న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి బీఆర్ గవాయిపై బూటు విసిరిన అడ్వకేట్ రాకేశ్ కిషోర్‌పై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని సీనియర్ అడ్వకేట్ వికాస్‌సింగ్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. వికాస్ సింగ్ ప్రస్తుతం సుప్రీంకోర్టు బార్ అసోసీయేషన్ అధ్యక్షులుగా ఉన్నారు. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతాతో కలిసి వికాస్‌సింగ్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనానికి ఈ అభ్యర్థన చేశారు. అడ్వకేట్ రాకేశ్ కిషోర్‌పై కోర్టు ధిక్కారం కేసు నడిపించేందుకు అడ్వకేట్ జనరల్ ఆర్ వెంకట రమణి కూడా అనుమతించారని అందువల్లన రాజ్యాంగ సమగ్రతకు సంబంధించిన ఈ అంశాన్ని విచారణ చేపట్టాల్సిందిగా సొలిసిటర్ జనరల్ కోరారు. ఈ ఘటనను మెచ్చుకుంటూ సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న చర్చలపై నిషేధం విధించాలని కూడా వికాస్‌సింగ్ సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు.
వికాస్‌సింగ్ ప్రతిపాదనపై స్పందిస్తూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీల ధర్మాసనం “ఈ ఘటనపై సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తే సంయమనం పాటిస్తున్నారు. అంటే ఈ ఘటన న్యాయవ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అటువంటి పరిస్థితుల్లో కోర్టు ధిక్కారం కేసు నడిపి చర్చలు మరింతగా పొడింగించాల్సిన అవసరమున్నదా?” అని ప్రశ్నించింది.
దీనికి సమాధానంగా వికాస్‌సింగ్ స్పందిస్తూ “రాకేశ్ కిషోర్ వ్యవహారంపై మీడియాలో జరుగుతున్న చర్చలు న్యాయవ్యవస్థను కించపరిచేవిగా ఉన్నాయి” అన్నారు.
వికాస్‌సింగ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ సొలిసిటర్ జనరల్ “ప్రధానన్యాయమూర్తి స్పందన ఆయన ఔన్నత్యాన్ని వెల్లడిస్తుంది. కానీ ఈ ఘటనను సమర్థిస్తూ పదేపదే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు న్యాయవ్యవస్థ ఔన్నత్యానికి భంగం కలిగించేవిగా ఉన్నాయి” అన్నారు.
“ఈ ఘటనను విష్ణుభగవానుడు సమర్థిస్తున్నారని అంటున్నారు. నిజానికి ఇటువంటి హింసాత్మక ఘటనలను ఎన్నటికీ క్షమించడు. అలా వ్యాఖ్యానించడం ఆయనను కూడా అవమానించడమే” అని వికాస్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ మాటలకు బదులిస్తూ జస్టిస్ సూర్యకాంత “పవిత్ర గ్రంథాలు హింసను ఎన్నడూ తిరస్కరించలేదు కదా?” అంటూనే “న్యాయస్థానం ఈ విషయంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే సామాజిక మాధ్యమాల్లో చర్చలు పెరుగుతాయే కానీ తగ్గవుగా?” అన్నారు. జస్టిస్ సూర్యకాంత అభిప్రాయాలతో ఏకీభవిస్తూ జస్టిస్ బాగ్చీ “దీనిపై జరిగే వాదోపవాదాలు ప్రచారోన్మాదులకు కొత్త అస్త్రాలను అందించే అవకాశాలు ఉన్నాయి కదా” అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో చిన్నవిషయాలను కూడా సంచలనం చేస్తున్న పరిస్థితులపై వ్యాఖ్యానిస్తూ, “సామాజిక మాధ్యమాలపై నియంత్రణ సరికొత్త సంవాదానికి దారితీస్తుంది. న్యాయస్థానాల్లో మనం ప్రవర్తిస్తున్న తీరు వలనే, ఈ మాత్రమైన ఉండగలుగుతున్నాం. ప్రజలకు మనపై విశ్వాసం ఉంది. అటువంటి స్ఫూర్తినే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి కూడా ప్రదర్శించారు. ఈ ఘటనను ఓ బాధ్యతారహితమైన వ్యక్తి చర్యగా భావించారు. మా దృష్టిలో ఈ అధ్యయం ముగిసిపోయింది. దీనిపై కేసు నడపడమంటే, ప్రచారోన్మాదులకు మందుగుండు సామాగ్రిని అందించడమే కదా? అటువంటి నిర్ణయంతో న్యాయం జరగదు కదా?” అని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు.
ఇటువంటి కేసుల కారణంగా కోర్టుల విలువైన సమయం వృథా అవుతుందని గుర్తుచేస్తూ బాగ్చీ “మీరు వాదించాల్సిన కేసు కోసం రోజంతా ఎదురుచూస్తారు. ఇప్పటికే ఈ విషయంపై ఐదు నిమిషాల చర్చ జరిగింది. ఈ సమయంలో కనీసం మూడు కేసుల్లో వాదోపవాదనలను వినేవాళ్లం. కక్షిదారులకు ఎంతో కొంత న్యాయం జరిగేది. జైళ్లో ఉన్న ఎవరో ఒకరు బయటకు వచ్చే వారు. ప్రజాప్రయోజనాలరీత్యా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానం తన వైఖరి తెలియజేసేది” అన్నారు.
ఇటువంటి ఘటనలు సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు అదాయసంపాదన మార్గాలేనని ఈ విషయంపై కోర్టు ధిక్కారం కేసును నడిపితే మరో వారం రోజులపాటైన జనం నోళ్లల్లో నానుతుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
రాకేశ్ కిషోర్ తాను చేసిన పనికి పశ్చాత్తాప పడకపోగా సమర్థించుకుంటున్న వైనాన్ని వికాస్ సింగ్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతవారం ఈ విషయంపై స్పందించిన జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ఈ ఘటన న్యాయవ్యవస్థ ప్రతిష్టకు సవాల్ విసురుతోందంటూ వ్యాఖ్యానించిన సంగతిని కూడా వికాస్ సింగ్ న్యాయస్థానానికి తెలియజేశారు. చివరికి ధర్మాసనం రాకేశ్ కిషోర్‌పై కోర్టుధిక్కారం కింద విచారణ చేపట్టడానికి అంగీకరించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
