2026 నవంబర్ 3న అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనకు కీలకమైన రాజకీయ పరీక్షగా నిలిచాయి.
ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ(House of Representatives), సెనేట్(Senate) రెండింటిపైనా ఆధిపత్యాన్ని సాధించింది.
ముఖ్యంగా 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన కొన్ని ప్రాంతాల్లోనూ డెమొక్రటిక్ అభ్యర్థులు విజయం సాధించడం ఈ ఎన్నికల ప్రత్యేకత. అమెరికా రాజకీయాల్లో ఇది కీలక మలుపు.
ఇది కేవలం రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగిన పోటీ మాత్రమే కాదు. ట్రంప్ ప్రభుత్వ ఆర్థిక విధానాలు, వలస విధానం, అంతర్జాతీయ యుద్ధాలు, ప్రజల జీవన వ్యయం, నిరుద్యోగం, ఆరోగ్య సంరక్షణ, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రభుత్వ వైఖరి వంటి అనేక అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఎన్నికలు.
ముఖ్యంగా ట్రంప్ రెండోసారి ఎన్నిక కావడానికి యువత ప్రధానంగా కృషి చేసింది. ‘అమెరికా నంబర్ వన్ ఎగైన్’ అనే నినాదం వారిని బాగా ఆకర్షించింది. కానీ గెలిచి పగ్గాలు చేపట్టిన 2025 జనవరి నుంచి ట్రంప్ అనుసరించిన విధానాలు యువతను తీవ్ర నిరాశకు గురిచేశాయి.
కొత్తగా కల్పించిన ఉపాధి అవకాశాలు నామమాత్రంగానే ఉన్నాయి. పైగా, టారిఫ్ యుద్ధం దేశంలో వివిధ సరుకుల ధరలు విపరీతంగా పెరగడానికి దారితీసింది. ఇరాన్‌పై యుద్ధంతో నిత్యావసర సరుకులతోపాటు ఇంధన ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి.
వీటికి తోడు, కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండానే ట్రంప్ ఒక్కడే సుమారు 2 బిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపిందని పరిశీలకుల అంచనా. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు- ట్రంప్ వ్యవహారశైలి, ఏకపక్ష, నియంతృత్వ పోకడలు, అవినీతి ఆరోపణలు తదితర అంశాలన్నీ కలిసి ఆయన పార్టీకి ఘోర పరాజయాన్ని తెచ్చిపెట్టాయి.
ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ వార్త రాసే సమయానికి డెమొక్రటిక్ పార్టీ 228 స్థానాలు గెలుచుకోగా, అధ్యక్షుడు ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ 139 స్థానాల్లో గెలుపొందింది. ఇంకా 68 స్థానాల ఫలితాలు తెలియాల్సి ఉంది. డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభలో 218 స్థానాల మెజారిటీ మార్కును దాటింది.
సెనేట్‌లోని 100 స్థానాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో డెమొక్రటిక్ పార్టీకి, దానికి మద్దతిచ్చే స్వతంత్ర సభ్యులకు కలిపి 54 స్థానాలు దక్కాయి. రిపబ్లికన్ పార్టీ 44 స్థానాలు గెలుచుకుంది. ఇంకా రెండు స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది.
సెనేట్‌లోనూ డెమొక్రటిక్ పార్టీ మెజారిటీ సాధించింది. అంటే ఇకపై ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించే చట్టాలకు కాంగ్రెస్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే, అనేక ఆరోపణలపై విచారణలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
రిపబ్లికన్ పార్టీకి ఎదురైన పరాజయం
ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురైన ఓటమి సాధారణ రాజకీయ పరాజయం కాదు. డెమొక్రటిక్ పార్టీ సెనేట్‌లో కనీసం ఏడు రిపబ్లికన్ స్థానాలను కైవసం చేసుకుంది. వీటిలో కొన్ని రాష్ట్రాలు సంప్రదాయంగా రిపబ్లికన్ పార్టీకి బలమైన ప్రాంతాలుగా పరిగణించబడతాయి.
