“బెంగాల్‌లోని రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం ఒకే సమయంలో చేసిన అప్పీళ్లు 72,000 — వీరిలో 99% మంది ముస్లింలు”
ఎన్నికల సంఘం దాఖలు చేసిన అప్పీళ్లు అనుకూలంగా వస్తే భవిష్యత్తులో ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగే ప్రతి ఎన్నికల ఫలితాలపై, ఎన్నికల తీరుతెన్నులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
పశ్చిమబెంగాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే, ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల పేర్లను తొలగించడానికి చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియలో రెండు రకాల పద్ధతులు కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు పద్ధతుల అంతిమ ఫలితం మాత్రం ఒక్కటే.
ముర్షిదాబాద్ జిల్లాలోని సంషేర్‌గంజ్ నియోజకవర్గంలోని 74,775 మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు కాదని న్యాయాధికారులు గుర్తించారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఈ నియోజకవర్గంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లను అనర్హులుగా గుర్తించారు.
మాల్దా జిల్లాలోని సుజాపూర్ నియోజకవర్గంలో న్యాయమూర్తులు అనర్హులుగా తొలగించిన ఓటర్ల సంఖ్య చాలా తక్కువ.
అయితే, న్యాయమూర్తులు పరిశీలించిన ఓటర్ల జాబితాలో అర్హులని నిర్ణయించిన వారిలో 61,066 మంది ఓటర్ల పేర్లను తిరిగి తొలగించాలని ఎన్నికల సంఘం అప్పీళ్లు దాఖలు చేసింది. ఇది రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం కంటే కూడా చాలా ఎక్కువ.
ఈ ప్రక్రియలో న్యాయాధికారులు పరిశీలించి ఓటు వేయడానికి అర్హులని ప్రకటించిన అనేక మంది ఓటర్లపైన కూడా ఎన్నికల సంఘం అప్పీళ్లు దాఖలు చేసింది.
సివిక్ రీసెర్చ్ గ్రూప్ సేకరించి, ధ్రువీకరించిన రికార్డులను ‘ది వైర్’ పరిశీలించింది. వాటి ప్రకారం, ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం తొలగించాలని కోరుతున్న ఓటర్లలో దాదాపు ప్రతి ఓటరు ముస్లింల పేర్లకు దగ్గరగా ఉన్నవే.
అంతేకాకుండా, ఈ అప్పీళ్లలో అత్యధిక శాతం 2026 ఏప్రిల్ 5వ తేదీన ఒకే సమయానికి నమోదు చేసినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. అదీ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాను ఖరారు చేయడానికి కేవలం రెండు రోజుల ముందు ఇది జరిగింది.
ఓటర్ల పేర్ల తొలగింపుకు రెండు విధానాలు-ఫలితం మాత్రం ఒక్కటే
సంషేర్‌గంజ్ నియోజకవర్గం: మొత్తం 1,08,400 మంది ఓటర్లను న్యాయపరమైన పరిశీలనకు పంపించారు. వారిలో 69 శాతం మందిని న్యాయాధికారులు తొలగించారు. 33,152 మందిని ఓటర్లుగా కొనసాగించేందుకు అర్హులని గుర్తించారు.
అయితే, ఎన్నికల సంఘం వారిలో 15,195 మందిపై అప్పీళ్లు దాఖలు చేసింది. అంటే, అర్హులుగా గుర్తించిన వారిలో 47.6 శాతం మందిపై మళ్లీ అభ్యంతరం తెలిపింది.
సుజాపూర్ నియోజకవర్గం: మొత్తం 1,34,521 మంది ఓటర్లను పరిశీలనకు పంపించారు. వారిలో కేవలం 20 శాతం మందిని మాత్రమే న్యాయాధికారులు తొలగించారు. 1,07,690 మందిని అర్హులుగా గుర్తించారు. అయినప్పటికీ, ఎన్నికల సంఘం వారిలో 61,066 మందిపై అప్పీళ్లు దాఖలు చేసింది. అంటే, అర్హులుగా గుర్తించిన వారిలో 56.7 శాతం మందిపై అప్పీళ్లు ఉన్నాయి.
