సగం సీట్లలో బీజేపీ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థిపై సాధించిన మెజారిటీ కంటే ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన ఓట్ల సంఖ్యే ఎక్కువ.
ఈసారి బీజేపీ గెలిచిన సీట్లలో అత్యధికం తొలిసారి గెలిచినవే.
‘ది స్క్రోల్’ విశ్లేషణ ప్రకారం, బీజేపీ గెలిచిన 105 స్థానాలలో గెలిచిన బీజేపీ అభ్యర్థికి, సమీప ప్రత్యర్థికి మధ్య ఉన్న ఓట్ల తేడా ఆయా నియోజకవర్గాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ద్వారా తొలగించిన ఓట్ల సంఖ్య కంటే తక్కువగానే ఉంది.
ఇందులో 86 స్థానాలలో బీజేపీకి ఇదే తొలి విజయం..
తాజాగా ముగిసిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 207 స్థానాలలో గెలిచింది. ఇందులో 50 శాతం స్థానాలు, అంటే 105 నియోజకవర్గాలలో సమీప ప్రత్యర్థి కంటే బీజేపీ అభ్యర్థి సాధించిన ఓట్ల మెజారిటీ కంటే, ఆయా నియోజకవర్గాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా తొలగించిన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.
ఈ ఎన్నికలలో అనూహ్యంగా 294 శాసనసభ స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించిన బీజేపీ, 15 సంవత్సరాల మమతా బెనర్జీ పరిపాలనకు స్వస్తి పలికింది.
వివాదాస్పదమైన ఓటర్ల జాబితా సవరణ..
బెంగాల్లో అమలు జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అత్యంత వివాదాస్పదమైనది. ఈ సవరణలో భాగంగా రాష్ట్రంలో 91 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు.
అంటే రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్యలో 12 శాతం ఓటర్లను తొలగించారు. ఇందులో 27 లక్షల మంది తమ ఓటు హక్కును పునరుద్ధరించుకునేందుకు వివిధ వేదికల ద్వారా, చట్టబద్ధమైన యంత్రాంగం ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ఓటు హక్కుపై ప్రత్యేక ట్రిబ్యునల్స్ తుది నిర్ణయం చేయాల్సి ఉంది.
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను సంపూర్ణంగా సమర్థించిన ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ మాత్రమే.
విలక్షణమైన పద్ధతి..
సోమవారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గణనీయమైన స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టమవుతుంది.
ఫలితంగా గత ఎన్నికలలో 215 స్థానాలు గెలుచుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఈసారి 80 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
‘ది స్క్రోల్’ వద్ద ఉన్న సమాచారాన్ని విశ్లేషించి చూస్తే, ఈ ఎన్నికలలో బీజేపీని విజయం వరించేలా చేయడంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కసరత్తు ముఖ్యమైన పాత్ర పోషించిందా అన్న సందేహం వ్యక్తమవుతుంది.
ఆయా నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థి సమీప ప్రత్యర్థిపై సాధించిన అదనపు ఓట్ల(మెజారిటీ) కంటే ఆ నియోజకవర్గంలో ఎస్ఐఆర్లో భాగంగా తొలగించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఈ నిర్ధారణకు రావడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన గణాంకాలే ప్రమాణం. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో తొలగించబడిన ఓటర్ల జాబితాను కలకత్తా కేంద్రంగా పనిచేసే ప్రజా ప్రయోజన పరిశోధన సంస్థ ‘సబర్ ఇన్స్టిట్యూట్’ ఒక పట్టిక రూపంలో తయారు చేసింది. ఈ పట్టిక అందరికీ అందుబాటులోనే ఉంది.
ఉదాహరణకు బీజేపీ గెలిచిన బంకుర జిల్లాలోని ఇండస్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలిద్దాము. ఈ నియోజకవర్గంలో 2021లో జరిగిన ఎన్నికలలో కూడా బీజేపీ గెలిచింది. కానీ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో టీఎంసీకి బీజేపీ కంటే 9,000 ఓట్లు అదనంగా పోలయ్యాయి.
ఆ తర్వాత జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో 7,515 ఓట్లు తొలగించబడ్డాయి.
సోమవారం నాడు జరిగిన కౌంటింగ్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ 900 ఓట్ల ఆధిక్యతతో గెలిచింది.
105 నియోజకవర్గాలను పరిశీలించినప్పుడు వీటిలో అత్యధిక నియోజకవర్గాలలో బీజేపీకి ఇది తొలి విజయం. గత ఎన్నికలలో గెలిచిన సీట్లలో టీఎంసీ ఈసారి 129 స్థానాలలో ఓడిపోయింది.
