తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దళిత బ్యూరోక్రాట్ల పరిస్థితిని గమనిస్తే- రెండు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఎక్కువ సంఖ్యలో వివాదాలు బయటకు వస్తున్నాయి. ఈ వివాదాలన్నీ కులపరమైన వివక్షలే కావడం గమనార్హం.
పాలనాపరమైన అంశాల్లో రాజకీయ ఏకపక్ష నిర్ణయాలు, అధిక జోక్యం, రాజకీయ ఒత్తిళ్లు, తరచుగా బదిలీల వివాదాలు, రాజకీయంగా ప్రేరేపించబడిన పోస్టింగ్‌లతో పాటు పాలక పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలనే ఒత్తిడి వల్ల- తరచుగా పరిపాలనా వ్యవస్థలో వివాదాలు దళిత అధికారుల చుట్టే తిరుగుతున్నాయి. వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ మానసికంగా వేధిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఇద్దరు దళిత బ్యూరోక్రాట్ల వివాదాలు చర్చనీయాంశంగా మారాయి.
అందులో ఒకటి, హర్యానా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ అధికారుల కక్షపూరిత కులవివక్ష వల్ల మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నది.
రెండవది, ఆంధ్రప్రదేశ్‌లో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పీవీ సునీల్ కుమార్‌ను బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్ చేసిన ఘటన.
ప్రజాస్వామ్య జవాబుదారీతనం కోసం అధికారులు రాజకీయ నాయకత్వంలో పనిచేయాల్సి ఉండగా, ఇలాంటి వివాదాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడానికి నిర్మాణాత్మక, సంస్థాగత, అగ్రకుల ఆధిపత్య రాజకీయ, సంస్కృతులను పరిశీలించడం అవసరం.
రాజకీయ కక్షసాధింపు..
దేశవ్యాప్తంగా దళిత బ్యూరోక్రాట్ల మీద వేధింపులను గమనిస్తే, సమాజం మీద అవగాహన కలిగి ఉండి ప్రశ్నించే స్వభావం కలిగిన వారినే ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయని తెలుస్తుంది.
పీవీ సునీల్ కుమార్ కొన్నేళ్లుగా మాల, మాదిగ వాడల్లో ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేసి ఆ నిధులను నేరుగా వారితోనే ఖర్చుపెట్టించి, ఆ వాడల అభివృద్ధికోసం “అంబేద్కర్ ఇండియా మిషన్” ద్వారా సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
ఆయన వెనకాల సామాజిక సంఘర్షణలు ఉన్నాయి. లక్ష్యాలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో హక్కుల ఎజెండాతో ముందుకువెళ్తున్నారు.
భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను సహించని అగ్రకుల పాలక పక్షాలు ఆయన్ని టార్గెట్ చేసి నిరాధారమైన ఆరోపణలతో సస్పెండ్ చేశాయి.
మొన్న రెండవసారి కూడా తన సస్పెన్షన్‌ని జూన్ 30 వరకు పొడిగించారు.
అయితే, ఇప్పటికీ ఒక స్టాండ్ మీద నిలబడకుండా సందర్భాన్ని బట్టి భిన్నమైన ఆరోపణలను, అభియోగాలను కూటమి ప్రభుత్వం మోపుతుంది.
పీవీ సునీల్ కుమార్ ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లారని ఒక ఆరోపణ, వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని రెండో ఆరోపణ.
మొదటి ఆరోపణలో పీవీ సునీల్ కుమార్ ప్రతి పర్యటన ర్యాటిఫికేషన్, ఛార్జ్ హ్యాండోవర్ చేసి వెళ్లానని వివరణ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వ రెండవ ఆరోపణ ఏదైతే ఉన్నదో, ఆ అభిప్రాయం వాస్తవమా కాదా! అని అంగీకరించటానికి ముందు ఒక ప్రశ్న వేసుకోవాలి.
ఒక ప్రభుత్వం పాలిస్తున్నప్పుడు దాంట్లో అనేక వర్గాల బ్యూరోక్రాట్స్ పనిచేస్తారు.
ఆ ప్రభుత్వానికి అనుకూలమైన, వ్యతిరేకమైన వారు కూడా ఉంటారు. అలాంటప్పుడు, ఒక పీవీ సునీల్ కుమార్ ఒక్కరు మాత్రమే మద్దతుదారులు ఎలా అవుతారు?
ఈ కేసులో మరో కోణం..
ఈ చర్చ ఒక పక్క నడుస్తున్నప్పటికీ, “నేను ఒక షెడ్యూల్డ్ ట్రైబ్‌గా పుట్టడమే నేరమా” అంటూ మరో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలోని అసలు కుట్ర కోణాన్ని బట్టబయలు చేసింది.