సుజాపూర్‌లో న్యాయాధికారులు స్వయంగా తొలగించిన ఓటర్ల సంఖ్య కంటే, ఎన్నికల సంఘం అప్పీళ్లు చేసిన ఓటర్ల సంఖ్య రెండు రెట్లకు పైగా ఉంది.
ఈ అప్పీళ్లన్నీ అంగీకరించబడితే?
సంషేర్‌గంజ్‌లో పరిశీలనకు పంపిన ఓటర్లలో మొత్తం 83 శాతం మంది ఓటర్ల జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉంది.
సుజాపూర్‌లో ఈ సంఖ్య 65 శాతానికి చేరుతుంది. సుజాపూర్‌లో న్యాయాధికారులు తొలగించిన 26,829 మందికి అదనంగా, ఎన్నికల సంఘం అప్పీళ్లు నిజమని తొలగిస్తే మరో పెద్ద సంఖ్యలో ఓటర్లు తొలగించబడవచ్చు. మొత్తం తొలగింపుల సంఖ్య 87,895కు చేరుతుంది.
సుజాపూర్కు సంబంధించి న్యాయాధికారులు అర్హులుగా ప్రకటించిన మొత్తం 1,07,690 మంది రికార్డులను పరిశీలించారు.
సంషేర్‌గంజ్‌లో అర్హులుగా ప్రకటించిన 33,152 మందిలో 31,896 మంది రికార్డులు, అంటే సుమారు 96 శాతం అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ట్రిబ్యునళ్లు సుజాపూర్‌లో 89 అప్పీళ్లను, సంషేర్‌గంజ్‌లో 16 అప్పీళ్లను మాత్రమే పరిష్కరించాయి.
అప్పీళ్లు ఎదుర్కొంటున్న ఓటర్లు ఎవరు?
సంషేర్‌గంజ్‌లో ఎన్నికల సంఘం అప్పీళ్లు చేసిన 15,195 మందిలో 15,177 మంది ముస్లింల పేర్లకు దగ్గరగా ఉన్న పేర్లు ఉన్నాయి. ఇది 99.9 శాతం. సుజాపూర్‌లో 61,066 మందిలో 60,823 మందికి అలాంటి పేర్లు ఉన్నాయి. ఇది 99.6 శాతం.
ఈ గణాంకాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎన్నికల సంఘం, న్యాయాధికారులు అర్హులుగా ప్రకటించిన వారిలో నుంచి ప్రత్యేకంగా ముస్లింలను మాత్రమే ఎంచుకుని అప్పీళ్లు చేసిందని ఈ గణాంకాలు నేరుగా రుజువు కావు. ఎందుకంటే, సంషేర్‌గంజ్ జనాభాలో సుమారు 72 శాతం మంది, సుజాపూర్ జనాభాలో 75 శాతం మంది మైనారిటీ వర్గాలకు చెందినవారు.
న్యాయాధికారులు అర్హులుగా ప్రకటించిన వారిలో చాలామందికి ముస్లింల పేర్లకు దగ్గరగా ఉన్న పేర్లు ఉండటం దీనికి ఒక కారణం కావచ్చు.
అయితే, సమస్య అంతకుముందే మొదలైంది. అంటే, ఎవరిని మొదట పరిశీలనకు పంపించారనే దశలోనే అసమానతలు ఉన్నాయి.
సంషేర్‌గంజ్‌లో ఏమి జరిగింది?
గత ఏప్రిల్‌లో ది వైర్ ప్రచురించిన మరో కథనం ప్రకారం, ముస్లింలు జనాభాలో సగం లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న పోలింగ్ బూత్‌లలో ఒక్కో బూత్‌కు సగటున 467 మంది ఓటర్లను పరిశీలనకు పంపించారు.
ఇతర పోలింగ్ బూత్‌లలో ఈ సగటు కేవలం 65 మంది మాత్రమే. పరిశీలన తర్వాత అర్హులుగా ప్రకటించబడిన వారిలో దాదాపు అందరూ ముస్లింలే. ఇప్పుడు ఎన్నికల సంఘం అప్పీళ్లు చేసిన వారిలో కూడా దాదాపు అందరూ ముస్లింలే ఉన్నారు.
