనీ యాంశమైన ప్రక్రియలో చివరి దశ. దీని ద్వారా అద్దె-నియంత్రిత ఫ్లాట్ల యజమానులు ఎంత మేర అద్దె పెంచ వచ్చో నిర్ణయిస్తారు. ఈ నిర్ణయంలో వేతనాలు, ద్రవ్యోల్బణం, నిర్వహణ ఖర్చులు, పన్నులు, యజమానుల ఆదాయం వంటి అంశాలను బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది.
బోర్డు 2025 అధ్యయనం ప్రకారం, న్యూయార్క్ లో అద్దె-నియంత్రిత ఫ్లాట్ కు సగటు నెలవారీ అద్దె 1,599 అమెరికన్ డాలర్లు. అదే సమయంలో, కొత్తగా లీజుకు ఇచ్చే ఫ్లాట్ల మధ్యస్థ అద్దె 3,950 డాలర్లు గా ఉందని స్ట్రీట్ ఈజీ గణాంకాలు చెబుతున్నాయి.
నగరాన్ని మరింత అందుబాటు ధరల్లో నివసించ గలిగేలా చేస్తానని హామీ ఇచ్చిన డెమోక్రటిక్ సోషలిస్టు మమ్దానీ, జనవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత 9 మంది సభ్యులు గల బోర్డులో అద్దె దారులకు అనుకూలంగా ఉంటారని భావించిన ఆరుగురు సభ్యులను బోర్డులో నియమించారు.
అయితే ఓటింగ్ కు ముందు యజమానుల ప్రతినిధిగా ఉన్న ఒక సభ్యుడు, ఈ నియామకాలు బోర్డు పక్ష పాతంగా మారడానికి దారి తీశాయని ఆరోపిస్తూ రాజీనామా చేశారు.
మమ్దానీకి ముందు ఉన్న మేయర్ నియమించిన బోర్డు సభ్యురాలు, యజమానుల ప్రతినిధి క్రిస్టినా స్మిత్ మాట్లాడుతూ, “అద్దె ఫ్రీజ్ అమలు చేయడానికే బోర్డును మళ్లీ రూపొందించారు. ఆ తర్వాత జరిగినదంతా ఒక నాటకమే” అని విమర్శించారు.
బోర్డు చైర్ పర్సన్ చాంటెల్లా మిచెల్, మమ్దానీ నియమితు రాలు, బోర్డు సభ్యులు, సిబ్బంది స్వతంత్రంగా, నిజాయితీతో పనిచేశారని వారు చెప్పారు. ఇతర యజమానుల ప్రతినిధి అయిన మమ్దానీ నియమితుడు మాక్సిమ్ వైన్, ఓటింగ్‌కు ముందు అద్దెదారుల చప్పట్ల మధ్య ఒక దీర్ఘ ప్రకటన చదివారు. కానీ కొన్ని నిమిషాల తర్వాత అద్దె ఫ్రీజ్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో ఆ చప్పట్లు ఆనంద కేకలుగా మారాయి.
ఓటింగ్‌కు ముందు జరిగిన ప్రజా విచారణల్లో అద్దె దారులు అద్దె ఫ్రీజ్ను డిమాండ్ చేశారు. కొందరు, బిల్ డి బ్లాసియో పాలనలో 2015–2021 మధ్య ఒక సంవత్సరం లీజులపై మూడుసార్లు అద్దె పెంపు నిలిపివేసిన విషయాన్ని గుర్తుచేశారు. లేకపోతే కనీసం అద్దె పెంపు ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా ఉండాలని కోరారు.
యజమానుల సంఘాలు మాత్రం అద్దె ఫ్రీజ్ వల్ల భవనాల నిర్వహణ కష్టమవుతుందని, కొందరు తమ గృహ రుణాల చెల్లింపులు కూడా చేయలేరని వాదించాయి.
అద్దెదారుల సంఘాల వాదన ప్రకారం, ఒకే భవనం కలిగిన చిన్న యజమానుల నుంచి సంపన్న పెట్టుబడిదారుల వరకు అనేక మంది, అద్దె-నియంత్రిత ఫ్లాట్లలో కలిగే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి నియంత్రణ లేని మార్కెట్ రేటు ఫ్లాట్ల అద్దెలను పెంచుతున్నారు.
ఎన్నికైన తర్వాత మమ్దానీ, నెలకు 2,300 అమెరికన్ డాలర్ల అద్దె-నియంత్రిత క్వీన్స్‌లోని ఒక బెడ్రూమ్ ఫ్లాట్‌ను వదిలి, మన్‌హాటన్‌లోని మేయర్ అధికారిక ఐదు బెడ్రూమ్ నివాసానికి మారారు.
ఈ ఓటింగ్ మమ్దానీకి ఈ వారంలో మరో విజయంగా నిలిచింది. అలాగే న్యూ యార్క్ నుండి అమెరికా కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న ముగ్గురు వామపక్ష అభ్యర్థులకు మద్దతు ఇస్తూ డెమోక్రటిక్ పార్టీ ప్రాథమిక ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన ప్రారంభించారు.
సౌత్ చైనా మార్నింగ్ సౌజన్యంతో.
స్వేచ్ఛానువాదం: డి.వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