గత జగన్ ప్రభుత్వాన్ని ఈ కేసులో ఇరికించటానికి తనపైన ఒత్తిడి తెస్తున్నారని, తనను కుట్రపూరితంగా సంబంధం లేని విషయాల్లో ఇరికించాలని చూస్తున్నారని ఎక్స్ వేదికగా సునీల్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి తన ప్రమేయంతో సాక్షుల్ని ప్రభావితం చేయడానికి అనేక కుట్రల్ని చేస్తూ అధికారులను పావులుగా వాడుకొని మరోపక్క దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లోకి తీసుకుని అధికారులపై వేధింపులకు పాల్పడుతున్నారని కూడా ప్రకటించారు.
అయితే, ఈ కేసులో సుప్రీంకోర్టు సరైన ఆధారాలు లేవని కొట్టివేసింది.
కానీ, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల రెండు ఆధిపత్య రాజకీయ కుట్రల్లో ఇద్దరు అధికారులు- ఒకరు దళిత సామాజిక వర్గానికి చెందిన పీవీ సునీల్ కుమార్, మరో ఐపీఎస్ ఆఫీసర్ షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీకి చెందిన సునీల్ నాయక్‌లను బలిపశువులను చేయడానికి కూటమి ప్రభుత్వం జగన్ పార్టీ మీద కక్షతో చేస్తున్నారనేది తేటతెల్లమైంది.
కులం ఒక నిరంతర సంస్థాగత వాస్తవికత..
ఆంధ్రప్రదేశ్ సోషల్ పొలిటికల్, క్యాస్ట్ డైనమిక్స్ అర్థం కావాలంటే- కారంచేడు, చుండూరు, లక్ష్మిపేట కుల ఉన్మాదాలను అర్థం చేసుకోకుండా దళితుల మీద దాడులు, వివక్షలను అర్ధం చేసుకోలేము.
దళితులు ఏ స్థానంలో ఉన్నా కూడా వారు వివక్షకు, అవమానాలకు గురవుతున్నారంటే యాదృచ్ఛికంగా కాదు. దీని వెనక కుట్రపూరిత ఎజెండాలు ఉన్నాయి.
భవిష్యత్తులో దళిత బ్యూరోక్రాట్స్ పారదర్శకంగా పనిచేయనివ్వకుండా భయాన్ని కలిగించి, లొంగదీసుకునే ప్రణాళికలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సబాల్ట్రన్ సెక్షన్స్ నుంచి వచ్చే భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను సహించలేకనే ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి దుశ్చర్యల్లో గత జగన్ ప్రభుత్వం మినహాయింపు కాదు.
ఇది ప్రమాదకరమైన ధోరణి. ప్రజా జీవితంలో ఉండి ప్రజల కోసం పనిచేయాలనుకునే క్వాలిఫైడ్ బ్యూరోక్రాట్స్ పీవీ సునీల్ కుమార్లాంటి వాళ్లకు సర్వీస్ ఉంది.
అయినప్పటికీ పనిచేయనివ్వకుండా ప్రజాస్వామిక అవకాశాలు సన్నగిల్లిపోయేలా చేస్తున్నారు.
దేశంలో దళితులకు అధికారం, సంపదలో స్వల్పమైన వాటా ఉందని, సమానమైన ప్రాతిపదిక పొందే హక్కు కోసం విజయ్ కుమార్ ఐఏఎస్, పూర్ణచందర్ రావు, దేవి ప్రసాద్ ఉప్పులేటి, మరికొంత మంది మాజీ బ్యూరోక్రాట్స్ ఉద్యమిస్తున్నారు.
దేశంలో ఎంతో మంది అగ్రవర్ణ బ్యూరోక్రాట్స్ ఉన్నారు. కానీ, వారి చుట్టూ వివాదాలు లేవని కాదు! ఉన్నా కూడా వాటిని మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపెట్టే సాహసం చేయదు.
అదే దళిత అధికారుల విషయంలో మీడియా నిద్రపోకుండా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఆ వ్యక్తిని విలన్ చేసే వరకు వదిలిపెట్టదు.
ప్రస్తుతం దేశంలో దళితుల విషయంలో అదే జరుగుతుంది.
తెలంగాణలో గత ప్రభుత్వం ఆకునూరి మురళిలాంటి ఐఏఎస్‌కు రెండేళ్లు పోస్టింగ్ ఇవ్వలేదు.
కారు, గన్‌మెన్ ఇవ్వకుండా రెండేళ్లు పక్కన పెట్టింది. ఆ తర్వాత ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు అనేకమంది దళిత బ్యూరోక్రాట్లు ఇలాగే కుల వేధింపులకు గురయ్యారు.
స్పృహ లేని దళిత సమాజం..