ముఖ్యంగా టెక్సాస్, కాన్సాస్ వంటి రాష్ట్రాల్లో డెమొక్రటిక్ పార్టీ సాధించిన విజయాలు అమెరికా రాజకీయాల్లో మారుతున్న ఓటర్ల వైఖరికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
ప్రతినిధుల సభలోనూ రెండు డజన్లకు పైగా స్థానాలను డెమొక్రటిక్ పార్టీ రిపబ్లికన్ల నుంచి గెలుచుకుంది. 1994 తర్వాత(మూడు దశాబ్దాల కాలంలో) రిపబ్లికన్ పార్టీ ఇంతటి ఘోర పరాజయం పాలవడం ఇదే మొదటిసారి.
డెమొక్రటిక్ పార్టీ
అమెరికా రాజకీయాల్లో చాలా కాలంగా డెమొక్రటిక్ పార్టీ ప్రధానంగా మధ్యేవాద విధానాలతో పనిచేస్తోంది. బెర్నీ శాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, రషీదా త్లైబ్ వంటి నాయకుల ఎదుగుదలతో పార్టీ లోపల సోషలిస్టు, ప్రగతిశీల రాజకీయాలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ ఎన్నికలు ఆ ధోరణికి మరింత బలాన్ని ఇచ్చాయి.
అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ, కార్మికులకు మెరుగైన వేతనాలు, హక్కులు, సంపన్నులపై అధిక పన్నులు, ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య, గృహవసతి ఖర్చుల తగ్గింపు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల విస్తరణ, కార్పొరేట్ సంస్థల రాజకీయ ప్రభావాన్ని తగ్గించడం, ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సహాయాన్ని నిలిపివేయడం వంటి విధానాలను డెమొక్రటిక్ పార్టీ ప్రధానంగా ప్రచారం చేసింది.
అబ్దుల్ ఎల్-సయీద్ విజయం – చారిత్రక ప్రాధాన్యత
మిషిగన్ రాష్ట్రం నుంచి డెమొక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్ సెనేట్‌కు ఎన్నికవడం ఈ ఎన్నికల్లో మరో ముఖ్యమైన పరిణామం. ఆయన రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌ను ఓడించారు.
ఈ విజయంతో అమెరికా చరిత్రలో ఎన్నికైన తొలి ముస్లిం సెనేటర్‌గా ఆయన నిలవనున్నారు. ఆరోగ్య సంరక్షణ, సామాజిక న్యాయం, కార్మికుల ప్రయోజనాలు, ప్రజలకు అందుబాటులో ఉండే ఆర్థిక విధానాలపై ఆయన ప్రచారం సాగించారు.
డెమొక్రటిక్ సోషలిస్టు ఉద్యమం తెచ్చిన రాజకీయ మార్పులు
1973లో ఏర్పడిన Democratic Socialist Organizing Committee, 1971లో ఏర్పడిన New American Movement సంస్థలు 1982లో విలీనం కావడంతో Democratic Socialists of America(DSA) ఏర్పడింది.
2026 నవంబర్ 3న అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలు ఆ దేశ రాజకీయాల్లో ముఖ్యమైన పరిణామాలకు దారితీశాయి.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి కాంగ్రెస్‌లో ఎదురైన పరాజయం ఒక పరిణామమైతే- డెమొక్రటిక్ సోషలిస్టు ఉద్యమానికి చెందిన అభ్యర్థులు ఫెడరల్ కాంగ్రెస్, రాష్ట్ర శాసనసభలు, నగర పాలక సంస్థలు, విద్యా సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాలు మరో ప్రధాన పరిణామం.
ప్రత్యేకంగా బెర్నీ శాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, జోహ్రాన్ మమ్దానీ వంటి నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రగతిశీల రాజకీయ ధోరణి, డెమొక్రటిక్ సోషలిస్టుల విస్తరణ ఈ ఎన్నికల్లో మరింత స్పష్టంగా వెల్లడైంది.
