ఎస్ఈఈఈపీసీ సర్వేలో వెలుగుచూసిన అత్యంత ముఖ్యమైన అంశం రిజర్వేషన్ల గురించి కాదు. అది వెనుకబాటుతనం అసలు స్వభావానికి సంబంధించినది.
2026 ప్రారంభంలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక-ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయాలు, కులాల సర్వే ఫలితాలను విడుదల చేసింది.
భారతదేశ విధాన రూపకల్పన వ్యవస్థ చాలా కాలంగా చేయడానికి వెనుకాడుతున్న ఒక పనిని అది చేసింది.
ప్రతిరోజూ కోట్లాది మంది ఎదుర్కొంటున్న అసమానతల నిర్మాణానికి సంఖ్యల రూపంలో స్పష్టమైన ఆధారాలను అందించింది.
242 కులాలకు చెందిన 3.54 కోట్లకు పైగా వ్యక్తులను అనగా రాష్ట్ర జనాభాలో సుమారు 97 శాతం మందిని ఈ సర్వే కవర్ చేసింది.
దీంతో స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ఇప్పటివరకు రూపొందించిన అత్యంత సూక్ష్మమైన కులాల వారీ వెనుకబాటుతన గణాంక సమాచారంగా ఇది నిలిచింది.
విద్య, భూ యాజమాన్యం, గృహ వసతి, పారిశుద్ధ్యం, ఉపాధి, రుణభారం, సామాజిక సమ్మిళితం వంటి 42 బహుముఖ సూచికల ఆధారంగా రూపొందించిన సర్వే సమ్మిళిత వెనుకబాటుతన సూచీ(సీబీఐ) ఎక్కువ వెనుకబాటుతనాన్ని సూచిస్తుంది.
ఈ ప్రమాణంలో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు) 96, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) 95 స్కోరు సాధించాయి.
అగ్రవర్ణాలకు చెందిన ఇతర కులాలు (ఓసీలు) కేవలం 31 స్కోరు మాత్రమే పొందాయి.
అంటే రాష్ట్రం అనుసరించిన ఈ బహుముఖ సర్వే ప్రకారం చూస్తే ఒక సగటు ఎస్సీ లేదా ఎస్టీ కుటుంబం సగటు అగ్రవర్ణ కుటుంబంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ వెనుకబాటుతనంలో ఉందని ఈ సర్వే వెల్లడిస్తోంది.
ఈ గణాంకాలు దేశవ్యాప్తంగా కుల జనగణన, రిజర్వేషన్లపై విస్తృత చర్చకు దారితీశాయి. ఏయే వర్గాలు అధిక రిజర్వేషన్లను డిమాండ్ చేస్తాయి? ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) రిజర్వేషన్ల వాటాలో ఎలాంటి మార్పులు వస్తాయి? వంటివి ప్రాధాన్యం లేని ప్రశ్నలు కావు. అయితే చర్చను ప్రారంభించాల్సింది ఈ ప్రశ్నలతో కాదు.
సమస్య తీవ్రతను బహిర్గతం చేసిన జనగణన..
ఎస్ఈఈఈపీసీ సర్వేలో వెలుగులోకి వచ్చిన అత్యంత ముఖ్యమైన అంశం రిజర్వేషన్ల గురించి కాదు. అసలు సమస్య వెనుకబాటుతనం స్వభావానికి సంబంధించినది.
అందుకే కేవలం ఆదాయం వంటి ఒక్క సూచిక ఆధారంగా కాకుండా వివిధ రంగాల్లో పేరుకుపోతూ తరతరాలుగా కొనసాగుతున్న వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు సమ్మిళిత వెనుకబాటుతన సూచీ (సీబీఐ)ని రూపొందించారు.
242 కులాలపై ఈ సూచీ వెల్లడించిన విషయం ఏమిటంటే, వెనుకబాటుతనం అనేది ఒకే కోణంలో ఉండే సమస్య కాదు.
గృహ వసతి, పారిశుద్ధ్యం, విద్య నాణ్యత, భూమికి ప్రాప్యత, శ్రమ మార్కెట్లో స్థానం, రుణభారం, నివాస ప్రాంతం వంటి అనేక అంశాల్లో ఒకేసారి పనిచేసే బహుముఖ అసమానతల వ్యవస్థ అది.
అత్యంత వెనుకబడిన కులాలకు పేదరికం అనేది కేవలం ఆదాయ లేమి మాత్రమే కాదు ఏ ఒక్క సంక్షేమ పథకంతోనూ పరిష్కరించలేని సంక్లిష్టమైన, బహుముఖ సమస్య అని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.
