2026 మే 27న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) విషయంలో పొరపాటు జరిగిందా?
ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పు లేదా తొలగింపునకు సంబంధించి పౌరసత్వాన్ని పరిశీలించేందుకు ‘పరిమిత’ విచారణ చేపట్టే అధికారాలను భారత ఎన్నికల సంఘానికి కల్పించడం ద్వారా కోర్టు పొరపాటు చేసిందా?
రెండవది, అనుమానాల ఆధారంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం ద్వారా జాబితాను మార్చవచ్చా?
2025 జనవరి 6న ప్రచురించిన బీహార్ ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమ్మరీ రివిజన్ తర్వాత తలెత్తిన సమస్యల నేపథ్యంలో ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
2025 జూన్ 24న బీహార్‌తో ప్రారంభించి, దేశవ్యాప్తంగా కొత్తగా ఎస్ఐఆర్ చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
జనవరి 1, 2003(బీహార్‌లో చివరిసారిగా ఎస్ఐఆర్ నిర్వహించిన తేదీ), జనవరి 6, 2025 (బీహార్‌లో చివరి స్పెషల్ సమ్మరీ రివిజన్ తేదీ) మధ్య కాలంలో బీహార్‌లో ప్రతి ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రశ్నార్థకం చేసింది. ఇది అనవసర ప్రక్రియ. ఎందుకంటే ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలను క్రమం తప్పకుండా సమర్థంగా అప్డేట్ చేస్తుంటుంది.
కానీ, ఇప్పుడు చేపట్టిన అసాధారణ ఎస్ఐఆర్ ప్రక్రియ మూలంగా 2003–2025 మధ్య బీహార్‌లో జరిగిన ప్రతి ఎన్నికలో ఉపయోగించిన ఓటర్ల జాబితాలు ప్రశ్నార్థకంగా మారాయి.
ఫలితంగా, జనవరి 6, 2025 నాటి స్పెషల్ సమ్మరీ రివిజన్ జాబితా స్థానంలో జూన్ 24, 2025న ఆదేశించిన ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా రూపొందించిన జాబితా వచ్చింది.
జూన్ 24, 2025 నాటి ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను కోర్టులో సవాల్ చేశారు. అయితే మే 27, 2026 నాటి తీర్పులో ఎన్నికల సంఘం వైఖరిని కోర్టు సమర్థించడంతో ఆ సవాల్ విఫలమైంది.
2026 మే 27న కోర్టు తీర్పు వెలువరించడానికి ముందే, ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పెద్దఎత్తున ఓటర్ల పేర్ల తొలగింపులు, అనూహ్య స్థాయిలో చేర్పులు జరిగాయి.
బీహార్‌లో 2025 నవంబర్‌లో, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల నిర్వహణ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ప్రస్తుతం నిరసనల నడుమ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అమలవుతోంది.
ఎన్నికల సంఘం అధికారాలు
పౌరసత్వాన్ని నిర్ధారించడానికి ఎన్నికల సంఘానికి అధికారం లేదని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అధికారం ‘ఓటర్ల జాబితాలో చేర్చబడటానికి వ్యక్తిగత అర్హతను’ ప్రభావితం చేస్తుందని కోర్టు పేర్కొంది.
అయితే, “ఇది పౌరసత్వ దావాల నుంచి వ్యక్తిని దూరం చేయదు. పౌరసత్వ చట్టం ప్రకారం సమర్థుడైన అధికారి ఆ ప్రశ్నపై నిర్ణయం తీసుకోవడాన్ని ఇది నిరోధించదు” అని కూడా ఈ అంశంపై కోర్టు పేర్కొంది.
పౌరసత్వ విచారణ సందర్భంలో ‘పరిమిత’, ‘ఖచ్చితమైన’ అనే పదాలకు సంబంధించి, ‘ఒబిటర్ డిక్టా’(న్యాయమూర్తి ప్రసంగవశాత్తు చేసిన వ్యాఖ్య) రూపంలో చేసిన వ్యాఖ్యలకు కూడా పౌరసత్వ విషయంలో ఎలాంటి చట్టపరమైన ప్రాముఖ్యత లేదు.
అలాగే ‘ఎన్నికల సంఘం అధికారం’ అనేది ‘ఓటర్ల జాబితాలో చేర్చబడటానికి వ్యక్తిగత అర్హతను’ ప్రభావితం చేస్తుందని చేసిన ప్రకటనకు, ఇప్పటికే ఉన్న ఓటరును అనర్హుడిగా ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందనే అర్థం తప్ప మరొకటి లేదని భావించాల్సి వస్తుంది.
ఇది ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా అనిపిస్తోంది. అలాంటప్పుడు, ప్రస్తుత ఓటర్ల జాబితాలను నిర్లక్ష్యంగా మార్చడానికి ఎన్నికల సంఘానికి తగినంత అవకాశం ఇచ్చినట్లే కదా?
