ఇది భారతదేశానికి సంబంధించిన యుద్ధం కాదు. అయినప్పటికీ, దాని పర్యవసానాలు ఇప్పటికే భారతదేశాన్ని దిగ్బంధించాయి.
ప్రభుత్వాలు తరచుగా తమ సొంత ప్రయోజనాలకు నష్టం కలిగించే విధానాలను ఎందుకు అమలు చేస్తాయో- అవి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రహస్యాలలో ఒకటిగా మిగిలిపోతాయని బార్బరా టచ్మన్ ఒకప్పుడు అన్నారు.
తప్పులను తెలుసుకుని, నష్టాలను నివారించుకోవడం వ్యక్తుల విషయంలో చాలా అరుదుగానైనా జరుగుతుంది కానీ, రాజ్యాల విషయంలో మాత్రం దాదాపు జరగదని ఆమె అనడంలో విశేషమేమీ లేదనవచ్చు.
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఉన్న వాతావరణం గురించి ఆమె రాస్తూ, “1914లో మానవాళి గురించి ఆలోచించే వారికి వణుకు పుట్టించే భయంకరమైన వాతావరణం నెలకొని ఉండేది.
అత్యంత ధైర్యవంతులు, మనోనిబ్బరం ఉన్న వారికి సైతం కన్నీళ్లు తెప్పించేంతటి పరిస్థితులు ఉండేవి’’అని పేర్కొన్నారు.
దురదృష్టవశాత్తూ, ఆ మాటలు ఇప్పుడున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మనం పూర్తి ఘోరమైన పరిస్థితిని ఇంకా చూడలేదేమో అనిపిస్తుంది.
ఈ పరిస్థితుల్లో షేక్స్పియర్ నాటకమైన ‘కింగ్ లీర్’లోని ఒక ప్రసిద్ధ వాక్యం జ్ఞప్తికి వస్తోంది: “ఇదే అత్యంత ఘోరమైనది అని మీరు చెప్పగలిగినప్పుడు, అది ఎప్పటికీ అత్యంత ఘోరమైనది కాకపోవచ్చు”- ఈ మాటలు ప్రస్తుత సంక్షోభానికి సరిగ్గా సరిపోతాయి.
మనం ఇంకా పూర్తిగా ఘోరమైన పరిస్థితిని చూడవలసి ఉంది.
వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి: ఒక క్లిష్టమైన ప్రశ్న
ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాలతో పాటు విస్తారమైన ప్రాంతీయ శక్తులతో పశ్చిమాసియా మొత్తం విస్తరించిన యుద్ధం కేవలం మరొక ప్రాంతీయ సంక్షోభం మాత్రమే కాదు. భారతదేశం చుట్టూ ఉన్న వ్యూహాత్మక వాతావరణాన్ని పూర్తిగా మార్చివేస్తున్న మరొక తీవ్ర సంక్షోభం.
దశాబ్దాలుగా భారతదేశ విదేశాంగ విధాన పదజాలం ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ అనే ఒకే ఆలోచన చుట్టూ తిరుగుతోంది.
ప్రచ్ఛన్న యుద్ధం ముగియడానికి చాలా కాలం ముందు నుంచే ఈ సూత్రం భారత దౌత్యానికి మార్గదర్శకంగా ఉంది.
దీని ప్రకారం భారతదేశం ఏ కూటమిలోనూ చేరదు. పరస్పర పోటీపడే దేశాలతో తన సంబంధాలను కొనసాగిస్తుంది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కాపాడుకుంటుంది.
అయితే, పరీక్షకు గురైనప్పుడు మాత్రమే సిద్ధాంతాలకు సార్థకత చేకూరుతుంది. పశ్చిమాసియా భారతదేశానికి ఎంతో దూరంలో లేదు.
అందువల్ల ప్రస్తుత యుద్ధం, ఒక దేశ సొంత వ్యూహాత్మక పొరుగు దేశంలో యుద్ధం తలెత్తినప్పుడు ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అంటే ఏమిటి?’ అనే ఒక క్లిష్టమైన ప్రశ్నను లేవనెత్తుతోంది.