రిజర్వేషన్ల పరిధికి అందని రంగాల గురించి ఈ సర్వే వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి మరింత స్పష్టమవుతుంది.
ఎస్సీ కుటుంబాల్లో కేవలం 8 శాతం మందికే వ్యవసాయ భూమి ఉండగా, ఓసీ కుటుంబాల్లో ఈ వాటా 31 శాతంగా ఉంది.
రోజువారీ కూలీ పనులపై ఆధారపడుతున్న వారిలో అసంఘటిత, అభద్రతతో కూడిన శ్రమ మార్కెట్లో జీవనం సాగిస్తున్న వారి శాతం ఎస్సీలలో 46 శాతం, ఎస్టీలలో 41 శాతం ఉండగా ఓసీలలో అది కేవలం 11 శాతం మాత్రమే.
ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల శాతం ఎస్సీలలో 10, ఎస్టీలలో 8 ఉండగా, ఓసీలలో అది 30 శాతానికి చేరుకుంది.
తరతరాలుగా సామాజిక ఆధిపత్యాన్ని అలాగే వెనుకబాటుతనాన్ని పునరుత్పత్తి చేసే అంతర్వివాహాల (తమ కులంలోనే వివాహాలు చేసుకునే) సంప్రదాయం ఇప్పటికీ దాదాపు సర్వసాధారణంగానే కొనసాగుతోంది.
కులాంతర వివాహాలు సుమారు 5 నుంచి 6 శాతానికే పరిమితమయ్యాయి. భూమి యాజమాన్యం, అసంఘటిత శ్రమ మార్కెట్లో ఉపాధి, విద్య నాణ్యత, నివాస ప్రాంతాల కేంద్రీకరణ వంటి రంగాల్లో కనిపిస్తున్న ఈ అసమానతలను కేవలం ఒక కేంద్ర విశ్వవిద్యాలయంలో రిజర్వేషన్ శాతాన్ని పెంచడం లేదా తగ్గించడం ద్వారా మాత్రమే పరిష్కరించడం సాధ్యం కాదు.
ఇక్కడ రిజర్వేషన్ వ్యవస్థను తప్పుబట్టడం లేదు. తన పరిధిలో అది అధికారిక ప్రభుత్వ సంస్థల్లో వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచడంలో సమర్థవంతంగా పనిచేసింది.
సమస్య ఏమిటంటే కుల అసమానతల నివారణకు అవసరమైన మొత్తం విధాన వ్యవస్థకు బదులుగా రిజర్వేషన్లనే ఏకైక పరిష్కారంగా ప్రజా చర్చ పరిమితం చేసింది.
అంటే వర్షాధార వ్యవసాయ ప్రాంతంలో రోజువారీ వ్యవసాయ కూలీ పనిపై ఆధారపడి జీవిస్తున్న, పక్కా ఇల్లు లేని, మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేని ఒక కుటుంబ సమస్యలకు ప్రభుత్వ కళాశాలలో ఒక రిజర్వేషన్ సీటు దొరికితే చాలు అన్నట్లుగా వ్యవహరించింది.
తెలంగాణ సర్వే ఈ ఆలోచననే ప్రశ్నిస్తోంది.
కుల అసమానతలపై మన దృష్టి పరిధిని విస్తరించాలని, వాటిని అర్థం చేసుకునే ప్రమాణాలను మరింత విస్తృతంగా పునరాలోచించాలని అది మనందరినీ కోరుతోంది.
ఆర్థికంగా బలహీన వర్గాల రిజర్వేషన్..
ఎస్ఈఈఈపీసీ సర్వే మరో కీలకమైన ప్రశ్నకు కూడా రాష్ట్రవ్యాప్త అనుభవాధారిత గణాంకాలతో సమాధానం ఇస్తోంది.
103వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్‌కు తగిన అనుభవాధారిత ఆధారాలు ఉన్నాయా అనే ప్రశ్నను కోర్టు తేల్చకుండా వదిలేసింది.
తెలంగాణ ఎస్ఈఈఈపీసీ సర్వే ఆ ప్రశ్నకు రాష్ట్రస్థాయి గణాంకాల ఆధారంగా స్పష్టమైన సమాధానాన్ని అందిస్తోంది.
ఈ సర్వే ప్రకారం అలాంటి అనుభవాధారిత ఆధారాలు లేవు.