సుజాపూర్లోని మరో ముఖ్యమైన విషయం
ముస్లింలతో సాధారణంగా సంబంధం ఉన్న పేర్లు లేని అర్హులైన ఓటర్లపైన మాత్రం మరింత ఎక్కువ శాతం అప్పీళ్లు దాఖలయ్యాయి. వారి విషయంలో అప్పీళ్ల శాతం 86 శాతం కాగా, ముస్లిం పేర్లు ఉన్నవారిలో ఇది 57 శాతం.
ఈ ఓటర్లు ప్రధానంగా ఓటర్ల జాబితాలోని తొమ్మిది భాగాల్లో ఉన్నారు. ఆ తొమ్మిది భాగాల్లోనే అప్పీళ్లకు గురైన ఈ రెండు వర్గాల ఓటర్లలో అత్యధికులు ఉన్నారు.
కొన్ని ఉదాహరణలు: పార్ట్ 2లో అర్హులుగా గుర్తించిన మొత్తం 13 మందిపైనా అప్పీళ్లు చేశారు. పార్ట్ 244లో 43 మందిలో 40 మందిపై అప్పీళ్లు చేశారు.
పార్ట్ 250లో 78 మందిలో 68 మందిపై అప్పీళ్లు చేశారు. దీన్ని బట్టి ఒక్కొక్క ఓటరును విడిగా పరిశీలించి అప్పీళ్లు చేయడం కంటే, ఓటర్ల జాబితాలోని భాగాల వారీగా పెద్ద సంఖ్యలో అప్పీళ్లు దాఖలు చేసినట్లు కనిపిస్తోంది.
ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం-ఒకే సమయానికి వేల అప్పీళ్లు
ప్రతి పెండింగ్ అప్పీల్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య(ఐడీ) ఉంటుంది. SIR ప్రక్రియపై పనిచేస్తున్న పౌరహక్కుల కార్యకర్తలు ఈ ఐడీల నిర్మాణాన్ని విశ్లేషించారు. వారి వివరణను ది వైర్ కూడా స్వతంత్రంగా పరిశీలించింది.
ఈ ఐడీలోని ఒక అక్షరం ద్వారా గంపగుత్తగా అప్పీళ్లు ఏ తేదీ, ఏ సమయంలో నమోదు చేశారో తెలుసుకోవచ్చు. ఇప్పటికే పరిష్కరించిన అప్పీళ్లకు ఈ ఐడీలు అందుబాటులో లేవు. అందువల్ల ఈ విశ్లేషణ పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లకే పరిమితం.
సుజాపూర్‌లో పెండింగ్ అప్పీళ్లు 60,977. సంషేర్‌గంజ్‌లో పెండింగ్ అప్పీళ్లు 15,179. మొత్తం పెండింగ్ అప్పీళ్లు: 76,156. వీటిలో 72,838 అప్పీళ్లు, అంటే 96 శాతం, 2026 ఏప్రిల్ 5వ తేదీన ఒకే సమయంలో అప్పీలు చేసినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. వాటిలో సుజాపూర్‌లో 59,972 అప్పీళ్లు, మొత్తం అప్పీళ్లలో 98 శాతం. సంషేర్‌గంజ్‌లో 12,866 అప్పీళ్లు, మొత్తం అప్పీళ్లలో 85 శాతం.
అప్పీళ్ల ఐడీలు ఏమి సూచిస్తున్నాయి?
సీ-సిరీస్‌కు చెందిన ఐడీ నంబర్లు వరుసగా జారీ అయినట్లు కనిపిస్తున్నాయి. అవి ఓటర్ల జాబితాలోని ఒక్కో భాగం చొప్పున క్రమంలో ఉన్నాయి.
సుజాపూర్‌లో ఈ సంఖ్యలు 0 నుంచి 60,014 వరకు ఉన్నాయి. వాటిలో 43 సంఖ్యలు కనిపించడం లేదు. సంషేర్‌గంజ్‌లో 0 నుంచి 13,153 వరకు సంఖ్యలు ఉన్నాయి. వాటిలో 288 సంఖ్యలు కనిపించడం లేదు.
