What do the assembly election results reveal?
ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనకు 1967 నాటి పరిస్థితులను గుర్తుకు తెస్తుంది. ఇది ముగింపు కాదు. అసలైన పోరాటానికి ఆరంభం.
చాలా మంది నిరాశావాదులు భావిస్తున్నట్లుగా ఇది ముగింపు కాదు. బదులుగా ఒక రాజకీయ పునర్వ్యవస్థీకరణకు ఆరంభం కావచ్చు. దీని పర్యవసానాలు రాబోయే సంవత్సరాల్లో మాత్రమే స్పష్టమవుతాయి.
పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడులో ఇప్పుడు కనిపిస్తున్న ఈ పరిస్థితులు, గతంలో ఈ రెండు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలో ఇటువంటి భారీ మార్పు చోటుచేసుకున్న సమయాన్ని తక్షణమే గుర్తుకు తెస్తున్నాయి. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం, 1967లో జవహర్లాల్ నెహ్రూ మరణించిన కేవలం మూడేళ్ల తర్వాత, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాజకీయాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.
తమిళనాడులో ఒకప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు కె. కామరాజ్, ఫిబ్రవరి 1967లో ఒక విద్యార్థి నాయకుడి చేతిలో ఓడిపోయారు. దేశంలో కాంగ్రేసేతర పార్టీ అధికారంలోకి రావడం అనేది అది కేవలం రెండోసారి మాత్రమే. మొదటిసారి 1957లో కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా విజయం సాధించింది.
సి.ఎన్. అన్నాదురై నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పెరిగిన ధరలు, దానివల్ల కలిగిన అశాంతి మరియు కేంద్రం హిందీని రుద్దడంపై ఉన్న ఆగ్రహాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయ రంగంపైకి దూసుకొచ్చింది. ఆ తర్వాతి పరిణామాల్లో ఎం.జి. రామచంద్రన్ పార్టీ నుండి బయటకు పోవడంతో డీఎంకేలో చీలిక వచ్చి AIADMK ఏర్పడింది. ఈ రెండు ద్రవిడ పార్టీల మధ్య ఏర్పడిన బలమైన పోటీ, కాంగ్రెస్ పార్టీని 2026 వరకు అధికారానికి దూరంగా ఉంచడమే కాకుండా, ఒక శక్తివంతమైన ‘ద్రావిడ నమూనా’ అభివృద్ధికి దోహదపడింది. ఈ నమూనా సామాజిక న్యాయాన్ని ఆర్థిక పురోగతితో ముడిపెడుతూ, గత అరవై ఏళ్లుగా గణనీయమైన విజయాన్ని సాధించింది.
అయితే, సినీ నటుడు మరియు తమిళ వెట్రి కజగం (TVK)నాయకుడు సి. జోసెఫ్ విజయ్ ఇప్పుడు ఆ రెండు పార్టీల రాజకీయాలను (DMK vs AIADMK) బద్దలు కొట్టి, తమిళనాడు రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. 1967 తర్వాత మొదటిసారిగా, DMK లేదా AIADMK కాని మరొక ప్రాంతీయ పార్టీ కూటమికి నాయకత్వం వహించి, రాష్ట్రాన్ని ఏలే అవకాశం వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ TVK వైపు వేగంగా మొగ్గు చూపడం అనుకున్నంత ఆకస్మికమేమీ కాదు. DMK మిత్రపక్షాల మధ్య సంబంధాలు కొంతకాలంగా దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా తెరుచుకున్న ఈ కొత్త రాజకీయ అవకాశాన్ని ఉపయోగించుకుని తమిళనాడులో తన ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ చర్య ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ, బీహార్‌లోని రాష్ట్రీయ జనతా దళ్ వంటి ఇతర మిత్రపక్షాలకు కూడా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరి ఒక సందేశాన్ని పంపుతోంది. ఎందుకంటే, ఆయా రాష్ట్రాల్లో జూనియర్ భాగస్వామిగా తమకు అన్యాయం జరుగుతోందని చాలా మంది కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ కూటముల చరిత్ర!
1967లో పశ్చిమ బెంగాల్లో అజయ్ ముఖర్జీ నేతృత్వంలో మొదటి ‘యునైటెడ్ ఫ్రంట్’ ప్రభుత్వం ఏర్పడింది. 1952 నుండి శాసన సభ్యుడిగా, 1957 నుండి 1967 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సిపిఐ(ఎం) నాయకుడు జ్యోతి బసు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అది రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొన్న సమయం. నక్సల్బరీ ఉద్యమం అప్పుడే ప్రారంభమైంది. ఒక సంవత్సర కాలంలోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. తిరిగి అజయ్ ముఖర్జీ ముఖ్య మంత్రిగా 1969 దాకా సంకీర్ణ ప్రభుత్వం ఉంది.ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన స్వల్పకాలిక ప్రభుత్వాలు వచ్చాయి.
1972 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర హింస చోటుచేసుకోవడంతో ప్రతిపక్ష సి. పి. ఐ.(ఏం) పోటీ నుండి ఉపసంహరించుకుంది.
1972 నుండి 1977 వరకు సిద్ధార్థ శంకర్ రే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తీవ్రమైన హింస, కేంద్రం విధించిన అత్యవసర పరిస్థితి, చోటుచేసుకున్నాయి. 1977లో పార్లమెంటు ఎన్నికల తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ ఎన్నికలలో రే ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా 34 ఏళ్ల పాటు అప్రహతంగా పాలించింది. అప్పటి నుండి కాంగ్రెస్ అక్కడ మళ్లీ అధికారంలోకి రాలేదు.
