ఒడిశాలోని మాలీ పర్వత ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ గనులు తవ్వి, మరిన్ని అల్యూమినియం పరిశ్రమలు ఏర్పాటు చేస్తే, విస్తారమైన ప్రాంతంలో నీరు, గాలి, నేల తీవ్రంగా కలుషితమవుతాయి. అప్పుడు ఒడిశా భవిష్యత్తు చీకటిమయమవుతుంది.
నియంగిరి ప్రాంతానికి చెందిన ముఖ్యమైన ఆదివాసీ నాయకులు లాడా సికాకా, లింగరాజ్ ఆజాద్ తదితరులను ఇటీవల అరెస్టు చేశారు.
ఈ అరెస్టుల తర్వాత, సెప్టెంబరు 26న వేదాంత సంస్థ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కలిశారు.
ఆ సమావేశంలో ఆయన ఒడిశాలో రూ 1 లక్ష కోట్ల పెట్టుబడి పెడతానని హామీ ఇచ్చారు. కొత్త ఆసుపత్రి నిర్మిస్తామని, లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.
అయితే ఇందుకు ప్రతిగా నియంగిరి పర్వతాల్లో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు.
2013లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక గ్రామసభల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ప్రజలు గనుల తవ్వకాలను వ్యతిరేకించడంతో నియంగిరి పర్వతాల్లో గనుల తవ్వకాలను నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో గనులు తవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అనిల్ అగర్వాల్ ప్రకటనలో అనుమానాస్పద అంశాలు
ముఖ్యంగా ఆదివాసీ నాయకులు లాడా, లింగరాజ్ అరెస్టుల తర్వాత ఇలాంటి భారీ పెట్టుబడుల ప్రకటన రావడం ఆందోళన కలిగిస్తోంది. ఖండువాల్ మాలి, కుట్రుమాలి, సిజిమాలి పర్వతాల్లో గనుల తవ్వకాలను వ్యతిరేకిస్తూ వందలాది మంది ఆదివాసీలు, దళితులు నిరసనలు చేస్తున్నారు.
మా మాటి మాలి సురక్ష మంచ్ (మాతృభూమి పర్వతాల రక్షణ వేదిక) సభ్యులు కూడా ఈ పోరాటంలో ఉన్నారు.
2023 ఆగస్టు నుంచి పోలీసులు, ప్రైవేటు గూండాల దాడుల్లో హీరామల్ నాయక్‌తో పాటు అనేకమంది అరెస్టయ్యారు. మరికొందరిని కొట్టారు.
కాంతమల, తలయంపాదర్ గ్రామాల్లో తీవ్ర నిర్బంధాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ తంతు జరిగి, ఉద్రిక్తత, ఘర్షణల మధ్య భూములను ఆక్రమించుకున్నారు. ఈ పరిణామాల గురించి అగర్వాల్ చేసిన ప్రకటనలో ఎలాంటి ప్రస్తావన లేదు.
అలాగే పర్వతాలను, అక్కడి ప్రజల హక్కులను కాపాడేందుకు పనిచేస్తున్న కమ్యూనిటీ వైద్యుడు రాండల్ సిక్వెరా, మాతృభూమి పర్వతాల రక్షణ వేదిక దళిత నాయకుడు లక్ష్మణ్ నాయక్‌లను కూడా అరెస్టు చేశారు. వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినట్లు స్థానిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఆదివాసీల అనుమతి లేకుండా గనులు తవ్వకూడదు
2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం నియంగిరి ప్రాంతంలో గనులు తవ్వాలంటే మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదు.
స్థానిక ప్రజల స్వేచ్ఛాయుతమైన, పూర్తి సమాచారంతో కూడిన ముందస్తు అంగీకారం లేకుండా ఏ పర్వతంలోనూ గనులు తవ్వకూడదని 2013 సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.
నియంగిరి ప్రజల మత విశ్వాసాలు నియమ రాజు అనే దేవుడి చుట్టూ తిరుగుతాయి. వారి నమ్మకం ప్రకారం ఈ పర్వతాలు పవిత్రమైనవి. వారి అనుమతి లేకుండా వాటిని తవ్వడం వారి మత విశ్వాసాలను, జీవన విధానాన్ని దెబ్బతీస్తుంది.
ఈ పర్వతాలు కేవలం రాళ్లు, ఖనిజాల నిల్వలే కావు, ఆ ప్రాంతానికి జీవనాధారం. పర్వతాలపై ఉన్న బాక్సైట్ పొరలు వర్షపు నీటిని నిల్వ చేయడంలో సహాయపడతాయి. అక్కడి నుంచి అనేక సంవత్సరాల పాటు ప్రవహించే నీటి వనరులు ఏర్పడతాయి. ఆ బాక్సైట్‌ను తవ్వేస్తే ఆ నీటి వనరులు ఎండిపోయే ప్రమాదం ఉందని 2013 సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. అందుకే ఆదివాసీలు ఈ పర్వతాలను తమ తల్లిదండ్రులుగా, జీవనాధారంగా భావిస్తారు.
ఇప్పటికే అనేక అల్యూమినియం పరిశ్రమలు ఉన్నాయి
రాయగడ జిల్లాలో మరో అల్యూమినా శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తామని అగర్వాల్ చెబుతున్నారు. కానీ ఆ జిల్లాలో ఇప్పటికే కాశీపూర్‌లో ఉత్కల్ అల్యూమినియం పరిశ్రమ ఉంది.