భారతదేశ చమురు దిగుమతులలో దాదాపు మూడింట రెండు వంతులు హర్ముజ్ జలసంధి గుండానే వెళ్తాయి.
లక్షలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ, పనిచేస్తున్నారు.
ఐరోపా, పశ్చిమ ఆసియా- ఆసియాలను కలిపే వాణిజ్య మార్గాలు, ప్రస్తుతం క్షిపణులు, డ్రోన్లు, నౌకాదళ మోహరింపుల నీడలో ఉన్న జలాల గుండా వెళ్తున్నాయి.
ఈ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థ జీవనాడిలోనే జరుగుతోంది. ఇంతటి సంక్షోభ సమయంలో కూడా భారతదేశ స్వరం పెద్దగా వినిపించకుండా నొక్కివేయబడింది.
హర్ముజ్ – నియంత్రణ పరిమితులు
భారతదేశ సందిగ్ధావస్థకు హర్ముజ్ జలసంధి స్పష్టమైన సంకేతంగా మారింది. ఈ యుద్ధం జలసంధి గుండా సాగే వాణిజ్య నౌకాయానానికి తీవ్రమైన ఆటంకం కలిగించింది.
ప్రపంచం మొత్తం పెద్ద ఎత్తున ఆధారపడే ఈ జలసంధిలో రవాణాపై బీమా ఉపసంహరించబడటం, భద్రతా భయాలు ఇంధన ప్రవాహానికి అంతరాయం కలిగించాయి.
భారతదేశం కొన్ని నౌకలకు జలసంధి గుండా పరిమిత రవాణా అనుమతిని పొందినట్లు తెలుస్తోంది.
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య ఘర్షణల సమయంలో కూడా టెహ్రాన్‌లో భారతదేశం తన దౌత్య ప్రాబల్యాన్ని నిలుపుకుందని దీని ద్వారా స్పష్టమవుతుంది.
అయితే ఈ ప్రాబల్యానికి ఉన్న పరిమితులు కూడా వెల్లడవుతున్నాయి.
ఒక చట్టం ద్వారా నిర్వహించబడుతున్న, ఒక స్థిరమైన అంతర్జాతీయ జలమార్గమైన హర్ముజ్ ఇంకా నిర్బంధంలోనే ఉంది.
రవాణా సంబంధాలు, వ్యూహాత్మక అవగాహనలపై ఆధారపడే విధంగా చర్చలతో ముడిపడి ఉన్న కారిడార్‌గా మారింది.
భారతదేశం మినహాయింపులను పొందినప్పటికీ, వ్యూహాత్మక వాతావరణాన్ని నియంత్రించలేకపోయింది. ఇప్పటికీ ఫలితాలు యుద్ధ స్వభావం, తీవ్రత మీదే ఆధారపడి ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనేది ఇతర దేశాల యుద్ధంతో మనం జాగ్రత్తగా వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటుంది.
దేనా ఉదంతం – సముద్ర భద్రతపై ప్రభావం
మరొక ఉదంతం కూడా ఇదే సందిగ్ధతను తెలియజేస్తుంది. శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రంలో ఇరాన్ నావికాదళ నౌక ‘ఐరిస్ దేనా’ను అమెరికాకు చెందిన ఒక జలాంతర్గామి టార్పెడోతో పేల్చివేసింది. పేల్చివేయబడిన నౌక ఒక శిక్షణా నౌక మాత్రమే.
“సౌభ్రాతృత్వం, సహకారం, సమన్వయం” అనే ఇతివృత్తంతో భారత నావికాదళం నిర్వహించిన 74 దేశాల ‘మిలన్’ నావికా విన్యాసాలకు ఆహ్వానితురాలిగా హాజరై, స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది.
