న్యూస్‌క్లిక్, దాని సంపాదకుడు ప్రబీర్ పుర్కాయస్థపై ఆరోపించిన ఆర్థిక అక్రమాల కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆరు సంవత్సరాలు గడిచిన తర్వాత, గత నెలలో ఢిల్లీ హైకోర్టు ఆ కేసు చట్టపరంగా నిలబడదని తేల్చింది.
ఈ దర్యాప్తులను కొనసాగించడానికి అనుమతించడం “న్యాయ ప్రక్రియను తీవ్రంగా దుర్వినియోగం చేయడమే” అవుతుందని కోర్టు పేర్కొంది.
ఈ కేసు 2020 ఆగస్టులో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్ఐఆర్తో మొదలైంది.
ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా కొద్ది రోజుల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనీలాండరింగ్(డబ్బుల అక్రమ రవాణా)పై తన సొంత దర్యాప్తును ప్రారంభించింది.
విదేశాల నుంచి న్యూస్‌క్లిక్‌కు వచ్చిన నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని ఆరోపించింది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో 2021లో ఈడీ ప్రబీర్ పుర్కాయస్థ నివాసంతో పాటు న్యూస్‌క్లిక్ కార్యాలయంపై సోదాలు నిర్వహించింది.
ఈ ఏడాది మే 29న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ, పోలీసుల ఎఫ్ఐఆర్తో పాటు ఈడీ నమోదు చేసిన కేసును కూడా కొట్టివేశారు.
జూన్ 10న ఈ తీర్పు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ చదవవచ్చు.
ది వైర్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ..
ది వైర్‌కు ఈమెయిల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో, పుర్కాయస్థ తన జైలు జీవితం, లక్ష్యాలు, యువ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు తదితర అంశాల గురించి మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
నాటి ఎమర్జెన్సీ – నేటి అప్రకటిత ఎమర్జెన్సీ..
ప్రశ్న: ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో, అలాగే కొందరు విశ్లేషకులు “అప్రకటిత ఎమర్జెన్సీ”గా అభివర్ణిస్తున్న ప్రస్తుత కాలంలో కూడా మీరు జైలుకు వెళ్లారు.
ఈ రెండు సందర్భాల గురించి, వాటి మధ్య ఉన్న పోలికలు, తేడాల గురించి చెప్పగలరా?
ప్రబీర్ పుర్కాయస్థ: ముందుగా మనం వాటి మధ్య ఉన్న తేడాల గురించి మాట్లాడుకుందాం.
ఆ సమయంలో (ఇందిరా గాంధీ ఎమర్జెన్సీలో) ఎమర్జెన్సీ ఎప్పుడు ముగుస్తుందో లేదా అసలు ముగుస్తుందో లేదో మాకు తెలిసేది కాదు.
స్వాతంత్ర్యం వచ్చిన అనేక ఇతర దేశాల తరహాలోనే, భారతదేశం కూడా ఒక నిరంకుశ పాలనలోకి మారిపోయిందా అనే సందేహం ఉండేది.
మీకు తెలిసే ఉంటుంది, 1976లో సుప్రీంకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పు – ‘ADM జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా’ – తర్వాత చట్టపరమైన పరిస్థితి ఎలా మారిందంటే: మన ప్రాథమిక హక్కులకు రాజ్యాంగంలో హామీ ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయించుకునే అవకాశం లేకుండా పోయింది.
ఎమర్జెన్సీ ఎప్పుడు ముగుస్తుందో లేదా నిర్బంధం నుంచి ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని ఆ అనిశ్చిత పరిస్థితి చాలా మందిని మానసికంగా కుంగదీసింది.
ఈసారి మాత్రం మేము కోర్టులను ఆశ్రయించగలిగాము.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలాంటి కఠినమైన చట్టాల వల్ల న్యాయ ప్రక్రియపై పరిమితులు ఉన్నప్పటికీ, న్యాయపరమైన పరిష్కారాలు ఇంకా అందుబాటులో ఉన్నాయి. మేము కోర్టులను ఆశ్రయించగలిగాము, అదే మాకు ఆశను కలిగించింది.
మరోవైపు, చట్టపరంగా ఇప్పుడు మేము మునుపటి ఎమర్జెన్సీ కాలంలో ఉన్నట్లుగా రాజకీయ ఖైదీలం కాదు.
