నేను శ్రామికవర్గంలో జన్మించాను. తొలి నుంచీ నాలో కొన్ని ఆదర్శాలు, ఉత్సాహం, దీక్ష వుండేవి. నేను పెరిగిన వాతావరణం మొరటైనది, హింసాత్మకమైనది.
సమాజపు నిచ్చెనమెట్ల వ్యవస్థలో నాది అత్యంత కడపటి మెట్టు. దీని కారణంగా నా దృష్టి ఎప్పుడూ పైస్థానానికి చేరుకోవాలనే వుండేది.
అయితే సమాజం ఒక బ్రహ్మాండమైన అంతస్తుల వ్యవస్థ లాంటిది. దీనిలో నేను పై అంతస్తుకు చేరాలని నిర్ణయించుకున్నాను.
ఆ అంతస్తులో వుండే మగవాళ్ళు, ఆడవాళ్ళు అందమైన దుస్తులు ధరించేవారు.
తినడానికి అవసరమైన దానికంటే ఎక్కువే వుండేది. వాళ్ళు చదవడానికి, ఉల్లాసంగా గడవడానికి అవసరమైన సాహిత్యం వుండేది.
జీవితమంటే అదే అని నాకనిపించేది. జీవితానికి పరమార్థం అదే అనుకునేవాణ్ణి.
అయితే శ్రామికవర్గ వాతావరణంలో వున్నవారికెవరికైనా పై అంతస్థులకు చేరుకోవడం సాధ్యం కాని విషయం.
కాలిఫోర్నియాలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో కూలీగా వుండేవాడిని. నేను పై అంతస్తుకు చేరుకోవడానికి కావల్సిన నిచ్చెన ఎక్కడ దొరుకుతుందని వెతికేవాడిని.
ఆ సమయంలో నా దృష్టి వడ్డీ అనే పదార్థం మీద పడింది. చక్రవడ్డీ అనేదాన్ని కనిపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరా అని ఆశ్చర్యపోయేవాడిని.
నాతోటి కార్మికుల వేతనాలు, వయసు పైబడినవారి వేతనాలు, జీవనపు వ్యయం లెక్కలు తెలుసుకునేవాడిని.
అప్పుడు నాకేమనిపించేదంటే తక్షణమే పనిచేయడం ప్రారంభించి తగినంతగా సొమ్ము ఆదా చేసుకుంటే 50 సంవత్సరాల వయసు వచ్చేనాటికి పనిచేసే అవసరం లేకుండా సమాజంలో ఉన్నతస్థానంలో వున్నవాళ్ళు ఎంత మంచి జీవితాన్ని గడుపుతున్నారో అలా బతకవచ్చని నిర్ణయానికి వచ్చాను.
అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకూడదని గట్టి నిర్ణయానికొచ్చాను. వీటన్నింటి గురించి ఆలోచించాను గాని, శ్రామికవర్గపు కలల సౌధాన్ని భగ్నంచేసే “అనారోగ్యం” అనే దాన్ని పట్టించుకోలేదు.
వ్యాపారం, దోపిడీల మధ్య తొలి అడుగులు..
పదేళ్ళ వయసులో కొంతకాలం నగరపు రోడ్లమీద పత్రికలమ్మాను. ఇప్పుడు నాకు కొత్త నిచ్చెన దొరికింది, అదే వ్యాపారం.
దాచుకొన్న సొమ్మును ప్రభుత్వపు బాండ్లలో పెట్టటం కంటే ఐదు సెంట్లకు రెండు పేపర్లు కొని ఆ వెంటనే వాటిని పది సెంట్లకు అమ్మగలిగితే నా దగ్గర ఎంత పెట్టుబడి వుంటుందని లెక్కలేసుకొనేవాడిని.
త్వరలోనే నేనొక విజయవంతమైన వర్తకపు రాకుమారుడైనట్లు ఊహించుకునేవాడిని.
లాభమేముందీ? 16 సంవత్సరాలు వచ్చేటప్పటికే నాకు రాకుమారుడు అనే బిరుదొచ్చింది.
అయితే ఈ బిరుదు ఇచ్చిన వాళ్ళు సముద్రపు దొంగలు. ఆయిస్టర్లను వేటాడే దొంగల నావికుడైన రాకుమారుడు అనే బిరుదిచ్చారు నాకు.