2026 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో సోషలిస్టుల ప్రాతినిధ్యం
2026 నవంబర్ ఎన్నికలకు ముందు అమెరికా కాంగ్రెస్‌లో DSA సభ్యులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్. ఆమె న్యూయార్క్ రాష్ట్రం నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నాయకురాలు. రెండో వ్యక్తి రషీదా త్లైబ్. ఆమె మిషిగన్ రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యురాలు. వీరిద్దరూ ఆరోగ్య సంరక్షణ, కార్మిక హక్కులు, ఆర్థిక న్యాయం వంటి అంశాలపై పనిచేస్తున్నారు.
సెనేట్‌లో బెర్నీ శాండర్స్ వంటి నాయకులు డెమొక్రటిక్ సోషలిస్టు భావజాలాన్ని బహిరంగంగా సమర్థిస్తున్నారు.
2026 ఎన్నికల్లో కాంగ్రెస్‌లో సాధించిన విజయాలు
ఆరుగురు కొత్త DSA అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పటికే ఉన్న AOC, రషీదా త్లైబ్ కూడా తిరిగి ఎన్నికయ్యారు. దీంతో మొత్తం DSA బలం 2 నుంచి 8కి పెరిగింది. కొత్తగా ఎన్నికైన వారిలో డారియలిజా అవిలా షెవాలియర్, క్లెయిర్ వాల్డెజ్ ఇద్దరూ న్యూయార్క్ నుంచి విజయం సాధించారు.
మెలాట్ కిరోస్–కొలరాడో, ఏంజెలా గొంజాలెస్-టోరెస్–కాలిఫోర్నియా, డొనవన్ మెకిన్నీ–మిషిగన్, క్రిస్ రాబ్–పెన్సిల్వేనియా నుంచి ఎన్నికయ్యారు. ఇంకా కొన్ని ఫలితాలు తేలాల్సి ఉన్నాయి. అందువల్ల DSA ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశం ఉండవచ్చు.
రాష్ట్ర శాసనసభల్లో సోషలిస్టుల విజయాలు
ఈ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి రాజకీయ ప్రాతినిధ్యం కూడా ముఖ్యమైనది. రాష్ట్ర శాసనసభల కోసం DSA మద్దతు పొందిన 63 మంది అభ్యర్థుల్లో 40 మంది విజయం సాధించారు. ఏడుగురు ఓటమి చెందారు. 16 మంది ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉన్నాయి.
ముఖ్యంగా మిన్నెసోటా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో గవర్నర్ పదవితోపాటు శాసనసభల్లోనూ డెమొక్రటిక్ పార్టీకి ప్రాతినిధ్యం లభించడం వల్ల విధానాల అమలుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
అమెరికా రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, కార్మిక చట్టాలు, కనీస వేతనాలు వంటి అనేక అంశాలపై ప్రత్యక్ష నిర్ణయాలు తీసుకుంటాయి. అందువల్ల రాష్ట్ర శాసనసభల్లో ప్రాతినిధ్యం పెరగడం స్థానిక సామాజిక, ఆర్థిక విధానాలపై ప్రభావం చూపగలదు.
మేయర్లు, నగర కౌన్సిళ్లలో విజయాలు
DSA అభ్యర్థులు నగర పాలనకు సంబంధించిన ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ప్రత్యేకంగా వాషింగ్టన్ DC మేయర్‌గా జేనీస్ లూయిస్ జార్జ్ విజయం సాధించారు. ఆన్ ఆర్బర్ మేయర్‌గా యూసుఫ్ రభీ విజయం సాధించారు.
వాషింగ్టన్ DC కౌన్సిల్లో అపర్ణ రాజ్, పోర్ట్‌ల్యాండ్ నగర కౌన్సిల్లో మిచ్ గ్రీన్, సెయింట్ పీటర్స్బర్గ్ నగర కౌన్సిల్లో రిచీ ఫ్లాయిడ్, శాంటా బార్బరా నగర కౌన్సిల్లో గేబ్ ఎస్కోబెడో, ఇయాన్ బౌకే విజయం సాధించారు.
లాస్ ఏంజెలెస్ మేయర్ ఎన్నికలో DSA మద్దతు పొందిన నిత్యా రామన్ ముందంజలో ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇంకా తుది విజయం అధికారికంగా ప్రకటించలేదు.