వ్యవస్థ దృష్టిలో, నేరారోపణలు ఎదుర్కొంటున్న ఇతర వ్యక్తుల మాదిరిగానే మేమూ “విచారణ ఖైదీలు” (అండర్‌ట్రయల్స్) మాత్రమే.
అయితే, మాపై నమోదు చేసిన కేసులు తీవ్రమైన నేరాలకు సంబంధించిన చట్టాల కింద ఉన్నాయి.
గతంలో మా కుటుంబ సభ్యులు మమ్మల్ని చాలా సులభంగా కలుసుకోగలిగేవారు. కానీ ఇప్పుడు ములాఖత్‌లకు అనుమతులు పొందే ప్రక్రియతో పాటు, ఆ ములాఖత్‌లు కూడా కుటుంబ సభ్యులకు మరింత కష్టతరంగా మారాయి.
జైలు జీవితం – ఖైదీల ఆత్మగౌరవం..
ప్రశ్న: జైలు జీవితంలో మీ మనసులో బలంగా నిలిచిపోయిన సంఘటనల గురించి చెప్పగలరా?
ప్రబీర్ పుర్కాయస్థ: ఈ ఇంటర్వ్యూను నా జీవిత చరిత్ర (మెమోయిర్) రాయడానికి ఉపయోగించడం నాకు ఇష్టం లేదు.
జైల్లోని ప్రజల మనోధైర్యం, అలాగే ఈ రకమైన ఖైదు వల్ల వారు చెల్లించాల్సి వచ్చే మానవీయ మూల్యం మాత్రమే నా మదిలో బలంగా నిలిచిపోయాయి.
ఇది మనుషులను వారు బహుశా ఎప్పుడూ ఊహించని విధంగా, సిద్ధపడని రీతిలో పరీక్షిస్తుంది.
నాతోటి ఖైదీ ఒకరు చెప్పినట్లు – అంతిమంగా మా ఆత్మగౌరవాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ బయటకు రావాలని మేము కోరుకుంటాం.
మీడియా మద్దతు – చరిత్ర అంచనా..
ప్రశ్న: ఈ అనుభవం మీడియా వర్గాల్లోని ఐక్యత పట్ల మీ అవగాహనను మార్చిందా? మీరు ఊహించని విధంగా ఎవరైనా మీకు అండగా నిలబడ్డారా, లేదా మీరు మద్దతు ఆశిస్తే మౌనంగా ఉండిపోయిన వారు ఎవరైనా ఉన్నారా?
ప్రబీర్ పుర్కాయస్థ: ఇది కూడా నా జ్ఞాపకాలను రాసుకోవడానికి పనికొచ్చే ప్రశ్నే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, చిన్నవైనా పెద్దవైనా ఇలాంటి అన్ని “ఎమర్జెన్సీలు”, ప్రభుత్వ నిఘా నీడలో ఉన్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా పరీక్షిస్తాయి.
అంతిమంగా, పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడు కాదు- అసాధారణంగా మారినప్పుడు మీరు ఏం చేశారనే దాన్ని బట్టి ఈ సమాజం, బహుశా చరిత్ర కూడా మిమ్మల్ని అంచనా వేస్తాయి.
అరెస్టు తర్వాత జీవితంలో మార్పులు..
ప్రశ్న: 2023 అరెస్ట్ తర్వాత మీ రోజువారీ జీవితంలో శాశ్వతంగా మార్పులకు లోనైన అంశాలు ఏమిటి?
ప్రబీర్ పుర్కాయస్థ: 2021లో జరిగిన ఈడీ దాడి, తదనంతర పరిణామాలు, అలాగే 2023లో అరెస్టు వల్ల ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కోవడానికే ఇప్పుడు చాలా ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది.
నేను మరింత ఉపయోగకరమైన పనుల కోసం వినియోగించుకోవాలనుకున్న సమయమంతా, కోర్టు కేసులు, ఇతర చట్టపరమైన ప్రక్రియలను ఎదుర్కోవడానికే సరిపోతోంది.
నమ్మకాలు – సామాజిక బాధ్యత..