మొట్టమొదటి సారిగా నిచ్చెనమెట్లలో తొలి మెట్టు ఎక్కాను. పెట్టుబడిదారుడిని అయ్యాననిపించింది.
ఒక పడవ నాదైంది. ఒకర్ని నా దగ్గర పనికి కుదుర్చుకున్నాను, వచ్చిన లాభంలో యజమానిగా నేను రెండు వంతులు తీసుకుని అతనికి ఒక వంతు ఇచ్చాను.
సముద్రపు దొంగల మధ్య తీవ్రమైన పోటీ వుండేది, పరస్పరం మోసం చేసుకునేవాళ్ళం. తుపాకీ చేతికి వచ్చింది.
ఒక రోజు నా పనివాడు అజాగ్రత్తగా వుంచి పడవకు నిప్పంటించాడు. మొత్తం బుగ్గిబూడిదైపోయింది.
అక్కడి నుంచి ప్రారంభమైంది నా వేట. పెట్టుబడిదారులు నన్ను దోపిడీ చేయడానికి ప్రయత్నించేవాళ్ళు.. అప్పుడు ప్రారంభమైంది జీవిక కోసం బహురూపాలెత్తడం.
కాయకష్టంపై విరక్తి – మేధో వ్యాపారం వైపు..
నేనెప్పుడూ శ్రమను ప్రేమిస్తూనే వున్నాను. అలాంటి సమయంలో ఒక వ్యక్తి నన్ను చేరదీశాడు.
పనిపట్ల నాకుండే దీక్షను ఉపయోగించుకుని ఒక మనిషికిచ్చే జీతంతో నాతోటి ఇద్దరి పని చేయించుకునేవాడు.
అందుకు ముందు వాళ్ళిద్దరికీ కలిపి 40 డాలర్లు ఇచ్చేవాడు. అదే పనికి నాకు 30 డాలర్లు మాత్రమే ఇచ్చేవాడు. క్రమంగా పనిపట్ల విరక్తి కలిగింది, రోడ్లవెంట అడుక్కుంటూ అమెరికా అంతా తిరిగాను.
నా జీవితంలో ఎక్కువ భాగం మురికివాడల్లోనూ, జైళ్ళలోనూ గడిచిపోయింది. 18 ఏళ్ళ వయసొచ్చింది.
సమాజమనే సౌధంలో నేలమాళిగ నా స్థానమైంది. భయంకరమైన పేదరికం, లేమితనం. ఇలాంటి ఒక ప్రదేశం వుంటుందని కూడా నాగరికులు ఊహించడానికి ఇష్టపడని ప్రాంతం అది.
ఆలోచించడమంటేనే భయంవేసేది. జీవితమంటే తిండీ, వుండడానికి ఒక ఆశ్రయం అని గ్రహించాను. దానికోసమే మనుషులు వస్తువులమ్మేవాళ్లు. వ్యాపారస్తుడు చెప్పులమ్మితే, రాజకీయ నాయకుడు తన మంచితనాన్ని అమ్మేవాడు.
ప్రజా ప్రతినిధులు నమ్మకాన్ని అమ్మేవారు. మహిళలుగాని, పురుషులుగాని ఆత్మగౌరవాన్ని కూడా అమ్ముకొనేవారు.
ప్రతిదీ ఒక సరుకే, కాని కార్మికుడికి అమ్ముకోవడానికి అతని కండబలం మాత్రమే వుంది. మార్కెట్లో దానికి గౌరవం లేదు, తగిన విలువా లేదు. కాని శ్రామికుని కండబలం వుపయోగించిన కొద్దీ వాడిపోతుంది. దాన్ని వస్తువులలాగా పునరుజ్జీవింప చేయడం సాధ్యంకాదు.
మెదడు కూడా ఒక వస్తువేనని నేను గ్రహించాను. అయితే అదికూడా కండబలం కంటే భిన్నమైంది.
తన మేధోశక్తిని అమ్ముకునేవాడు యాభై, అరవై ఏళ్ళ వాడైనా యువకుడి కిందే లెక్క. అతడికి వచ్చే ఆదాయం కూడా ఎక్కువే.
కాని శ్రామికుడు నలభై ఏళ్లకే ముసలివాడైపోతాడు. అందుకని నేను ఒక కచ్చితమైన నిర్ణయానికి వచ్చాను.