ఐడీలను ఒక క్రమంలో పెట్టి పరిశీలించినప్పుడు, ఓటర్ల జాబితాలోని భాగాల సంఖ్య వెనక నుంచి ముందుకు కాకుండా మొదట పార్ట్ 1, తర్వాత పార్ట్ 2 ఇలా చివరి భాగం వరకు క్రమంగా ఉన్నాయి.
అయితే, ఒక్కో భాగంలో ఐడీల క్రమం ఓటర్ల సీరియల్ నంబర్లను లేదా వారి పేర్లు తిరస్కరించిన తేదీలను తెలుపడం లేదు.
దీని ఆధారంగా, అప్పీళ్లు దాఖలు చేసిన ప్రతిసారీ ఒక్కో ఐడీని విడిగా జారీ చేయడం కాకుండా, ఓటర్ల జాబితాలోని భాగాల వారీగా ముందుగానే గుత్తగుత్తగా ఐడీలు సృష్టించి ఉండవచ్చు.
డీ, ఈ సిరీస్‌లకు చెందిన తక్కువ సంఖ్య అప్పీళ్లు, ఆన్లైన్లో దాఖలైన జీ సిరీస్ అప్పీళ్లు మాత్రం ఇలాంటి వరుస క్రమంలో లేవు.
వేరువేరు తేదీల్లో ఆన్లైన్లో దాఖలైన జీ సిరీస్ అప్పీళ్లు మాత్రమే విడివిడిగా దాఖలు చేసినట్లుగా కనిపిస్తున్నాయి.
సంషేర్‌గంజ్‌లో ఇలాంటి అప్పీళ్లు 423 ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం ఏప్రిల్ 1 నుంచి 8 మధ్య దాఖలయ్యాయి. ఏప్రిల్ 3న అత్యధికంగా 82 దాఖలయ్యాయి. సుజాపూర్‌లో ఏప్రిల్ 3న అప్పీళ్లు 37 ఉన్నాయి.
ఒక్కో భాగంలో అప్పీళ్ల పరిస్థితి
ఈ అప్పీళ్లు రెండు నియోజకవర్గాల్లోని దాదాపు అన్ని ప్రాంతాలకూ చెందినవి ఉన్నాయి. సంషేర్‌గంజ్‌లో అర్హులుగా గుర్తించిన ఓటర్లు ఉన్న మొత్తం 230 భాగాల్లో అప్పీళ్లు దాఖలయ్యాయి.
సుజాపూర్‌లో అర్హులుగా గుర్తించిన ఓటర్లు ఉన్న 262 భాగాల్లో 261 భాగాలకు సంబంధించిన అప్పీళ్లు ఉన్నాయి.
చాలా భాగాల్లో న్యాయాధికారులు అర్హులుగా ప్రకటించిన ఓటర్లలో సుమారు సగం మందిపై లేదా అంతకంటే ఎక్కువ మందిపై ఎన్నికల సంఘం అప్పీళ్లు చేసింది.
న్యాయాధికారులు ఎక్కువ మంది ఓటర్లను అర్హులుగా గుర్తించిన భాగాల్లోనే అప్పీళ్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. మొత్తం 20 భాగాల్లో రికార్డుల్లో ఉన్న అర్హులైన ఓటర్లు ముస్లింల పేర్లకు దగ్గరగా ఉన్న పేర్లే ఉన్నాయి.
అత్యధిక అప్పీళ్లు నమోదైన భాగాలు
సుజాపూర్‌లో కనీసం 100 మంది అర్హులైన ఓటర్లు ఉన్న భాగాల్లో పార్ట్ 25-182 మందిలో 134 మందిపై అప్పీళ్లు అంటే 73.6 శాతం.
పార్ట్ 151లో 72.5 శాతం. పార్ట్ 152లో 71.5 శాతం. పార్ట్ 179లో 71.5 శాతం. సంషేర్‌గంజ్‌లో అత్యధిక శాతం అప్పీళ్లు పార్ట్ 41లో నమోదయ్యాయి. అక్కడ అర్హులుగా గుర్తించిన 203 మందిలో 139 మందిపై అప్పీళ్లు చేశారు. ఇది 68.5 శాతం.