నేడు కుల వ్యవస్థ! ఇంకా కులం ఎక్కడ ఉందంటూ ఎదురు ప్రశ్న వేస్తూనే ఆధునిక పోకడతో అనేక రంగాల్లో ముఖ్యంగా రాజకీయ రంగంలో, విద్యా రంగంలో నిరంతరం సవాలు చేస్తున్నది.
రాను రాను దళిత ఉద్యమాల ప్రభావం తగ్గడం వల్ల కుల వివక్షలను ఎదుర్కొంటున్న కొత్త తరం వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్యలను చేసుకుంటున్నారు.
అయితే, కుల వివక్షలను ఎదుర్కొంటున్న ప్రస్తుత దళిత సమాజం కుల స్పృహ కలిగి లేదు.
కుల స్పృహ కలిగిలేకపోవడం అంటే పాజిటివ్ దృక్పథంలో కులాన్ని వెనకేసుకురావడం అని అర్థం కాదు. నిరంతరం నీడలా వెంటాడే కుల వివక్షలను తిప్పికొట్టే ప్రణాళిక లేకపోవడం ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం.
దళితుల మీద జరుగుతున్న హింస, వివక్షల పట్ల స్పందించడం అటుంచితే- సో కాల్డ్ ప్రభుత్వాల కుట్రలను వెనకేసుకొస్తున్నారు.
ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దళిత ఉద్యమాల ప్రభావం చాలా ఎక్కువ, కానీ పీవీ సునీల్ కుమార్లాంటి ఐపీఎస్ అధికారులను ప్రభుత్వాలు కక్ష గట్టి వేధిస్తున్నప్పుడు జరుగుతున్న చర్చల్లో ఆయనకు లభించిన దళితుల మద్దతు కంటే అగ్రవర్ణాలకు దళితుల నుంచి లభించిన మద్దతు ఎక్కువ.
రాజకీయ ఐడియాలజీ లేకపోవడం..
ఇరవై ఒకటో శతాబ్దంలో దళిత రాజకీయాలు ఆత్మగౌరవం, విద్య, ప్రాతినిధ్యం కోసం ఉద్యమాల ద్వారా దళిత రాజకీయ చైతన్యపరచడంలో విఫలం అయ్యాయి.
అయితే రాజకీయ హక్కులు, విద్య, ఉపాధిలో రిజర్వేషన్లు, రాజ్యాంగ రక్షణలను కాపాడుకోవడానికి బీఆర్ అంబేద్కర్ దళితులను సమీకరించారు.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, తరువాత బహుజన్ సమాజ్ పార్టీ వంటి సంస్థలు సామాజికంగా అణచివేయబడిన సమాజం నుంచి దళితులను రాజకీయంగా వ్యవస్థీకృత శక్తిగా మార్చడానికి ప్రయత్నించాయి.
ఒకప్పుడు “బహుజన పాలన” అనే నినాదం అణచివేత వర్గాల మధ్య ఐక్యతను నొక్కి చెప్పింది. అంతేకాకుండా భారత రాజకీయాల్లో అగ్రకుల ఆధిపత్యాన్ని సవాలు చేసింది.
కానీ, ప్రస్తుతం దళిత యువతకు పొలిటికల్ ఐడియాలజీ లేకపోవడం వల్ల అగ్రవర్ణ రాజకీయాలలో కీలుబొమ్మలుగా మారారు.
దళిత రాజకీయాల చైతన్యం అత్యంత శక్తివంతమైన సామాజిక పరివర్తనలలో ఒకటి. అంబేద్కర్, ఫూలే, పెరియార్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే వారసత్వం లేక దళిత చైతన్యం, రాజకీయ స్పృహ లేక క్రమంగా దళిత ఉద్యమాలు బలహీనపడుతున్నాయి.
దళిత రాజకీయ చైతన్యాన్ని విచ్ఛిన్నం చేసి, దళితులను విభజించి రాజకీయంగా లబ్ధిపొందడం ప్రస్తుత అగ్రకుల రాజకీయ పార్టీల ప్రధాన ఎజెండాగా ఉంది. దళిత హక్కుల సంక్షోభం సాధారణ దళితుల నుంచి ఉన్నత స్థానంలో స్థిరపడ్డ బ్యూరోక్రాట్స్ వరకు వెంటాడుతున్నది.
బీఆర్ అంబేద్కర్ వారసత్వం కొత్త తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. కానీ, ఆయన ఆశించిన సామాజిక, రాజకీయ గుర్తింపు రోజురోజుకు బలహీనపడుతున్నది.
ప్రశ్నించే తత్వం లేదు. ఏకీకృత దళిత ఉద్యమానికి బదులుగా, విచ్ఛిన్నమైన దళిత సమూహాల అస్తిత్వ విభజన రాజకీయాలతో సామాజిక న్యాయాన్ని సాధించలేక, వివక్షల పట్ల పోరాడలేక దళిత ఉద్యమాలు అగ్రకుల రాజకీయాల్లో బలైపోతున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