DSA విజయాలు కేవలం అమెరికా కాంగ్రెస్‌కే పరిమితం కాలేదు. రాష్ట్ర శాసనసభలు, నగర పాలక సంస్థలు, కౌంటీలు, పాఠశాల బోర్డులు వంటి స్థానిక ప్రజాస్వామ్య సంస్థల్లోనూ అభ్యర్థులు గెలిచారు.
ఎన్నికల్లో కార్మిక సంఘాల పాత్ర కీలకం
అమెరికాలో కార్మిక సంఘాలు రాజకీయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన శక్తిగా ఉన్నాయి. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, పని గంటలు, పెన్షన్ వంటి అంశాలపై పోరాడటంతోపాటు, తమకు అనుకూలమైన విధానాలను అమలు చేయగల అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తాయి.
ఈ ఎన్నికల సందర్భంగా యునైటెడ్ ఆటో వర్కర్స్, సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్, అసోసియేషన్ ఆఫ్ ఫ్లైట్ అటెండెంట్స్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ సంఘాలు కీలక పాత్ర పోషించాయి.
ఎన్నికల్లో ముందుకొచ్చిన ప్రధాన సమస్యలు
ఈ ఎన్నికల్లో ఏడు ప్రధాన సమస్యలు ప్రజలను ప్రభావితం చేశాయి.
1. జీవన వ్యయం పెరుగుదల: అమెరికాలో సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జీవన వ్యయం పెరగడం.
ఆహార పదార్థాలు, ఇంధన ధరలు, ఇళ్ల అద్దెలు, విద్యుత్, ఇతర గృహ ఖర్చులు, పిల్లల సంరక్షణ, వైద్య ఖర్చులు పెరిగాయి.
వేతనాలు పెరిగినా, అనేక కుటుంబాలకు జీవన వ్యయం భారంగా మారింది. ప్రజలు తమ రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం ఎన్నికల్లో ధ్రువపడింది.
2. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు: ట్రంప్ ప్రభుత్వం అమెరికా పరిశ్రమలను రక్షించడం, దేశీయ ఉత్పత్తిని పెంచడం పేరుతో ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను పెంచింది. కానీ ఆచరణలో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం, వ్యాపార అనిశ్చితి ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తాయి. చిన్న వ్యాపారులు, వినియోగదారులు, రైతులు ఈ విధానాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నారు.
3. ఆరోగ్య సంరక్షణ: అమెరికాలో వైద్య సేవలు అత్యంత ఖరీదైనవి. ఒబామా ప్రవేశపెట్టిన Affordable Care Act (Obamacare) ద్వారా లక్షలాది మందికి ఆరోగ్య బీమా అందుబాటులోకి వచ్చింది.
ట్రంప్ ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకాలకు సంబంధించిన నిధులు, అర్హతలు, ప్రభుత్వ సబ్సిడీల విషయంలో తీసుకున్న మార్పులు ఎన్నికల్లో ముఖ్యమైన సమస్యలుగా ముందుకొచ్చాయి.
ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలా? లేక మార్కెట్ ఆధారిత ప్రైవేటు బీమా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా? అనే చర్చ జరిగింది.
4. వలస విధానం: ట్రంప్ ప్రభుత్వ కఠిన వలస విధానం ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అక్రమ వలసదారుల అరెస్టులు, బహిష్కరణలు, సరిహద్దుల వద్ద భద్రత పెంపు, వలసదారుల కుటుంబాలపై ప్రభావం, శరణార్థులకు ఆశ్రయం కల్పించే విధానం, చట్టబద్ధ వలస ప్రక్రియలపై ఆంక్షలు ఎన్నికల్లో ప్రధానంగా చర్చకు వచ్చాయి.
5. ఇరాన్ యుద్ధం: అమెరికా విదేశాంగ విధానం కూడా ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత పొందింది. ముఖ్యంగా ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు, అమెరికా సైనిక జోక్యం, ఆర్థిక భారం ప్రజల్లో చర్చకు వచ్చాయి.
అమెరికా తన దేశంలోని పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సమస్యలను పరిష్కరించకుండా విదేశీ యుద్ధాలకు భారీగా ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ముందుకొచ్చాయి.
