భారతదేశంలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో, ప్రభుత్వ రంగ సంస్థలలో సైతం ఒకరోజు సెలవు తీసుకోవటం గగనం అవుతున్నది. ఇక ప్రైవేటు యాజమాన్యాల సంగతి చెప్పనవసరం లేదు.
అలాంటిది చైనా ప్రభుత్వం, కార్మికులు, ఉద్యోగులు, అధికారులు తమకున్న సెలవులను ఒక ప్రణాళిక ప్రకారం వినియోగించుకోవాలని కోరుతూ ఆ దేశంలోని వివిధ రాష్ట్రాలు నోటీసులు జారీ చేశాయి.
ఏదైనా ఒక పరిశ్రమ లేదా సంస్థ యజమాని, సిబ్బందికి సెలవులు ఇస్తే పనికి అంతరాయం కలుగుతుందని భావించిన పక్షంలో, ఆ పని చేసిన రోజుకు రోజువారీ వేతనానికి 300 శాతం(అంటే 3 రెట్లు – ఉదాహరణకు రోజుకు రూ 100 వేతనం అనుకుంటే నష్టపరిహారం కింద అదనంగా మరో రూ 300) ఆ యజమాని చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించడం ఊహకందని విషయం.
కార్మిక శాఖ వివిధ సంస్థలకు తనిఖీలకు వెళ్లినప్పుడు సెలవుల వినియోగం ఎలా జరుగుతున్నది అనే అంశాన్ని కూడా వారి చెక్‌లిస్ట్‌లో ప్రభుత్వం చేర్చింది.
కార్మికులు, ఉద్యోగుల పట్ల చైనా ప్రభుత్వ వైఖరికి ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదు.
కార్మికులు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వారి పని సామర్థ్యం పెరుగుతుందని చైనా ప్రభుత్వం భావిస్తోంది.
ఇదే సోషలిస్ట్ చైనా దేశానికి, మిగతా పెట్టుబడిదారీ దేశాలకు ఉన్న తేడా.
– లక్ష్మయ్య
వినియోగాన్ని పెంచే దిశగా కొత్త విధానాలు..
కార్మికుల హక్కులను రక్షించడానికి, దేశీయ వినియోగాన్ని ప్రోత్సహించడానికి జరుగుతున్న విస్తృత ప్రయత్నాలలో భాగంగా, చైనాలోని కనీసం ఏడు ప్రాంతీయ రాష్ట్రాలు చెల్లింపుతో కూడిన వార్షిక సెలవుల అమలును ప్రోత్సహించడానికి కొత్త విధానాలను జారీ చేశాయి.
ఈ విషయంలో యునాన్ రాష్ట్రం తాజాగా స్పందించింది. ఏప్రిల్ 30న, ఆరు ప్రాంతీయ విభాగాలు సంయుక్తంగా ఒక నోటీసును విడుదల చేశాయి.
దేశీయ డిమాండ్‌ను విస్తరించడానికి, వినియోగాన్ని పెంచడానికి, స్థిరమైన వృద్ధిని కొనసాగించడానికి ఉద్యోగులు విడతల వారీగా ‘పెయిడ్ హాలిడేస్’ వినియోగించుకునే పద్ధతులను సులభతరం చేయాలని ఈ నోటీసు పేర్కొంది.
సమాన సెలవు హక్కులు – ముందస్తు ప్రణాళిక..
కాంట్రాక్ట్ రకం లేదా పదవితో సంబంధం లేకుండా కార్మికులందరికీ సమాన సెలవు హక్కుల రక్షణను ఈ నోటీసు నొక్కి చెబుతోంది.
వార్షిక సెలవుల నిర్వహణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, ఏడాది ఆరంభంలోనే సెలవుల షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకోవాలని, కార్యకలాపాలకు అంతరాయం కలిగించే విధంగా ఒకేసారి అందరూ సెలవు తీసుకోవడాన్ని నివారించాలని ఇది యజమానులను ప్రోత్సహిస్తుంది.
విడతల వారీ సెలవులను ప్రోత్సహించడం వల్ల, కార్మికులు తమ చెల్లింపు సెలవులను ప్రభుత్వ సెలవులతో, పాఠశాల సెలవులతో లేదా స్థానిక సంప్రదాయ పండుగలతో కలిపి ఏడాది పొడవునా సమయాన్ని మెరుగ్గా కేటాయించుకోవడానికి వీలవుతుంది.
ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ విషయంలో ఆదర్శంగా నిలవాలని, అధికారులు ముందుగా తమ సెలవులను ఉపయోగించుకోవాలని కూడా ఈ నోటీసు కోరింది.