శ్రమను అమ్ముకోవడం మాని, నా మెదడును అమ్ముకోవాలని భావించి “మేధో వ్యాపారిని” అయ్యాను.
మేధో ప్రపంచంలో నిరాశ..
దానికోసం జ్ఞానాన్ని వెతుక్కోవడం ప్రారంభించాను. కాలిఫోర్నియా వచ్చి పుస్తకాలు చదవడం ప్రారంభించాను.
సమాజ అధ్యయన శాస్త్రంలో(సోషియాలజీ) పరిణతి సంపాదించాలని అప్పుడు నాకు అర్థమైంది. ఆ పుస్తకాల్లో శాస్త్రీయమైన సమాజ సంబంధమైన భావనలు నాకు దొరికాయి.
సోషలిస్టులు, విప్లవకారులు వర్తమాన వ్యవస్థను కూలదోసి నూతన సమాజ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సేకరిస్తారు.
నేను కూడా సోషలిస్టు విప్లవకారుడిని. అందుకే కార్మికవర్గ బృందాలలోనూ, ‘ది క్రౌడ్’ వంటి విప్లవకర మేధావుల బృందాలలోనూ సభ్యుణ్ణి అయ్యాను.
అక్కడ నాకు పదవీకాంక్షలేని, డబ్బుమీద అపేక్షలేని కార్మికవర్గ మిత్రులు దొరికారు.
వాళ్ళ మధ్యనే నాకు మానవీయత పట్ల విశ్వాసం, కొన్ని ఆదర్శాలు, నిస్వార్ధత, అమరత్వమనే అద్భుతమైన ఆలోచనలు అవగాహనలోకి వచ్చాయి.
అక్కడ నేను కలిసిన మనుషులు అంతక్రితం కలిసినవాళ్ళకంటే చాలా భిన్నమైనవాళ్ళు. అదొక భిన్నమైన ప్రపంచం. అది వస్తు ప్రపంచం కాదు, భావనా ప్రపంచం.
మేధోవ్యాపారిగా నేను విజయాన్ని సాధించాను. సమాజం నాకు ద్వారాలు తెరిచింది. పెద్దలతో కలిసి భోజనాలు చేశాను. అందమైన, ఖరీదైన దుస్తులు ధరించిన ఆడవాళ్ళతో స్నేహం చేశాను.
అయితే ఆ ఆడవాళ్ళు బయటికి రూపంలో ఎలా వున్నా ఆ రూపం వెనుక అంతకు ముందు నేను చూసిన శ్రామిక స్త్రీల కంటే గొప్పగా లేరనిపించింది.
ఇది నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. మతబోధకులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ప్రొఫెసర్లు పరిచయమయ్యారు.
వాళ్ళలో చాలామంది ఉన్నతంగానే కనపడ్డారు. కాని నాకెందుకో వాళ్ళలో జీవం తొణికిసలాడినట్టు అనిపించలేదు. వాళ్ళు బతుకుతున్నారు గాని జీవించడం లేదనిపించింది. భద్రపరచబడిన ధనిక శవాల్లాగా(మమ్మీలలాగా) అనిపించారు.
సమాజపు డొల్లతనం – తిరిగి కార్మిక వర్గం వైపు..
అది ఒక నేరమయ మోసపూరిత ప్రపంచం. ఇలాంటి సమాజంలో జీవించడం నాకిష్టంలేదనిపించింది. అందుచేత నేను తిరిగి నా శ్రామికవర్గానికి వెళ్ళిపోయాను. నేను పుట్టింది అక్కడే, అది నాది. ఇంకెంతమాత్రమూ పైస్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించాలనుకోలేదు.
సౌధపు పై అంతస్తుల కంటే కింది పునాదే నాకు ఆసక్తిగా అనిపించింది.
అక్కడ శ్రామికులతో, ఆదర్శవాదులతో, శ్రామికవర్గ మేధావులతో కలిసి పార, గునపం పట్టుకొని ఆకాశహర్మ్యాలను కూల్చివేసే పనిలో నిమగ్నమయ్యాను.
కొద్దిరోజుల తరవాత ఇంకా అనేక చేతులు నాకు తోడవుతాయి. కుళ్ళిపోయిన ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేస్తాం.
మానవాళి కోసం కొత్త సౌధాలను నిర్మాణం చేస్తాం. అందులో కంపుకొట్టే నేలమాళిగలు వుండవు.