ఐదేళ్ల క్రితం బీజేపీ గెలిచిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఈసారి కూడా బీజేపీనే గెలిచింది.
పాఠకులకు ఈ విషయం తేలికగా అర్థం కావటానికి, గత ఎన్నికల్లో ఒక పార్టీ గెలిచి ఈ ఎన్నికలలో మరొక పార్టీ గెలిచిన నియోజకవర్గాలను ‘స్వింగ్ సీట్లు’గా పరిగణిద్దాము.
అటువంటి 86 స్వింగ్ సీట్లలో ఎస్ఐఆర్లో భాగంగా తొలగించబడిన ఓటర్ల సంఖ్య కంటే, సమీప ప్రత్యర్థిపై బీజేపీ సాధించిన ఓట్ల సంఖ్య తక్కువగా ఉంది.
జాదవ్పూర్: అనూహ్య మార్పు..
దక్షిణ కలకత్తా పరిధిలో ఉన్న జాదవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలిద్దాము. కొన్ని దశాబ్దాల పాటు ఈ నియోజకవర్గంలో వామపక్షాలదే గెలుపు.
1987 నుంచి 2011 వరకు ఈ నియోజకవర్గం నుంచి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గెలుస్తూ వచ్చారు.
ఆ తర్వాత కూడా జాదవ్పూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నడూ గెలవలేదు.
2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి టీఎంసీ గెలుపొందగా, సీపీఎం రెండో స్థానంలో ఉంది. 55,139 ఓట్లు సంపాదించుకున్న బీజేపీ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
‘ది స్క్రోల్’ నిర్వహించిన క్షేత్రస్థాయి అధ్యయనంలో కూడా ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ టీఎంసీ, సీపీఎం మధ్యనే ఉన్నట్లుగా వెల్లడైంది.
ఎస్ఐఆర్లో భాగంగా ఈ నియోజకవర్గంలో మొత్తం 56 వేల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ సీట్లో తొలిసారి బీజేపీ గెలిచింది. కానీ సమీప ప్రత్యర్థి కంటే బీజేపీ అభ్యర్థి సాధించిన మెజారిటీ కేవలం 27,716 మాత్రమే.
ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి మొత్తం 1,06,000(లక్షా ఆరు వేల) ఓట్లు పోలైతే, టీఎంసీ అభ్యర్థి సుమారు 80,000 ఓట్లు సొంతం చేసుకున్నారు.
సీపీఎంకు 41 వేల ఓట్లు పోలయ్యాయి.
కూలిన కోటలు..
సోమవారం నాడు వెలువడిన ఎన్నికల ఫలితాలలో, గతం నుంచి టీఎంసీ కోటలుగా ఉన్న అనేక నియోజకవర్గాలలో ఆ పార్టీ పరాజయం పొందింది.
గుర్తింపు కలిగిన అనేకమంది సీనియర్ నాయకులు కూడా ఓడిపోయారు.
టోలిగంజ్ నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా ఓటమిలేని నాయకుడిగా ఉన్న మాజీమంత్రి అరూప్ బిశ్వాస్ ఈ ఎన్నికలలో ఓడిపోయారు.
బీజేపీ అభ్యర్థి 613 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఎస్ఐఆర్లో భాగంగా తొలగించిన ఓట్ల సంఖ్య 37,889.
శశి పాంజ, సిద్ధికుల్లా చౌదరి, మలయ్ ఘటక్, స్నేహాశిస్ చక్రవర్తి వంటి మరో 10 మంది క్యాబినెట్ మంత్రులు కూడా ఇదే రకంగా ఓటమి పాలయ్యారు.
ఆయా నియోజకవర్గాలలో బీజేపీ సాధించిన మెజారిటీ కంటే ఎస్ఐఆర్లో తొలగించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంది.
భవానిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మమతా బెనర్జీ కూడా బీజేపీ ముఖ్య నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు.
మమతా బెనర్జీకి వచ్చిన ఓట్ల కంటే సువేందు అధికారికి 15,105 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. 2011 నుంచి ఈ నియోజకవర్గంలో టీఎంసీ నికరంగా గెలుస్తూ వచ్చింది. కానీ తాజాగా జరిగిన ఎస్ఐఆర్లో భాగంగా ఈ నియోజకవర్గంలో 51 వేల ఓట్లను తొలగించారు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