6. ప్రజాస్వామ్యం, అవినీతి, అధికార దుర్వినియోగం: ట్రంప్ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల స్వతంత్రత, న్యాయవ్యవస్థ, మీడియా స్వేచ్ఛ, పరిపాలనా వ్యవస్థలపై చూపుతున్న ప్రభావం గురించి విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వంలో పారదర్శకత, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలు డెమొక్రటిక్ పార్టీ ప్రచారంలో ప్రాధాన్యత పొందాయి.
7. గృహవసతి, ఉపాధి, కార్మిక హక్కులు: యువతకు ఇళ్లు కొనడం కష్టమవడం, అద్దెలు పెరగడం, విద్యార్థుల రుణభారం, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు వంటి అంశాలు కూడా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి.
ముఖ్యంగా ప్రగతిశీల అభ్యర్థులు కార్మికులకు అనుకూలమైన చట్టాలు, అందుబాటు ధరల్లో గృహవసతి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రచారంలో ప్రధాన చర్చనీయాంశాలుగా చేశారు.
ఈ సమస్యలన్నీ కలిపి ట్రంప్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి దోహదపడ్డాయి.
యువత, కార్మికులు, హిస్పానిక్ ఓటర్ల పాత్ర
ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ విజయానికి వివిధ సామాజిక వర్గాల మద్దతు దోహదపడింది. ఉపాధి, విద్యా రుణాలు, గృహవసతి, ఆరోగ్య సంరక్షణ వంటి సమస్యలపై యువ ఓటర్లు ప్రగతిశీల అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.
హిస్పానిక్ వర్గం: గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన కొన్ని హిస్పానిక్ ఓటర్లలో ఈసారి డెమొక్రటిక్ పార్టీ వైపు మొగ్గు కనిపించింది. ముఖ్యంగా టెక్సాస్–మెక్సికో సరిహద్దు ప్రాంతాల్లో డెమొక్రటిక్ అభ్యర్థులు విజయాలు సాధించారు.
కార్మికులు, మధ్యతరగతి: పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య ఖర్చులు, వేతనాల సమస్యలు ఈ వర్గాల ఓటింగ్‌పై ప్రభావం చూపాయి.
ముఖ్యంగా యువత, హిస్పానిక్ ఓటర్లు డెమొక్రటిక్ పార్టీకి ఇచ్చిన మద్దతు రిపబ్లికన్ల విజయావకాశాలను దెబ్బతీసింది.
ట్రంప్ ప్రభుత్వంపై ఈ ఫలితాల ప్రభావం
డెమొక్రటిక్ పార్టీ రెండు సభల్లో మెజారిటీ సాధించడం ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. దీని వల్ల ట్రంప్ ప్రతిపాదించే కొత్త చట్టాలను డెమొక్రటిక్ పార్టీ అడ్డుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వ బడ్జెట్‌పై డెమొక్రటిక్ పార్టీ ప్రభావం పెరుగుతుంది. ట్రంప్ ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారుల నియామకాలను సెనేట్‌లో ప్రశ్నించే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ విధానాలు, అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ విచారణలు నిర్వహించవచ్చు. వలస విధానం, ఆరోగ్య బీమా, పన్నులు, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది.
విదేశాంగ, సైనిక విధానాలపై కూడా కాంగ్రెస్‌లో ప్రతిపక్షం బలమైన ప్రశ్నలు లేవనెత్తవచ్చు.
అయితే, కాంగ్రెస్‌లో డెమొక్రటిక్ పార్టీకి మెజారిటీ వచ్చినంత మాత్రాన ట్రంప్ అధ్యక్ష పదవికి ఎలాంటి ముప్పూ ఉండదు. ఆయన పదవీకాలం కొనసాగుతుంది.
చట్టాలపై అధ్యక్షుడికి వీటో అధికారం కూడా ఉంటుంది. అందువల్ల ఈ ఎన్నికల ఫలితాలు ట్రంప్ ప్రభుత్వాన్ని నియంత్రించే రాజకీయ శక్తిని ప్రతిపక్షానికి ఇచ్చాయి. కానీ ప్రభుత్వాన్ని వెంటనే మార్చవు.