అలాగే కలహండి జిల్లాలో వేదాంతకు చెందిన లాంజిగఢ్ శుద్ధి కర్మాగారం ఉంది. కోరాపుట్ జిల్లాలో దామన్‌జోడిలో నాల్కో పరిశ్రమ కూడా ఉంది. ఇవి ఉండగానే మరో పరిశ్రమ ఎందుకు?
అదేవిధంగా ఉత్తర ఒడిశా ప్రాంతమైన ధెంకనాల్ జిల్లాలో మరో అల్యూమినియం కర్మాగారం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లా కియోంఝర్ జిల్లాకు అతి దగ్గరగా ఉంది.
బాక్సైట్ పర్వతాలకు చాలా దూరంగా ఉంది. ఝార్సుగూడలో వేదాంతకు, సంబల్పూర్లో హిందాల్కోకు, అంగుల్‌లో నాల్కోకు ఇప్పటికే అల్యూమినియం పరిశ్రమలు ఉన్నాయి. ఇవి చాలవా?
అత్యంత నాణ్యమైన హాట్ మెటల్‌ను ఒడిశాలోని వేదాంత అల్యూమినియం పార్క్‌కు సరఫరా చేయడమే దీని ఉద్దేశం.
2026 అక్టోబరులోనే అగర్వాల్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో సమావేశమై ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం కర్మాగారాల్లో ఒకదాన్ని నిర్మించే ప్రణాళిక గురించి అగర్వాల్ చర్చించారు.
ఉత్తర ఒడిశాలో రక్షణ రంగానికి అవసరమైన ప్రత్యేక లోహ మిశ్రమాలను తయారు చేయడం కూడా ఈ ప్రణాళికలో భాగం.
నియంగిరిలో వివాదాస్పదమైన ఖనిజాల తవ్వకం కోసం భారీ పెట్టుబడులు పెట్టడం గురించి మొదట ప్రస్తావించలేదు.
గిరిజనులకు ఉపాధి అవకాశాలు ఉంటాయని భ్రమలు కల్పించి, ఆదివాసీలను కాపాడుతున్న పర్యావరణాన్ని, వారి జీవితాలను నాశనం చేయడమే జరుగుతుంది.
ఆదివాసీ యువతను ఆకర్షించే ఉద్యోగాల హామీలు
ఒడిశాలో వేలాది మంది ఆదివాసీలు అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో తమ భూములు, జీవనాధారాలను కోల్పోయారు.
పెద్ద ఆనకట్టలు, గనులు, పరిశ్రమల కారణంగా అనేక కుటుంబాలు తమ గ్రామాలను విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు వారికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కొత్త పరిశ్రమల వైపు ఆకర్షిస్తున్నారు. కానీ ఉద్యోగాలు కల్పించడం పేరుతో వారి సంప్రదాయ జీవన విధానాన్ని, అడవులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడం సరైన అభివృద్ధి కాదు.
ఒడిశా ఇప్పటికే భారీ అప్పుల్లో ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా గనుల తవ్వకాల మౌలిక సదుపాయాల కోసం తీసుకున్న అప్పుల భారం రాష్ట్రంపై ఉంది. అయినా ఒడిశా రాష్ట్ర మొదటి ఆదివాసీ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈ భారీ పెట్టుబడుల ప్రతిపాదనను అంగీకరించడం ఆందోళన కలిగిస్తోంది. న్యాయపరమైన ఆటంకాలను దాటవేసేందుకే ముఖ్యమంత్రి ఉపాధి ఆశలు ప్రేరేపిస్తున్నాడు.
2013 ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత కూడా నియంగిరి ప్రాంతంలో సైనికీకరణ, అరెస్టులు, పోలీసుల అణచివేత కొనసాగుతున్నాయి.
నియంగిరిని స్టెరిలైట్/వేదాంతకు అమ్మడం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి తిరిగి మొక్కలు నాటుతారని వేదాంతకు అనుకూలంగా 2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరిజిత్ పసాయత్ అన్నప్పుడు ఒక ఆదివాసీ నాయకుడు చెప్పిన మాటలను గుర్తించాలి.
“Taro Karma, Amoro Dharma.” అంటే, “పాపం వారిది కావచ్చు, కానీ మా కర్తవ్యం మా ధర్మం.” తమ పర్వతాలను కాపాడటం తమ ధర్మమని ఆదివాసీలు భావిస్తున్నారు.
అదానీ సంస్థల ప్రణాళికలు కూడా ఒడిశా వనరులపైనే
2026 సెప్టెంబరులో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లారు. అక్కడ పరిశ్రమలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందాలు అదానీ బల్లాడా, కుట్రుమాలి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్న బాక్సైట్ గనుల ప్రణాళికలతో కూడా సంబంధం కలిగి ఉన్నాయి. ఇవి 2023లో ప్రకటించినవి.
అలాగే రాయగడ జిల్లాలో మరో శుద్ధి కర్మాగారం, సుందర్‌గఢ్ జిల్లాలో మరో అల్యూమినియం కర్మాగారం ఏర్పాటు చేసే ప్రణాళికలున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఒడిశాలో 25 బిలియన్ అమెరికన్ డాలర్ల భారీ పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు.
సెప్టెంబరులో ముఖ్యమంత్రి సంతకం చేసిన “సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి” ఒప్పందాల్లో సుమారు 880 మిలియన్ డాలర్ల పెట్టుబడుల హామీ కూడా ఉంది.