విచారణ అంటే విచారణే. అంతకంటే తక్కువేమీ కాదు. పౌరసత్వం అంటే పౌరసత్వమే. అంతకంటే తక్కువేమీ కాదు.
పౌరసత్వంపై విచారణ జరిపేందుకు ఎన్నికల సంఘానికి ఉన్న రాజ్యాంగ అధికారం వివాదాస్పదంగానే ఉంది. ఎన్నికల ఆదేశాన్ని మించి, పరిమిత విచారణ జరిపే అధికారాన్ని కూడా ఎన్నికల సంఘానికి దఖలు చేయడం ద్వారా కోర్టు పొరపాటు చేసినట్లుగా కనిపిస్తోంది.
ఓటర్ల జాబితాను తయారు చేసేటప్పుడు, అర్హులైన ప్రతి భారతీయ పౌరుడినీ ఓటరుగా చేర్చేలా చూడటం వరకే ఎన్నికల సంఘం విధి పరిమితం కావాలి.
కనీస వయస్సు (18 సంవత్సరాలు), భారతీయ పౌరసత్వం వంటి అర్హతలను డాక్యుమెంట్ల ద్వారా నిర్ధారించాలి.
ఎన్నికల సంఘం పాత్ర కచ్చితంగా నిర్వహణాపరమైనదే. పరిమితంగానైనా పౌరసత్వం గురించి విచారణ జరిపే అధికారం దానికి లేదు.
అయితే, సమస్య ఏమిటంటే ఏ ఒక్క డాక్యుమెంటూ పౌరసత్వాన్ని నిస్సందేహంగా నిరూపించదు.
మరో మాటలో చెప్పాలంటే, భారతీయ పౌరసత్వంపై అనుమానాల ఆధారంగా ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించడానికి కోర్టు ఎన్నికల సంఘానికి మార్గదర్శకాలు లేని అధికారాన్ని కట్టబెట్టింది.
2025 జనవరి 6 నాటికి ఓటర్ల జాబితాలో పేరు ఉండి, భారతీయ పౌరుడిగా పరిగణించబడిన వ్యక్తి, 2025 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం చర్యతో ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
పత్రాలు, పౌరసత్వం, తొలగింపు
భారతీయ పౌరసత్వానికి రుజువుగా పనిచేసే ఏ పత్రాన్ని కూడా కోర్టు తీర్పు పేర్కొనలేదు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, కోర్టు తీర్పులోని 158వ పేరాలో “…పాస్‌పోర్ట్ లేదా జనన ధ్రువీకరణ పత్రం వలె కాకుండా రేషన్ కార్డు పౌరసత్వానికి నిశ్చయాత్మకమైన రుజువు కాదని గమనించడం సముచితం…” అని పేర్కొన్నారు. అందువల్ల, పాస్‌పోర్ట్ లేదా జనన ధ్రువీకరణ పత్రం పౌరసత్వానికి నిశ్చయాత్మకమైన రుజువని కోర్టు తీర్పునిచ్చినట్లవుతుంది.
అందువల్లే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, 2026 జూన్ 24న పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ బ్రీఫింగ్లో, పాస్‌పోర్ట్ కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని, భారతీయ పౌరసత్వానికి రుజువు కాదని వివాదాస్పద ప్రకటన చేసింది.
భారతీయ పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలను తన అధికార పరిధిలో కోర్టు ఎందుకు పేర్కొనలేకపోయింది? లేదా, భారతీయ పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలను పేర్కొనాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కోర్టు మాండమస్ రిట్ జారీ చేయలేకపోయిందా?
ఎన్నికల సంఘం ద్వారా పౌరసత్వం ప్రశ్నార్థకమైన ప్రతి భారతీయ పౌరుడి ఆశలను కోర్టు వమ్ము చేసింది.
ఎవరైనా భారతీయ పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకోవాలి? ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం దొరకలేదు.
కేవలం వారి భారతీయ పౌరసత్వంపై సందేహాల ఆధారంగా, గత ఎన్నికల్లో ఓటు వేసిన వ్యక్తి ఓటు హక్కును తొలగించే అధికారాన్ని మాత్రం ఎన్నికల సంఘం చెలాయించగలదు.
1950 జనవరి 26 నుంచి భారతీయ ఓటర్ల జాబితాలు ఏ ప్రాతిపదికన తయారయ్యాయి? ముగిసిన ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితాను అనుమానాల ఆధారంగా ఎలా మార్చవచ్చు?
మునుపటి ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఒక వ్యక్తిని ఎలా అనర్హుడిగా ప్రకటిస్తారు? ఇప్పటికే ఉన్న ఓటరును అనర్హుడిగా ప్రకటించడానికి రాజ్యాంగ ప్రమాణం ఏమిటి?