గాలి, వెలుతురు ధారాళంగా ప్రవహించే గదులు వుంటాయి. పరిశుభ్రమైన ఉన్నతమైన, జీవంతో తొణికిసలాడుతున్న మనుషులుంటారు.
ఇతర పెట్టుబడిదారులు నన్ను నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేసేవారు. నా కండరాల సత్తువ ఉపయోగించుకుని వాళ్ళు డబ్బు సంపాదించడం ప్రారంభించారు. వాళ్ళ దగ్గర నేను ఒక తెరచాప నావికుడిగా పనిచేశాను.
తోళ్ల షాపులలో, కర్మాగారాలలో, లాండ్రీలలో పనిచేశాను. తివాచీలు శుభ్రం చేసేవాడిగా, కిటికీలు కడిగేవాడిగా, తోటమాలిగా కూడా పనిచేశాను. నా శ్రమకు తగ్గ ఫలితం నాకెన్నడూ దక్కలేదు.
నేను పనిచేసే తోళ్ల షాపు యజమాని కూతురు గుర్రపు బగ్గీలో వెళుతుంటే చూసినప్పుడల్లా అదంతా నా నరాల సత్తువే అనీ, అదే ఆ గుర్రపుబగ్గీ టైర్లను లాగుతున్నట్టు అనిపించేది. నేను పనిచేసే ఫ్యాక్టరీ యజమాని కొడుకు కాలేజీకి వెళుతుంటే వాడి చదువుకీ, వాడు తాగే వైన్‌కు అయ్యే ఖర్చులో నా శరీర శ్రమ వుంది కదా అనుకునేవాడిని.
అయితే దీనిపట్ల నాకెప్పుడూ అసంతృప్తి లేదు. ఇదంతా ఒక ఆటలో భాగమే అనుకొన్నాను. వాళ్ళు నాకంటే శక్తిమంతులు. నాకు పని అంటే భయంలేదు. కష్టపడి పనిచేయడాన్ని నేను ప్రేమించాను. నేను కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళలో స్థానం సంపాదించుకోగలనని అనుకునేవాడిని. అలాంటి క్షణంలోనే నా అదృష్టం కొద్దీ నాలాగా ఆలోచించే ఒక యజమాని దొరికాడు.
నేను పనిచేయడానికి ఇష్టపడుతుంటే, నేను పనిచేయాలని నాకంటే ఎక్కువగా ఆయన కోరుకునేవాడు. పని చేయడం ద్వారా నేను వ్యాపార మెళకువలు తెలుసుకుంటున్నానని సంతృప్తి చెందాను. అయితే కాలక్రమంలో ఆ జీవితం విసుగెత్తింది.
కులీన వర్గాల మోసపూరిత జీవితం..
డబ్బున్నవాళ్ళ సంపదను చూసి నేను ఎప్పుడూ అసూయపడలేదు. అది నన్ను దిగ్భ్రాంతికి గురిచేసిందన్న మాట వాస్తవం. వాళ్ళు అందమైన దుస్తులు ధరించి చిన్న చిన్న ఆదర్శాల గురించి, నైతిక విలువల గురించి చిలకపలుకులు పలుకుతుండేవాళ్ళు. కాని వాళ్ళ జీవితానికి మూలసూత్రం వస్తు సంపదను పోగువేసుకోవడం. వాళ్ళప్పుడప్పుడు చిన్న చిన్న సేవాసంస్థలకు సహాయం చేస్తుండేవాళ్ళు.
అయితే వాళ్ళు తింటున్న తిండి, ధరిస్తున్న అందమైన దుస్తుల మీద బాల కార్మికుల, వేశ్యల స్వేదంతో కూడిన శ్రమ వుందని నాకు తెలుసు. ఇలాంటి విషయాలు వాళ్ళముందు ప్రస్తావిస్తే నాకు చాలా కోపంతో కొన్ని బోధనలు చేసేవారు.
నా పేదరికానికి కారణం పొదుపరితనం లేకపోవడం, తాగడం, మాలో అంతర్లీనంగా పేరుకుపోయిన అనైతికత అని చెప్పేవారు.
ఆరు సంవత్సరాల వయసున్న బాలబాలికలను అర్ధాకలితో వుంచి వాళ్ళతోటి రోజుకు పన్నెండు గంటలు బట్టల మిల్లులో పనిచేయించడాన్ని నేను ప్రస్తావించినప్పుడల్లా నన్ను ఆందోళనకారుడు అని నిందించేవాళ్ళు.
