జూన్ 30 దాదాభాయి నౌరోజీ వర్ధంతి. ఈ సందర్భంగా వారిని గురించి కొన్ని విశేషాలు.
దాదాభాయి నౌరోజీ – భారత జాతీయోద్యమానికి ఆర్థిక, రాజకీయ మార్గదర్శకుడు.
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో వీరు విశిష్టమైన స్థానం సంపాదించించారు. ఆయనను “భారత జాతీయోద్యమ పితామహుడు”, “గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా” అని గౌరవంగా పిలుస్తారు. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన వల్ల జరిగిన ఆర్థిక దోపిడీని శాస్త్రీయంగా విశ్లేషించి ప్రపంచం ముందు ఉంచిన తొలి భారతీయ నాయకుడు ఆయనే. భారత జాతీయోద్యమానికి రాజకీయ దిశను మాత్రమే కాకుండా ఆర్థిక పునాదిని కూడా నిర్మించిన మహానుభావుడు దాదాభాయి నౌరోజీ.
బాల్యం – విద్య:
దాదాభాయి నౌరోజీ 1825 సెప్టెంబర్ 4న బొంబాయిలోని ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచే ఆయనకు విద్యపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఉన్నత విద్యను అభ్యసించి, ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో అధ్యాపకునిగా నియమితులయ్యారు. ఆ కాలంలో భారతీయులు ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపకులుగా పనిచేయడం చాలా అరుదు. దీంతో ఆయన భారతీయ మేధావులలో ప్రముఖ స్థానాన్ని సంపాదించారు.
భారతదేశంలోని పేదరికం సహజ సిద్ధమైనది కాదని, అది బ్రిటిష్ వలస పాలన ఫలితమని దాదాభాయి నౌరోజీ నిరూపించారు. భారతదేశ సంపద పన్నులు, వాణిజ్య లాభాలు, సైనిక వ్యయాలు, పరిపాలనా ఖర్చులు, బ్రిటిష్ అధికారుల జీతాలు, పెన్షన్ల రూపంలో ఇంగ్లండ్‌కు తరలిపోతున్నదని ఆయన విశ్లేషించారు.
ఈ సిద్ధాంతాన్నే ఆయన “డ్రెయిన్ థియరీ” లేదా “సంపద తరలింపు సిద్ధాంతం”గా వివరించారు. భారతదేశ సంపద విదేశాలకు తరలిపోవడం వల్ల దేశంలో పెట్టుబడులు తగ్గిపోవడం, పరిశ్రమలు అభివృద్ధి చెందక పోవడం, వ్యవసాయం వెనుకబడి పోవడం, ప్రజలు పేదరికంలో మగ్గిపోవడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ విశ్లేషణ భారత జాతీయోద్యమానికి అపారమైన బలం ఇచ్చింది. భారతదేశ స్వాతంత్ర్యం కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాకుండా ఆర్థిక విముక్తికి సంబంధించిన అంశమని జాతీయ నాయకులు గ్రహించారు.
కాంగ్రెస్ నిర్మాణంలో పాత్ర:
దాదాభాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపక నాయకులలో ఒకరు. ఆయన 1886, 1893 మరియు 1906 సంవత్సరాల్లో మూడు సార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రారంభ దశలో ఆయన మితవాద రాజకీయాలకు నాయకత్వం వహించారు. రాజ్యాంగబద్ధమైన పద్ధతుల ద్వారా భారతీయులకు రాజకీయ హక్కులు సాధించాలని ఆయన విశ్వసించారు.
1906లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఆయన స్వరాజ్యాన్ని భారతీయుల లక్ష్యంగా ప్రకటించారు. ఈ నిర్ణయం భారత జాతీయోద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది.
1892లో దాదాభాయి నౌరోజీ బ్రిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. లిబరల్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. పార్లమెంట్లో భారత ప్రజల సమస్యలను ధైర్యంగా ప్రస్తావించి, భారతీయులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని, పరిపాలనలో భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.
భారతదేశానికి సంబంధించిన అంశాలను బ్రిటిష్ ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి అపూర్వమైనది.
రచనలు:
దాదాభాయి నౌరోజీ రచించిన భారత Poverty and Un-British Rule in India అనే పుస్తకం దాదాభాయి నౌరోజీ గారి అత్యంత ప్రసిద్ధ ఆర్థిక విశ్లేషణ గ్రంథం.