అగ్రవర్ణాలకు చెందిన ఇతర కులాల(ఓసీ) జనాభాలో ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) పరిమాణాన్ని అంచనా వేయడానికి ఎలాంటి అధ్యయనం గానీ, ప్రత్యేక కమిషన్ గానీ ఏర్పాటు చేయకుండానే 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారు.
ఇప్పుడు తెలంగాణ ఎస్ఈఈఈపీసీ సర్వే వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని ఓసీ వర్గానికి చెందిన మొత్తం 18 కులాలూ వెనుకబాటుతన సూచీ (సీబీఐ)లో రాష్ట్ర సగటు కంటే తక్కువ స్కోరు సాధించాయి.
అంటే ఈ బహుముఖ కొలమానం ప్రకారం చూస్తే ఓసీ వర్గంలో గణనీయంగా వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయని చెప్పడానికి తగిన ఆధారాలు కనిపించడం లేదు.
10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుతున్న వర్గం సీబీఐలో 31 స్కోరు సాధించగా, 27 శాతం ఓబీసీ రిజర్వేషన్ పొందుతున్న వర్గం 86 స్కోరు, 15 శాతం ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్న వర్గం 96 స్కోరు సాధించింది.
తెలంగాణ జనాభాలో ఓసీ వర్గం వాటా 11.9 శాతం. ఈ వర్గానికి లభిస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా దాదాపు అదే నిష్పత్తికి సమానంగా ఉంది.
మరోవైపు, బీసీలు/ఓబీసీలు రాష్ట్ర జనాభాలో 56.4 శాతం ఉన్నప్పటికీ వారికి కేంద్ర స్థాయిలో కేవలం 27 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉంది.
ఈ పరిస్థితిని రాజ్యాంగ సూత్రాలు, ప్రయోజనవాదం లేదా సామాజిక న్యాయం వంటి ఏ సిద్ధాంతం ఆధారంగానూ సమర్థించడం కష్టం.
దీనిని ప్రధానంగా ఒక రాజకీయ రాజీ ఫలితంగా మాత్రమే అర్థం చేసుకోవచ్చు.
కుల జనగణన నిజంగా అర్థవంతంగా ఉండాలంటే ఈ రాజకీయ రాజీని ప్రజల ముందే ఆధారాలతో పునఃసమీక్షించి, కొత్తగా చర్చించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను అది అందించాలి.
గణాంకాలు వాటంతట అవే సంస్కరణలు తీసుకురాలేవు..
మండల్ కమిషన్ 1980లో తన నివేదికను సమర్పించింది. సచార్ కమిటీ 2006లో నివేదిక ఇచ్చింది.
రంగనాథ్ మిశ్రా కమిషన్ 2007లో తన నివేదికను సమర్పించింది. ఈ మూడు కూడా వెనుకబాటుతనం, వివక్ష, ప్రాతినిధ్య లోపంపై సమగ్ర గణాంకాలు, ఆధారాలను అందించాయి.
అయితే వాటి సిఫారసులు కొంతవరకు మాత్రమే అమలయ్యాయి. మరికొన్ని పక్కన పెట్టబడ్డాయి. ఇంకొన్ని న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్నాయి.
2023లో నిర్వహించిన బీహార్ కుల సర్వే ప్రకారం ఓబీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాలు(ఈబీసీలు) కలిసి రాష్ట్ర జనాభాలో దాదాపు 63 శాతం ఉన్నట్లు వెల్లడైంది.
అయితే ఆ గణాంకాల ఆధారంగా ఎలాంటి విధానపరమైన చర్యలు చేపట్టక ముందే ఆ సర్వే తీవ్ర రాజకీయ దుమారానికి, న్యాయస్థానాల్లో సవాళ్లకు దారితీసింది.
దీనివల్ల స్పష్టమవుతున్న విషయం ఏమిటంటే, గణాంకాలు వెలుగులోకి వచ్చిన వెంటనే అవి రాజకీయ పోరాటంలో భాగమైపోతాయి.
అయితే ఆ గణాంకాలను సామాజిక-ఆర్థిక పునర్విభజనకు దారితీసే విధానాలుగా మార్చగల సంస్థాగత వ్యవస్థ మాత్రం నిర్మించబడలేదు.
తెలంగాణ ఎస్ఈఈఈపీసీ సర్వే పద్ధతిపరంగా ఇప్పటివరకూ జరిగిన ఇలాంటి అన్ని సర్వేల కంటే కూడా మరింత బలమైనది.