ఈ వ్యవహారం వల్ల ఏమి జరగవచ్చు?
2026 ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాలనూ తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. రెండు చోట్లా కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.
సంషేర్‌గంజ్: మహమ్మద్ నూర్ ఆలం 7,587 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎన్నికల సంఘం అప్పీళ్లు చేసిన ఓటర్ల సంఖ్య గెలుపు మెజారిటీకి రెండింతలు కంటే ఎక్కువ.
సుజాపూర్: సబీనా యాస్మిన్ 60,287 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎన్నికల సంఘం అప్పీళ్లు చేసిన ఓటర్లు 61,066 మంది. అంటే, ఆమె గెలుపు మెజారిటీ కంటే అప్పీళ్లకు గురైన ఓటర్ల సంఖ్య కొంచెం ఎక్కువ.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ సంషేర్‌గంజ్‌లో 26,000కు పైగా ఓట్ల మెజారిటీతో, సుజాపూర్‌లో 1.3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2026 ఏప్రిల్ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే ప్రకటించారు.
అయితే, ఈ అప్పీళ్లలో ఎన్నికల సంఘం విజయం సాధిస్తే, భవిష్యత్తులో ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముందుగా జరగబోయే మున్సిపల్ ఎన్నికలపైనా ఈ పరిణామాలు ప్రభావం చూపవచ్చు. ఆ ఎన్నికల షెడ్యూల్ నవంబరులో ప్రకటించే అవకాశం ఉంది.
సుజాపూర్‌లో ఎన్నికల సంఘం అప్పీళ్లు చేసిన 61,066 మంది ఓటర్లు, ఆ నియోజకవర్గం ప్రాథమిక ఓటర్ల జాబితాలోని మొత్తం 2,56,276 మందిలో దాదాపు నాలుగో వంతుకు సమానం.
ఓటర్ల అప్పీళ్లపై విచారణ నెమ్మదిగా సాగుతోంది
ఈ రెండు నియోజకవర్గాల్లోని 76,261 అప్పీళ్లలో ట్రిబ్యునళ్లు కేవలం 105 అప్పీళ్లనే పరిష్కరించాయి. సుజాపూర్‌లో 89. సంషేర్‌గంజ్‌లో 16. మిగిలిన అప్పీళ్లు కోల్‌కతాలోని ట్రిబ్యునళ్లలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల నుంచి కోల్‌కతా వందల కిలోమీటర్ల దూరంలో ఉంది.
సెప్టెంబరు 21 నుంచి ట్రిబ్యునళ్లు ఎలాంటి ఉత్తర్వులనూ అప్లోడ్ చేయలేకపోయాయి. ఎందుకంటే, ఎన్నికల సంఘం పోర్టల్‌లోకి న్యాయమూర్తులు తమ ఆధార్ వివరాలతో లాగిన్ కావాలనే నిబంధనను న్యాయమూర్తులు తిరస్కరించారు.
ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు
ఎన్నికల సంఘం న్యాయాధికారుల వద్ద అప్పీళ్లు చేసిన ఓటర్లందరూ ఇప్పటికే రెండుసార్లు తమ అర్హతను నిరూపించుకున్నారు. మొదట బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ) ముందు. తర్వాత న్యాయాధికారి ముందు. అయినప్పటికీ, ఎన్నికల సంఘం వారిపై ఎందుకు అప్పీళ్లు చేసిందో స్పష్టంగా చెప్పలేదు.
అలాగే, ఈ ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వలేదు. ప్రతి కేసును అప్పీల్ చేయడానికి ముందు విడిగా పరిశీలించారా? ఇన్ని వేల అప్పీళ్లు ఒకే సమయానికి ఎందుకు నమోదయ్యాయి?
రెండు నియోజకవర్గాల్లోనూ అర్హులుగా గుర్తించిన వారిలో సుమారు సగం లేదా అంతకంటే ఎక్కువ మందిపై ఎందుకు అప్పీళ్లు చేశారు?
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఎందుకు కనిపిస్తోంది? ఈ ప్రశ్నలకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదు.
(తెలుగు అనువాదం: డి. వెంకన్న)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