ఓటరును కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిందా? ఇవి కోర్టు పరిగణించవలసిన ప్రశ్నలు.
రాజ్యాంగపరమైన పరిష్కారాల కోసం ఆర్టికల్ 32 (ప్రాథమిక హక్కుల అమలు కోసం కోర్టును ఆశ్రయించే హక్కు), భారతదేశంలోని అన్ని కోర్టులపై సుప్రీంకోర్టుకు గల అధికారాలు, ఏ కేసులోనైనా లేదా పెండింగ్‌లో ఉన్న కేసులోనైనా పూర్తి స్థాయి న్యాయం చేయడానికి అవసరమైన ఆదేశాలు జారీ చేసే అధికారం కల్పించే ఆర్టికల్ 142, భారతదేశంలోని పౌరులు, న్యాయ అధికారులందరూ సుప్రీంకోర్టుకు సహాయం చేయవలసిన బాధ్యతను నిర్దేశించే ఆర్టికల్ 144 కింద సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలు విస్తృతమైనవి.
భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించడానికి స్పష్టమైన గీతను గీయడం ద్వారా ఈ చట్టపరమైన శూన్యతను కోర్టు ఇప్పటికీ సరిదిద్దగలదు.
వయోజన ఓటు హక్కు, భారతీయ పౌరసత్వం అనేవి ఓటర్ల జాబితాలో చేర్చడానికి అవసరమైన రెండు అర్హతలు. రాజ్యాంగం ఎలాంటి ముందస్తు అర్హతను సూచించదు.
అనర్హతకు సంబంధించిన ప్రశ్న, అర్హులైన ఓటర్లను గుర్తించిన తర్వాత మాత్రమే వస్తుంది. అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే అనర్హుడు కాగలడు.
ఆర్టికల్ 326 అనర్హతకు సంబంధించిన ప్రాతిపదికలను నిర్దేశిస్తుంది: ‘నివాసం లేకపోవడం’, ‘మతిస్థిమితం లేకపోవడం’, ‘నేరం’ లేదా ‘అవినీతి లేదా చట్టవిరుద్ధమైన ఆచరణ’.
ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950, ఓటర్ల రిజిస్ట్రేషన్ నిబంధనలు–1960 రాజ్యాంగంలోని ఆర్టికల్ 326కు అనుగుణంగా ఉండాలి. అర్హతగల ఓటరును అనర్హుడిగా ప్రకటించేటప్పుడు సహజ న్యాయ సూత్రాలను కూడా పాటించాలి.
విచారణ లేకుండా, ముందస్తు నిర్ణయం తీసుకుని అర్హతగల ఓటరు పేరును ఓటర్ల జాబితా నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించలేరు.
ఓటు హక్కు పరిరక్షణ
స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం. ఈ పునాది బలహీనపడితే, ప్రపంచ శక్తిగా భారత్ అవతరించాలనే ఆకాంక్ష సాకారం కాదు.
భారతీయ పౌరుడు తన ఓటు హక్కు గురించి సందిగ్ధంలో ఉంటే, అలాంటి పౌరుడి నుంచి మనం ఉత్తమమైనదాన్ని ఎలా ఆశించగలం?
ఓటు హక్కును సాధారణంగా చట్టపరమైన హక్కుగా వర్ణించినప్పటికీ, దాని ఆచరణ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికల పట్ల రాజ్యాంగబద్ధతకు కేంద్రంగా ఉంటుంది. ఈ అంశంలో కోర్టు తీర్పుల ద్వారా మార్పులు చోటుచేసుకున్నాయి.
గోలక్‌నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం (1967), కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం (1973), ఇందిరా గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ (1975) కేసుల ద్వారా ఈ మార్పులు వచ్చాయి.
ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ మూడు తీర్పులను కలిపి చదివితే, ఓటు హక్కును భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా నిర్ధారిస్తున్నాయని స్పష్టమవుతుంది.
రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, దాని మౌలిక నిర్మాణాన్ని నాశనం చేయడానికి లేదా దెబ్బతీయడానికి హక్కు లేదని కేశవానంద భారతి తీర్పు స్పష్టం చేస్తుంది.
ప్రజాస్వామ్యంతో సహా అవసరమైన రాజ్యాంగ లక్షణాలను రక్షించే సూత్రాలను ఆచరించాలి.
మిలార్డ్స్, ఓటు హక్కును స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, సకాలంలో సమర్థించండి.
(వ్యాస రచయిత సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, భారత మాజీ అదనపు సొలిసిటర్ జనరల్)
హిందూ సౌజన్యంతో అనువాదం: కె. సత్యరంజన్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