ఈ సర్వేలో రూపొందించిన 42 ప్రమాణాల సమ్మిళిత వెనుకబాటుతన సూచీ (సీబీఐ) దేశంలోనే ఈ తరహాలో రూపొందించిన తొలి సమగ్ర వెనుకబాటుతన సూచీ.
అలాగే ఈ సర్వే గణాంకాలను విశ్లేషించేందుకు ప్రభుత్వం నుంచి స్వతంత్రంగా ఒక నిపుణుల కార్యాచరణ బృందం ఏర్పాటు చేయడం వల్ల దాని నిర్ధారణలకు విశ్లేషణాత్మక స్వతంత్రత కూడా లభించింది.
అయితే కుల జనగణనలో వెల్లడైన అంశాలపై ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకునేలా చేసే చట్టబద్ధమైన వ్యవస్థ లేకపోతే ఈ కుల జనగణన కూడా చివరికి భారతదేశంలో అత్యంత భారీ వ్యయంతో రూపొందించి, చివరకు అల్మారాలో పెట్టిన మరో కమిషన్ నివేదికగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ప్రపంచం ఇప్పటికే నేర్చుకున్న మూడు పాఠాలు, భారతదేశం నేర్చుకోవాలి..
నిర్మాణాత్మక వెనుకబాటుతనాన్ని గణాంకాల రూపంలో మ్యాపింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న తొలి ప్రజాస్వామ్య దేశం భారత్ కాదు.
భిన్నమైన రాజకీయ నేపథ్యాలున్న మూడు దేశాల అనుభవాలు భారత్‌కు విలువైన పాఠాలను అందిస్తాయి. వాటిలో బ్రెజిల్ అనుభవం భారత పరిస్థితులకు అత్యంత దగ్గరగా ఉంటుంది.
బ్రెజిల్లో జాతి ఆధారిత సామాజిక అంతరాల చరిత్ర ఉంది. అక్కడ చాలాకాలం పాటు జాతి వివక్ష లేని ప్రజాస్వామ్యం అనే భావన ప్రచారంలో ఉండేది.
భారత పట్టణ వృత్తిపర వర్గాల్లో ఆధునిక భారతదేశంలో కులాలకు ఇక ప్రాధాన్యం లేదు అనే అపోహ ఎలా కొనసాగుతుందో బ్రెజిల్లో కూడా ఆ జాతి సమానత్వపు అపోహ అదే విధంగా పనిచేసింది.
అయితే 2000వ దశకం ప్రారంభం నుంచి బ్రెజిల్ జాతి ఆధారిత గణాంకాల సేకరణ నుంచి చట్టబద్ధమైన పునర్విభజన దిశగా క్రమబద్ధంగా అడుగులు వేసింది.
2012లో తీసుకొచ్చిన ‘కోటా చట్టం’ అనంతరం 2023లో మరింత బలోపేతం చేయబడింది.
ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు సమాఖ్య(ఫెడరల్) విశ్వవిద్యాలయాల్లో 50 శాతం సీట్లను కేటాయించారు.
అలాగే ప్రతి రాష్ట్ర జనగణనలో నమోదైన జనాభా నిష్పత్తికి అనుగుణంగా నల్లజాతి, మిశ్రమ జాతి, ఆదివాసీ విద్యార్థులకు ప్రత్యేక ఉప-కోటా కూడా కల్పించారు.
బ్రెజిల్ మోసాలను నివారించేందుకు ధ్రువీకరణ కమిషన్లను కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే, సంస్థాగత అమలు వ్యవస్థలు లేకపోతే గుర్తింపు ఆధారంగా ఇచ్చే హక్కులు నిజంగా అవసరమైన వారికి కాకుండా తక్కువ అవసరం ఉన్నవారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆ దేశం గుర్తించింది.
దీని ఫలితంగా సమాఖ్య (ఫెడరల్) విశ్వవిద్యాలయాల్లో జాతి ఆధారిత రిజర్వేషన్లు కేవలం ఆదాయ ఆధారిత రిజర్వేషన్లతో సాధ్యం కాని స్థాయిలో నల్లజాతి విద్యార్థుల ప్రాతినిధ్యాన్ని పెంచాయి.
అలాగే రిజర్వేషన్ల లబ్ధిదారులు దీర్ఘకాలంలో ఉపాధి మార్కెట్లో గణనీయమైన ప్రయోజనాలు పొందినట్లు అధ్యయనాలు చూపించాయి. అదే సమయంలో ఇతర విద్యార్థుల అవకాశాలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపిన ఆధారాలు కూడా కనిపించలేదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