అయితే ఈ పెట్టుబడుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? Rare-Earth Corridor పేర ఒడిశాలోని భారతదేశ అరుదైన ఖనిజ సంపదను పెద్ద పరిశ్రమల అవసరాలకు తరలించడానికి “పాక్స్ సిలికా” అనే అమెరికా కంపెనీతో ఫిబ్రవరిలో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఒప్పందాలు చేసుకుంటోంది.
మే నెలలో అమెరికా-భారత్ మధ్య జరిగిన కీలకమైన, అరుదైన ఖనిజాల సరఫరా ఒప్పందం “Quad Critical Minerals Initiative Framework”తో ముడిపడి ఉంది.
క్వాడ్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి కీలక ఖనిజాల సరఫరా కోసం క్వాడ్ భాగస్వామ్య దేశాలయ్యాయి.
ఒడిశాలో భారతదేశంలోని మోనజైట్ నిల్వల్లో దాదాపు నాలుగో వంతు ఉన్నట్లు అంచనా. ఈ ఖనిజం అరుదైన భూ మూలకాల్లో ఒకటి. ఆయుధ తయారీ సహా అనేక రంగాల్లో దీనికి ప్రాధాన్యం ఉంది.
ఛత్రపూర్‌లోని ఒడిశా సాండ్స్ గనుల ప్రాంతం నుంచి వెలువడే వ్యర్థాలు ఇప్పటికే సముద్ర తీర ప్రాంతాలను కలుషితం చేశాయి, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపాయి.
ఒడిశా అతిపెద్ద అల్యూమినియం అమ్మకంతో పాటు అరుదైన ఖనిజాలు, ఉక్కు, పెట్రోకెమికల్స్, డేటా కేంద్రాలు, ఓడరేవుల అభివృద్ధి పేరుతో మరిన్ని ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. వీటన్నింటినీ విడివిడిగా చూడకూడదు. వాటి వెనుక ఉన్న పెద్ద ఆర్థిక, రాజకీయ ప్రణాళికను అర్థం చేసుకోవాలి.
గత చరిత్ర
వంద సంవత్సరాల క్రితమే అల్యూమినియం పరిశ్రమల ప్రణాళిక ప్రారంభమైంది. 1920–1930 మధ్య కాలంలో భూగర్భ శాస్త్రవేత్త సీఎస్ ఫాక్స్ భారతదేశంలోని బాక్సైట్ గురించి పుస్తకాలు రాశారు. ఒడిశాలో పరిశ్రమలు, ఆనకట్టలు నిర్మించి గనుల నుంచి అల్యూమినియం తీసి విదేశాలకు ఎగుమతి చేయడానికి, పరిశ్రమలకు నీరు, హైడల్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్తు అందించాలని ఆయన ప్రణాళికలు రూపొందించారు.
100 సంవత్సరాల క్రితమే అల్యూమినియం యుద్ధాలకు ఉపయోగపడుతుందని అర్థమైంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోనే ఆయుధాల తయారీలో అల్యూమినియం ప్రాధాన్యం పెరిగింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు అది మరింత కీలకమైన లోహంగా మారింది.
భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొద్దిగా ముందు, తర్వాత హిరాకుడ్ ఆనకట్టలు నిర్మించి అల్యూమినియం పరిశ్రమకు నీరు, విద్యుత్తు అందించాలనే నాటి ముఖ్యమంత్రుల నిర్ణయం పెద్ద వివాదాస్పదమైంది. తర్వాత ప్రపంచ బ్యాంకు సహాయంతో ఒడిశాలో గనుల పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు.
1980వ దశకంలో సౌదీ అరేబియా అభివృద్ధి నిధి నుంచి 80 మిలియన్ డాలర్ల రుణం తీసుకుని కోరాపుట్–దామన్జోడి–రాయగడ రైల్వే మార్గాన్ని నిర్మించారు. దీని ద్వారా అల్యూమినా ఉత్పత్తులను సముద్ర తీరానికి తీసుకెళ్లి పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రణాళిక “ఎగుమతుల ద్వారా అభివృద్ధి” అనే ప్రపంచ బ్యాంక్ ఫాక్స్ బ్లూప్రింట్ ముందస్తు షరతుల్లో భాగంగా అమలు జరిగినది.
బాక్సైట్ పర్వతాలు ఆదివాసీలకు ఎందుకు పవిత్రమైనవి?
1900లో భూగర్భ శాస్త్రవేత్త టీఎల్ వాకర్ ఒడిశాలోని పర్వతాలపై బాక్సైట్ నిల్వలను గుర్తించారు. ఈ ప్రాంతంలోని నేల సారవంతంగా ఉండటానికి బాక్సైట్ కూడా ఒక కారణమని ఆయన గుర్తించారు. ఆ పర్వతాల అడుగుభాగంలోని రాళ్లకు ‘ఖొండలైట్’ అని పేరు పెట్టారు. ఆ ప్రాంతంలో నివసించే ఖొండ్ ఆదివాసీల పేరుతోనే ఆ పేరు పెట్టారు.
ఉత్తరాంధ్రను ఆనుకుని ఉన్న బాక్సైట్ పర్వత ప్రాంతాల్లో కొండరెడ్లు అనే ఒక ముఖ్యమైన గిరిజన తెగ ఉండేది.