యజమానులతో కూడా నేను సామరస్యంగా వుండగలిగేవాడిని కాదు. పరిశుభ్రమైన ఉన్నత హృదయం కలిగిన ఆదర్శాలు తొణికిసలాడే సజీవమైన వ్యక్తులను నేను వాళ్ళలో చూస్తానేమోనని ఆశపడేవాడిని.
మతబోధకులతో, రాజకీయ నాయకులతో, వ్యాపారస్తులతో, ప్రొఫెసర్లతో, సంపాదకులతో కలిసి భోజనం చేసేవాడిని, వైన్ తాగేవాడిని, కలిసి ప్రయాణం చేసేవాడిని. కాని నేను అనుకుంటున్న లక్షణాలు గల మనుషులు నాకెన్నడూ కనపడలేదు. ఇలాంటి కులీనవర్గ మర్యాదస్తుల్లో భర్తలు లేని స్త్రీలను, అనాథ స్త్రీలను రహస్యంగా దోపిడీ చేసే వ్యక్తులుండేవాళ్ళు.
కొంతమందైతే అందమైన పుస్తకాలు కొని, తాము సాహిత్యాన్ని పోషిస్తున్నట్టు ఫోజు పెట్టేవారు. పత్రికా సంపాదకులు, తాము డబ్బులు తీసుకుని ప్రకటిస్తున్న మందులు హానికరమైనవని తెలిసినా ఆ ప్రకటనలను మానుకొనేవాళ్ళు కాదు. పైగా నేను వాస్తవాలు చెప్పినందుకు నన్ను పనికిమాలిన వాగాడంబరుడినని నిందించేవారు.
సెనెటర్లు, గవర్నర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు-వీళ్ళందరి మాటల్లో ఎంతో ఆదర్శం కనపడేది. కాని ఆచరణలో వీళ్ళంతా అమ్ముడుపోయిన సరుకే. వీళ్ళలో చర్చిలలో వుండే మతబోధకులు కూడా భాగం. వీళ్ళ జీవితాలను తరచి చూచినకొద్దీ వాళ్ళ డొల్లతనం, అవినీతి, అక్రమాలు నాకర్థమయ్యేవి.
వీళ్ళతో కలిసి జీవించలేననే వాస్తవాన్ని తెలుసుకున్నాను. మేధోపరంగా నేను అలసిపోయాను, నైతికంగా ఓడిపోయాను. ఆ కారణంగానే మళ్ళీ నేను నా కార్మికవర్గ ప్రపంచంలోకి వెళ్ళిపోయాను.
నా విశ్వాసమంతా శ్రామిక వర్గం పైనే..
ఇది నా దృష్టి.. మానవులందరూ కేవలం ఆకలిబాధల నుంచి ఎలా తప్పుకోవడం అనే ఆలోచనల కంటే ఉన్నతమైన ఆలోచనల వైపుగా ప్రయాణం చేసే సమయం కోసం ఎదురుచూసేవాడిని. ఒక మనిషి పనిచేయడానికి ఇప్పుడు లభిస్తున్న భౌతిక సంపద కంటే మరింకేదో ఉన్నతమైన విలువ వాళ్ళను కార్యోన్ముఖులను చేసే సమయం కోసం నేను ఎదురుచూసేవాడిని.
మనిషి ఉన్నతత్వం మీద, అద్భుతమైన గుణగణాల మీద నా నమ్మకం ఎన్నటికీ సడలదు. వర్తమానంలో మనం చూస్తున్న ఈ విపరీత తత్వం మీద నిస్వార్ధత ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం నాది.
చివరగా ఒక్క మాట. నా విశ్వాసమంతా కార్మికవర్గం మీదనే. ఒక ఫ్రెంచి వ్యక్తి చెప్పినట్లుగా “సమయం అనే మెట్లమీద సాధారణమైన చెప్పులు పైకి వెళ్తూ ప్రతిధ్వని చేస్తుంటే, పాలిష్ చేయబడిన బూట్లు చప్పుడు చేయకుండా కిందకి దిగిపోతున్నాయి.”
అనువాదం: సీఎస్ఆర్ ప్రసాద్
(జాక్ లండన్ విప్లవం తదితర వ్యాసాలు- Revolution and Other Essays నుంచి..)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