ప్రశ్న: మీ రాజకీయ ప్రయాణాన్ని వెనుతిరిగి చూసుకుంటే, మీరు యువకుడిగా ఉన్నప్పుడు ఎంతో బలంగా నమ్మిన ఏదైనా ఒక సిద్ధాంతాన్ని లేదా నమ్మకాన్ని, అనుభవం వచ్చాక మార్చుకోవాల్సి వచ్చిందా? అలాగే, గతంలో మీరు తిరస్కరించిన ఏదైనా విషయాన్ని కాలక్రమంలో విలువైనదిగా గుర్తించారా?
ప్రబీర్ పుర్కాయస్థ: ఇది కూడా నా ఆత్మకథలో ఉండాల్సిన ప్రశ్నే. మీ ప్రశ్నలు భవిష్యత్తులో నేను రాసుకోబోయే ఆత్మకథ పనిని సులభతరం చేస్తాయని ఒప్పుకోవాల్సిందే.
క్లుప్తంగా చెప్పాలంటే, జీవితం పట్ల నాకు చాలా సరళమైన దృక్పథం ఉంది. మీరు దేన్ని నమ్ముతున్నారో తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించండి, కానీ ప్రతిరోజూ మీ నమ్మకాలను పునఃసమీక్షించుకోవడం మొదలుపెట్టకండి.
విస్తృతంగా చెప్పాలంటే, మనందరికీ సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను నిర్వర్తించడానికి, సమాజం, చట్టాలు విధించిన పరిమితులకు లోబడే మనం వ్యవహరించాలి.
యువ జర్నలిస్టులకు సందేశం..
ప్రశ్న: స్వతంత్ర మీడియాకు స్వేచ్ఛ తగ్గిపోతున్నప్పటికీ, నేటి పరిస్థితుల్లో ఉన్న ప్రమాదాలను ఎదుర్కొంటూనే ఇంకా జర్నలిజం రంగంలోకి రావాలనుకుంటున్న యువతకు మీరు ఏమి చెబుతారు?
ప్రబీర్ పుర్కాయస్థ: నేటి యువతకు తమకేం కావాలో తెలుసు. తమ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సాధనాలు కూడా వారి వద్ద ఉన్నాయి. కొన్ని అవకాశాలు కుదించబడుతున్నా, కొత్త అవకాశాలకు దారులు తెరుచుకుంటున్నాయి.
వయసులో పెద్దవాళ్లమైన మా ముందున్న సవాలు ఏమిటంటే, మేము గతంలో ఎలా పోరాడామో, వారు ఏమి చేయాలని మేము భావిస్తున్నామో చెబుతూ వారికి ఉపన్యాసాలు ఇవ్వకుండా, వారికి మా నుంచి నిజంగా ఏమి అవసరమో అర్థం చేసుకోవడం. అవును, మేము మా అనుభవాలను, మేము ఏం చేశాం, ఎందుకు చేశామో వారితో పంచుకోవచ్చు. ఆ తర్వాత వాటిలో తమకు ఏది అవసరమో కాదో వారు స్వయంగా నిర్ణయించుకోవచ్చు.
ప్రతిఘటనలో హాస్యం – ఆశావాదం..
ప్రశ్న: రాజకీయ ప్రతిఘటనలో హాస్యం ఒక ముఖ్యమైన భాగం. దాడులు, కోర్టు కేసులు, జైలు జీవితం మధ్య కూడా మీరు మీ హాస్యస్ఫూర్తిని, ఆశావాదాన్ని ఎలా నిలబెట్టుకోగలిగారు?
ప్రబీర్ పుర్కాయస్థ: మునుపటి ఎమర్జెన్సీ సమయంలో, నాతో పాటు నిర్బంధంలో ఉన్న, నాకంటే వయసులో పెద్దవారైన ఒక వ్యక్తి నాతో ఇలా అన్నాడు: “నువ్వు నవ్వుతూ ప్రతిఘటించవచ్చు, లేదా ఏడుస్తూ ప్రతిఘటించవచ్చు. ఎంపిక నీదే.”
అప్పట్లో కూడా నేను హాస్యాన్ని, ఆశావాదాన్ని మెరుగైన ఎంపికగా భావించాను. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే, జీవితంలో ఒకసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత, వాటిని మాటిమాటికీ పునఃపరిశీలించకపోవడమే మంచిది. అలా చేస్తే చాలా సమయం, మానసిక ఆవేదన రెండూ ఆదా అవుతాయి.
అనువాదం: దేవి పోలిన
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