ఈ పర్వతాలు ఖొండ్ ఆదివాసీల మతం, సంస్కృతి, జీవన విధానంలో చాలా ముఖ్యమైనవి. వాటికి సంబంధించిన కథలు, పురాణాలు, పవిత్ర గుహలు ఉన్నాయి. అందుకే వాటిని కాపాడటానికి ప్రజలు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.
నియంగిరి అనే పేరును సాధారణంగా ‘నిగమ్’ అంటే నియమం లేదా చట్టం అనే అర్థంతో చూస్తారు. అలాంటి పవిత్రమైన పర్వతాలపై గనులు తవ్వడానికి వేదాంత ప్రయత్నిస్తున్నది. ‘వేదాంత’ అనే పేరుతో ఉన్న సంస్థ అపారమైన సంపదను సంపాదిస్తూ, చట్టాన్ని, సుప్రీంకోర్టు తీర్పును, స్థానిక ప్రజల హక్కులను పట్టించుకోవడం లేదు.
ఖొండ్ ప్రజలు తమను తాము ‘కువింగ’ అని పిలుచుకుంటారు. క్రీపూ మూడో శతాబ్దంలో అశోకుడి ఒడిశా దండయాత్రను భారీ ప్రాణనష్టంతో ఎదుర్కొన్న కళింగ ప్రజలతో వీరికి చారిత్రక సంబంధం ఉంది.
తర్వాత కొంతమంది ప్రజలు పర్వత ప్రాంతాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారని చెబుతున్నారు. ఆ విధంగా వారిని వారు కువింగగా పిలుచుకుంటారు.
అభివృద్ధి పేరుతో ఆదివాసీల మధ్య విభజన
‘కళింగ నగర్’ అనే పేరుతో నిర్మించిన ఉక్కు పరిశ్రమల ప్రాంతం కూడా ఆదివాసీల భూములను స్వాధీనం చేసుకోవడంతో వివాదాస్పదమైంది.
అదానీ సంస్థలు కూడా ‘కళింగ అల్యూమినా లిమిటెడ్’, ‘అదానీ కళింగ రిసోర్సెస్ లిమిటెడ్’ వంటి పేర్లతో కంపెనీలను ఏర్పాటు చేశాయి. ఇవి ఒడిశాలోని బాక్సైట్ నిల్వలను స్వాధీనం చేసుకునే ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి.
భారతదేశంలో అభివృద్ధి చేస్తున్న ప్రతి పెద్ద ప్రాజెక్టు ప్రారంభానికి ముందు భూమికి పట్టాలు ఉన్నవారు, లేనివారు నష్టపరిహారం, ఉద్యోగాలు తీసుకునేవారు, భూముల స్వాధీనాన్ని వ్యతిరేకించి పోరాడేవారుగా స్థానిక ప్రజలను రెండు వర్గాలుగా విడదీస్తున్నారు.
ఉద్యోగాలు, పునరావాస కాలనీల్లో నివాసం కల్పించడం ద్వారా ప్రజలను పరిశ్రమలపై ఆధారపడేలా చేస్తున్నారు. దీనినే విభజించి పాలించే విధానం అంటారు.
అగర్వాల్ ప్రాజెక్టుకు అనుమతించడం ద్వారా ఆదివాసీ ముఖ్యమంత్రే తన ప్రజలకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడుతోంది.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మాజీ కమిషనర్ బీడీ శర్మ ఆదివాసీ భూముల్లో జరుగుతున్న దోపిడీని “అంతర్గత వలస పాలన”గా అభివర్ణించారు. అంటే ఒక దేశంలోని ప్రభుత్వమే తన ప్రజలపై యుద్ధం చేస్తున్నట్లుగా వ్యవహరించడం.
వేదాంత, అదానీ సంస్థలు నియంగిరి వంటి జీవనాధార పర్వతాలపై ఆధిపత్యం సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలు దీనికి ఉదాహరణలు.
భవిష్యత్తు అల్యూమినియం పరిశ్రమల వల్ల ఒడిశాకు ప్రమాదం:
అల్యూమినియం ఆధారిత పరిశ్రమల వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా ఒడిశా భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని అనిల్ అగర్వాల్ చెబుతున్నారు. ఇది వాస్తవ పరిస్థితిని వక్రీకరించడం. అల్యూమినియం తవ్వకాలు గానీ, పరిశ్రమలు గానీ గతంలో చేయని, భవిష్యత్తులో చేయలేని మాటలివి.
మరిన్ని పర్వతాలను తవ్వి, మరిన్ని అల్యూమినియం పరిశ్రమలు నిర్మిస్తే నీరు, గాలి, నేల కలుషితమవుతాయి. విశాలమైన ఒడిశా ప్రాంత భవిష్యత్తు అంధకారమవుతుంది.
ఆదివాసీలు ఎదుర్కొంటున్న అసలు సమస్య వారి అభివృద్ధి లేకపోవడం కాదు. అభివృద్ధి ముసుగులో వారి భూములను స్వాధీనం చేసుకొని, వారి సంస్కృతిని నాశనం చేసి, భారీ ప్రాజెక్టులు డామ్లు నిర్మించి వారి సంప్రదాయ జీవన విధానాన్ని దెబ్బతీయడం జరుగుతోంది. ఇది ‘సాంస్కృతిక మారణహోమం’.