ప్రైవేట్ కంపెనీలు ఫ్రంట్‌లైన్ కార్మికులకు, కీలక సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
పర్యవేక్షణ, పకడ్బందీ అమలు..
సెలవు హక్కుల చట్టపరమైన రక్షణ, పర్యవేక్షణ పెంపు, ప్రజలలో అవగాహన పెంచడం, ప్రచారాలతో సహా ఎనిమిది సహాయక చర్యలను అందులో సూచించారు.
ప్రభుత్వ సంస్థలలో అమలు తీరును అధికారులు పర్యవేక్షిస్తారు. నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పిస్తారు.
మార్చి నుంచి జెజియాంగ్, గుయిజౌ, అన్హుయ్, షాంగ్సీ, షాంగ్జీ, హైనాన్ వంటి రాష్ట్రాలు కూడా చెల్లింపు సెలవులను ప్రోత్సహించే ప్రతిపాదనలను జారీ చేశాయి.
జెజియాంగ్‌లో కార్మిక అధికారులు వార్షిక సెలవుల అమలు తీరును సాధారణ తనిఖీలలో చేర్చారు. షాంగ్సీ తన రోజువారీ కార్మిక పర్యవేక్షణ తనిఖీలలో దీనిని చేర్చింది.
పని ఒత్తిడి వల్ల యజమాని సెలవు ఇవ్వలేకపోతే, సదరు ఉద్యోగి ఉపయోగించని సెలవు దినాలకు ఆ ఉద్యోగి రోజువారీ వేతనానికి 300 శాతం యజమాని పరిహారంగా చెల్లించాలి.
సెలవు తీసుకోకపోవడం అంకితభావం కాదు!
పెయిడ్ హాలిడేస్‌కు సంబంధించి చట్టపరమైన నిబంధనలు ఉన్నప్పటికీ, అమలు మాత్రం బలహీనంగా ఉంది.
తాము సెలవు తీసుకుంటే తోటి కార్మికులపై అదనపు భారం పడుతుందని చాలా మంది కార్మికులు భావిస్తుంటారు.
ఇంకొంతమంది సెలవు తీసుకోకపోవడాన్ని అంకితభావానికి చిహ్నంగా భావిస్తారు.
చైనా యూనివర్సిటీ ఆఫ్ లేబర్ రిలేషన్స్‌లోని లా స్కూల్ అకడమిక్ కమిటీ హెడ్ షెన్ జియాన్ఫెంగ్ మాట్లాడుతూ- సెలవు తీసుకోకపోవడం గొప్ప సహకారం అనే అభిప్రాయం మారాలని అన్నారు.
సెలవులు వాడుకోవడం ద్వారా సాంకేతిక పురోగతితో, పని నాణ్యత, సామర్థ్యాన్ని మెరుగుపరచడం వీలవుతుంది తప్ప ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కాదని ఆయన చెప్పారు.
చెల్లింపు సెలవులను ప్రోత్సహించడం అంటే “ప్రజలపై పెట్టుబడి పెట్టడం” వంటిదని, ఇది కార్మికులకు విశ్రాంతిని ఇస్తుందని, తక్కువ జననాల రేటు వంటి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు.
రెన్మిన్ యూనివర్సిటీ ఆఫ్ చైనాలోని స్కూల్ ఆఫ్ లేబర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డీన్ జావో జోంగ్ మాట్లాడుతూ- “సెలవు తీసుకోవడం అంటే అవమానకరమైన భావన”, “ఓవర్‌టైమ్ అంటేనే అంకితభావం” అనే పొరపాటు నమ్మకాలు కార్మికులను సెలవు తీసుకోకుండా అడ్డుకుంటున్నాయని అన్నారు.
ప్రభుత్వ సబ్సిడీలు – కుటుంబాలకు ఉపశమనం..
చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ పరిశోధకుడు వాంగ్ టియాన్యు మాట్లాడుతూ- చిన్న వ్యాపారస్తులు చెల్లింపు సెలవుల ఖర్చులను భరించడంలో ఇబ్బంది పడతారని, కాబట్టి ప్రభుత్వం పన్ను మినహాయింపులు, సబ్సిడీల ద్వారా ఆ భారాన్ని పంచుకోవాలని సూచించారు.
అన్హుయ్, జియాంగ్సు వంటి రాష్ట్రాలు తమ 2026 ప్రభుత్వ పని నివేదికలలో ఈ చర్యలను చేర్చాయి. పాఠశాల సెలవులతో తల్లిదండ్రుల సెలవులను అనుసంధానించడం కుటుంబాలకు నిజమైన ఉపశమనాన్ని ఇస్తుందని జావో చెప్పారు.
ఆర్ లక్ష్మయ్య అనువదించిన ఈ వ్యాసాన్ని చైనా డైలీ పత్రిక సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