ఈ సంఘటన చట్టబద్ధతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజం చెప్పాలంటే, సాయుధ సంఘర్షణ చట్టాల ప్రకారం యుద్ధంలో పాల్గొనే నౌకలను అంతర్జాతీయ జలాల్లో లక్ష్యంగా చేసుకుని పేల్చవచ్చు.
అయినప్పటికీ, భారతదేశానికి సంబంధించి ఈ ఘటన చట్టాల పరిమితులతో నిమిత్తం లేని అంశం. భారతదేశం హిందూ మహాసముద్రానికి తానే సంరక్షకురాలిగా ప్రకటించుకుంది.
ఈ ఉదంతం భారతదేశానికి కేవలం చట్టబద్ధత పరంగానే కాకుండా, తన వ్యూహాత్మక ప్రాముఖ్యతకు సంబంధించి కూడా ఎంతో ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు.
ఈ నౌక భారతీయ నౌకాదళ విన్యాసాలలో పాల్గొంది.
వంద మందికి పైగా నావికులు ప్రాణాలు కోల్పోయిన ఈ విషాదంలోని మానవతా కోణాన్ని కాదనలేనప్పటికీ, దానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వనట్లు కనిపిస్తోంది.
అంతేకాకుండా, పశ్చిమ ఆసియాలో ప్రారంభమైన యుద్ధం హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి విస్తరించడం మొదలైంది.
ప్రపంచ ఇంధనం, వాణిజ్యంలో ఈ ప్రాంతం గణనీయమైన వాటాను కలిగి ఉంది. ఈ జలాల్లో శత్రుత్వం ఏమాత్రం విస్తరించినా అది ప్రపంచ స్థిరత్వాన్ని అనివార్యంగా ప్రభావితం చేస్తుంది.
హిందూ మహాసముద్రంలో సముద్ర భద్రతను తేలికగా తీసుకోకూడదని కూడా ఈ ఉదంతం స్పష్టం చేస్తుంది.
ఇతర ప్రాంతాలలో మొదలయ్యే సంఘర్షణలు కూడా, స్వేచ్ఛా సముద్ర మార్గాలు, ఊహించదగిన సముద్ర క్రమంపై ఆధారపడిన ప్రాంతాలకు వ్యాపించగలవు.
చివరగా, ఇది ప్రధాన శక్తుల మధ్య సంయమన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
ప్రధాన సంఘర్షణ క్షేత్రానికి దూరంగా తీసుకున్న సైనిక చర్యలు, యుద్ధంలో పక్షాలు కాని దేశాలపై ఊహించని పరిణామాలను కలిగిస్తాయి.
భారతదేశం ఇతరుల సంఘర్షణలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించదు.
అయితే, హిందూ మహాసముద్రం ఒక స్థిరమైన సముద్ర ప్రాంతంగా కొనసాగుతూ, వాణిజ్య రవాణా, ఇంధన ప్రవాహాలు ఎటువంటి అంతరాయం లేకుండా నిలిచి ఉండేలా చూడటంలో దానికి చట్టబద్ధమైన ఆసక్తి ఉంది.
ఉద్రిక్తత ఉచ్చు
ఉద్రిక్తతను పెంచే ప్రక్రియలోనే అసలైన ప్రమాదం దాగి ఉంది. ఆధునిక యుద్ధ పద్ధతులు అభివృద్ధి చెందిన దేశాల సైన్యాలకు లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో నాశనం చేసే సామర్థ్యాన్ని ఇస్తున్నాయి.
క్షిపణి స్థావరాలు, కమాండ్ సెంటర్లు, రాడార్ నెట్వర్కులపై వేగంగా, సమర్థవంతంగా దాడి చేయవచ్చు. ఇటువంటి విజయాలు ఆయా దేశాలలో తరచుగా ఒక ప్రమాదకరమైన ఆశావాదాన్ని సృష్టిస్తాయి.