ఆదివాసీ పిల్లల కోసం వేలాది ఆశ్రమ పాఠశాలలు, వసతి పాఠశాలలు ఏర్పాటు చేశారు. కానీ వాటి వల్ల పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి, తమ భాష నుంచి, తమ సంస్కృతి నుంచి దూరమవుతున్నారు.
కొన్ని సందర్భాల్లో వారి మాతృభాషలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. అగర్వాల్ ఇచ్చే ఉద్యోగాల హామీలు ఇప్పటికే తమ తల్లిదండ్రుల సంప్రదాయాలకు, నిలకడైన జీవారణ్య అభివృద్ధికి దూరం చేసి ఆదివాసీ యువతను మరింత ఆకర్షించే అవకాశం ఉంది.
కిస్(KISS) విద్యాసంస్థపై విమర్శ
ఒడిశాలోని కిస్(Kalinga Institute of Social Sciences) ప్రపంచంలోని అతిపెద్ద భారీ ఆదివాసీ వసతి విద్యాసంస్థల్లో ఒకటి.
ఈ సంస్థ, గనుల పరిశ్రమలతో కలిసి పనిచేస్తున్న తీరు, పరిశ్రమల ఆధారిత ఆలోచనలను, హిందుత్వ భావజాలాన్ని యువతలో పెంచుతూ, ఆదివాసీల సొంత జ్ఞానం, నైపుణ్యాలు, విలువలను మానసికంగా పాడుచేస్తున్నాయి. ఇలా జరిగితే భవిష్యత్తు తరాలు తమ మూలాలను, సంప్రదాయాలను మరిచిపోయే ప్రమాదం ఉంది.
యుద్ధాల కోసం అల్యూమినియం అవసరం
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాల ద్వారా లాభాలు పొందేందుకు భారతదేశంలో ప్రైవేటు రంగానికి ఆయుధాల కర్మాగారాలు ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని 2026 ఏప్రిల్‌లో అనిల్ అగర్వాల్ అన్నారు.
ఇది వేదాంత సంస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్న అల్యూమినియం పరిశ్రమల ప్రణాళికలను ఉద్దేశించి అన్నారు. ఎందుకంటే ఆయుధాల తయారీకి అల్యూమినియం మిశ్రమ లోహాలు పెద్ద మొత్తంలో అవసరం.
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అల్యూమినియం పరిశ్రమ అభివృద్ధికి సహకరించిన ఉన్నతాధికారి డ్యూయీ ఆండర్సన్ 1951లో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఏ యుద్ధమైనా విజయవంతంగా ముగియాలంటే భారీ పరిమాణంలో అల్యూమినియం ఉపయోగించాల్సి వస్తుంది. దానిని పెద్ద మొత్తంలో నాశనం చేయాల్సి వస్తుంది కూడా.
75 సంవత్సరాల తర్వాత కూడా ఈ మాట నిజమేనని రుజువైంది. భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం తన ‘India 2020’ పుస్తకంలో ఆయుధాల తయారీకి ఉపయోగించే అల్యూమినియం మిశ్రమాల ఉత్పత్తిని పెంచాలని సూచించారు.
భారతదేశం ఈపాటికే పెద్ద ఆయుధ ఉత్పత్తిదారుగా మారుతోంది. ఇజ్రాయెల్‌కు డ్రోన్లు, ఇతర ఆయుధ పరికరాలను కూడా సరఫరా చేస్తోంది.
ఆదివాసీల జీవనాధారమైన భూములను తవ్వి తీసిన ఖనిజాలతో ఆయుధాలు తయారు చేసి, వాటిని యుద్ధాలకు ఉపయోగిస్తే అది రెండు రకాల విధ్వంసానికి దారితీస్తుంది.
మొదటిది ఖనిజాల తవ్వకాల వల్ల ఆదివాసీల భూములు నాశనం కావడం. రెండోది ఆ ఖనిజాలతో తయారైన ఆయుధాల వల్ల యుద్ధాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం. ఇది ‘రెండు వైపులా మరణం’ లాంటిది.
హరిత ఇంధన విప్లవం పర్యావరణానికి మంచిదేనా?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ‘గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్’ అంటే పర్యావరణానికి అనుకూలమైన ఇంధన వ్యవస్థ వైపు మార్పు గురించి మాట్లాడుతున్నారు.
సౌర విద్యుత్తు, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని పెంచాలని చెబుతున్నారు. కానీ ఈ మార్పు పేరుతో ఖనిజాల కోసం, విద్యుత్ కోసం మరిన్ని గనులు తవ్వాల్సి వస్తోంది.
ఇది ఒక విరుద్ధమైన పరిస్థితి
ప్రపంచంలోని ఏ దేశమూ పూర్తిగా చమురు వినియోగాన్ని ఆపలేదు. భూగర్భంలోనే కాక సముద్ర గర్భంలోని చమురు నిల్వలను కూడా వెలికితీస్తున్నారు.
భారతదేశం కూడా బొగ్గు నిల్వలను వేగంగా తవ్వుతోంది. ‘కార్బన్ న్యూట్రల్’ పేరుతో పెద్ద ఆనకట్టలు, పరిశ్రమల్లో కొంత తక్కువ కాలుష్యం కలిగించే సాంకేతికతను ఉపయోగించడం ద్వారా కార్బన్ తగ్గినట్లు లెక్కలు చూపిస్తున్నారు. కానీ పెద్ద ఆనకట్టలు నదీ పర్యావరణ వ్యవస్థలను, వాటిపై ఆధారపడిన ప్రజల జీవనాన్ని నాశనం చేస్తున్నాయి. వాటిని పర్యావరణానికి అనుకూలమైన ప్రాజెక్టులుగా చూపించడం సరైనది కాదు.
