పెరుగుతున్న జెట్ ఇంధన ధరలు, గల్ఫ్ ప్రాంతంలోని ఘర్షణల కారణంగా ప్రపంచ విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకున్నాయి.
దీంతో, ఈ నెల షెడ్యూల్స్ నుంచి ఏకంగా ఇరవై లక్షల విమాన సీట్లను రద్దు చేశారు.
ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ ‘సిరియం’ నుంచి అందిన డేటా ప్రకారం, మే నెలలో షెడ్యూల్ కంటే సుమారు 13,000 తక్కువ విమానాలు నడుస్తాయి.
ఈ సంఖ్య ప్రపంచ విమానయాన సామర్థ్యంలో 2% కంటే తక్కువే అయినప్పటికీ, లండన్ హీత్రూ షెడ్యూల్లో 111 విమానాలు రద్దయ్యాయి.
కానీ జెట్ ఇంధన సరఫరాలో తలెత్తే సమస్యలు వేసవి కాలంలో మరిన్ని విమానాల రద్దుకు దారితీయవచ్చు.
విమానాలను సర్దుబాటు చేయడానికి తమకు మరింత వెసులుబాటు ఉంటుందని గత వారాంతంలో బ్రిటన్ విమానయాన సంస్థలకు తెలియజేశారు.
రద్దయిన 20 లక్షల సీట్లలో కొన్నింటిని చిన్న విమానాలను రంగంలోకి దించడం ద్వారా సర్దుబాటు చేశారు.
విమానయాన సంస్థల కోతలు..
ఇస్తాంబుల్, మ్యూనిచ్ నగరాల్లో విమానాల రాకపోకలు భారీగా తగ్గాయి. టర్కిష్ ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా సంస్థలు పెద్ద ఎత్తున కోతలు విధించాయి.
జర్మనీకి చెందిన విమానయాన సంస్థ(లుఫ్తాన్సా), తన అనుబంధ సంస్థ ‘సిటీలైన్’ ద్వారా నడిచే 20,000 స్వల్ప-దూర విమానాలను వేసవి నెలల్లో రద్దు చేసింది.
మండిపోతున్న జెట్ ఇంధన ధరలు..
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి, హోర్ముజ్ జలసంధి మూసివేత తర్వాత జెట్ ఇంధన ధర రెట్టింపు కంటే ఎక్కువ అయింది.
బ్రిటన్ నుంచి నడిచే మెజారిటీ స్వల్ప-దూర విమానయాన సంస్థలు జెట్ ఇంధన కొనుగోళ్లపై ముందస్తు ఒప్పందాలు కలిగి ఉన్నాయి.
అంటే అవి తక్షణ ధరల పెరుగుదల ప్రభావాన్ని ఎదుర్కోవని భావిస్తున్నాయి.
ఈజీజెట్, విజ్‌ఎయిర్ సంస్థలు తమ వేసవి షెడ్యూల్‌ను పూర్తిస్థాయిలో నడుపుతామని ప్రకటించాయి.
సాధారణంగా ఆరు వారాలలో సరఫరాకు హామీ ఉన్నందున, ప్రస్తుతం ఎలాంటి కొరతను చూడటం లేదని విమానయాన పరిశ్రమ చెబుతోంది.
ఇంధన కొరతపై అంతర్జాతీయ సంస్థల హెచ్చరికలు..
అయితే, మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా సరఫరాకు ఆటంకం కలిగితే యూరప్ దేశాలు జెట్ ఇంధన కొనుగోళ్లలో కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
గోల్డ్‌మన్ సాచ్స్ విశ్లేషకులు ఒక పరిశోధనా నోట్లో ఈ విధంగా తెలియజేశారు: “జెట్ ఇంధనాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం బ్రిటన్ అని, తక్కువ నిల్వలు, అధిక దిగుమతిపై ఆధారపడటం, తక్కువ శుద్ధి సామర్థ్యం కారణంగా ఆ దేశం ఎక్కువగా ప్రభావితమవుతుందని” పేర్కొన్నారు.
బ్రిటన్‌లో ఇంధన నిల్వలు “ప్రమాదకరమైన స్థాయికి” పడిపోవచ్చని, ఇది పంపిణీలో నియంత్రణ అవకాశాన్ని పెంచుతుందని హెచ్చరించింది.
ప్రయాణికుల ఇబ్బందులు తప్పించేందుకు ప్రభుత్వ చర్యలు..
వేసవి సెలవుల ప్రయాణికులకు చివరి నిమిషంలో ఇబ్బందులు కలగకుండా చూడటానికి, ఒకే రోజు ఒకే ప్రదేశానికి ఒకటి కంటే ఎక్కువ విమానాలు ఉన్నప్పుడు వాటిని సమన్వయం చేయడం వంటి ప్రత్యేక చర్యలు ముందస్తుగా తీసుకోవచ్చని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వం “వాడుకో లేదా కోల్పో” నిబంధనలను సడలిస్తోంది. దీనివల్ల తక్కువ టిక్కెట్లు అమ్ముడైన విమానాలను రద్దు చేసినా, తదుపరి సీజన్లో ఆ మార్గాల్లో విమానాలు నడిపే విలువైన హక్కులను విమానయాన సంస్థలు కోల్పోవు.
ఒకవేళ చెప్పుకోదగ్గ స్థాయిలో టిక్కెట్లు అమ్ముడుపోకపోతే, సగం ఖాళీగా ఉన్న విమానాల కోసం ఇంధనాన్ని వృధా చేయకుండా ఉండేందుకు ఆ విమానాలను రద్దు చేసే అవకాశం ఉంది.
ది గార్డియన్ పత్రిక సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