సైనిక ఒత్తిడి అద్భుతంగా పని చేస్తోందని భావించి, నాయకులు యుద్ధాన్ని మరింత విస్తరించే సాహసానికి ఒడిగడతారు.
కానీ, దాడికి గురైన దేశం ఊహించిన విధంగా పతనం కావడం అరుదుగా మాత్రమే జరుగుతోంది. ఈలోగా విదేశాల నుంచి వచ్చే ఒత్తిడి ఆ దేశంలో అంతర్గత ఐక్యతను బలపరుస్తుంది. జాతీయవాద భావన పెరిగి, సంఘర్షణ మరింతగా విస్తరిస్తుంది. రాజకీయ శాస్త్రవేత్త రాబర్ట్ పేప్ దీనిని ‘ఉద్రిక్తత ఉచ్చు’గా అభివర్ణించారు.
చరిత్రలో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి: వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్. ప్రస్తుత యుద్ధం కూడా అదే బాటలో పయనించే ప్రమాదం ఉంది.
ఇజ్రాయెల్, అమెరికా యుద్ధరంగంపై కొద్దికాలం పాటు ఆధిపత్యం చెలాయించవచ్చు. కానీ ఇరాన్ వ్యూహం దీనికి భిన్నంగా కనిపిస్తోంది. తక్షణ విజయాన్ని ఆశించకుండా, క్షిపణి దాడులు, సముద్ర కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, పశ్చిమాసియాలో ఒత్తిడిని పెంచడం ద్వారా యుద్ధానికి అయ్యే ఖర్చును పెంచాలని చూస్తోంది.
ఇటువంటి యుద్ధాలలో ఇంధన మార్కెట్లు, నౌకా రవాణా మార్గాలు, దౌత్యపరమైన పొత్తులతో కూడిన విస్తారమైన అంతర్జాతీయ వ్యవస్థ నిర్ణయాత్మక వేదికగా మారుతుంది. ఇందులో భారతదేశం కూడా ఉంది.
అరువు తెచ్చుకున్న కథనాల వల్ల కలిగే ప్రమాదం
భారతదేశంలో జరుగుతున్న చర్చలో మరొక ధోరణి వెలుగులోకి వచ్చింది. కొన్ని వర్గాలు ఇజ్రాయెల్ సైనిక వైఖరితో దాదాపు ఉత్సాహభరితమైన తాదాత్మ్యం చెందుతున్నాయి. ఇజ్రాయెల్‌ను నిర్ణయాత్మక రాజనీతిజ్ఞతకు, సాంకేతిక శక్తికి ఆదర్శంగా చూపుతున్నాయి.
కానీ ఈ పోలిక తప్పుదోవ పట్టిస్తుంది. ఇజ్రాయెల్, అమెరికా ఆధ్వర్యంలోని ఒక అధికారిక కూటమి వ్యవస్థలో పనిచేస్తుంది. ఇజ్రాయెల్ వ్యూహాత్మక సిద్ధాంతం వారి సంకుచిత భౌగోళికతను, నిర్దిష్టమైన భద్రతా వాతావరణాన్ని తెలియజేస్తుంది.
భారతదేశ వ్యూహాత్మక సిద్ధాంతం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇంధన సరఫరా, సప్లయ్ చెయిన్స్, ప్రవాస భారతీయుల భద్రత, స్థూల ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు మన బలహీనతలుగా ఉన్నాయి. మరో దేశ సైనిక సిద్ధాంతాలను మెచ్చుకున్నంత మాత్రాన ఇటువంటి నిర్మాణాత్మకమైన వాస్తవాలు మారవు.
వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అంటే భావోద్వేగంతో ఏదో ఒక పక్షం వైపు చేరడం కాదు; సంఘర్షణ పడుతున్న దేశాలతో సంబంధాలను కొనసాగించడానికి సంబంధించినది.