లిథియం, కోబాల్ట్, నికెల్, అరుదైన భూ మూలకాలు వంటి ఖనిజాలను భారీగా తవ్వుతున్నారు. అల్యూమినియం కూడా కీలక ఖనిజంగా పరిగణించబడుతోంది. లిథియంతో కలిపిన అల్యూమినియం విమానాలు, డ్రోన్లు, ఆయుధాల తయారీలో ఉపయోగపడుతుంది.
అల్యూమినియం శుద్ధి కర్మాగారాల్లో ఉప ఉత్పత్తిగా లభించే గాలియం కూడా కీలకమైన లోహం. అంటే పర్యావరణాన్ని కాపాడతామని చెప్పే కొన్ని ప్రణాళికలు మరోవైపు గనుల తవ్వకాలను పెంచుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల పోరాటాలు
ఆదివాసీలు తమ పర్వతాలను ఎలా కాపాడుకోవాలి? పర్వతాలు ఖొండ్ ఆదివాసీల ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్థిక జీవితంలో ప్రధాన భాగం. అందువల్ల వాటిని తవ్వకాలకు అప్పగించడానికి వారు ఎలా అంగీకరిస్తారు?
నియంగిరి పర్వతాలపై కోట్ల రూపాయల డబ్బు ఉండటం ముఖ్యం కాదు. ఆ పర్వతాలే తమ తల్లిదండ్రులని 2009 ఏప్రిల్‌లో వేదాంత లాంజిగఢ్ శుద్ధి కర్మాగార విస్తరణపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో లాడా సికాకా చెప్పారు. అందుకే వాటిని కాపాడటం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.
పురాతన పురాణాల్లోని రాక్షసులు ఇప్పుడు పెద్ద కంపెనీల రూపంలో తిరిగి వచ్చినట్లున్నారు.
భారతదేశంలోనే కాకుండా లాటిన్ అమెరికా దేశాల్లో కూడా గనుల తవ్వకాల కోసం ఆదివాసీల భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా ప్రజలను విభజించి, వారి మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు.
అయితే అక్కడ జరుగుతున్న ప్రజా ఉద్యమాలు ఆదివాసీ ఉద్యమాలకు ఊపిరి పోస్తున్నాయి.
ఈక్వెడార్, బొలీవియా దేశాలు తమ రాజ్యాంగాల్లో ‘ప్రకృతికి హక్కులు’ అనే భావనను చేర్చి ప్రఖ్యాతి కాంచాయి. అంటే నదులు, పర్వతాలు, అడవులు కూడా కేవలం మనుషులు ఉపయోగించుకునే వనరులు మాత్రమే కావు. వాటికంటూ స్వతంత్ర విలువ, హక్కులు ఉన్నాయని గుర్తించడం. కానీ అనేక సాంస్కృతిక, ఉదారవాద విధానాలకు అతీతంగా అందరి కోసం ఒక బహుళ జాతీయ వాదం, అంతర్గత సాంస్కృతిక సమాజం గురించిన దేశీయ భావనల నుంచి ఇది ఎలా ఉద్భవించిందో తెలియదు.
రాజకీయ వ్యవస్థలో మార్పు, ఆర్థిక వ్యవస్థలో వైవిధ్యం చూపకుండా ప్రకృతికి హక్కులు ఉన్నాయని చెప్పడంలో అర్థం లేదు.
ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడేవారుగా మాత్రమే కాకుండా, సమాజంలోని ఇతర అణగారిన వర్గాలతో కూడా కలసి పోరాడి దేశ రాజకీయ, ఆర్థిక నిర్ణయాల్లో భాగస్వాములు కావాలి.
ఈక్వెడార్ ఉదాహరణ
ఈక్వెడార్‌లో ప్రజాభిప్రాయ సేకరణల ద్వారా కొన్ని గనులు, చమురు ప్రాజెక్టులను ప్రజలు తిరస్కరించారు. ఆ దేశంలోని CONAIE అనే ఆదివాసీ సంఘం వివిధ వర్గాల ప్రజలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చింది.
పర్వత ప్రాంతాల్లో నివసించే కిచ్వా ప్రజలు, అమెజాన్ ప్రాంత ఆదివాసీలు, క్రైస్తవులు, మార్క్సిస్టులు, ఆదివాసీ మత విశ్వాసాలు కలిగినవారు కలిసి తమ భూములను కాపాడుకోవడానికి గనుల తవ్వకానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. వారందరి ప్రధాన లక్ష్యం ఆదివాసీ భూములను రక్షించడం, ప్రకృతి సంపదను విచ్చలవిడిగా తవ్వడాన్ని వ్యతిరేకించడం.
అయితే ఆ దేశపు సోషలిస్టు అధ్యక్షుడు కోర్రియా కూడా చమురు తవ్వకాలను నిలిపివేస్తానని చెప్పి తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
చమురు ఆదాయం నుంచి పాఠశాలలు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించే కార్యక్రమాలు చేపట్టారు. ఇది భారతదేశంలో 2015లో ప్రారంభించిన జిల్లా ఖనిజ నిధి(District Mineral Fund) పథకాన్ని పోలి ఉంది.