ఈ పుస్తకం 1901లో ప్రచురించబడింది. ఇందులో ఆయన బ్రిటిష్ వలస పాలన కారణంగా భారతదేశ సంపద ఇంగ్లండ్‌కు ఎలా తరలిపోతుందో గణాంకాలు, ప్రభుత్వ నివేదికలు, ఆర్థిక వివరాల ఆధారంగా విశ్లేషించారు. ఈ గ్రంథంలోని ప్రధాన అంశాలు.
సంపద తరలింపు సిద్ధాంతం. భారతదేశంలో సృష్టించబడిన సంపదలో గణనీయమైన భాగం బ్రిటన్‌కు వెళ్లిపోతున్న దని ఆయన నిరూపించారు.
భారత ప్రజల పేదరికానికి కారణం వారి సోమరితనం లేదా ప్రకృతి వైపరీత్యాలు కాదని, వలస పాలకుల ఆర్థిక విధానాలేనని వివరించారు.
బ్రిటిష్ అధికారుల జీతాలు, పెన్షన్లు: భారతదేశంలో పనిచేసిన బ్రిటిష్ అధికారుల జీతాలు, పెన్షన్లు మరియు ఇతర చెల్లింపులు బ్రిటన్‌కు వెళ్లడం వల్ల దేశ సంపద బయటకు వెళ్తోందని పేర్కొన్నారు. భారత ఆదాయాన్ని బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం కూడా సంపద తరలింపులో ముఖ్య కారణమని చెప్పారు.
ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశాలు లేకపోవడం వల్ల ఆ ఆదాయం కూడా విదేశీయుల చేతుల్లోకి వెళ్తోందని వివరించారు.
ఈ పుస్తకం భారత జాతీయోద్యమానికి ఆర్థిక పునాదిని అందించింది. తరువాత R. C. Dutt వంటి ఆర్థికవేత్తలు కూడా బ్రిటిష్ పాలన వల్ల భారతదేశానికి జరిగిన ఆర్థిక నష్టాన్ని తమ రచనల ద్వారా విశ్లేషించారు.
దాదాభాయి నౌరోజీ గారి ఈ గ్రంథాన్ని భారత స్వాతంత్ర్యోద్యమంలోని తొలి ఆర్థిక విమర్శగా, అలాగే భారతీయ జాతీయ ఆర్థిక ఆలోచనలకు పునాదిగా చరిత్రకారులు గుర్తిస్తారు.
ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయి. ఈ గ్రంథంలో బ్రిటిష్ పాలన వల్ల భారతదేశానికి జరిగిన నష్టాలను గణాంకాలతో సహా వివరించారు. ఈ పుస్తకం ద్వారా భారతదేశ పేదరికానికి అసలు కారణాలు ప్రపంచానికి తెలిసాయి. భారతదేశంలో జాతీయ చైతన్యం పెరగడానికి ఈ రచన ఎంతో తోడ్పడింది.
గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో దాదాభాయి నౌరోజీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. ఆయనను రాజకీయ గురువుగా గౌరవించేవారు.
నేటి ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల నేపథ్యంలో దేశ సంపద, సహజ వనరులు, శ్రమ ఫలితాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయనే ప్రశ్న మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందుతున్నాయా? సంపద కేంద్రీకరణ పెరుగుతోందా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే సమయంలో దాదాభాయి నౌరోజీ ఆర్థిక విశ్లేషణలు ఇప్పటికీ ప్రాసంగికంగానే కనిపిస్తాయి.
ముగింపు:
1917 జూన్ 30న దాదాభాయి నౌరోజీ మరణించినప్పటికీ ఆయన ఆలోచనలు, విశ్లేషణలు, జాతీయోద్యమానికి అందించిన దిశానిర్దేశం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
దాదాభాయి నౌరోజీ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదు. ఆయన గొప్ప ఆర్థికవేత్త, దూరదృష్టి గల రాజకీయ నాయకుడు, భారత జాతీయ చైతన్యానికి మార్గదర్శకుడు. భారతదేశ సంపద దోపిడీని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడి గా, స్వరాజ్య భావనకు పునాది వేసిన నాయకుడిగా ఆయన పేరు భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