ప్రపంచ రాజకీయాలపై ఈ ఎన్నికల ప్రభావం
అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక, సైనిక శక్తి. అందువల్ల అమెరికా ఎన్నికల ఫలితాలు ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపుతాయి.
ఈ ఎన్నికల అనంతరం అంతర్జాతీయ వాణిజ్య సుంకాలపై ట్రంప్ ప్రభుత్వానికి ప్రతిఘటన పెరగవచ్చు. విదేశీ యుద్ధాలకు అమెరికా నిధుల కేటాయింపుపై మరింత చర్చ జరగవచ్చు. నాటో, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ విధానాలపై కాంగ్రెస్‌లో విభేదాలు పెరగవచ్చు.
పేదలు, కార్మికులు, మధ్యతరగతి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే విధానాలపై చర్చ పెరుగుతుంది. భారతదేశంతో వాణిజ్య సంబంధాలు, దిగుమతి సుంకాల విషయంలోనూ అమెరికా అంతర్గత రాజకీయాల ప్రభావం ఉండవచ్చు.
అయితే విదేశాంగ విధానంలో మార్పులు కేవలం కాంగ్రెస్ మెజారిటీ వల్లనే నిర్ణయించబడవు. అధ్యక్షుడి అధికారాలు కూడా కీలకమైనవి.
2026 అమెరికా మధ్యంతర ఎన్నికలను మూడు ప్రధాన కోణాల్లో చూడాలి.
1. ఆర్థిక అసంతృప్తి రాజకీయ మార్పుకు దారితీసింది: దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదైనా, సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని ఈ ఎన్నికలు నిరూపించాయి.
2. ట్రంప్ రాజకీయాలకు ప్రతిఘటన పెరిగింది: వలస, సుంకాల విధానం, విదేశీ యుద్ధాలు, ప్రభుత్వ అధికారాల వినియోగం వంటి అంశాలపై వచ్చిన అసంతృప్తి రిపబ్లికన్ పార్టీకి నష్టం కలిగించింది.
3. డెమొక్రటిక్ పార్టీలో ప్రగతిశీల రాజకీయాలకు ప్రాధాన్యత పెరుగుతోంది: బెర్నీ శాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్, జోహ్రాన్ మమ్దానీ వంటి నాయకులు ముందుకు తెచ్చిన ప్రజా సంక్షేమ రాజకీయాలకు కొత్త తరం నుంచి మద్దతు పెరుగుతోంది.
అయితే డెమొక్రటిక్ పార్టీ అధికారంలోకి రావడం మాత్రమే అమెరికా ఆర్థిక, సామాజిక సమస్యలకు పరిష్కారం కాదు. ఆ పార్టీ తన ఎన్నికల హామీలను ఎంతవరకు అమలు చేస్తుందన్నదే అసలైన పరీక్ష.
2026 నవంబర్ 3న జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికలు దేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. రెండేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్‌కు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ప్రతినిధుల సభతోపాటు సెనేట్‌లోనూ డెమొక్రటిక్ పార్టీ ఆధిక్యం సాధించడం ట్రంప్ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యపరమైన నియంత్రణను పెంచింది.
ముఖ్యంగా DSA మద్దతు పొందిన అభ్యర్థుల విజయాలు అమెరికా రాజకీయాల్లో ప్రగతిశీల, ప్రజాస్వామ్య సోషలిస్టు భావజాలానికి పెరుగుతున్న ప్రాధాన్యతను సూచిస్తున్నాయి.
ప్రజలకు ఆరోగ్యం, విద్య, ఉపాధి, గృహవసతి, సామాజిక భద్రత వంటి మౌలిక అవసరాలు అందించాలనే డిమాండ్ అమెరికా రాజకీయాల్లో మరింత బలంగా వినిపిస్తోంది.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచలేని రాజకీయ అధికారానికి ఎన్నికల ద్వారా ప్రజలు సమాధానం చెబుతారనే ప్రజాస్వామ్య సూత్రానికి ఈ ఎన్నికలు మరో ఉదాహరణగా నిలుస్తున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