ఇజ్రాయెల్‌తో భారతదేశ సంబంధాలు, అమెరికాతో భాగస్వామ్యాలు, ఇరాన్‌తో దీర్ఘకాలిక సంబంధాలు, గల్ఫ్‌తో లోతైన ఆర్థిక సంబంధాలు అన్నీ కూడా ఒక సంక్లిష్టమైన దౌత్య నిర్మాణంలో అంతర్భాగం. ఆ నిర్మాణాన్ని కేవలం సైద్ధాంతిక పొత్తుకు కుదించడం భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి బదులుగా బలహీనపరుస్తుంది.
సమతుల్యతకు పరీక్ష
స్వయంప్రతిపత్తి అంటే ప్రపంచంలో జరిగే యుద్ధాల నుంచి కాపాడుకోవడం మాత్రమే కాదు. అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే జాతీయ ప్రయోజనాలను కాపాడుకోగల సామర్థ్యమే స్వయంప్రతిపత్తి.
ఆర్థిక స్థాయి, దౌత్యపరమైన పరిధి, ప్రత్యర్థి కూటములతో సంబంధాల ద్వారా అటువంటి స్వయంప్రతిపత్తిని నిలబెట్టుకునే నిర్మాణాత్మక పునాదులు భారతదేశానికి ఇప్పటికీ ఉన్నాయి.
కానీ స్వయంప్రతిపత్తి నిశ్చలంగా ఉండేది కాదు. నిరంతరం కసరత్తు చేస్తూ ఉండవలసిన అంశం. హర్ముజ్ ఉదంతం, సమతుల్య దౌత్యం ద్వారా భారత నౌకాయానానికి మార్గం కల్పించడం వంటి ఆచరణాత్మక ఫలితాలను సాధించవచ్చని తెలియజేస్తుంది.
అదే సమయంలో, సంఘర్షణలు భారతదేశ భద్రతకు కీలకమైన ప్రాంతాలకు ఎంత వేగంగా విస్తరించగలవో కూడా దేనా సంఘటన మనకు గుర్తు చేస్తుంది.
ప్రమాదకరమైన విధానాలను మార్చడం కష్టమనే టచ్మన్ హెచ్చరికను గుర్తుంచుకోవాలి. యుద్ధాల వల్ల కలిగే నష్టాలు స్పష్టంగా కనిపించిన చాలా కాలం తర్వాత కూడా అగ్రరాజ్యాలు వాటిని కొనసాగిస్తాయి.
భారతదేశం ముందున్న సవాలు ఈ సంఘర్షణ ఫలితాన్ని నిర్ణయించడం కాదు. విస్తరిస్తున్న యుద్ధ ఛాయలు భారతదేశం ఆధారపడిన సముద్ర వాణిజ్యాన్ని, ఆర్థిక వ్యవస్థలను అస్థిరపరచకుండా చూసుకోవడమే అసలైన సవాలు.
వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి భారతదేశానికి ఉన్న అవకాశాలను విస్తరించడానికి ఉద్దేశించబడింది. అగ్రరాజ్యాలు ఎప్పటికప్పుడు తమకు అనుగుణంగా నిబంధనలను మార్చుకుంటున్న నేటి పరిస్థితులలో ఆ అవకాశాలను మరింత స్పష్టతతో ఉపయోగించుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న.
స్వయంప్రతిపత్తి అనేది అధికారిక ప్రసంగాలలో పునరావృతమయ్యే ఒక పదబంధంగా మాత్రమే మిగిలిపోతే, క్రమంగా అర్థాన్ని కోల్పోతుంది.
సంక్షోభ సమయాల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన, స్వతంత్ర దౌత్యానికి పునాదిగా మారినప్పుడు మాత్రమే భారతదేశపు అత్యంత విలువైన వ్యూహాత్మక ఆస్తులలో ఒకటిగా నిలుస్తుంది.
ఈ యుద్ధం భారతదేశపు యుద్ధం కాదు. కానీ దాని పర్యవసానాలు ఇప్పటికే భారతదేశాన్ని దిగ్బంధించాయి.
అనువాదం: పి. నరసింహారావు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