ప్రస్తుత పరిస్థితి:
తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు, ఓటర్ల జాబితాలో జరిగిన భారీ మార్పులలో 91 లక్షల మందిని ఓటర్ల జాబితా నుండి తొలగించారు. (ఇందులో 27లక్షల మంది పేర్లు ఓటర్ల లిస్టులో ఉన్నప్పటికీ ఓటువేయ నిరాకరించబడిన వారు కూడా ఉన్నారు). ఇవన్నీ కలసి రాష్ట్ర రాజకీయాలలో పెద్ద మార్పుకు దారి తీసాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో బిజెపి 294 సీట్లకు గాను 208 సీట్లు గెలుచుకుని పశ్చిమ బెంగాల్లో మొదటిసారి అధికారంలోకి వచ్చింది. భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బెంగాల్లో ఆ పార్టీకి ఇది చారిత్రక విజయం. గతంలో ఉమ్మడి బెంగాల్లో వి.డి. సావర్కర్ నేతృత్వంలోని హిందూ మహాసభ, ముస్లిం లీగ్‌తో కలిసి కూటమిగా అధికారంలో ఉన్న సందర్భం మాత్రమే ఉంది.
1941లో అప్పటి ముఖ్యమంత్రి ఏ.కె. ఫజ్లుల్ హక్ తన మంత్రివర్గంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీని రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నియమించారు. హిందూ మహాసభ (వీ.డీ. సావర్కర్ పార్టీ) మరియు ముస్లిం లీగ్ కలిసి బెంగాల్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ (NWFP) మరియు సింధ్ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సమయం ఇది. కాంగ్రెస్ పార్టీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో మునిగిపోయి ఉండడం, వలస పాలనలో ప్రభుత్వ ఏర్పాటుకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించు కోవడంతో ఇది సాధ్యమైంది.
తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీలు కాకుండా మూడవ పార్టీ అతి పెద్ద శక్తిగా ముందుకు రావడంతో మిగిలిన ప్రధాన రాజకీయ పార్టీలు కూడా వారి పాత అంచనాలను పునసమీక్షించు కోవాల్సిన అవసరం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం జూనియర్ భాగస్వామిగా ఉన్న స్థితి నుంచి బయటపడాలని కోరుకోవటం, మిగతా పార్టీలకు కూడా ఆలోచించు కునేందుకు వీలు కల్పిస్తుంది. దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా తమిళనాడులో జరిగే పరిణామాలను లోతుగా పరిశీలిస్తాయి. ఎందుచేతనంటే తమిళనాడులో జరిగే పరిణామాల ప్రభావం ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల మీద కూడా ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో జరిగే ఈ విజయవంతమైన పరిణామం సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న అన్నిచోట్ల ఇది ఒక నమూనాగా లేదా కనీసం ఒక హెచ్చరికగా ఉంటుంది.
ఇకపోతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒక కొత్త తరహా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నది. గతంలో లాగా ప్రభుత్వ వ్యతిరేకత, అస్తిత్వ రాజకీయాలు, విపక్షాల మధ్య అనైక్యత ఇక ఎల్లకాలం కొనసాగకపోవచ్చు.
బెంగాల్ రాష్ట్రంలోని ఏ సామాజిక రాజకీయ పరిణామాలు భారీ మెజారిటీకి దోహదం చేసాయో, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తుడిచిపెట్టడం సాధ్యం కాదు. ప్రస్తుత ప్రభుత్వం నిలకడగా కొనసాగుతుందని హామీ కూడా ఏమీ లేదు. అందుకు భిన్నంగా ఏమైనా జరిగితే లోతుగా పరిశీలించాలి.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికలు 1967 నాటి ఎన్నికలతో పోల్చ లేక పోయినప్పటికీ పరిస్థితులు మాత్రం అంతకంటే చాలా వెనుకకు తీసుకు వెళ్తాయి. కేవలం పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే కాదు మొత్తం భారతదేశంలోనే అస్థిరత్వంగా ఉన్న కూటములు, రాజకీయ పార్టీలను తిరిగి తమ వైఖరులను పునసమీక్షించు కోవాల్సిన అవసరాన్ని కలుగజేస్తాయి. నిర్ణయాత్మకమైన తీర్పుగా కనిపిస్తున్న ప్రస్తుత వాతావరణం భవిష్యత్తులో మరింత సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితులను సృష్టిస్తాయి.
“ప్రస్తుతం ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీనిని ఒక అనివార్యమైన ముగింపుగా భావించి పొరపడకూడదు. బదులుగా, పావులు ఎలా కదులుతున్నాయి, మిత్రపక్షాలు తమ వైఖరులను ఎలా మార్చుకుంటున్నాయి, ప్రత్యర్థులు ఎలా స్పందిస్తున్నారు, ఒకప్పుడు శాశ్వతంగా మూసుకు పోయినట్లు అనిపించిన చోట్ల కొత్త అవకాశాలు ఎలా ఏర్పడుతున్నాయో గమనించాలి. చాలా మంది వినాశనం తప్పదని భావిస్తున్నట్లుగా ఇది ముగింపు కాదు. బహుశా ఇది ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం కావచ్చు. ఒక రాజకీయ పునర్వ్యవస్థీకరణ, దీని పరిణామాలు రాబోయే సంవత్సరాల్లో మాత్రమే స్పష్టమవుతాయి.”
రచన: సీమ చిస్తి.
అనువాదం: ఆర్.లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