ఈ పథకాల ద్వారా స్థానిక ప్రజల నిజమైన అవసరాలు, ఆశయాలు పట్టించుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.
బొలీవియా ఉదాహరణ
బొలీవియా అధ్యక్షుడు ఇవో మోరేల్స్ ఆదివాసీ ఐమారా వర్గానికి చెందినవాడు. అయినా ఆయన ప్రభుత్వం విదేశీ చమురు కంపెనీలకు అమెజాన్ ప్రాంతంలో ప్రవేశం కల్పించింది. దీంతో అక్కడి TIPNIS ఆదివాసీ ప్రజలు తమ భూములను కాపాడుకునేందుకు అమెజాన్ తెగలతో తీవ్రంగా పోరాడారు.
ఇది వామపక్ష రాజకీయాల్లో కూడా ప్రకృతి వనరుల తవ్వకాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చూపిస్తుంది. పర్యావరణాన్ని కాపాడాలనే సోషలిస్టులు దీన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు.
న్యూజిలాండ్‌లో నదికి, పర్వతానికి చట్టపరమైన హక్కులు
న్యూజిలాండ్‌లోని ఓటేయరో ఆదివాసీల పోరాటం ఫలితంగా 2017లో వాంగనుయి నదికి చట్టపరమైన వ్యక్తిత్వం కల్పించారు. అంటే ఆ నదికి కూడా చట్టపరమైన హక్కులు ఉన్నాయని గుర్తించారు.
2018లో మౌంట్ తారనాకి పర్వతానికి కూడా ఇలాంటి చట్టపరమైన గుర్తింపు ఇచ్చారు. దీనివల్ల ఆదివాసీల సంప్రదాయ జ్ఞానం, ప్రకృతితో వారి సంబంధం ఎంత ముఖ్యమో ప్రపంచానికి తెలిసింది.
భారతదేశంలో ఆదివాసీల పరిస్థితి
భారతదేశంలో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఒకవైపు పరిశ్రమల పేరుతో ఆదివాసీల భూములు స్వాధీనం చేసుకుంటున్నారు.
మరోవైపు వన్యప్రాణుల అభయారణ్యాల నుంచి కూడా వారిని బయటకు పంపిస్తున్నారు. కానీ ఆదివాసీలు ప్రకృతికి శత్రువులు కాదు. వారు అడవులు, నదులు, జంతువులతో కలిసి జీవించే సమాజాలు.
స్థానిక ప్రజలకు నిర్ణయాధికారాన్ని కల్పించే వికేంద్రీకృత పాలనా విధానం ద్వారా ప్రకృతి అవసరాలను కూడా నిర్ణయాల్లో భాగం చేయవచ్చు. ఇక్కడ ప్రశ్న కేవలం అడవులు, పర్వతాలను కాపాడటం మాత్రమే కాదు.
ఆదివాసీల సంస్కృతి, ప్రకృతితో వారి అనుబంధం, వారి ప్రత్యేక జీవన విధానాన్ని కూడా కాపాడాలి. ప్రకృతి హక్కులు అనే భావన లేకుండా నదులు, పర్వతాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడం సాధ్యం కాదు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రకృతికి చట్టపరమైన హక్కులు కల్పించిన ఉదాహరణలు ఉన్నాయి. కానీ తమ పర్వతాలను కాపాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టిన నియంగిరి, సిజిమాలి ఆదివాసీల ఉద్యమాలు ప్రత్యేకమైనవి.
భారత రాజకీయ పరిస్థితి
ఆదివాసీ హక్కుల పోరాటం, ప్రజాస్వామ్య ఉద్యమం. పోలీసుల సహకారంతో కార్పొరేట్ సంస్థలు భూములు, సహజ వనరులను స్వాధీనం చేసుకోవటానికి వ్యతిరేకంగా ఆదివాసీలు, దళితులు తమ రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి పోరాడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆవిర్భవించి ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు దేశంలోని వివిధ ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.
ఎన్నికల సంఘంలోని అవినీతి, రాజ్యాంగ హక్కులు హరించడానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం సాగుతోంది.
రాహుల్ గాంధీ ఆదివాసీల గురించి ఏమన్నారు?
ఇటీవల గుజరాత్ పర్యటనలో రాహుల్ గాంధీ ఆదివాసీలను ‘వనవాసి’ అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఉపయోగించే ‘వనవాసి’ అనే పదానికి బదులుగా ‘ఆదివాసీ’ అనే పదం ఉపయోగించాలని ఆయన అన్నారు. ‘వనవాసి’ అంటే అడవుల్లో నివసించేవారు. ‘ఆదివాసీ’ అంటే ఈ భూమికి అసలైన నివాసులు.
ఈ రెండు పదాల మధ్య తేడా ఉందని, ‘వనవాసి’ అనే పదం ఆదివాసీల చారిత్రక భూమి హక్కులను బలహీనపరుస్తుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలను ఈ దేశానికి అసలైన యజమానులుగా అభివర్ణించారు.
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆదివాసీ ప్రతినిధులను కలిసినప్పుడు, వారి విద్య, వైద్యం, సంస్కృతి, గుర్తింపు విషయంలో వారి నిర్ణయాలకే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.
సమాజంలోని అనేక వర్గాల్లో ఆదివాసీ సమస్యలపై అవగాహన పెరుగుతోంది. అయితే మరోవైపు ఆదివాసీలపై అణచివేత కూడా పెరుగుతోంది.
భారతదేశంలో గనుల తవ్వకాల చరిత్ర
భారతదేశంలో గనుల తవ్వకాలు బ్రిటిష్ పాలన సమయంలోనే ప్రారంభమయ్యాయి. అయితే నెహ్రూ పాలనలో పెద్ద ఎత్తున గనులు, లోహ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.
ఆదివాసీల హక్కులను గౌరవించాలనే నెహ్రూ ప్రకటించిన పంచశీల సూత్రాలకు, ఈ పారిశ్రామిక అభివృద్ధికి మధ్య వైరుధ్యం ఉంది.
1991–1993 మధ్య సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా కొత్త ఆర్థిక, గనుల విధానాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో గనుల విస్తరణ వేగంగా పెరిగింది.
అయితే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ, వేదాంత వంటి పెద్ద కార్పొరేట్ సంస్థలు బరితెగించి ఆదివాసీ ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాయి.
ఈ సంస్థలు ఖనిజ సంపదను స్వాధీనం చేసుకునేందుకు పోలీసుల సహకారం తీసుకుంటున్నాయి.
భీమా కోరేగావ్ కేసు, పోలీసుల దుర్వినియోగం
బీజేపీ పాలిత ప్రభుత్వాల కాలంలో చట్టపరమైన వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. భీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన వారిపై నెట్‌వైర్ మాల్వేర్ను ఉపయోగించి తప్పుడు ఆధారాలు సృష్టించారనే ఆరోపణలు వున్నాయి.
ఈ కేసులో అరెస్టయిన ఫాదర్ స్టాన్ స్వామి జైలులోనే మరణించారు. ఆయనతో పాటు ఆదివాసీ, దళిత హక్కుల కోసం పనిచేసిన పలువురు కార్యకర్తలు కూడా లక్ష్యంగా మారారు.
ఒడిశాలో గనుల తవ్వకాలను వ్యతిరేకించే ఆదివాసీలపై జరుగుతున్న పోలీసుల అణచివేతకు, ఢిల్లీలో ఇతర నగరాల్లో జరుగుతున్న ప్రజా నిరసనలకు మధ్య సంబంధం ఉంది.
లాడా సికాకా అరెస్టులో కూడా అనేక అక్రమాలు జరిగాయి. నిరపరాధుల నిర్బంధం, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం, పోలీసులపై ఎలాంటి చర్యలు లేకపోవడం దేశవ్యాప్తంగా తీవ్రమైన సమస్యలుగా మారాయి.
అక్టోబరు 14న బాధ్యతలు స్వీకరించిన ఒడిశా కొత్త గవర్నర్ బ్రజ్ మోహన్ రామ్ కూడా తన తొలి ప్రసంగంలో బీజేపీకి రాష్ట్రంలో మరిన్ని ఓట్లు సాధించేలా చేస్తానని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని గవర్నర్‌గా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారు.
భారత రాజ్యాంగం, ఎన్నికల విధానం నిర్దేశించిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, గతంలో ఎన్నడూ లేనివిధంగా దాడులను ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం ఎన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కుంటోంది. అదేవిధంగా ఆదివాసీల సంస్కృతి, జీవన విధానం కూడా అణచివేతకు గురవుతోంది.
ఆయుధాల ఎగుమతులు, ఆదివాసీ భూముల విధ్వంసం
ఆదివాసీల భూముల్లోని జీవనాధార ఖనిజాలను తవ్వి, వాటితో ఆయుధాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, యుద్ధాల ద్వారా లాభాలు పొందాలనే ఉద్దేశంతో ఈ పరిశ్రమలను విస్తరిస్తే, భారతదేశంలోని అత్యంత సారవంతమైన ప్రకృతి సంపద భవిష్యత్తు తరాలకు పనికిరాని బంజరు భూములుగా మిగిలిపోతాయి.
అందుకే గనుల తవ్వకాల సమస్య ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయ చర్చగా మారాలి. అదానీ, వేదాంత సంస్థలు ఈస్ట్ ఇండియా కంపెనీ కొత్త రూపాలుగా భారతదేశంలోని సహజ సంపదను తమ స్వార్థ ప్రయోజనాల కోసం దోచుకుంటున్నాయి.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకప్పుడు తూర్పు భారతదేశ సంపదను దోచుకున్నట్లే, ఇప్పుడు ఈ పెద్ద సంస్థలు భారతదేశంలోని సహజ సంపదపై ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నిస్తున్నాయి.
ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకు ఇది అద్దం పడుతున్నది. భూమిలోని జీవనాధార వనరులను ఎంతకాలం ఇలా విచ్చలవిడిగా తవ్వుకుంటూ పోతారు? ఈ విధ్వంసాన్ని ఆపడానికి ప్రపంచ ప్రజలందరూ ఎప్పుడు ఒక్కటవుతారు?
ఫెలిక్స్ పడెల్: ఆదివాసీ హక్కులపై విస్తృతంగా కృషి చేసిన మానవ పరిణామ శాస్త్రవేత్త.
మాళవిక గుప్తా: ఆదివాసీ హక్కులపై విస్తృతంగా కృషి చేసిన మానవ పరిణామ శాస్త్రవేత్త. ప్రత్యేకించి ఆదివాసీ, స్థానిక సమస్యలపై భారత్, ఈక్వెడార్ దేశాలపై పరిశోధనలను కేంద్రీకరించారు.
(తెలుగు అనువాదం: డి. వెంకన్న)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
